వరుణ్ కారుణ్య
చాలా చిన్నపనే... అవతల వారిని ఆనందపెడుతుంది. మనల్ని వారి దృష్టిలో ఉన్నతులను చేస్తుంది. మనకు మనం సామాన్యులమే అయినా... అవతలి వారికి అసామాన్యులమనిపిస్తాం. ఆకాశమంత ఎత్తులో నిలుస్తాం! అందుకోసం ఏం చేయాలంటారా... కాసేపు వరుణ్‌పృథి ఫేస్‌బుక్ పోస్టులను గమనించి.. అవకాశం ఉన్నప్పుడు తనలాగే చేస్తే చాలు!
కాలిఫోర్నియాలోని హాలీవుడ్‌లో నటన, డాన్సుల్లో శిక్షణ పొంది వచ్చిన ఈ ఢిల్లీ యువకుడు బాలీవుడ్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తూ.. వీడియో ఆల్బమ్స్‌లో నటిస్తూ ఉంటాడు. వరుణ్‌పృథి నేపథ్యం ఇదే అయినా... ఇతడిని ప్రస్తావించుకోవాల్సిన అంశం మాత్రం మరోటి ఉంది. అదే.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లైన ఫేస్‌బుక్, యూట్యూబ్‌లను వేదికలుగా చేసుకొని అతడు చేస్తున్న విభిన్నమైన ప్రయత్నం.
ఢిల్లీలోని కనాట్‌ప్లేస్ ‘బ్లాక్ ఏ’లో ఫుట్‌పాత్‌పై సాక్స్‌లను అమ్ముతుండే ఒక మధ్యవయసు మహిళను కొంతకాలం కిందట ప్రపంచానికి పరిచయం చేశాడు పృథి. తను అమ్మే సాక్సులు నాణ్యమైనవని.. ఒక పెయిర్ కొనాలని కోరిన ఆ మహిళ దగ్గర పృథి ఆగి.. ఆమె దగ్గర ఉన్న మొత్తం సాక్సులన్నీ కొనేశాడు! అంతే ఒక్కసారిగా ఆమె కళ్లలో తడి.. ఎన్నో రోజులు అమ్మితేగానీ అమ్ముడయిపోని ఆ సాక్సులన్నీ ఒకేసారి అమ్ముడయిపోతే ఆమెకు అంతకు మించిన ఆనందముంటుందా! పృథి ఎవరో ఆమెకు తెలీదు. కానీ అతడు ఆమెకు జీవితంలో మరిచిపోలేని వ్యక్తి అయ్యాడు. ఈ ప్రయత్నంలో అతడు చెల్లించింది మహా అంటే ఐదొందల రూపాయలు. ఆ డబ్బుకు ప్రతిగా అంత విలువైన సాక్సులు పొందాడు. కానీ అతడు ఆమెకి అందించిన సంతోషానికి మాత్రం ఎవ్వరూ విలువకట్టలేరు. ఆ విషయం పృథి అప్‌లోడ్ చేసిన వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ఈ వీడియో చివర పృథి ఇచ్చే సందేశం ఏమిటంటే... ‘కనాట్ ప్లేస్ బ్లాక్ ఏ ప్రాంతంలో ఉంటుందామె.. మీరు అటువైపు వెళితే ఆమె దగ్గర సాక్సులు కొనండి’ అంటాడు. మరి అందుకోసం మనం ఢిల్లీ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. మన వీధి చివర కూడా ఇలాంటి ఆనందం కోసం ఎదురుచూసే స్ట్రీట్‌వెండర్లు ఉండనే ఉంటారు.
ఈసారి ఢిల్లీ వీధుల్లోనే.. పెన్నులమ్మే పిల్లాడు.. ఆరేడేళ్లుంటాయి. మెక్‌డొనాల్డ్స్ చికెన్ ఔట్‌లెట్ బయట నిలబడి లోపలికి చూస్తూ కనిపించడంతో వరుణ్ లోపలకు తీసుకెళ్లాడు. రెండు చికెన్ బర్గర్‌లు ఆర్డరిచ్చి టేబుల్ మీద కూర్చొబెట్టి అతడి కథేంటో తెలుసుకోవడం మొదలెట్టాడు. వరుణ్ ఆర్డరిచ్చిన చికెన్ బర్గర్‌లు రెండూ తనకే అని తెలిసి.. రెండోదాన్ని చెల్లి కోసం ఇంటికితీసుకెళతానన్న ఆ పిల్లాడి స్వరంలోని మార్ధవంలో అపురూపమైన ఆర్తి. ఆ పిల్లాడి దగ్గర ఉన్న పెన్నులన్నింటినీ కొనేసి పంపించాడు వరుణ్.
వరుణ్ ఫేస్‌బుక్ పేజీకి ఐదులక్షల లైక్‌లున్నాయి! చాలా మంది స్టార్ హీరోల ఇమేజ్‌తో సమానం ఈ మొత్తం. వరుణ్ చెప్పే పద్ధతి బాగుంది. ప్రపంచాన్ని అలరించడానికి, ఆనందపెట్టడానికి నక్షత్రాలను కలిపేయనక్కర్లేదు.. మేఘాలను కరిగించనక్కర్లేదు.. మనకు చేతనయ్యే చిన్నచిన్నపనులతోనే కొందరిని ఆనందపెట్టగలం, వారి అనందాన్ని అనుభూతిగా మార్చుకోగలం... అని చెప్పకుండా చెబుతాడు వరుణ్. ఇది ఎవ్వరి హృదయాన్ని అయినా సున్నితంగా తాకుతుంది. మరి మనం చేయగలిగింది ఏమిటంటే.. వరుణ్ యూట్యూబ్ ఛానల్‌నో.. ఫేస్‌బుక్ పేజ్‌నో పూర్తిగా చూస్తే ఆ హ్యుమానిటీ హనీలో తడవొచ్చు! వరుణ్‌నే స్ఫూర్తిగా తీసుకుంటే.. మానవత్వాన్ని వర్షింపజేయవచ్చు.
- జీవన్ రెడ్డి.బి