Mouth cancer
-
Mouth Cancer: దంత సమస్యలకు, నోటి కేన్సర్‌కు సంబంధం ఉందా?
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్. చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా, మహిళలు, పురుషులు అనేక రకాల కేనర్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, భారత్ సహా అధిక జనాభా ఉన్న దేశాల్లో ఈ కేన్సర్ మహమ్మారిలా వ్యాపిస్తోంది. వీటిల్లో ప్రధానమైంది నోటి కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఆరో అత్యంత సాధారణ క్యాన్సర్. పొగాకు, సుపారీ లేదా పాన్ మసాలా నమలడం లాంటి చెడు అలవాట్ల కారణంగా మహిళల కంటే పురుషులను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి ఆరుగురిలో ఒకరు కేన్సర్‌తో మరణిస్తున్నారు. అయితే ప్రారంభ దశలో గుర్తించినప్పుడే దీనికి చికిత్స సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి క్యాన్సర్ రావడం చాలా ఆందోళన కలిగిస్తుంది. నోటి కేన్సర్ కూడా ప్రమాదకారి అనే చెప్పవచ్చు. పొగాకు నమలడం, మద్యం సేవించడం లేదా సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లు ఉన్నవారిలో ఇది సర్వసాధారణం అని అందరికీ తెలుసు. కానీ ఇవేవీ లేని వ్యక్తికి నోటి కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. నోటి లోపల, పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గల లోపలిభాగం, అంగిలి, ఇలా నోటిలోని ఏ భాగంలోనైనా ఇది సోకవచ్చు. ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్ నోటి కేన్సర్ లక్షణాలు సాధారణంగా దీన్ని ప్రారంభ దశలో గుర్తించడం అసాధ్యం. దంతాలు, చిగుళ్ళ వాపు, నోటి లోపల తెల్లటి మచ్చలు, దంతాలు వదులుగా మారడం మొదలవుతుంది. నోటి లోపల గడ్డలు లేదా గడ్డలు కనిపిస్తాయి. ఇది కాస్త ముదిరితే చెవుల్లో నొప్పి కూడా మొదలవుతుంది. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి ఆహారం తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రధానంగా దంతాలు , చిగుళ్ల చుట్టూ నిర్వచించబడని ఇన్ఫెక్షన్ లేదా విపరీతమైన నొప్పి, స్వరపేటిక, వాయిస్‌లో మార్పులు అంటే బొంగురు పోవడం, లేదా ముక్కు, నాసోఫారింజియల్, నొప్పి తొలి సూచిక కావచ్చు. నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసన (హాలిటోసిస్) ఉన్నా, మింగడంలో ఇబ్బంది (డిస్ఫాగియా) ,నోట్లోగడ్డలు కూడా తొలి సంకేతం. సిగరెట్, బీడీ, సిగార్, పొగాకు. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి కూడా నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. వాయిస్‌లో మార్పు వచ్చినా, నోరు, నాలిక మీద తెల్లటి మచ్చలు పుండ్లు త్వరగా మానక పోయినా, నోటిని తరచూ శుభ్రం చేసుకుంటున్నా దుర్వాసన వస్తున్నా, మింగడం కష్టం మారినా, ఉన్నట్టుండి దంతాలు వదులుగా మారి, నొప్పి పుడుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నోట్: ఈ లక్షణాలు ఉన్న వారందరికి కేన్సర్ సోకినట్టు కాదు అనేది గుర్తించాలి. కానీ, కొన్ని పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. దీన్ని తొలి దశలో గుర్తించడమే చికిత్సలో కీలకం, అందుకే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. -
ఆ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన 30 శాతం జనాభా
నోటి క్యాన్సర్ విషయంలో దేశంలోని రాజస్థాన్ మూడవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జనాభాలో 30 శాతం మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నోటి క్యాన్సర్ అనేది గుట్కా, బీడీ, సిగరెట్, పొగాకు మొదలైన మత్తుపదార్థాలు తీసుకోవడం వలన వస్తుంది. ఈ మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు నోటిలో పుండు ఏర్పడి, అది ఎంతకీ నయంకానపుడు, అది క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. మరోవైపు నోటిలోపల అల్సర్లు ఉండటం సాధారణమేనని అనిపించినా, ఇది తీవ్రమైనప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. నోటి పుండు అనేది చాలా సాధారణ సమస్యే అయినప్పటికీ, దానిని విస్మరించడం ప్రాణాంతకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ ఆశిష్ జోషి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 30 శాతం మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు అలవాట్లు. అయితే ఈ వ్యాధికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా నోటి క్యాన్సర్‌కు కారణంగా నిలుస్తున్నాయి. నోటి లోపల ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం ఉంటే అది క్యాన్సర్‌గా మారే అవకాశం 50 నుంచి 60 శాతం వరకూ ఉంటుందని డాక్టర్ ఆశిష్ జోషి తెలిపారు. 43 ఏళ్లుగా దంతవైద్యునిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆశిష్ ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు నోటి క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. -
నోటి క్యాన్సర్ అంటున్నారు...
నా వయసు 35 ఏళ్లు. నేను పదిహేనేళ్లుగా గుట్కా తింటున్నాను. ఆర్నెల్లుగా నా నోటిలో వాపు, నొప్పి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ బాధ మరీ ఎక్కువగా ఉంది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా చెప్పండి. గుట్కాలు/పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత అంతగా పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. మిమ్మల్ని పరీక్షించి, మీ చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చిందో క్యాన్సర్ స్పెషలిస్టు పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. మీరు చెబుతున్న లక్షణాలైతే క్యాన్సర్ సూచకాలే. మొదట మీకు సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ సీటీ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కష్టమవుతుంది. మీలోని క్యాన్సర్ ఇతరచోట్లకు వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించడం మొదట చేయాలి. ఆ తర్వాత తొలగించిన భాగాన్ని ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు మానాక, రేడియోథెరపీ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. మీరు మొదట గుట్కా/పొగాకు నమలడం మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు. ‘కీమో’ అంటే భయం... ఆ చికిత్స గురించి వివరంగా చెప్పండి నా వయసు 48 ఏళ్లు. ఇటీవలే క్యాన్సర్ వచ్చింది. కీమో ఇవ్వాలని అంటున్నారు. కీమోలో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువ అంటారు కదా! దాంతో నాకు ఆందోళనగా ఉంది. కీమోథెరపి గురించి నాకు కాస్త వివరంగా చెప్పండి. మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. శరీరంలోని కొన్ని ప్రాంతాలలో తిష్ఠవేసిన క్యాన్సర్ కణజాలాన్ని అవి సర్జరీకి లేదా రేడియేషన్‌కు అనువుగా ఉన్న ప్రాంతాలలోనే సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా తొలగించగలుగుతాం లేదా నాశనం చేయగలం. కానీ కీమో ద్వారా శరీరంలోని ఎలాంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కీమోథెరపీలో 100పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి ఒకే మందును సైతం వాడవచ్చు. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతిని అనుసరించి అందించే విధానాన్ని కాంబినేషన్ కీమోథెరపీ అంటారు. పలురకాల మందులు, వాటి సంయుక్త ప్రబావాలన్నీ ఉమ్మడిగా క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని సమూలంగా సంహరించగలుగుతాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు ఆ మందుకు లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కాంబినేషన్ కీమోథెరపీని వినియోగిస్తారు. మీ విషయంలో మీకు ఏ మందులు లేదా కాంబినేషన్ మందులు వాడాలన్నది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే కీమోథెరపీలో భాగంగా మందులను ఎంత మోతాదులో, ఏ విధంగా, ఎప్పుడెప్పుడు, ఎంతకాలం ఇవ్వాలన్న విషయం కూడా మీ డాక్టరే నిర్ణయిస్తారు. ఈ నిర్ణయాలన్నీ కూడా మీరు ఏ రకమైన క్యాన్సర్ కణితితో బాధపడుతున్నారు, అది శరీరంలోని ఏ భాగంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, అది మీ శరీర కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తోంది అన్న అంశాలపై ఆధారపడి మీ డాక్టర్ నిర్ణయిస్తారు. కీమోథెరపీలో ఇచ్చే మందులను బట్టి మీ శరీరంలో అనేక విధాలుగా అతివేగంగా విస్తరించే క్యాన్సర్ కణాల విధ్వంసం జరుగుతుంది. క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందులను రూపొందించడం జరిగింది. అందువల్ల ప్రతి మందూ భిన్నరీతిలో పనిచేస్తుంటుంది. క్యాన్సర్ కణజీవనక్రమంలో ఎప్పు దాన్ని లక్ష్యంగా చేసుకొని, ధ్వంసం చేయాలో అప్పుడు మాత్రమే ఆ మందు ప్రభావం పనిచేస్తుంది. ఇక మీరు చెప్పే సైడ్ఎఫెక్ట్స్ విషయానికి వస్తే... కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని క్యాన్సర్ లేని సాధారణ కణజాలం సైతం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కీమో చికిత్స వల్ల పేషెంట్ కొంత అసౌకర్యానికి, ఇబ్బందికి గురవుతుంటారు. ఈ సైడ్ఎఫెక్ట్స్ వల్ల ముందు నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి మోతాదులో మందు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందువల్ల చికిత్స ప్రణాళికను అనివార్యంగా మార్చాల్సిరావచ్చు. ఇలాంటప్పుడు చికిత్స ద్వారా ఆశించే ఫలితాలను సంపూర్ణంగా రాబట్టడం కష్టసాధ్యం కావచ్చు. అంటే సైడ్ఎఫెక్ట్స్ వల్ల శారీరక అసౌకర్యం, ఇబ్బందులే కాకుండా, ఒక్కోసారి పూర్తి చికిత్స ప్రక్రియ కూడా కుంటుపడే అవకాశం ఉంది. కీమో వల్ల ఎదురయ్యే ఇబ్బందులో వాంతులు, వికారం, అలసట, జుట్టు రాలిపోవడం (ఇది తాత్కాలికం) వంటివి కలగవచ్చు. ఇక రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం మాత్రం కాస్త తీవ్రమైన పరిణామం. అయినా ఇటీవల సైడ్ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే కీమోథెరపీ మందుల రూపకల్పన కూడా జరుగుతోంది. మీ డాక్టర్ సూచించిన చికిత్సను చేయించుకోండి. కొత్తగా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వంటివి అత్యాధునికమైన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో సైడ్ఎఫెక్ట్స్ చాలా తక్కువ. మీరు ఎలాంటి ఆందోళనా చెందకుండా మీ డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన, చికిత్సను నిర్భయంగా తీసుకోండి. డాక్టర్ జి. వంశీకృష్ణారెడ్డి, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
మద్యంతో నోటిక్యాన్సర్ ముప్పు
లండన్ : రోజుకు కేవలం కొద్దిపాటి మద్యం తీసుకున్నా చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్, గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజూ పరిమితంగా మద్యం సేవిస్తే పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఇప్పటివరకూ వచ్చిన పలు అథ్యయనాలను తాజా సర్వే తోసిపుచ్చింది. పరిమితంగా తీసుకునే మద్యంలోనూ ఉండే నిర్థిష్ట బ్యాక్టీరియాతో పలు తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తాయని తేల్చింది. మద్యం అసలే ముట్టుకోని వారితో పోలిస్తే రోజుకు ఒకసారి అంతకంటే ఎక్కువ సార్లు మద్యం తీసుకునే వారి నోటిలో హానికారక బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. హానికారక క్రిములతో పోరాడే ఆరోగ్యకర బ్యాక్టీరియా సైతం మద్యం సేవించే వారిలో అతితక్కువగా ఉంటుందని పేర్కొంది. మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తి బలహీనపడకుండా, తల, మెడ, నోటి క్యాన్సర్ల బారినపడకుండా ఉండవచ్చని అథ్యయన రచయిత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు జియోంగ్ ఆన్ చెప్పారు. -
నోరు శుభ్రంగా లేకున్నా నోటి కేన్సర్!
♦ పొగాకు, గుట్కా, ఆల్కహాల్‌లతో పాటు ఇదీ ఒక కారణమే ♦ ప్రపంచ నోటి కేన్సర్లలో 31.25 శాతం భారత్‌లోనే ♦ ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి పరిశోధనలు సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట ఫుల్‌గా నాన్ వెజ్ తిని, దాంతోపాటు ఆల్కహాల్ లేదా శీతల పానీయాలు సేవించి కనీసం నోటిని శుభ్రం చేసుకోకుండా అలాగే నిద్రపోతే నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం, పొగాకు పదార్థాలు, గుట్కా నమలడం, ఆల్కహాల్ సేవించడం వ ల్ల నోటి కేన్సర్ ప్రమాదం ఎక్కువని, దాంతోపాటు నోటిని శుభ్రంగా ఉంచుకోకున్నా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచంలో 3.2 లక్షల మంది నోటి కేన్సర్ రోగులు ఉంటారని, అందులో లక్ష మంది (31.25%) మన దేశంలోనే ఉంటారని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కేన్సర్లు కోటిన్నర మందికి వచ్చే అవకాశం ఉందని, అందులో భారత్‌లో 10.58 లక్షల (7.05%) మందికి సోకే అవకాశం ఉందని పేర్కొంది. గుట్కా నమలడం వల్ల ఎంత శ్రమ చేసినా శరీరం అలిసిపోదు. అందుకే బరువులు మోసేవారు, లారీ, ఆటో డ్రైవర్లు, ఇతరత్రా శ్రమ జీవులు దీనికి బానిసలవుతున్నారని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి వారికి కేన్సర్ సోకినట్లు ప్రాథమిక దశలో గుర్తించలేమని చెబుతున్నారు. ప్రాథమిక దశలో గుర్తించేందుకు: ప్రాథమిక దశలోనే నోటి కేన్సర్‌ను గుర్తించేందుకు చేయాల్సిన వైద్య పరీక్షలపై పరిశోధనలు చేస్తున్నట్లు ఇండో-అమెరికన్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధిపతి డాక్టర్ వీవీటీఎస్ ప్రసాద్ సోమవారమిక్కడ విలేకరులకు చెప్పారు. అందుకోసం అమెరికాకు చెందిన ఒక కంపెనీ రూ. 2.5 కోట్లు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రూ. 50 లక్షల ఆర్థిక సాయం చేశాయన్నారు. రెండేళ్లు ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో నోటి కేన్సర్ అధికంగా ఉందన్నారు. భారత్‌లో ఇతర కేన్సర్లతో పోలిస్తే నోటి క్యాన్సర్లే అధికమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామా ల్లో నీటి కొరత కారణంగా శుభ్రత తగ్గి సర్వైకల్ కేన్సర్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మూడు, నాలుగో దశల్లో నోటి కేన్సర్ రోగులొస్తే వారిని కాపాడటం కష్టమన్నారు. మొదటి, రెండో దశలో ఉన్నప్పుడు నోటి కేన్సర్‌ను దంత వైద్యులు కూడా గుర్తించలేరన్నారు. అందుకే తాము ప్రాథమిక దశలో నోటి కేన్సర్‌ను గుర్తించే పరీక్షలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. దీనికి ‘థెర్నాస్టిక్ పరిశోధన’ అని నామకరణం చేశామని ఆయన తెలిపారు.