విడిపోనిది ఈ రక్త ‘బంధం’ | Vidiponidi the blood relationship | Sakshi
Sakshi News home page

విడిపోనిది ఈ రక్త ‘బంధం’

Published Tue, Mar 4 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

విడిపోనిది ఈ రక్త ‘బంధం’

విడిపోనిది ఈ రక్త ‘బంధం’

 ‘తలసేమియా’ పేరు వినే ఉంటారు. ‘రత్నావళి’ అనే పేరు కూడా వినే ఉంటారు. గత పదిహేనేళ్లుగా తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం ఎక్కించేపనిలో తలమునకలుగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకురాలు ఆమె. తలసేమియా జబ్బుతో బాధపడుతున్న కొడుకును కాపాడుకుంటూ తన లాంటి మరో ఇరవైమందిని కలిసి, వారిని ఒప్పించి ‘తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ’ సంస్థను నెలకొల్పిందామె.

ఆమె కుమారుడు తలసేమియాతో పోరాడి ఓడిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయి ఇప్పటికి ఐదేళ్లవుతోంది. ఏ బిడ్డ కోసమైతే ఈ సంస్థను స్థాపించిందో అతనే లేకపోతే రత్నావళి ఇంకెవరి కోసం పోరాడుతున్నట్టు? ఇరవై మంది బాధితులతో మొదలైన ఆ సొసైటీలో ఇప్పుడు 2 వేలమంది ఉన్నారు. ‘‘నా బిడ్డను పోగొట్టుకున్నాను కానీ, వాడి ఆశయాన్ని కాదు..’’ అంటున్న ఈ అమ్మ గురించి...

 తలసేమియా బాధితులకు ప్రతి పదిహేనురోజులకొకసారి రక్తం ఎక్కించకపోతే బతకడం కష్టం. హైదరాబాద్ పురానాహవేలీలో ఉన్న ‘తలసే మియా అండ్ సికిల్ సెల్ సొసైటీ’లో రోజూ యాభై నుంచి అరవైమంది తలసేమియా బాధితులు రక్తం ఎక్కించుకుంటున్నారు. ఈ జబ్బు ఎందుకొస్తుందంటారా? మన దేశ జనాభాలో ఐదుశాతం మంది తలసేమియా వాహకులున్నారు. రక్తంలో హెచ్‌బిఎ2లెవల్ 3.5 శాతానికి మించి ఉంటే వారిని తలసేమియా వాహకులంటారు. ఏ ఇద్దరు తలసేమియా వాహకులు పెళ్లి చేసుకున్నా... వారికి పుట్టే బిడ్డలు యాభై శాతం తలసేమియా బాధితులుగా పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. చాలా ఏళ్ళ క్రితం రత్నావళికి మొదట అబ్బాయి పుట్టాడు. అందరిలానే ఆమె ఎంతో సంతోషించింది. బిడ్డకు నాలుగు నెలలు నిండాక విరేచనాలు, బరువు తగ్గిపోవడం, మాటిమాటికీ జ్వరం మొదలయ్యాయి.

బిడ్డ వైద్యం కోసం పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చిందామె. అలా వచ్చి తిరగని ఆసుపత్రి లేదు. చివరకు నిమ్స్ వైద్యులు జబ్బుకు కారణం బయటపెట్టారు. ప్రతి పదిహేనురోజులకు బిడ్దకు రక్తం ఎక్కించకపోతే ప్రమాదం అని చెప్పారు. జబ్బు పేరేమిటని అడిగితే ‘తలసేమియా’ అన్నారు. ‘లోకంలో ఎవ్వరికీ లేని బాధ నాకే ఎందుకు పెట్టావు భగవంతుడా...’ అని బాధపడుతున్న రత్నావళికి తన లాంటి తల్లులు చాలామంది కనిపించడంతో అది ఒకరి బాధ కాదని అర్థమైంది. అందరూ కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. అలా వెలసిన ఈ సొసైటీలో 2 వేలమంది బాధితులు చేరారు.

 రెండు వేల మంది బిడ్డలు

 ఇరవై ఒక్క ఏళ్ల వయసున్న బిడ్డ మరణాన్ని తట్టుకున్న తల్లికి అతని కోరికే ఓదార్పునిచ్చింది. ‘‘నాలుగు నెలల బిడ్డప్పటి నుంచి రోహిత్ కన్నుమూసేనాటికి 750 సార్లు రక్తం ఎక్కించాం. ప్రతి పదిహేను రోజులకొకసారి రక్తం ఎక్కిస్తున్నాం కదా...నా బిడ్డకేం కాదనుకునేదాన్ని. కానీ... అన్నిసార్లు రక్తం ఎక్కించడం వల్ల వాడి శరీరంలో యాంటీబాడీస్ పెరిగిపోయి ఇన్‌ఫెక్షన్ వచ్చేసింది. 2009 మార్చి 14న యథావిధిగా రక్తం ఎక్కించాం. రెండోరోజున చెయ్యి నొప్పిగా ఉందని చెప్పాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చెయ్యంతా వాపు రావడం, నల్లబడడం, బొబ్బలెక్కడం...అంతా నిమిషాల్లో జరిగిపోయింది. ఆ ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఆ బాధలో కూడా వాడు నాతో ‘నాలాంటి బిడ్డలు నీకు ఇంకా చాలామంది ఉన్నారమ్మా. వారిని జాగ్రత్తగా చూసుకో’ అన్నాడు. ఆఖరి క్షణంలో వాడు అన్న మాటలు నన్ను ప్రతిక్షణం ముందుకు నెడుతుంటాయి’’ అంటూ కడుపుకోతను ఆమె గుర్తుచేసుకున్నారు.
 

 రక్తం కోసం...
 సొసైటీ పెట్టడంతోనే తలసేమియా బాధితులకు కష్టాలు తీరలేదు. వారికి కావాల్సిన రక్తం కోసం, సొసైటీ నిర్వహణకు కావాల్సిన డబ్బు కోసం రత్నావళి ఎక్కని గుమ్మం లేదు. రక్తం ఒక్కటీ ఉంటే సరిపోదు కదా! దాన్ని శుద్ధి చేయడం కోసం ప్రతీ యూనిట్‌కి 600 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి నెలా 15 లక్షల రూపాయల ఖర్చు. ‘‘1998లో సొసైటీ ఏర్పాటయ్యాక కూడా చాలా కష్టపడ్డాం. తలసేమియా గురించి ప్రజల్లో అవగాహన వచ్చాక రక్తం ఇవ్వడానికి కొందరు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు రావడం మొదలుపెట్టారు.

అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని 2009లో సొసైటీలోనే బ్లడ్‌బ్యాంకు ఏర్పాటు చేసుకున్నాం. రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా రక్త సేకరణ జరగడం లేదు. దీని కోసం రకరకాల పేర్లతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం’’ అని రత్నావళి చెప్పారు.
 ‘‘పేగుబంధానికి దూరమయ్యాను కానీ, నా సొసైటీని నమ్ముకున్న మిగతా తల్లుల బిడ్డల ప్రేమకు దూరం కాలేదు నేను’’ అని చెప్పే రత్నావళి రక్తబంధాన్ని అర్థం చేసుకుందాం. తలసేమియా బాధితుల కోసం మనం కూడా చేతనైనంత సాయం అందిద్దాం!
     - భువనేశ్వరి, ఫొటోలు: అనిల్ కుమార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement