
తినే కూరలు, వేపుళ్లు మొదలుకొని తాగే చాయ్ వరకు... అవి అల్లంతో జతగూడితే వాటికి ఓ ప్రత్యేకత చేకూరుతుంది. అందుకే జింజర్ చికెన్ అనీ, జింజర్ టీ అంటూ అల్లాన్ని ఒక విశేషణంగా వాడి, పదార్థం ప్రత్యేకతను చాటుతారు. ఇలా దాన్ని విశేషణంగా వాడుతున్నారంటేనే అందులో ఆరోగ్య విశేషాలు ఎన్నో ఉంటాయని వేరే చెప్పాలా? అందులో ఇవి కొన్ని...
♦ అల్లంలో జింజెరాల్ అనే చాలా చురుకైన జీవరసాయనం ఉంటుంది. దానికి ఎన్నో ఔషధగుణాలున్నాయి. జింజెరాల్‌లో వాపు, నొప్పి, మంట వంటి వాటిని వేగంగా తగ్గించి, గాయాలను వెంటనే మానేలా చేసే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అల్లం ఇన్ఫెక్షన్లనూ నివారిస్తుంది, తగ్గిస్తుంది. జింజెరాల్‌లోని యాంటీ–ఆక్సిడెంట్స్ కారణంగా అల్లం ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది
♦ అల్లం వికారాన్ని తగ్గిస్తుంది. అందుకే గర్భవతుల్లో కనిపించే వేవిళ్ల (మార్నింగ్ సిక్‌నెస్) తాలూకు వికారాన్ని అల్లం సమర్థంగా నివారిస్తుంది. అంతేకాదు... కీమోథెరపీకి సైడ్‌ఎఫెక్ట్‌గా కనిపించే వాంతులు, వికారాలను కూడా అల్లం సమర్థంగా తగ్గిస్తుంది
♦ అల్లం వల్ల జలుబు, గొంతునొప్పి వంటివి తేలిగ్గా తగ్గిపోతాయన్నది అనుభవపూర్వకంగా అందరికీ తెలిసిన సత్యమే.
♦ అల్లంలోని యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ గుణం కారణంగా ఆస్టియోఆర్థరైటిస్ వంటి జబ్బులు ఉన్నవారు అల్లంతో ఉన్న ఆహారం తీసుకుంటే వాళ్లలో కనిపించే కీళ్లనొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
♦ అల్లంలో యాంటీ–డయాబెటిక్ గుణాలు ఉన్నట్లు ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైంది. అల్లం ఒంట్లోని చక్కెరపాళ్లను నియంత్రిస్తుంది. దాంతో గుండెజబ్బుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
♦ అల్లం ఆకలిని పెంచడంతో పాటు జీర్ణక్రియ వేగంగా జరిగేలా తోడ్పడుతుంది. అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి అల్లం మంచి ఔషధం.
♦ మహిళల్లో రుతుసమయంలో కనిపించే నొప్పి నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది.
♦ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు ముప్పును నివారిస్తుంది.
♦ అల్లం మెదడును చురుగ్గా అయ్యేలా చేయడంతో పాటు అలై్జమర్స్ వ్యాధి ముప్పును నివారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment