మంచు కురిసే ప్రాంతంలో.. మైనస్ డిగ్రీల చలిలో.. 5895 మీటర్ల ఎత్తులో ఉన్న ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్దదైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి త్రివర ్ణపతాకాన్ని ఎగురవేసి.. అమ్మాయిలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు వెన్నపూస శ్రీలత.
వైఎస్‌ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండల పరిధిలోని మారుమూల పల్లెటూరుకు చెందిన శ్రీలత.. ఆఫ్రికా ఖండం టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతారోహణ చేసి.. యువతులు ఎందులోనూ తీసిపోరని చాటి చెప్పారు. వెల్లటూరు గ్రామపరిధిలోని పాతగిరియపల్లెకు చెందిన వ్యవసాయరైతు వి.వెంకటచంద్రారెడ్డి, అయ్యవారమ్మల కుమార్తె అయిన శ్రీలతకు కడప నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు తలసైనిక్ క్యాంపులో ట్రెక్కింగ్ చేసే సమయంలో పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. అదే సమయంలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ఔత్సాహికులకు ఎంపికలు నిర్వహించారు. అయితే అందులో ఈమె ఎంపిక కాలేదు. ఆ క్రమంలో ఈ యేడాది ఫిబ్రవరిలో మౌంట్ కిలిమంజారో పర్వతారోహణ కోసం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించినప్పుడు జిల్లాస్థాయిలో సత్తాచాటి, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అక్కడ చక్కటి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో శిక్షణకు అర్హురాలయ్యారు.
మంచుకొండల్లో
జాతీయస్థాయిలో ట్రెక్కింగ్ శిక్షణకు దేశవ్యాప్తంగా 160 మందిని ఎంపికచేయగా.. ఏపీ నుంచి 40 మంది ఈ శిక్షణకు హాజరయ్యారు. ఏప్రిల్ నెలలో 20 రోజుల పాటు జమ్మూ–కశ్మీర్‌లో మంచుకొండల్లో కఠోరశిక్షణ ఇచ్చారు. కిలీమంజారో పర్వతారోహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎక్కే విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం కిలిమంజారో పర్వతారోహణ చేసే బృందంలో ఒకరిగా శ్రీలత ఎంపికయ్యారు. ఆ తర్వాత విజయవాడలో మళ్లీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
వణికించే చలిలో
సాహసోపేతమైన పర్వతారోహణలో పాల్గొనాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం అవసరం. పురుషులు సైతం కాస్త వెనుకా.. ముందు ఆలోచించే ఇటువంటి సాహసకృత్యానికి రాష్ట్రం నుంచి 40 మంది వెళ్లగా వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే అమ్మాయిలు ఉండటం విశేషం. ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక కాగా, మరో యువతి శ్రీలత.
పోలీస్ ఆఫీసర్ అవడమే లక్ష్యం
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి ముంబైకి, అక్కడి నుంచి విమానంలో నేరుగా టాంజానియాకు వెళ్లాం. అక్కడి నుంచి 3 గం. పాటు ప్రయాణించి కిలిమంజారో హిల్‌స్టేషన్‌కు సెప్టెంబర్ 7వ తేదీకి చేరుకున్నాం. రోజుకు 10 కి.మీ. ఎక్కాలన్న లక్ష్యంతో తొలిరోజు 12 కి.మీ. మేర ఎక్కాం. ఉదయం పూట –7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రిళ్లు –9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండేది. ఇలా రోజుకు కొన్ని కి.మీ.చొప్పున ఎక్కుతూ అత్యంత ఎల్తైన కిబో(ఉహురు) శిఖరం అంచుకు చేరుకున్నాం. మొత్తం వారం రోజుల్లో 5,895 మీటర్ల ఎత్తు (19,341 అడుగుల ఎత్తులో)న పర్వతాన్ని చేరుకున్నాం. ఆ శిఖరాగ్రంలో త్రివర్ణపతకాన్ని ఎగురవేయడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తాను. భవిష్యత్తులో పోలీసు ఉన్నతాధికారిగా పనిచేయాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం ప్రస్తుతం ఎస్‌ఐ ఉద్యోగం సాధించేందుకు సన్నద్ధం అవుతున్నా.
– నాగ్, కడప
Comments
Please login to add a commentAdd a comment