దేవుడిలా వచ్చాడు... కష్టాలు తీర్చాడు! | todayYS Rajasekhar Reddy Jayanthi | Sakshi
Sakshi News home page

దేవుడిలా వచ్చాడు... కష్టాలు తీర్చాడు!

Published Fri, Jul 8 2016 1:02 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

దేవుడిలా వచ్చాడు... కష్టాలు తీర్చాడు! - Sakshi

దేవుడిలా వచ్చాడు... కష్టాలు తీర్చాడు!

నేడు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి. మారాజు... మన సార్.. పుట్టినరోజు.
అలాంటి తండ్రి మన గుండె గర్భంలో ఉంటే... పురిటినొప్పులు ఎలా ఉంటాయి?
తియ్యటి జ్ఞాపకాల్లా ఉంటాయి. సేద తీర్చే స్మృతుల్లా ఉంటాయి.
పేగు పంచుకున్న మధురిమల్లా ఉంటాయి. అప్పుడే పుట్టిన బోసి నవ్వుల్లా ఉంటాయి.
ఊహు! ఈ బొడ్డుతాడు తెగదు. ఈ బంధం వీడదు.
గర్భగుడిలోని పవిత్రమైన విగ్రహం ప్రతిఫలించే కిరణాల్లా...
వై.ఎస్.ఆర్. జ్ఞాపకాలు గుండె గర్భంలో కొలువై ఉన్నాయి. కేరింతలు కొడుతున్నాయి.
అశేష ఆత్మీయ క్షణాల ఆ కేరింతల్లో ఇవి.. గోరంత.

పావలా బొట్టు రూపాయి కంటే పెద్దగా కనిపించింది.
సూర్యుడి కంటే ఎక్కువ వెలుగునిచ్చింది. నుదుటినున్న చీకటిని చెరిపేసింది.

 

అన్నలా నా జీవితాన్ని మలిచారు!
నా కాళ్లమీద నేను నిలదొక్కుకోవడంతో పాటు మరో ఐదు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తానని కలలో కూడా అనుకోలేదు. వైయస్‌ఆర్‌గారు మా మహిళలకు పావలా వడ్డీ రుణం రూపంలో మంచి దారి చూపించారు. నేను 2005లో లక్ష రూపాయలు తీసుకుని రైసు మిల్లు, పిండిమర పెట్టాను. అదిప్పుడు ఐదు లక్షల స్థాయికి చేరుకుంది. మా పాపకు మంచి సంబంధం చూసి, పెళ్లి చేశాను.మరోవైపు గ్రామైక్య సంఘ ప్రెసిడెంటుగా, ఇందిరాక్రాంతి పథక మండల సమాఖ్య అధ్యక్షురాలిగా కూడా చేశాను. ఇప్పుడు విజయనగరంలోని టీటిడిసీలో, ఆర్.కె. టౌన్‌షిప్‌లోని జిఎమ్మార్ సంస్థకు చెందిన మెస్‌లను చూసుకుంటున్నాను. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వైఎస్‌ఆర్ అనుకున్నారు. అన్నలా నాలాంటి ఎందరో చెల్లెళ్ల జీవితాన్ని మలిచారాయన. - మత్య నాగమణి  (ముగడ గ్రామం - బాడంగి మండలం - విజయనగరం)

 
అదే నా జీవనాధారం

అన్ని అవయవాలూ సక్రమంగా ఉంటేనే పని దొరకడం కష్టం. ఇక.. శారీరక లోపం ఉంటే ఎవరు ఆదరిస్తారు? మా కుటుంబం పరిస్థితి కూడా అంతంత మాత్రం. అమ్మా నాన్న (నూకాబత్తిని సుభాషిణి, మాణిక్యరావు) కూలి పనులకు వెళతారు. వాళ్లకు నేను పెద్ద భారమే. పల్లెత్తు మాట అనకుండా నన్ను సాకారు. వాళ్ల కష్టం చూడలేక కుమిలిపోయేదాన్ని. అలాంటి సమయంలోనే రాజశేఖర్‌రెడ్డిగారు పావలా వడ్డీ రుణాల ప్రవేశం మొదలుపెట్టారు. అది నాకు కొండంత అండ అయ్యింది. 15,000 రూపాయలు రుణం తీసుకుని, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా. దాని మీద వచ్చే డబ్బులు, అమ్మా నాన్నలు కష్టం చేసి తెచ్చే డబ్బులతో ఇప్పుడు మేం ఇబ్బంది లేకుండా బతకగలుగుతున్నాం. ఏ ఆధారం దొరకదేమోనని దిగులుపడ్డ నాకిప్పుడు ఆ చిన్న బడ్డీ కొట్టే పెద్ద ఆధారమైంది. పావలా వడ్డీ రుణం వల్ల నాక్కలిగిన ఆర్థిక బలం నేను వికలాంగురాలిననే విషయాన్ని మర్చిపోయి శారీరక బలాన్నిస్తోంది. రాజశేఖర్‌రెడ్డి సారూ.. మీ కుటుంబం చల్లగా ఉండాలి.  - భాగ్యలక్ష్మి, గుంటూరు

 

బువ్వ పెట్టిన తండ్రి..!
నాకు బువ్వపెట్టి బతుకిచ్చిన తండ్రి రాజశేఖర్‌రెడ్డి. నాకు 18 ఎకరాల పొలం ఉంది. ఆరుగురు కొడుకులకు తలా 3 ఎకరాలు పంచి ఇచ్చాను. ఆ పొలంలో సజ్జలు, ఆముదాలు పండిస్తాం. సీజన్‌లో వరి సాగు చేస్తాం. వ్యవసాయం అంటే తేలికైన పనేమీ కాదు. రెక్కలు ముక్కలు చేసుకోవాలి. కానీ ఏడాదంతా కష్టపడి పండిస్తే వచ్చేది పెట్టుబడులకు, కరెంట్ బిల్లులకే సరిపోయేది. కానీ మా కష్టాలను తీర్చడానికి వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అవుతూనే మొట్టమొదటగా ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం పెట్టారు. అది మా పాలిట వరమయ్యింది. మాబోటి రైతులకు ఎంతో మేలు జరిగింది. విద్యుత్ చార్జీల రూపంలో పోయేదంతా మిగలసాగింది. దాంతో మా కష్టానికి ఫలితం దక్కింది. మా జీవితాల్లో మార్పు వచ్చింది. మాకు కడుపునిండా బువ్వపెట్టిన ఆ తండ్రిని మేం మరవలేమయ్యా! చెప్పాలంటే... ఆయన కాలంలో మాబోటి రైతులు రాజుల్లెక్క బతికారు. అందుకే మేం బతికున్నంత కాలమూ ఆయన్ను యాది పెట్టుకుంటం. - బొడ్డుపల్లి సత్తయ్య, గుమ్మడవెల్లి,  నల్లగొండ

 
దేవుడిలా వచ్చాడు... కష్టాలు తీర్చాడు!
రైతుల కష్టం తెలిసిన దేవుడు వైఎస్‌ఆర్. వానలు పడక, కరెంట్ లేక, బోరు నీళ్లు అందక.. నానా కష్టాలు పడి సాగు చేసిన పంట అతివృష్టి, అనావృష్టితో దెబ్బ తింటున్న సమయంలో ఆయన దేవుడిలా వచ్చారు. మా కష్టాలన్నీ తీర్చారు. వ్యవ సాయానికి ఉచితంగా విద్యుత్ ఇస్తానని ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే నిలుపుకున్నారు. ఆయన పుణ్యమాని చిన్న రైతులం, మెట్ట ప్రాంత రైతులం ఎంతో లబ్ధి పొందాం. అంతుకుముందు వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించలేక తంటాలు పడ్డాం. ఆయన పెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఆ సమస్యను తీర్చేసింది. ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాదు... దానికితోడు ఏడు గంటల విద్యుత్ సరఫరా కూడా చేయటంతోఎంతో మేలు జరిగింది.  వ్యవసాయం ఉన్నంత కాలం వైఎస్‌ను మరువలేం.  - గుమ్మడి రామకృష్ణ, పెదపారుపూడి, కృష్ణాజిల్లా

 

ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటిలోని కాగితాల కంటే ఎక్కువ సంఖ్యలో కలలు ఉంటాయి... ప్రతి స్టూడెంట్‌లో.  ఆ కలలు కళకళలాడాలంటే జేబులు గలగలలాడాలి. ఫీజులు ‘కట్ట’గలగాలి. వై.ఎస్.ఆర్. అందరి ఫీజులను గలగలమనిపించారు.

 

ఆ మహానుభావుడి దయ!
నాన్న సింగరేణిలో పనిచేసేవారు. ఆయన వీఆర్‌ఎస్ తీసు కున్నాక మా ఆర్థికస్థితి అతలాకుతలమైంది. ఎలాగో కష్టపడి  పదో తరగతిలో మండల టాపర్‌గా నిలిచాను. పై చదువులకు వెళ్లాలంటే దిక్కుతోచని పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆసరాతో బాసర ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ పూర్తి చేశాను. ‘గేట్’లో ఉత్తీర్ణత సాధించి ఎంటెక్‌లో చేరాను. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందగలిగాను. అంతా ఆ మహానుభావుడి దయ.  - వేమూర్ల రాజేశ్, రెబ్బెన, ఆదిలాబాద్ జిల్లా

 

నా పిల్లలు ప్రయోజకులయ్యారు!
నేను దర్జీని. బట్టలు కుడితే తప్ప పూటగడవదు. ముగ్గురు పిల్లలనూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాను. మంచి మార్కులు తెచ్చుకోవడంతో ముగ్గురికీ ప్రైవేటు కాలేజీల్లో ఉచితంగా సీట్లు వచ్చాయి. పెద్దబ్బాయి నసీరుద్దీన్, అమ్మాయి రుక్సానా మెడిసిన్, చిన్నబ్బాయి నిజాముద్దీన్ ఇంజినీరింగ్ చదవాలనుకున్నారు. దర్జీ పనితో పిల్లల ఆశలు తీర్చడమెలా అని దిగులు చెందుతున్న తరుణంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆదుకుంది. పిల్లలు కోరుకున్నది చదువుకున్నారు. ప్రయోజకులయ్యారు.  - షేక్ ఫయాజ్ బాషా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 


అన్నం పెట్టే అన్నదాతతో ఉండాల్సింది రుణానుబంధం కానీ.. రుణాల బంధం కాదు. శత్రుత్వాన్ని కూడా మాఫీ చేసే సంస్కారం ఉన్నవాళ్లం. అన్నదాత రుణాలను మాఫీ చేయలేమా? చేయొద్దూ!!


పొలం అమ్మేద్దామనుకున్నా..
‘‘వ్యవసాయానికి వీలుగా ట్రాక్టర్ కొనుగోలుకు కనగల్ శాఖ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో రూ. 4 లక్షలు అప్పు తీసుకున్నా. మిత్తి(వడ్డీ) తో కలుపుకుని నాలుగు లక్షలు కాస్తా రూ. 7 లక్షల పైచిలుకు అయ్యింది. చెల్లించలేని గడ్డు పరిస్థితి వచ్చింది. బ్యాంక్ అధికారులేమో పలుమార్లు ట్రాక్టర్‌ను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. సరే అనుకొని, బ్యాంక్ అప్పు తీర్చేందుకు ఉన్న రెండు ఎకరాల భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డా. అయితే అప్పటి సీఎం వైఎస్ పుణ్యమా అని ట్రాక్టర్ కోసం బ్యాంక్‌లో తీసుకున్న రుణంలో మిత్తి రూ. 3,15,000 ఒకే దఫా మాఫీ అయింది. దీంతో అప్పటి నుంచి వైఎస్‌ను నా గుండెల్లో పెట్టుకున్నా. ఆయనపై అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు’’.  - కారింగు జానకిరాములు, బుడమర్లపల్లె, నల్లగొండ జిల్లా

 
రుణ విముక్తి పొందా...

అప్పులు చేసి మరీ 15 ఎకరాల్లో వరి సాగు చేశా. నగలు తనఖా పెట్టి సుమారు రూ. 3 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నా. పంటలు సరిగ్గా పండక అప్పుల ఊబిలో కూరుకుపోయాను. కానీ రుణమాఫీ పథకం పుణ్యమాని ఒక్క పైసా కూడా బ్యాంకుకు కట్టాల్సిన పని లేకుండా పోయింది. వైఎస్ హయాంలో కుటుంబంలో ఎంత మంది పేరున రుణాలు ఉన్నా ఎటువంటి షరతులూ లేకుండా మాఫీ చేశారు. కానీ రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారు. అది కూడా అప్పులో కేవలం లక్షన్నర మాత్రమే. అదీ ఏకకాలంలో చేయకుండా విడతల వారీగా చేయడం ఇబ్బందిగా ఉంది. - కళ్లం వీరారెడ్డి, పోతుకట్ల, ప్రకాశం జిల్లా

 

కూలి చేసేవాడు కూలి చేస్తూనే ఉన్నాడు.  కౌలు చేస్తున్నవాడు కౌలు చేస్తూనే ఉన్నాడు. ఉహు... లాభం లేదు. పరిస్థితి మార్చాలనుకున్నారు వైఎస్‌ఆర్.  ఆ సామి వల్ల వాళ్లు ఆసాములయ్యారు.  నడుం మీద తుండుకట్టు... భుజం మీద తుండుగుడ్డ అయింది. భయపడకుండా ఎవుసం చేసుకుంటున్నా!

 
భూమిల నాగలిని పెట్టినానంటే సాలు ఫారెస్టోల్లు వచ్చి పడేటోళ్లు. నాగలిని ముక్కలు చేసోటోళ్లు. అదేమని అడిగితే.. బండబూతులు తిట్టేవారు. కొట్టేవారు. అన్యాయంగా కేసులు పెట్టేవాళ్లు. బాబూ.. అయ్యా అని కాళ్లా వేళ్లా పడి బతిమాలుకున్నా డబ్బులు వసూలు చేసోటోల్లు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అంతే, నాకున్న మూడెకరాలకు హక్కు పత్రం వచ్చింది. అప్పటి సంది ఎవరితో ఇబ్బందులు లేకుండా సక్కగా ఎవుసం చేసుకుంటున్నాను. భూమిని అనుకూలంగా చదును చేసుకుని మంచి పంట తీస్తున్నా. దీంతో అప్పులు తీరి ఆర్థికంగా స్థిరపడ్డా. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు హక్కుపత్రాలకు పంటరుణాలు ఇస్తారన్నారు. ఆయన పోయిన తరువాత మమ్మల్నెవరూ పట్టించుకోవడం లేదు.  -  బానోతు ఈర్య, కొత్తపల్లి, వరంగల్


కూతుళ్లకు పెళ్లిళ్లు చేయగలిగాను...
ఆడపిల్ల పెళ్లి అంటే ఎంత కష్టమైనదో చెప్పాల్సిన పనిలేదు. మాకు నలుగురు కూతుళ్లు. అయినా కూడా వాళ్లకు పెద్ద ఇబ్బంది పడకుండా పెళ్లిళ్లు చేయగలిగామంటే అదంతా రాజశేఖరరెడ్డిగారి పుణ్యమే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక  2010లో సర్వే నెంబరు 31లో 85 సెంట్లు భూమిని మాకు అందజేశారు. ఆ భూమిలో గోగు, శనగ వంటి పంటలు పండిస్తున్నాం. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో ఉపాధి పొందుతున్నాం. అంతకు ముందు నేను, నా భర్త కూలీలుగా పనికి వెళ్లేవాళ్లం. భూమి అందడంతో సొంతంగా సేద్యం చేసుకుంటున్నాం. సొంత ఇంటిని కట్టుకోగలిగాం. నలుగురు కుమార్తెల్లో ముగ్గురికి పెళ్లిళ్లు చేసేశాం. ఆర్థికంగా అంతగా ఇబ్బంది పడకుండా జీవించగలగడానికి కారణం ఆ మహానుభావుడే. మా కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది. - ఆర్నిపల్లి రామలక్ష్మి, జక్కువ, కృష్ణాజిల్లా

 

ఆదాబ్.. ఆదాబ్.. ఆదాబ్.. ఆదాబ్..
నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం భాయ్‌లకు. ధర్మం నాలుగు పాదాల మీద నిలబడి ఉంటుందని రిజువైంది.ఆదాబ్.. ఆదాబ్.. ఆదాబ్.. ఆదాబ్...

నాడు పొలంలో... నేడు పాఠశాలలో..!
చిన్నప్పట్నుంచీ చదువంటే ప్రాణం. కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా పొలం పనులకు వెళ్లక తప్పలేదు. నలుగురి సంతానంలో నేనే పెద్దవాడ్ని కావడంతో చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు నాపై పడ్డాయి. నాకంటే చిన్నవాళ్లైన ముగ్గురు తమ్ముళ్ల మంచిచెడ్డలు ఆలోచించి మోటార్ వైండింగ్, పొలం పనులు చేస్తుండేవాడ్ని. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. 2007లో బీయిడీ పూర్తిచేశా. మరుసటి ఏడాది డీఎస్సీ పరీక్ష రాశాను. 57 మార్కులు వచ్చాయి. వైఎస్ మైనార్టీలకు అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ల పుణ్యమా అని ఉపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. లేదంటే మళ్లీ పలుగు, పార పట్టుకుని పొలంలోకి వెళ్లేవాడ్ని. ఇవాళ ఇలా భావిభారత పౌరుల చేత అక్షరాలు దిద్దిస్తూ, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నానంటే కారణం ఆ మహానుభావుడే. మైనార్టీ రిజర్వేషన్ల కారణంగా నాతో పాటు యాలాల మండలంలోనే మరో ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు.  - షేక్ అహ్మద్, కమాల్‌పూర్, యాలాల మండలం, రంగారెడ్డి                  

 

పూరి గుడిసె. ఈ రాష్ట్రంలో పూర్‌మెన్ ఉండకూడదు.
పక్కా ఇల్లు కడితే పక్కా ఆశలు పుట్టుకొస్తాయి. పెద్దవాళ్లు కావాలి అన్న ఆకాంక్ష పుట్టుకొస్తుంది. మట్టిలో కాదు, రాతితో జీవితాన్ని కట్టాలన్న దీక్ష వస్తుంది. మట్టి మనుషులలో రాతి దీక్షను మొలకెత్తించిన మనిషి వై.ఎస్.ఆర్.

 
అడగని వారికీ సాయం చేశారాయన!

‘నాకు ఫలానా సాయం కావాలి’ అని వైఎస్‌ఆర్ ని కలిసిన ఎవరూ అసంతృప్తితో వెనక్కి వెళ్లింది లేదు. అడగని వారికి కూడా సహాయం చేసే మనిషి ఆయన. నేను కర్నూలు ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా ఉన్నప్పుడు ఓ రోజు ఆయన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తనిఖీకి వచ్చారు. ఓ వార్డులో కాలు తొలగించిన రోగిని చూసి ఆగిపోయారు. అతడి కేస్ షీట్ చూసి... ‘ఏమయ్యా! బీడీలు, చుట్టలు బాగా కాలుస్తావా, పొగతాగే వారికి ఈ జబ్బు వస్తుంది. అందుకే నీకు కాలు తీసేశారు. ఆరోగ్యం పాడు చేసుకుంటే ఏం వస్తుంది’ అని చనువుగా మందలించారు. పక్కనే ఉన్న జాయింట్ కలెక్టర్‌తో ‘అతడికి వికలాంగుల పెన్షన్ ఇప్పించండి’ అన్నారు. ఏదో సందేహం వచ్చినట్లు ఆగి ‘నీకు ఇల్లు ఉందా’ అని అడిగారు. లేదని అనగానే... పక్కా ఇంటిని శాంక్షన్ చేయమని జేసీకి ఆదేశం ఇచ్చేశారు. అడిగిన వారికి సహాయం చేసే నాయకులను చూశాను. సహాయం కోసం తిప్పుకునే నాయకులూ తెలుసు. కానీ అడగక ముందే అవసరాన్ని గుర్తించి సహాయం చేసే నాయకుడు వైఎస్‌ఆర్!  - డాక్టర్ హనుమంతరాయుడు, హైదరాబాద్

 

రోడ్డు మీదో, వీధిలోనో, మారుమూల ఇంట్లోనో, పొలం గట్టునో... మనిషికి, ప్రాణానికి మధ్య జీవితం బొడ్డు తాడు తెగిపోతే... కుయ్ కుయ్ కుయ్‌మని ప్రాణ సంకటానికి ప్రాణ శకటం వస్తే! ప్రాణం లేచి వస్తుంది. నమ్మకం లేచి నిలుచుంటుంది.

 

దేవుడిని కళ్లారా చూస్తున్నట్లుండేది!
నాకు 2007, డిసెంబరు 13న యాక్సిడెంట్ అయి, కాలు విరిగింది. ఊహించని ఆ సంఘటనకు షాక్‌లోకి వెళ్లిపోయాను. కానీ అదృష్ట వశాత్తూ 108 సర్వీసు అంబులెన్స్ వచ్చి నన్ను క్షణాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ జరిగింది. అయితే ఏ పనీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను చూసి ఇంట్లో వాళ్లంతా కన్నీరు మున్నీరయ్యారు. దాంతో 2008 మార్చి 16వ తేదీన నేను మొదటిసారిగా రాజశేఖరరెడ్డిగారిని సిఎం క్యాంపు ఆఫీసులో కలిశాను. ఆయన నా పరిస్థితి తెలుసుకుని ఆర్థిక సహాయం చేశారు. ‘‘బాధపడకు, నేనున్నాను, ధైర్యంగా ఉండు’’ అన్నారు. ఇది జరిగి ఏడాది నిండక ముందే మా మారుమూల గ్రామానికి వచ్చారు. ‘‘నీ కాలు బాగైంది కదా’’ అని అడగడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. వైఎస్‌గారిని కలిసిన ప్రతిసారీ నాకు దేవుడిని కళ్లారా చూస్తున్నట్లే ఉండేది. కలిసింది మూడు సార్లే అయినా జీవితాంతం గుర్తు పెట్టుకోగలిగినంత సంతోషాన్ని దాచుకోగలిగాను.  - బానోతు రవీందర్ నాయక్, హేమ్లా తండా, నల్లగొండ

 

నీలి ఆకాశం కరగదు. దానికి కరుణ ఉండదు.  అలాంటి ఆకాశం రైతు జీవితాన్ని మబ్బు మబ్బుగా చేసేస్తుంది. నిరాశ ముసురుతుంది. మబ్బుకుండను ఆయన రాజ్యం తెచ్చింది. ఆయన ఉంటే మబ్బు ఉన్నట్టే. వాన ఉన్నట్టే. మరి వానని భూమి మీద మబ్బుగా మార్చాలంటే?  జలయజ్ఞం చేయాలి. భూమి మీద పారే మబ్బులే... జలయజ్ఞం.

 
భగీరథుడు... వైఎస్!

సింగూరు ప్రాజెక్టు ద్వారా సేద్యానికి నీరందిస్తామని దాదాపు ముప్పై ఏళ్లుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు హమీ ఇచ్చి మరిచారు. కానీ వైఎస్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కాలువల నిర్మాణం ప్రారంభించారు. ఆయన తర్వాత వచ్చినవారు కాలువ పనులు పూర్తి చేయ లేకపోయారు. సింగూరు నీటిపైనే ఈ ప్రాంత రైతులు ఆధారపడి ఉన్నారు. అటువంటి నేత మళ్లీ రాడు. ఆయనే ఉంటే కాలువ ఎప్పుడో పూర్తయ్యేది.                                          - ముస్లాపురం భాగయ్య, రైతు, పోసానిపేట, మెదక్

 

రైతు బాంధవుడు!
ధవళేశ్వరం వద్ద ఆన కట్ట కట్టిన కాటన్ రైతుల హృదయాల్లో ఎలా నిలిచి పోయాడో అలాగే వైఎస్ కూడా అన్నదాత గుండెల్లో అజేయుడిగా మిగిలి పోతాడు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన నాయకుడు. - దేవలంక రాము, రైతు నాయకుడు, నరేంద్రపురం, తూ.గో.

 

పుట్టిన రోజు కానుక
నా అభిమాన నేత వైఎస్‌ఆర్ పుట్టిన రోజుకు కానుక ఇవ్వాలని ఎనిమిది వేల పప్పు దినుసులతో ఆయన చిత్రాన్ని తయారు చేశాను. వారంలో  ధాన్యచిత్రం పూర్తయింది. కానీ నా అభిమాన నాయకునికి చేరేదెలా? నా చేతుల్తో ఆయనకు అందించే భాగ్యం కలగాలని దేవుణ్ని కోరుకునేవాడిని. ఆ అదృష్టం 2009లో వచ్చింది.

 
నల్లగొండ జిల్లా, కోదాడలో ప్రచారం బస్సు ఆగగానే భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టేశారు. నేను గుంపులో ఉండిపోయాను. ఆయన బస్సు పైకి వచ్చి అందరికి అభివాదం చేస్తున్నారు. నేను చిత్రపటాన్ని పెకైత్తి పట్టుకున్నాను. కళ్లతోనే ‘ఏమిటది’ అన్నట్లు సైగ చేశారు. ‘తర్వాత తీసుకుంటాను’ అన్నట్లు చేత్తోనే సైగ చేశారు. సమావేశం ముగిసింది. అందరూ బస్సెక్కి డోర్లు మూసేశారు. అవకాశం జారిపోయిందనే దిగులు.  అంతలోనే... కిటికీ తెరిచి నన్ను పిలిచి చిత్రపటాన్ని తీసుకుని ‘బాగుందని’ ప్రశంసిస్తూ షేక్ హ్యాండిచ్చారు. ఆయన మాటకు కట్టుబడే మనిషి మాత్రమే కాదు, సైగతో చెప్పినా కూడా ఆచరణలో పెట్టే నాయకుడు. - తమలపాకుల సైదులు, కోదాడ

 

పేరు పెట్టి పిలిచే ఆప్యాయత

మా నాన్నగారికి వైఎస్ గారితో కొద్దిపాటి పరిచయం. ఆయన 2006లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి అపస్మారక స్థితిలోకి పోయారు. ఆ మర్నాడే పేపర్‌లో వార్త చూశారో ఏమో సి.ఎమ్ ఆఫీస్ నుంచి ఆస్పత్రికి ఫోన్... ‘‘సి.ఎమ్ గారు వాకబు చేయమన్నారు. ఎలా ఉన్నారు? ఏ అవసరం ఉన్నా చెప్పమన్నారు’’ అన్నారు.

 
తర్వాత మూడవరోజు... ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ‘‘బాగైపోతుందమ్మా ధైర్యంగా ఉండండి’’ అని మా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎంత ఖర్చయినా వెనకాడవద్దని ఆస్పత్రి వర్గాల వారికి చెప్పారు. మా నాన్నగారు కొద్దిగా కోలుకున్నాక సి.ఎమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మేము క్యాంపు ఆఫీస్‌కి వెళ్లాం. నాన్నగారు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారని వెంటనే ఆయనే మా దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచి ‘‘జేమ్స్ ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా? నడుస్తున్నావా? నీకు ఏ అవసరాలున్నా మీ అబ్బాయిలను నా దగ్గరకు పంపించు, మంచి ట్రీట్‌మెంట్ తీసుకో’’ అని చెప్పారు. ఆ ఆప్యాయత మరవలేనిది. - ప్రేమ్, సుధీర్, హైదరాబాద్

 

అనుకుంటే చేస్తారు...
ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఏదైనా సాయం అడిగితే చేస్తామంటారు. చేయరు. కొందరు చేసినట్టు నటిస్తారు. చేయరు. మరికొందరు అసలేమీ చేయకనే, సాయం అడగడానికి వెళ్లాం కదా అని ఈసడిస్తారు. కాని నేను ఎరిగిన వైఎస్... చేయాలనుకుంటే చేసే మనిషి. ముక్కూ ముఖం ఎరగకపోయినా సాయం చేయడానికి చేయి అందించే మనిషి.


మాది కడపజిల్లాలోని ఒక పల్లెటూరు. 1994 మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమా పాసయినా ఉపాధి లేదు. తండ్రి మరణించడంతో దిక్కుతోచని స్థితి. ఏం చేయాలో అర్థంకాక వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారిని కలిశాను. అదే మొదటిసారి కలవడం. సిఫార్సు లెటరు రాసిచ్చి, లిమిటెడ్ కంపెనీలో చేర్పించారు. లెటర్ ఇచ్చి ‘నేను రికమండేషన్ చేశాను కదా అని ఎవరూ కూర్చోబెట్టి జీతాలు ఇవ్వరు. కష్టపడి పని చేయ్. కెరీర్ డెవలప్ చేసుకో’ అన్నారు. ఆయన ఇచ్చిన లెటర్ జిరాక్స్ లామినేషన్ చేయించి భద్రంగా ఉంచుకున్నాను. ఆయన ఇచ్చిన సలహా పాటిస్తున్నాను... పాటిస్తాను. ఎప్పటికీ మరువను. - ఎ. జయలక్ష్మీరెడ్డి, బెంగళూరు

 

నేనున్నాను... అని ఆదుకున్నారు!
భారతదేశ పటంలో మా ఊరు ఎక్కడుందో మాకే తెలియదు. అలాంటిది మా పొందూరు ఖద్దరు మహాత్మాగాంధీని ఆకర్షించి, ఆయన ప్రశంసలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అయితే క్రమేణా ఖద్దరు ఉత్పత్తులకు ఆదరణ తగ్గింది. ఊరు వెలవెలపోతూ, నేత కార్మికులు విలవిలలాడుతున్న తరుణంలో ‘‘నేనున్నాను’’ అంటూ వై.ఎస్.గారు వచ్చారు. మా గ్రామ కార్మికులకు ఆయన పునర్జన్మ ఇచ్చారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొందూరు ఖద్దరు గొప్పతనం చెప్పి, ప్రచారం లభించేలా చేసి మమ్మల్ని గట్టెక్కించారు. ఖద్దరు అంటే మాకు రాజశేఖరరెడ్డిగారే గుర్తుకొస్తారు. ఆయన ధరించే పొందూరు ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చీ, మువ్వన్నెల కండువా... ఖద్దరు ప్రాశస్త్యాన్ని చాటుతుంటాయి. చక్కనైన పంచె కట్టు, నలగని చొక్కాతో హుందాగా కనిపిస్తూ మా గ్రామ వస్త్రాలకు శోభను తెచ్చారాయన. చేనేత కార్మికులకు పింఛను, పావలా వడ్డీ రుణం, మార్కెటింగ్ సదుపాయం కోరాం. అభయం ఇచ్చారు. అంతలోనే - ఆ రాజాధిరాజు వెళ్ళిపోయారు.  - దండా గోవిందరావు, పొందూరు, శ్రీకాకుళంజిల్లా

 

ఆ దండను దాచుకున్నాం...
1990 లో రాజశేఖర్‌రెడ్డిగారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జంగారెడ్డిగూడెం వస్తున్నారని తెలిసి, మా నాన్నగారు, మా అన్నదమ్ములు ముగ్గురం ఆయన రాక కోసం ఎంతో ఆతృతతో రోడ్డుకు పక్కగా నిలబడ్డాం. సెక్యూరిటీ మధ్య వై.యస్‌గారు మందుకు నడుస్తున్న వారల్లా మా నిరీక్షణను గుర్తించి ఆగి పలకరించి ‘‘పట్టణంలో జరిగే మీటింగ్‌కు త్వరగా రండి’’ అని ఆహ్వానించారు. ఇలా ఆయనతో అనుబంధం ఏర్పడింది.

 
తిరిగి 2003 లో పాదయాత్రలో భాగంగా మా ఇంటికి దగ్గర్లోనే వై.యస్‌గారు బస చేశారు. ఉదయమే మా కుటుంబ సభ్యులమంతా ఆయన దగ్గరకు వెళ్ళాం. విలేకర్లు, స్థానిక నాయకులతో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. నా కూతురు ప్రశాంతి వైయస్‌గారి దగ్గరకు వెళ్ళి నూలు దండను ఆయన మెడలో వేసింది. ఆయన ముచ్చటపడి అదే దండను అమ్మాయి మెడలో వేశారు. మళ్ళీ మా అమ్మాయి ఆయన మెడలో వేసింది. మళ్ళీ వైయస్‌గారు అమ్మాయి మెడలో వేశారు. ఆ దండను ఆయన జ్ఞాపికగా పదిలంగా మా ఇంట్లో దాచుకున్నాం.  - పి.ఎస్.ఎస్.ఎస్.గాంధీ, జంగారెడ్డిగూడెం

 

నా ఇష్టదైవానికి... భక్తితో...
ఆ దేవుడు నా అభిమాన నేత. ప్రజల ఆరాధ్యదైవం. అలాంటి గొప్ప నాయకుడికి ఘనంగా నివాళులర్పించాలని నా మనసు పదే పదే కోరింది. కానీ ఆర్థికంగా పేదను. డబ్బు ఖర్చు పెట్టి గొప్ప పనులు చేయలేను. నా కూతురి వివాహం చేస్తూ... ఆహ్వాన పత్రిక మీద ఆ దేవుడి ఫొటో వేశాను. ఎవరి ఇష్టదైవం ఫొటోలు వారు వేసుకుంటారు. ఆ దైవాలను మనం చూడలేదు. విన్నాం అంతే. పేదల దేవుడు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి గొప్ప పాలన అందించిన వై.ఎస్. ఫొటోను నా కూతురి పెళ్ళి పత్రికపై అచ్చు వేయించుకొని నా ఆత్మీయ నాయకుడికి నివాళి అర్పించాను. శుభలేఖ మీద చనిపోయినవారి ఫొటో వద్దని ఎందరో వారించారు. నా దృష్టిలో ఆయన జీవించే ఉన్నారు. కొన్ని కోట్ల జనం మదిలో సజీవంగా ఉన్నారు. ఆయనకు మరణం లేదు. అటువంటి ఫొటో ‘శుభలేఖ’ మీద ఉండటం శుభమే.  - మేకల మోహన్,  కమలానగర్, అనంతపురం

 

తాతయ్య ఉత్తరం!
వై.ఎస్ తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన భద్రాచలం పర్యటనలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. ఆ హాస్టల్‌లోని బాలబాలికలు సిఎం గారిని గౌరవంగా సార్, సార్ అని సంబోధించినప్పుడు, వారిని వారించి, ‘‘నన్ను తాతయ్య అని పిలవండి’’ అని అలాగే పిలిపించుకుని మురిసిపోయారు.

 
2004లో బాలభవన్ వేసవి శిబిరంలో నేను, మా అక్క ముగింపు వేడుకలలో పాల్గొన్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు  సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన సమయం అది. మేము దాచుకున్న 500 రూపాయలను ఇచ్చాం. నగదు తీసుకోరన్నారు. చెక్కు ఇవ్వడం మాకు చేతరాదని ఆ డబ్బును సి.ఎం గారికి అందచేయమని మంత్రిని కోరాం. మేము ఆ డబ్బులు పంపించామని తెలుసుకున్న వై.ఎస్.గారు. మమ్మల్ని మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని భద్రంగా దాచుకున్నాం. ఓసారి వైఎస్ తాతయ్యను చూడాలంటే నాన్న క్యాంప్ ఆఫీస్‌కు తీసుకెళ్ళారు. - సత్తి సుమధుర, షాదాన్ స్కూల్,  హైదరాబాద్

 

ఫొటో ముచ్చట
వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు 1982లో గోరంట్ల జూనియర్ కాలేజీ ప్రారంభించడానికి వచ్చారు. ఆయన ప్రసంగం నన్నెంతో ఆకర్షించింది. వై.ఎస్. ప్రసంగం మొదలై, అది పూర్తయ్యేవరకు ఆయన అభిమానులు పూలమాలలు వేయడం, ఫొటోలు తీయించుకోవడం జరిగింది. నేను కూడా ఆయనకు పూలమాల వేశాను. ఫొటో కోసం వెయిట్ చేస్తుండగా, కెమెరాలో రీల్ అయిపోయింది. నా ముఖంలోని బాధను గమనించిన వై.ఎస్.గారు నా భుజం తట్టి, ఇంకోసారి తప్పకుండా అవకాశం వస్తుందని ఊరడించారు. ఆ తర్వాత... కొన్ని నెలలకు ఆయన్ను కలిసే అవకాశం మళ్లీ వచ్చింది. వై.ఎస్.గారు నన్ను చూసి, ‘‘బాగున్నావా’’ అని అడిగారు. ‘‘చాలా దూరం నుంచి వచ్చినట్లున్నావు కదా’’అని అంటూనే, ‘‘ఫొటో తీసుకునే అవకాశం మనకు ఈ రోజు వస్తుంది’’ అన్నారు. అలా ఆ రోజు నా ముచ్చట తీరింది. ఆ సంఘటనను గుర్తుపెట్టుకోవడం నాకెంత ఆశ్చర్యమో. ఎంత జ్ఞాపకశక్తి! వై.ఎస్.గారితో దిగిన ఫొటోపై ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని పదిలంగా దాచుకున్నాను.  - కొడేకండి హైదర్ వలి, గోరంట్ల

 

రంజాన్ ‘బోనస్’
2003లో రంజాన్ పర్వదినం. ‘ప్రజాహిత బస్సుయాత్ర’లో భాగంగా అనంతపురం వచ్చిన వై.ఎస్.గారు గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. నేను వారి దగ్గరకు వెళ్ళి - ‘‘సార్... ఈ రోజు రంజాన్ పండుగ. కానుకగా టోపీ తెచ్చాను’’ అని చెప్పాను. ఆయన సంతోషంగా ‘‘క్యారీ ఆన్’’ అన్నారు. స్వయంగా నా చేతులతో నేను ఆయనకు టోపీ అలంకరించాను. ‘‘ఏమయ్యా... టోపీ టైట్‌గా ఉన్నట్లుందే’’ అని నవ్వుతూ అన్నారు. ఆ మధుర క్షణాలు నేను ఎన్నటికీ మరచిపోలేనివి. ఆ రోజు మా వెంట ఒక అబ్బాయి కూడా వచ్చాడు. అతడిని చూసి వై.ఎస్.గారు. - ‘‘ఏమయ్యా... పఠాన్ డ్రెస్ వేసుకుని జోరుగా ఉన్నావు. వీళ్ళకంటే నువ్వే జోరుగా ఉన్నావు’’ అని మమ్మల్ని చూపిస్తూ, ఆ అబ్బాయితో చమత్కరించారు.

 
నేను ధైర్యం చేసి ‘‘సార్... మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది’’ అన్నాను. ‘‘మీ ఆశీర్వాదం ఉండాలి’’ అని అన్నారు. ఆ మాట నాకెంతో సంతోషం వేసింది. రంజాన్ రోజు వై.ఎస్.గారిని కలవడం నిజమైన పండగగా, పండగ బోనస్‌గా భావించాం. - పి.షఫీయుల్లాఖాన్, అనంతపురం

 

గులాబీ మొక్కను నాటుకున్నాం...
డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి జ్ఞాపకాలు మా గుండెల్లో ఎప్పుడూ  నిండుగా ఉంటాయి. మా పెరట్లో ఆయన గుర్తుగా గులాబీలు పూస్తున్నాయి. ఆ గులాబీలను చూసినప్పుడల్లా చిరునవ్వులు చిందిస్తున్న వైఎస్సే కనిపిస్తారు. డాక్టర్ వైఎస్సార్‌ని కలిసింది ఒక్కసారే అయినా అది ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది.


‘‘వై.ఎస్.ఆర్ పిడుగురాళ్ళ వస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారా పరిచయం చేయిస్తాను రా’’ అని మా మామగారు కబురు పంపారు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నరసరావుపేటలో దండ కొనుక్కుని వెళ్ళాను. గురజాల ఎమ్మెల్యే నన్ను వై.ఎస్.గారికి పరిచయం చేస్తూ - ‘‘మీ వీరాభిమాని’’ అన్నాడు. తక్షణం నా అభిమాన నేతకు నమస్కరించి, దండ వేసి, శుభాకాంక్షలు తెలిపాను. ఆయన నన్ను చిరునవ్వుతో ‘‘ఏం చేస్తుంటావు? పిల్లలెంతమంది? అంతా బాగున్నారా? ఏదైనా అవసరమైతే కలువు’’ అని ఆత్మబంధువులా మాట్లాడారు. అలాంటి మనిషి మన మధ్య లేరంటే గుండెని పిండేసినట్లవుతోంది. ఆయన అంత్యక్రియల రోజు గుర్తుగా గులాబీ మొక్కను నాటుకున్నాం.  - షేక్ హబీబుల్లా, పర్చూరు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement