ఎనిమిదేళ్ల కష్టానికి నజరానా
ఆజానుబాహులైన అందగాళ్లను చూసిన తెలుగు తెరకి... సింహంలాంటి కండల వీరుడ్ని పరిచయం చేశాడు యంగ్ స్టార్ రానా. ఆరడుగులు దాటిన హైట్‌తో పాటు అందుకు తగినెహ ర్క్యులస్ ఫిజిక్‌తో తెలుగు సినీ హీరో లుక్‌కి కొత్త రూట్ ఇచ్చాడు. నాజూకైన కుర్రాడి నుంచి టాలీవుడ్ కండల వీరుడి దాకా రానా ట్రాన్స్‌ఫార్మేషన్‌లో పాలుపంచుకున్న ట్రైనర్ ‘కునాల్ గిర్’ పంచుకున్న సంగతులివి...
ఈజీగా సాధ్యం కాలేదు...
తొలిసారి ‘లీడర్’ సినిమాకు ముందు రానాను 8 ఏళ్ల క్రితం కలిశాను. అప్పట్లో తను చాలా స్కిన్నీగా ఉండేవాడు. ఫిజికల్ ఫిట్‌నెస్ పరంగా రానా జెనెటిక్స్ అంత బెస్ట్ అని చెప్పలేం. జెనెటిక్స్ ప్రకారం చూస్తే ఒక తీరైన శరీరాన్ని మెయిన్‌టెయిన్ చేయడం అనేది అతనికి అంత సులభమైన విషయం కాదు. అయితే అతని ఫిజిక్‌కి వైడ్ స్ట్రక్చర్, గుడ్ ఫ్రేమ్ ఉంటుంది. కఠినమైన డైట్, వర్కవుట్ చేయాలి. అలా చేశాడు కాబట్టే ఇప్పుడు ఫిట్‌నెస్‌కి సింబల్‌గా మారాడు.
5 రోజులు... రోజుకో గంట
ఎప్పటికప్పుడు కఠినంగా అనిపించడానికి రానా కోసం ప్రత్యేకంగా వర్కవుట్స్ డిజైన్ చేస్తాను. తను వ్యక్తిగతంగా హ్యాండ్స్, ఛెస్ట్ వర్కవుట్స్ ఇష్టంగా చేస్తాడు. ఎక్కువగా వెయిట్ ట్రైనింగ్ వర్కవుట్స్ చేస్తాడు. హెవీ వెయిట్స్ ద్వారా కేలరీలు బాగా ఖర్చు చేయగలడు కాబట్టి తనకి కార్డియో వర్కవుట్స్ అంత అవసరం రాదు. వారంలో 5 రోజులు ప్రతి రోజూ కనీసం గంటకు తగ్గకుండా వ్యాయామం చేస్తాడు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడాయన ఫిట్‌నెస్ లెవల్స్ అసాధారణంగా పెరిగాయి. తను ఊర్లో లేకున్నా కూడా వర్కవుట్స్ మిస్ అవడం ఇష్టం ఉండదు. అందుకని తన కోసం ప్రత్యేకంగా నా అసిస్టెంట్స్‌లో ఒకరిని తన వెంట పంపిస్తాను. ఇటీవలే ఆయన చెన్నైలోని ఒక మారుమూల గ్రామంలో షూటింగ్‌లో ఉన్నప్పుడు కూడా నా అసిస్టెంట్స్‌లో ఒకరిని తన కోసం పంపించాను.
రైట్ డైట్...
తన డైట్ తన సినిమా కేరెక్టర్లను అనుసరించి అప్పుడప్పుడు మారుతుంటుంది. సాధారణంగా రోజుకు 8 సార్లు మీల్స్ తీసుకుంటాడు. అందులో చాలా వరకూ హై ప్రొటీన్ ఉంటుంది. బాగా వెజిటబుల్స్, మిల్క్ వినియోగిస్తాడు.