దేశాలను వేటికవిగా ఉంచడానికి సరిహద్దులు ఉన్నట్లే, వేటికవిగా ఉన్న దేశాలను కలిపేయడానికి ‘ఇంగ్లిష్’ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ దేశం ఏ భాషలో ఉన్నా, ఇంగ్లిష్‌లో ఆ భాషను అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఇంగ్లిష్ భాషా సముద్రంలో ఇంగ్లిష్ భాషను ఎవరు కనిపెట్టారన్న విషయాన్ని మాత్రం శోధించి సాధించలేం! భాష నిరంతరం పుడుతూనే ఉంటుంది కనుక ఇంగ్లిష్‌కే కాదు, ఏ భాషకూ సృష్టికర్త ఉండరు. వాడుకలోకి తెచ్చేవాళ్లు, పలుకుబడిలో ఉంచేవాళ్లు.. వీళ్లు మాత్రమే ఉంటారు. మనుషులు మాట్లాడినన్నాళ్లు భాష ఉంటుంది.
వాడుక, పలుకుబడి తగ్గితే వడలిపోతుంది. పదును తగ్గుతుంది. అప్పుడు మన భాషలోని పదాలే, మన భాషలోని భావాలే కొత్తవిగా అనిపించి ఇంగ్లిష్‌లో వాటి అర్థాలను వెతుక్కోడానికి పేజీలు తిప్పుతాం! తెలుగు టు ఇంగ్లిష్. ‘నులక మంచం’ అంటే ఏంటి తాతయ్యా (డాడీకి తెలిసే అవకాశం తక్కువ కనుక) అని అడిగితే తాతయ్య చెప్పగలడు. ఇంగ్లిష్‌లో చెప్పు తాతయ్యా అర్థం కావడం లేదు అంటే it is a cot with a simple wooden frame onto which ropes are woven tightly అంటాడు.
నులక మంచానికి ఇంగ్లిష్‌లో అచ్చంగా ఒక పదం లేదు. అది భారతీయ సంస్కృతిలోనిది. ఉర్దూలో నులక మంచాన్ని ‘చార్‌పాయ్’ అంటారు. సంస్కృతంలో, హిందీలో, పంజాబీలో ఇంకా కొన్ని నాన్–ఇంగ్లిష్ భాషల్లో ‘చార్‌పాయ్’ అనే అంటారు. ఇంగ్లిష్ భాషలోని గొప్పతనం ఏంటంటే.. అది లాంగ్వేజ్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అన్ని భాషల్నీ తనవి చేసుకుంటుంది. అంటే కొట్టేయడం కాదు. చోటు ఇవ్వడం. చార్‌పాయ్ అనేది 1835–45 మధ్య వాడుకలోకి వచ్చిన పదం. కాలక్రమంలో దాన్ని కాలిన్స్ ఇంగ్లిష్ డిక్షనరీ తీసుకుంది.
తీసుకోవడం అంటే.. భాషకు, పదానికి గౌరవస్థానం ఇవ్వడం. జీవితం కూడా అంతే. ఉన్నది కొంత, తెచ్చుకున్నది కొంత అయితేనే సంపూర్ణంగా ముందుకు సాగుతుంది. తెలిసిన దానిని తరచి చూసుకోకుండా, తెలియనిదాన్ని తెరిచి చూడకుండా ఉంటే నిర్జీవమైపోతుంది. ఈ విషయాన్నంతా ఇంగ్లిష్‌లో మొదలుపెట్టి, ఇంగ్లిష్‌లో కంప్లీట్ చెయ్యడం దేనికంటే.. ఇవాళ ‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ డే’. – మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment