
శ్రీదేవి ఆకస్మిక మరణం కలిగించిన ఆవేదన నుంచి ఆమె అభిమానులు, సహనటులు నేటికీ కోలుకోనేలేదు. ఫిబ్రవరి 24 నుంచీ (ఆమె చనిపోయిన రోజు) దేశంలో ఎక్కడో ఒకచోట శ్రీదేవి స్మరణ.. జ్ఞాపకాల కాంతులు వెదజల్లుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలోని ‘దేవ్‌దితి’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఓ మేరి చాందినీ’ పేరుతో సంగీత నృత్య కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆమె నటించిన సినిమాల్లోని యాభై పాత్రలతో యాభై మంది మహిళలు స్టేజిపై కనిపించి శ్రీదేవిని తలపించే ప్రయత్నం చేశారు. ఈ యాభై పాత్రలూ శ్రీదేవి.. చీర ధరించి ఉన్నవే కావడం విశేషం.
‘దేవ్‌దితి’ నేతృత్వంలోని ‘ఇండియా శారీ చాలెంజ్’ కార్యక్రమం మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. పట్టణ మహిళల్లో చీరను ధరించే సంస్కృతిని సుసంపన్నం చేయడం కోసం మూడేళ్ల క్రితం సప్నా ఖండేల్‌వాల్, వందనా గుప్తా ‘ఇండియా శారీ చాలెంజ్’ ను ప్రారంభించారు. శ్రీదేవి పాత్రలకు తగ్గట్టుగా చీరలు ధరించి స్టేజీ మీదకు వచ్చిన వాళ్లంతా గృహిణులే. నటించాలని అందరికీ ఉంటుంది. శ్రీదేవిలా నటించాలని ఆమె అభిమానులకు ఉంటుంది. ఆ అభిమానంతో ఈ యాభై మంది గృహిణులూ తమకు నచ్చిన శ్రీదేవి పాత్రలో నిమిషం పాటు నటించి ఆకట్టుకున్నారు. ఇంతకన్నా ఘనమైన నివాళి ఆమెకు ఏముంటుంది?!
Comments
Please login to add a commentAdd a comment