'అప్పడం'గా తినండి | Verity Papads Special Story | Sakshi
Sakshi News home page

'అప్పడం'గా తినండి

Published Sat, Aug 10 2019 7:41 AM | Last Updated on Sat, Aug 10 2019 7:41 AM

Verity Papads Special Story - Sakshi

ఏదో అప్పడమనీ... సైడ్‌ డిష్‌ అనీ ఇన్నాళ్లు సైడ్‌ ప్లేటులో పెట్టిన వాళ్లు ఇప్పుడు మెయిన్‌ కోర్సులోకి దించి అప్పనంగా తినండి! ఇది అప్పడం భోజనం!

దహీ పాపడ్‌ కీ సబ్జీ
కావలసినవి: నూనె – 4 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 1 (పొడవుగా నిలువుగా కట్‌ చేయాలి); మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; అప్పడాలు – 5; ఉప్పు – తగినంత; కసూరీ మేథీ – 2 టేబుల్‌ స్పూన్లు; గరం మసాలా – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ∙స్టౌ మీద బాణలిలో 4 టేబుల్‌ స్పూన్ల నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి. ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి వేసి మరోమారు వేయించాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి వేసి మరోమారు వేయించాలి ∙కప్పు నీళ్లు, కప్పు చిలికిన పెరుగు వేసి కలపాలి ∙సన్నని మంట మీద పదార్థాలన్నీ కలిసేవరకు కలుపుతుండాలి ∙అప్పడం ముక్కలను ఇందులో వేసి, కొద్దిగా ఉప్పు జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి ∙గరం మసాలా, కసూరీ మేథీ జత చేసి బాగా కలిపి దింపేయాలి.

మేథీ పాపడ్‌కర్రీ
కావలసినవి: మెంతులు – 3 టేబుల్‌ స్పూన్లు;
పెరుగు – 3 టేబుల్‌ స్పూన్లు; మినప అప్పడాలు – 4; ధనియాల పొడి – 3 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత.

తయారీ: ∙స్టౌ మీద పెద్ద పాత్రలో రెండు కప్పుల నీళ్లు మరిగించి దింపేయాలి ∙మెంతులు వేసి మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక అప్పడాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ∙మిక్సీలో... పెరుగు, ధనియాలు, మిరప కారం, పసుపు వేసి మెత్తగా చేసి, స్టౌ మీద బాణలిలో ఉన్న నూనెలో వేసి వేయించాలి ∙మెంతులలోని నీళ్లు తీసేసి, ఉడుకుతున్న పెరుగు మిశ్రమంలో వేసి రెండుమూడు నిమిషాలు కలియబెట్టాలి ∙ఒక కప్పు నీళ్లు జత చేసి మరిగించాలి ∙అప్పడం ముక్కలను ఇందులో వేసి కలిపి దింపేయాలి. (పచ్చి అప్పడాలను కూడా ఉపయోగించుకోవచ్చు) ∙అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. (మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఇందులోని మెంతులు ఔషధంలా పనిచేస్తాయి.

పాపడ్‌ పోహా
కావలసినవి: అప్పడాలు – 8; అటుకులు – ఒక కప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను.
తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నూనె పోసి కాగాక, అప్పడాలు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙అప్పడాలను చేతితో పొడి చేయాలి ∙ఒక పాత్రలో అప్పడాల పొడి, అటుకులు, ఉప్పు, మిరప కారం, ఇంగువ వేసి బాగా కలిపి, గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి.

స్టఫ్‌డ్‌ పాపడ్‌ రోల్స్‌
కావలసినవి: పసుపు – అర టీ స్పూను; మిరప కారం –
అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఆమ్‌చూర్‌ – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1; అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్‌ స్పూను; మైదా పిండి – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర తరుగు – 3 టేబుల్‌ స్పూన్లు; పచ్చి బఠాణీ – పావు కప్పు; ఉడికించి, మెత్తగా మెదిపిన బంగాళ దుంప – రెండు కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; చిన్న సైజు అప్పడాలు – 10.

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, కొద్దిగా నీళ్లు పోసి దోసెల పిండి మాదిరిగా కలిపి పక్కనుంచాలి ∙స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పచ్చి బఠాణీ, ఉడికించి మెదిపిన బంగాళ దుంప, ఉప్పు, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, ఆమ్‌ చూర్‌ పొడి వేసి కలపాలి ∙ఒక్కో అప్పడాన్ని చల్ల నీళ్లలో 30 సెకన్ల పాటు ఉంచి తీసేయాలి ∙అప్పడం మెత్తగా ఉన్నప్పుడే బంగాళ దుంప మిశ్రమం కొద్దిగా తీసుకుని అప్పడానికి ఒక చివర ఉంచి, జాగ్రత్తగా రోల్‌ చేసి, అంచులను మైదా పిండితో మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పాపడ్‌ రోల్స్‌ను అందులో వేసి కరకరలాడే వరకు వేయించాలి ∙కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙గ్రీన్‌ చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

స్వీట్‌ అండ్‌ టాంగీ మసాలా పాపడ్‌ చాట్‌
కావలసినవి: ఉల్లి తరుగు – పావు కప్పు; ఉడికించిన బంగాళ దుంప – అర కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; గ్రీన్‌ చట్నీ – 2 టీ స్పూన్లు; స్వీట్‌ చట్నీ – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరప కారం – పావు టీ స్పూను; మిక్స్చర్‌ – రెండు కప్పులు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; చాట్‌ మసాలా – అర టీ  స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; పచ్చి అప్పడాలు – 4 (మధ్యకు రెండు ముక్కలుగా కట్‌ చేయాలి)

తయారీ: ∙స్టౌ మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ ఉంచి, నూనె వేయకుండా, అప్పడాలను పేపర్‌ నాప్‌కిన్‌తో ఒత్తుతూ కాల్చి కోన్‌ ఆకారంలో చుట్టాలి (వేడిగా ఉన్నప్పుడే కోన్‌ ఆకారంలో చుట్టినప్పుడు అంచులు అవే అతుక్కుంటాయి ∙ఈ విధంగా అన్నీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ∙ఒకపాత్రలో ఉడికించిన బంగాళ దుంప ముక్కలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మిక్స్చర్, కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరప కారం, చాట్‌ మసాలా, నిమ్మ రసం, స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ అన్నీ వేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న కోన్‌లో ఈ మిశ్రమాన్ని ఉంచి, చాట్‌ మసాలా చల్లి అందించాలి ’ స్నాక్‌లా చాలా రుచిగా ఉంటుంది.

కేరళ స్టైల్‌ పాపడ్‌ కర్రీ
కావలసినవి: బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; కేరళ అప్పడాలు – 10; ఉల్లి తరుగు – ఒక కప్పు; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2 ; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; కొబ్బరి నూనె – 3 టీ స్పూన్లు (పోపు కోసం).

తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, అప్పడాలు వేయించి తీసి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙అదే బాణలి లో బంగాళ దుంప ముక్కలు వేసి కరకరలాడేవరకు వేయించాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఇంగువ, పచ్చి మిర్చి తరుగు, అల్లం ముద్ద వేసి బాగా కలపాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙మిరప కారం, పసుపు, ధనియాల పొడి జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙వేయించుకున్న బంగాళ దుంప ముక్కలు, అప్పడం ముక్కలు వేసి కలిపి దింపేయాలి ∙ఈ కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది ∙స్నాక్‌లాగ కూడా తినొచ్చు.

పాపడ్‌ స్టఫ్‌డ్‌పరాఠా
కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; అప్పడాలు – 4; గరం మసాలా – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి).
తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకుని, అరగంట సేపు పక్కన ఉంచాలి ∙అప్పడాలను నూనె లేకుండా పెనంమీద కాల్చి, చేతితో మెదుపుతూ మెత్తగా పొడి చేయాలి ∙ఒక పాత్రలో అప్పడాల పొడి, గరం మసాలా, ఎండు మిర్చి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙ఒక్కో ఉండను, చేతితో గుండ్రంగా చేయాలి ∙అప్పడాల పొడి మిశ్రమం అందులో ఉంచి మధ్యలోకి మడిచి, అంచులు మూసేయాలి ∙అప్పడాల కర్రతో జాగ్రత్తగా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా వేసి ఎక్కువ సేపు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement