నాన్నకు ప్లేటులో... | today fathers day | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్లేటులో...

Published Fri, Jun 17 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

నాన్నకు ప్లేటులో...

నాన్నకు ప్లేటులో...

ఆకలిలో మర్చిపోయే ప్రేమను కూడా ప్రేమ అనవచ్చు.ప్రేమలో ఆకలిని కూడా మరిచిపోయేలా చేసేది నాన్న ప్రేమ అనవచ్చు. నిజమే! నాన్న ప్రేమ కడుపు నింపేస్తుంది.రేపు ఫాదర్స్ డే! నిజానికి ప్రతిరోజూ ఫాదర్స్ డే! రేపు ఫాదర్స్ డే వేడుకలు.నాన్నకు ఏమైనా వండిపెడితే బాగుంటుంది కదూ! ప్రేమగా వండిపెడితే ఇంకా బాగుంటుంది కదూ!

పెసరట్టు
అమ్మ ఆరు నెలలుగా అమెరికాలో ఉంటోంది. ఇంకో రెండు మూడు నెలల్లో వచ్చేస్తుంది. అమ్మ ఉన్నప్పుడు వంటిల్లు ఎలా ఉంటుందో కూడా నాన్నకు తెలియదు. ఇప్పుడు నాన్న నేను లేచేసరికి టిఫిన్లు చేసి సిద్ధంగా ఉంచుతారు. ‘ఎందుకు నాన్నా.. పనివాళ్లు ఉన్నారుగా’ అంటే వినరు. సండే అయితే స్పెషల్స్‌తో అదరగొట్టేస్తారు. నాన్నకు పెసరట్టు అంటే చాలా ఇష్టం. నాన్నను సర్‌ప్రైజ్ చేయడానికి పెసరట్టు ట్రై చేస్తుంటాను. పెసరట్టు కాలుతుంటే దాని మీద అన్ని ఉల్లిపాయలు, ఇన్ని పచ్చిమిర్చి ముక్కలు, అంత కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ ఉంటుందీ.. అదన్నమాట.  - నానీ

కావల్సినవి:
గుండు పెసరపప్పు - కప్పు; కొత్తిమీర - కొద్దిగా బియ్యం - 2 టీ స్పూన్లు; ఉల్లిపాయ - 1 (తగినన్ని) అల్లం - చిన్నముక్క; జీలకర్ర - టీ స్పూన్ పచ్చిమిర్చి - 4; ఉప్పు - తగినంత

తయారీ:
పెసరపప్పును కడిగి, కనీసం 5 గంటల సేపు నానబెట్టాలి. మిక్సర్‌జార్‌లో నానిన పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. స్టౌపై పెనం పెట్టి వేడిచేయాలి. పెనం  మధ్యలో పిండి వేసి గరిటెతో గుండ్రంగా తిప్పాలి. దోసెలా వేయాలి. అట్టు మీద తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లి చుట్టూ టీ స్పూన్ నూనె వేయాలి. మంట తగ్గించి పెనం మీద మూత పెట్టాలి. 2-3 నిమిషాలాగి మూత తీసి, అట్టు కాలిందేమో చూసుకొని, జాగ్రత్తగా రెండోవైపుకు తిప్పాలి. తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. పెసరట్టుకు అల్లం పచ్చడి కాంబినేషన్ అద్దిరిపోతంది. ట్రై చేయండి.

కొబ్బరిపాల  పాయసం

నాన్నకు కొబ్బరి పాల పాయసం అంటే చాలా ఇష్టం. నా పుట్టిన రోజున, పండగలప్పుడు అమ్మ అదే చేస్తుంది. నేనూ అమ్మ దగ్గరే ఈ పాయసం చేయడం నేర్చుకున్నాను. బాగా కిస్‌మిస్‌లు, జీడిపప్పులు, నెయ్యి వేస్తే కొబ్బరి పాల పాయసం ఎంతైనా లాగించవచ్చు. ఈ ఫాదర్స్ డే కి నాన్నకోసం కొబ్బరి పాలపాయసం చేస్తాను. - ఆదాశర్మ

కావల్సినవి:
వెన్నతీయని పాలు - 4 కప్పులు; కొబ్బరి పాలు - కప్పు; పచ్చికొబ్బరి పేస్ట్ - కప్పు (కొబ్బరి ముక్కలను మిక్సర్‌జార్‌లో వేసి మెత్తగా చేయాలి, పేస్ట్ మెత్తగా అవ్వాలంటే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలపచ్చు); పచ్చికొబ్బరి తరుగు - పావు కప్పు, పంచదార - కప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూన్, జాజికాయ పొడి - పావు టీ స్పూన్; నెయ్యి - టీ స్పూన్; జీడిపప్పు పలుకులు - 10; కిస్‌మిస్ - తగినన్ని

 
తయారీ:
మందపాటి గిన్నెలో పాలు మోసి మరిగించాలి. దీంట్లో కొబ్బరి పాలు, పేస్ట్, సన్నగా తరిగి కొబ్బరిముక్కలు వేసి ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా యాలకులపొడి, జాజికాయపొడి, నెయ్యి వేసి కలపాలి. చివరగా నెయ్యిలో వేయించి జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసిదించాలి.

గోంగూర పచ్చడి

నాకు నార్త్ ఇండియన్ వంటకాల రుచులే తెలుసు. అమ్మ చేసే వంటలన్నీ బాగా ఇష్టంగా తింటాను. టాలీవుడ్‌కి వచ్చాక ఇక్కడి పచ్చళ్లు బాగా నచ్చాయి. మా నాన్నగారు గోంగూర పచ్చడిని బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా సరదాగా ట్రై చేస్తుంటాను.

కావల్సినవి:
గోంగూర - 300 గ్రాములు నూనె - టీ స్పూన్; ఎండుమిర్చి - 10 ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు మెంతులు - 1/2 టీ స్పూన్; జీలకర్ర -  టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు - 3; ఉప్పు - తగినంత  ఎర్ర ఉల్లిపాయ - 1 (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి)  పోపులోకి: నూనె - 2 టేబుల్ స్పూన్లు  వెల్లుల్లి - 4 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి); నల్ల గుండు మినప్పప్పు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ; శనగపప్పు - టీ; స్పూన్; ఎండుమిర్చి - 2; ఆవాలు - అర టీ స్పూన్

 
తయారీ

గోంగూరను శుభ్రపరిచి తడిపోయేంతవరకు ఆరబెట్టాలి. కడాయిని పొయ్యి మీద పెట్టి నూనె వేసి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో గోంగూర వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. రోట్లో లేదా మిక్సర్‌జార్‌లో వెల్లుల్లి రెబ్బలు, వేయించిన దినుసులు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. దీంట్లో ఉడికించిన గోంగూర వేసి బ్లెండ్ చేయాలి. రుబ్బిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చివేయించాలి. కరివేపాకు వేసి పోపు చల్లారాక గోంగూర పచ్చడిలో కలపాలి. కావాలనుకుంటే చిటికెడు ఇంగువ కూడా పోపులో వేసుకోవచ్చు.   -   రకుల్ ప్రీత్‌సింగ్


సింధీ  ఆలూ టుక్  ‘నాన్నకు ఆలూ టుక్ ఇష్టం’

కావల్సినవి:

బేబీ పొటాటోలు (చిన్న బంగాళదుంపలు) - 20  కారం - 3/4; ఉప్పు - తగినంత; మిరియాలపొడి - పావు టీ స్పూన్

 
తయారీ:

గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు వేసి బంగాళదుంపలను ఉడికించాలి. తర్వాత నీళ్లు వడకట్టి బంగాళదుంపలను పక్కన ఉంచాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగాక ఉడికిన బంగాళదుంపలను గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. చల్లారాక ఒక్కో బంగాళదుంపను అరచేతితో అదమాలి. మళ్లీ కాగుతున్న నూనెలో వేసి వేయించి, ప్లేట్‌లోకి తీసుకొని కారం, మిరియాల పొడి, ఉప్పు చల్లి వెంటనే సర్వ్ చేయాలి.  -  తమన్నా

గుత్తొంకాయ

నేను కిచెన్‌లోకి వెళ్తానంటే నాన్న కంగారు పడతారు. సరదాగా అమ్మతో కలిసి ఆటపట్టిస్తుంటారు. నాన్నకు గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. గుత్తొంకాయ కూరంటే చాలా పెద్ద పనే! కానీ, అమ్మ సాయంతో ఈ కర్రీ చేసి నాన్న చేత మార్కులు కొట్టేస్తా!

 

కావల్సినవి:

పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము - ఒకొక్కటి 100 గ్రాముల చొప్పున; చింతపండు - నిమ్మకాయ పరిమాణం (నీళ్లు పోసి నానబెట్టాలి); వంకాయలు - 6; ఉల్లిపాయలు - 1 (పెద్దది. సన్నగా తరగాలి); ఎండుమిర్చి - 4; నూనె - 2 టేబుల్ స్పూన్లు; కారం - టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; కరివేపాకు - రెమ్మ; ఉప్పు - తగినంత కొత్తిమీర - టీ స్పూన్

తయారీ:

పల్లీలు, నువ్వులు వేయించి చేసిన పొడి, కొబ్బరి, చింతపండు గుజ్జు, కారం, తగినంత ఉప్పు కలిపి ముద్ద చేయాలి. వంకాయలను నాలుగువైపు లా కట్ చేయాలి. పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కట్ చేసిన వంకాయల్లో కూరాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలపాలి. కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, స్టఫ్డ్ వంకాయలు, మిగిలిన గ్రేవీ వేసి కలిపి ఉడికించాలి. వంకాయలు, మిశ్రమం చక్కగా ఉడికాక కొత్తిమీర చల్లి దించాలి.
- నిహారిక

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement