నోరు శుభ్రంగా లేకున్నా నోటి కేన్సర్! | Whether or not you clean mouth cancer in the mouth! | Sakshi
Sakshi News home page

నోరు శుభ్రంగా లేకున్నా నోటి కేన్సర్!

Published Tue, Jan 12 2016 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

నోరు శుభ్రంగా లేకున్నా నోటి కేన్సర్!

నోరు శుభ్రంగా లేకున్నా నోటి కేన్సర్!

♦ పొగాకు, గుట్కా,     ఆల్కహాల్‌లతో పాటు ఇదీ ఒక కారణమే
♦ ప్రపంచ నోటి కేన్సర్లలో 31.25 శాతం భారత్‌లోనే
♦ ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి పరిశోధనలు
 
 సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట ఫుల్‌గా నాన్ వెజ్ తిని, దాంతోపాటు ఆల్కహాల్ లేదా శీతల పానీయాలు సేవించి కనీసం నోటిని శుభ్రం చేసుకోకుండా అలాగే నిద్రపోతే నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం, పొగాకు పదార్థాలు, గుట్కా నమలడం, ఆల్కహాల్ సేవించడం వ ల్ల నోటి కేన్సర్ ప్రమాదం ఎక్కువని, దాంతోపాటు నోటిని శుభ్రంగా ఉంచుకోకున్నా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచంలో 3.2 లక్షల మంది నోటి కేన్సర్ రోగులు ఉంటారని, అందులో లక్ష మంది (31.25%) మన దేశంలోనే ఉంటారని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కేన్సర్లు కోటిన్నర మందికి వచ్చే అవకాశం ఉందని, అందులో భారత్‌లో 10.58 లక్షల (7.05%) మందికి సోకే అవకాశం ఉందని పేర్కొంది. గుట్కా నమలడం వల్ల ఎంత శ్రమ చేసినా శరీరం అలిసిపోదు. అందుకే బరువులు మోసేవారు, లారీ, ఆటో డ్రైవర్లు, ఇతరత్రా శ్రమ జీవులు దీనికి బానిసలవుతున్నారని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి వారికి కేన్సర్ సోకినట్లు ప్రాథమిక దశలో గుర్తించలేమని చెబుతున్నారు.

 ప్రాథమిక దశలో గుర్తించేందుకు: ప్రాథమిక దశలోనే నోటి కేన్సర్‌ను గుర్తించేందుకు చేయాల్సిన వైద్య పరీక్షలపై పరిశోధనలు చేస్తున్నట్లు ఇండో-అమెరికన్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధిపతి డాక్టర్ వీవీటీఎస్ ప్రసాద్ సోమవారమిక్కడ విలేకరులకు చెప్పారు. అందుకోసం అమెరికాకు చెందిన ఒక కంపెనీ రూ. 2.5 కోట్లు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రూ. 50 లక్షల ఆర్థిక సాయం చేశాయన్నారు. రెండేళ్లు ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో నోటి కేన్సర్ అధికంగా ఉందన్నారు.

భారత్‌లో ఇతర కేన్సర్లతో పోలిస్తే నోటి క్యాన్సర్లే అధికమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామా ల్లో నీటి కొరత కారణంగా శుభ్రత తగ్గి సర్వైకల్ కేన్సర్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మూడు, నాలుగో దశల్లో నోటి కేన్సర్ రోగులొస్తే వారిని కాపాడటం కష్టమన్నారు. మొదటి, రెండో దశలో ఉన్నప్పుడు నోటి కేన్సర్‌ను దంత వైద్యులు కూడా గుర్తించలేరన్నారు. అందుకే తాము ప్రాథమిక దశలో నోటి కేన్సర్‌ను గుర్తించే పరీక్షలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. దీనికి ‘థెర్నాస్టిక్ పరిశోధన’ అని నామకరణం చేశామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement