నోటి క్యాన్సర్‌ అంటున్నారు... | Tobacco chewing is more likely to get Mouth cancer | Sakshi
Sakshi News home page

నోటి క్యాన్సర్‌ అంటున్నారు...

Published Mon, Mar 25 2019 2:11 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Tobacco chewing is more likely to get Mouth cancer - Sakshi

నా వయసు 35 ఏళ్లు. నేను పదిహేనేళ్లుగా గుట్కా తింటున్నాను. ఆర్నెల్లుగా నా నోటిలో వాపు, నొప్పి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ బాధ మరీ ఎక్కువగా ఉంది. నోటిలో పుండ్లు (మౌత్‌ అల్సర్స్‌) వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్‌ అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా చెప్పండి. 
 
గుట్కాలు/పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్‌ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత అంతగా పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్‌ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. మిమ్మల్ని పరీక్షించి, మీ చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలో ఏ భాగంలో క్యాన్సర్‌ వచ్చిందో క్యాన్సర్‌ స్పెషలిస్టు పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. మీరు చెబుతున్న లక్షణాలైతే క్యాన్సర్‌ సూచకాలే. మొదట మీకు సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ  సీటీ లేదా ఎమ్మారై స్కానింగ్‌ పరీక్షలు చేయించి, క్యాన్సర్‌ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి.

ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్‌ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్‌ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఒకవేళ క్యాన్సర్‌ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కష్టమవుతుంది. మీలోని క్యాన్సర్‌ ఇతరచోట్లకు వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్‌ వచ్చిన భాగం మేరకు తొలగించడం మొదట చేయాలి. ఆ తర్వాత తొలగించిన భాగాన్ని ప్లాస్టిక్‌ సర్జరీ లేదా రీ–కన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు.

ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్‌ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్‌ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్‌ డిసెక్షన్‌ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు మానాక, రేడియోథెరపీ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. మీరు మొదట గుట్కా/పొగాకు నమలడం మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్‌ వచ్చేలా చేయగలదు.

‘కీమో’ అంటే భయం... ఆ చికిత్స గురించి వివరంగా చెప్పండి

నా వయసు 48 ఏళ్లు. ఇటీవలే క్యాన్సర్‌ వచ్చింది. కీమో ఇవ్వాలని అంటున్నారు. కీమోలో సైడ్‌ఎఫెక్ట్స్‌ ఎక్కువ అంటారు కదా! దాంతో నాకు ఆందోళనగా ఉంది. కీమోథెరపి గురించి  నాకు కాస్త వివరంగా చెప్పండి. 

మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు.  శరీరంలోని కొన్ని ప్రాంతాలలో తిష్ఠవేసిన క్యాన్సర్‌ కణజాలాన్ని అవి సర్జరీకి లేదా రేడియేషన్‌కు అనువుగా ఉన్న ప్రాంతాలలోనే  సర్జరీ లేదా రేడియేషన్‌ థెరపీ ద్వారా తొలగించగలుగుతాం లేదా నాశనం చేయగలం. కానీ కీమో ద్వారా శరీరంలోని ఎలాంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ క్యాన్సర్‌ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కీమోథెరపీలో 100పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి ఒకే మందును సైతం వాడవచ్చు. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతిని అనుసరించి అందించే విధానాన్ని కాంబినేషన్‌ కీమోథెరపీ అంటారు. పలురకాల మందులు, వాటి సంయుక్త ప్రబావాలన్నీ ఉమ్మడిగా క్యాన్సర్‌ కణాలపై పోరాడి వాటిని సమూలంగా సంహరించగలుగుతాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్‌ కణాలు ఆ మందుకు లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కాంబినేషన్‌ కీమోథెరపీని వినియోగిస్తారు. మీ విషయంలో మీకు ఏ మందులు లేదా కాంబినేషన్‌ మందులు వాడాలన్నది మీ డాక్టర్‌ నిర్ణయిస్తారు.

అలాగే కీమోథెరపీలో భాగంగా మందులను ఎంత మోతాదులో, ఏ విధంగా, ఎప్పుడెప్పుడు, ఎంతకాలం ఇవ్వాలన్న విషయం కూడా మీ డాక్టరే నిర్ణయిస్తారు. ఈ నిర్ణయాలన్నీ కూడా మీరు ఏ రకమైన క్యాన్సర్‌ కణితితో బాధపడుతున్నారు, అది శరీరంలోని ఏ భాగంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, అది మీ శరీర కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తోంది అన్న అంశాలపై ఆధారపడి మీ డాక్టర్‌ నిర్ణయిస్తారు. కీమోథెరపీలో ఇచ్చే మందులను బట్టి మీ శరీరంలో అనేక విధాలుగా అతివేగంగా విస్తరించే క్యాన్సర్‌ కణాల విధ్వంసం జరుగుతుంది. క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందులను రూపొందించడం జరిగింది. అందువల్ల ప్రతి మందూ భిన్నరీతిలో పనిచేస్తుంటుంది.

క్యాన్సర్‌ కణజీవనక్రమంలో ఎప్పు దాన్ని లక్ష్యంగా చేసుకొని, ధ్వంసం చేయాలో అప్పుడు మాత్రమే ఆ మందు ప్రభావం పనిచేస్తుంది. ఇక మీరు చెప్పే సైడ్‌ఎఫెక్ట్స్‌ విషయానికి వస్తే... కీమోథెరపీ వల్ల క్యాన్సర్‌ కణాలతో పాటు శరీరంలోని క్యాన్సర్‌ లేని సాధారణ కణజాలం సైతం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కీమో చికిత్స వల్ల పేషెంట్‌ కొంత అసౌకర్యానికి, ఇబ్బందికి గురవుతుంటారు. ఈ సైడ్‌ఎఫెక్ట్స్‌ వల్ల ముందు నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి మోతాదులో మందు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందువల్ల చికిత్స ప్రణాళికను అనివార్యంగా మార్చాల్సిరావచ్చు. ఇలాంటప్పుడు చికిత్స ద్వారా ఆశించే ఫలితాలను సంపూర్ణంగా రాబట్టడం కష్టసాధ్యం కావచ్చు. అంటే సైడ్‌ఎఫెక్ట్స్‌ వల్ల శారీరక అసౌకర్యం, ఇబ్బందులే కాకుండా, ఒక్కోసారి పూర్తి చికిత్స ప్రక్రియ కూడా కుంటుపడే అవకాశం ఉంది.

కీమో వల్ల ఎదురయ్యే ఇబ్బందులో వాంతులు, వికారం, అలసట, జుట్టు రాలిపోవడం (ఇది తాత్కాలికం)  వంటివి కలగవచ్చు. ఇక రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం మాత్రం కాస్త తీవ్రమైన పరిణామం. అయినా ఇటీవల సైడ్‌ఎఫెక్ట్స్‌ తక్కువగా ఉండే కీమోథెరపీ మందుల రూపకల్పన కూడా జరుగుతోంది. మీ డాక్టర్‌ సూచించిన చికిత్సను చేయించుకోండి. కొత్తగా టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యూనోథెరపీ వంటివి అత్యాధునికమైన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో సైడ్‌ఎఫెక్ట్స్‌ చాలా తక్కువ. మీరు ఎలాంటి ఆందోళనా చెందకుండా మీ డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన, చికిత్సను నిర్భయంగా తీసుకోండి. 

డాక్టర్‌ జి. వంశీకృష్ణారెడ్డి, సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ క్యాన్సర్‌ స్పెషలిస్ట్,
యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement