వేలెత్తిచూపి ఊరుకోలేదు | Twinkle Khanna tweet spurs Akshay Kumar to build toilet near  beach | Sakshi
Sakshi News home page

వేలెత్తిచూపి ఊరుకోలేదు

Published Thu, Apr 5 2018 12:09 AM | Last Updated on Thu, Apr 5 2018 10:14 AM

Twinkle Khanna tweet spurs Akshay Kumar to build toilet near  beach - Sakshi

భర్త అక్షయ్‌ను ఒప్పించి అదే బీచ్‌లో ట్వింకిల్‌ ఏర్పాటు చేయించిన బయోటాయ్‌లెట్‌  

నిరుడు ఆగస్ట్‌లో బాలీవుడ్‌ నటి ట్వింకిల్‌ ఖన్నా.. ఉదయం పూట జుహూ బీచ్‌లో వాకింగ్‌ చేస్తుంటే ఆరుబయటే మూత్ర విసర్జన చేస్తున్న ఒక వ్యక్తిని ఫొటో ఫోటో తీసి, దానిని ట్విట్టర్‌లో పెట్టింది గుర్తుందా.. ‘‘గుడ్‌ మార్నింగ్‌... టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ–2 సినిమా ఫస్ట్‌ సీన్‌ ఇదే కావచ్చు’’ అని! ఈ ట్వీట్‌ను ఆమె ఫాలోవర్స్‌ రీట్వీట్‌ చేయడం, ఇంకా చాలామంది దానికి కౌంటర్‌ ట్వీట్‌ ఇవ్వడంతో అది  WhenYourWalk GoesDown TheToilet పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్‌ ఉద్యమంగా మారింది.  అయితే ఆమె అప్పుడు చేసిన  ట్వీట్‌ను తప్పుపట్టిన వాళ్లే ఎక్కువ మంది. ‘ముంబై స్లమ్స్‌లో ఉండే వాళ్ల పరిస్థితి ఆ నటీమణికి తెలియనట్టుంది అందుకే అంత ముతకగా ఆలోచించి ట్వీట్‌ చేసింది’ అని, ముంబై మురికి వాడల్లో జనాలకు సరిపడా పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ లేకపోవడం వల్లే ఆ.. కాలకృత్యాలను, అకాలకృత్యాలను ఆరుబయట కానించేస్తున్నారనే ఇంగితం మరిచినట్టుంది సదరు యాక్ట్రెస్‌’ అనీ.. ఘాటుగా విమర్శించారు ఆమెను. ఇప్పుడీ ప్రస్తావనంతా ఎందుకూ అంటే... 

దాదాపు ఏడు నెలల కిందటి ఆ ట్వీట్‌ వర్కవుట్‌ అయి ఇప్పుడు జుహూ బీచ్‌ ప్రాంతంలో బయో టాయ్‌లెట్లు వెలిశాయి! ఈ పని చేసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ ట్వింకిల్‌ ఖన్నా భర్త, ‘టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’ నటుడు, సహ నిర్మాత అక్షయ్‌ కుమార్‌. అందుకోసం శివసేన నేత ఆదిత్య థాకరేతో కలిసి పది లక్షల రూపాయలు వెచ్చించి, బయో టాయ్‌లెట్లు కట్టించాడు అక్షయ్‌.  జుహూ బీచ్‌లో వీటిని పెట్టడం వల్ల ఆ దగ్గరల్లోని స్లమ్స్‌ వాళ్లకే కాదు.. విజిటర్స్‌కూ చాలా ఉపయుక్తంగా ఉందని ముంబై, కే వెస్ట్‌ వార్డ్‌ అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంత్‌ గైక్వాడ్‌ అన్నారు. ముంబైలో దాదాపు 63 శాతం మంది స్లమ్స్‌లో నివసిస్తున్నారు. 30 మందికి ఒక్క టాయ్‌లెట్‌ లెక్క చూసుకున్నా ఇంకా 60 వేల టాయ్‌లెట్స్‌ అవసరం ఉందట ముంబై మురికివాడలకు. ట్వింకిల్‌ ట్విట్టర్, అక్షయ్‌ కార్యాచరణతోనైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement