రోజంతా మేకప్ తాజాగా..?
కౌన్సెలింగ్
ఈ మాసంలో పెళ్లిళ్లు, పండగలు ఎక్కువగా ఉన్నాయి. మేకప్ తప్పనిసరి అవుతుంది. కానీ చెమట, ఉక్కపోత వల్ల చికాకుగా ఉంటుంది. మేకప్ ఎక్కువసేపు తాజాగా, చికాకు కలిగించని విధంగా ఉండాలంటే ఏం చేయాలి?
- వనజాక్షి, సీతాఫల్‌మండి
సాయంకాలం వేడుకలలో మేకప్ పెద్దగా ఇబ్బంది అనిపించదు. కాని పగలు వేడుకలకు మాత్రం వాటర్ ఫ్రూఫ్ లేదా స్వెట్ ఫ్రూఫ్ మేకప్ వాడాలి. అయితే వీటిలో అంత లుక్ రాదు. కానీ ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. మేకప్ కి ముందు ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మృదువుగా రాయాలి. కళ్లకు ఐ లైనర్, ఐ లాష్, పెదవులకు లిప్‌స్టిక్ వాడితే చాలు. వీటితో పాటు హెయిర్ స్టైల్, డెస్సింగ్ సౌకర్యవంతంగా ఉంటే చికాకు కలగదు.
నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. పనిలో అలసట, బయట దుమ్ము ధూళి వల్ల ముఖం శుభ్రపరుచుకున్న కాసేపటికే తాజాదనం కోల్పోయినట్టుగా ఉంటోంది. ‘రోజూ పడుకునేముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, ఆ త ర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచిదని, ముఖ చర్మం చాలా బాగా శుభ్రపడుతుంద’ని నా స్నేహితురాలు చెబుతోంది. రోజూ క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించవచ్చా? ఏయే సందర్భాలలో ఉపయోగించాలో చెప్పగలరు.
- సీమ, ఈమెయిల్
క్లెన్సింగ్ మిల్క్ చర్మంలోని పోర్స్ వరకు వెళ్లి మలినాలను తొలగించి, శుభ్రం చేస్తుంది. దీనిని రోజూ వాడితే చర్మంలోని సహజసిద్ధమైన ఆయిల్స్ పోయి పొడిగా తయారవుతుంది. పొడిగా మారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. దీంతో త్వరగా వయసు పైబడినట్టుగా కనిపిస్తారు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు క్లెన్సింగ్ మిల్క్‌ను వాడకూడదు. చర్మతత్త్వాన్ని బట్టి పదిహేను, నెలరోజులకు ఒకసారి ఉపయోగించడం మేలు. చర్మకాంతి పెరగాలంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సమతుల ఆహారం, సరైన నిద్ర... అవసరం అవుతాయి. ముందు జీవనశైలి మీద దృష్టి పెట్టి, ఆ తర్వాత బ్యూటీ నిపుణుల సలహాలు పాటించండి.
ముఖానికి పండ్లగుజ్జుతో మసాజ్ చేసుకోవడం, ఫేస్‌ప్యాక్‌గా వాడటం వల్ల చర్మకాంతి పెరుగుతుందంటారు. నిజమేనా? అయితే ఎలాంటి పండ్లు వాడాలి?
- రశ్మి, ఈమెయిల్
మన చర్మతత్త్వం ఎలాంటిదో తెలుసుకోకుండా రకరకాల పండ్లను మసాజ్‌లకు వాడితే చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. పైగా ఆ పండ్లలోని రకరకాల ఆమ్లాలకు మన చర్మం ఎలా ప్రభావితం అవుతుందో కూడా తెలియదు. ఆ పండ్లలో ఉండే ఆమ్లాలు చర్మాన్ని దెబ్బతీయవచ్చు. ఉదాహరణకు చాలామంది పసుపు రాసుకుంటారు. కాని కొందరికి ఆ పసుపులోని గుణాలు పడక మొటిమలు రావచ్చు. అంటే ఎవరి చర్మతత్త్వానికి తగ్గట్టుగా వారు ఆ ఉత్పత్తులను వాడితేనే సరైన ఫలితాలు లభిస్తాయి. మసాజ్ విషయానికి వస్తే నిపుణులు చేసే మసాజ్‌లో స్ట్రోక్స్ చర్మానికి తగ్గట్టుగా ఉంటాయి. వాళ్లు వాడే నాణ్యమైన ఉత్పత్తులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తాజా పండ్లు తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం చర్మకాంతిని పెంచుతుంది. అందుకని పండ్లను మసాజ్‌లకు కాకుండా తినడానికి ఉపయోగించడం మంచిది. అంతగా అయితే కొన్ని రకాల పండ్లను మాత్రమే ఆ చర్మతత్వానికి తగ్గట్టు ఫేస్ ప్యాక్ మాత్రమే వేసుకోవచ్చు. మసాజ్‌లు చేసుకోకూడదు.
- గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్