భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిష్ఠలు, నియమాలు, మడులు పాటించినా, పాటించకపోయినా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉండాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటేæ కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద లాంటివి కూడా. వ్రతం అనేసరికి అమ్మవారికి ఎంతెంత పూజ చేయాలో, ఎన్నెన్ని నైవేద్యాలు పెట్టాలో అని కంగారు పడనక్కరలేదు. మన ఇంటికి ఎవరైనా బాగా కావలసిన ఒక ముఖ్య అతిథి వచ్చారనుకోండి, మనం వారిని సాదరంగా ఆహ్వానించి, ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో ఎలా గౌరవించి, ఎంత మర్యాదగా సాగనంపుతామో అలా శ్రద్ధగా, భక్తిగా, నిష్ఠగా పూజ చేసుకోవాలి. చేతనైన పిండివంటలు చేయాలి. ఇంటికి వచ్చిన పేరంటాళ్లకు మర్యాద చేసి, కాళ్లకు పసుపు రాసి, నుదుట బొట్టు, మెడకు గంధం పెట్టి, చేతికి తోరం కట్టి, చేతిలో పండ్లు, తాంబూలం పెట్టి, నమస్కరించి, ఆశీస్సులు అందుకోవాలి.
వరలక్ష్మి వ్రతంలో తోరం ఎందుకు?
వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సంప్రదాయం ఉంది! ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు, ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం...అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుందని విశ్వాసం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, మరొకటి ముత్తయిదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అందుకే నవసూత్రం కట్టుకుంటారు. కొందరు ఐదు ముడులు కూడా వేసుకుంటారు. ఇలా కట్టుకున్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ! ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒకో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి పూజించాలి. దీనినే తోరగ్రంథిపూజ అంటారు. తోరంలోని ఒకో ముడినీ అక్షతలతో కానీ, పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథిపూజ. ఇందుకోసం ఓం కమలాయై నమ: ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయై నమ: ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమ: తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యై నమ: చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్షై్మనమ: పంచమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయామై నమ: షష్టి గ్రంథిం పూజయామిఓం విశ్వసాక్షిణ్యై నమ: సప్తమ గ్రంథిం పూజయామి ఓం చంద్రోసహోదర్యై నమ: అష్టమ గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయై నమ: నవమ గ్రంథిం పూజయామి అని చదువుతూ ఒకో ముడినీ పూజించాలి.
ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత...!
బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాధివృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే’!!అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి. తోరాన్ని తప్పకుండా కుడిచేతికే ధరించాలి. అంతేకాదు, ఇలా ధరించిన తోరాన్ని కనీసం ఒక రాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవడం మంచిది.
పూజకు కావలసినవి
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెబట్ట, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరాలు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.
వ్రత విధానం
ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం పైన బియ్యపుపిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ప్రతిమ లేదా ఫొటో అమర్చుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకుని, నివేదన, హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారిని ధ్యాన ఆవాహనాది శోడశోపచారాలతో పూజించుకోవాలి. వ్రత కథ చదువుకుని, అక్షతలు శిరస్సున ధరించాలి. ముత్తయిదువలకు వాయినాలు, తాంబూలాలు ఇవ్వాలి. అనంతరం బంధుమిత్రులతో కలసి భుజించాలి.
– డి.వి.ఆర్.
రావమ్మా వరలక్ష్మీ తల్లీ రావమ్మా
Published Fri, Aug 24 2018 12:31 AM | Last Updated on Fri, Aug 24 2018 12:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment