
మన్ కాయి డక్‌వీడ్! నాచులా.. నీటి వనరుల ఉపరితలంపై పెరిగే చిన్నసైజు మొక్కలు ఇవి. చాలామంది ఈ మొక్కలను చెత్త అనుకుంటారుగానీ... ప్రపంచం ఇప్పుడిప్పుడే దీని ప్రాముఖ్యతను గుర్తిస్తోంది. ఇదో పోషకాల గుట్ట అని చెబుతోంది. బెన్ గురియాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ మన్‌కాయి డక్‌వీడ్ కార్బోహైడ్రేట్లు బాగా తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజు మోతాదు పెరిగిపోకుండా అడ్డుకోగలదు. అంటే.. ముధుమేహానికి మంచి విరుగుడన్నమాట. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న మరో ఆహారంతో పోల్చి చూసినప్పుడు మన్‌కాయి తీసుకున్న వారిలో అత్యధిక గ్లూకోజ్ మోతాదు తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతోపాటు శరీరం నుంచి గ్లూకోజ్ వేగంగా తొలగిపోవడం.. ఉదయాన్నే పరగడుపున ఉండాల్సిన గ్లూకోజ్ కూడా తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. అంతేకాకుండా.. మన్‌కాయి తీసుకున్న వారు చాలాకాలంపాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని పొందారు. అంతేకాదు.. హిటా జెలీజా అనే శాస్త్రవేత్త జరిపిన పరిశోధన ద్వారా ఈ డక్‌వీడ్ కనీసం 45 శాతం ప్రొటీన్ అని తెలిసింది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఏడాది పొడవునా దీన్ని పండించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో వందల సంవత్సరాలుగా ఆహారంగా తీసుకుంటున్న మన్‌కాయిలో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, పీచుపదార్థం, ఇనుము, జిక్ లాంటి మినరల్స్, ఏ, బీ కాంప్లెక్స్, బీ12 వంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నట్లు పరిశోధనల్లో స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment