ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గితే డెంగ్యూ ఉన్నట్లేనా? | Wealth Ayurvedic Clinic | Sakshi
Sakshi News home page

ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గితే డెంగ్యూ ఉన్నట్లేనా?

Published Fri, Dec 11 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గితే డెంగ్యూ ఉన్నట్లేనా?

ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గితే డెంగ్యూ ఉన్నట్లేనా?

ఆయుర్వేదం కౌన్సెలింగ్
నా వయసు 57 ఏళ్లు. బరువు 82 కేజీలు. గత రెండేళ్లుగా రెండు మోకాళ్లలోనూ క్రమేణ నొప్పులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కీళ్లు కదల్చడం ఇబ్బందికరంగా ఉంది. ఎముకల వైద్య నిపుణులు మోకాళ్ల చిప్పలు మార్చే శస్త్రచికిత్సను సూచించారు. ఆయుర్వేద మందులతో ఈ సమస్య పరిష్కారమవుతుందా? దయచేసి వివరంగా తెలియజేయండి.
- పి. సూర్యారావు, మెదక్
ఆయుర్వేదశాస్త్రంలో ఈ వ్యాధిని సంధివాతంగా వివరించారు. సాధారణంగా ఇది వయసుపైబడిన వారిలో కనిపిస్తుంటుంది. వయసు రీత్యా శరీరంలో వాత ప్రాబల్యం కలుగుతుంది. దీనికి తోడు తినే ఆహారంలో పోషక విలువలు లోపించడం, తగురీతిలో శరీరంలోని అన్ని కీళ్లకూ వ్యాయామం లేకపోవడం, అశాస్త్రీయంగా వాడే కొన్ని రకాల మందుల దుష్ర్పభావం, సొంతవైద్యాలు, నాటువైద్యాల ఫలితాలు ఇలాంటి సమస్యకు ఇతర కారణాలు. వీటి వల్ల వాతప్రకోపం జరిగి, అస్థి ధాతు శైథిల్యానికి దారితీస్తుంది. దీన్నే ధాతుక్షయం అంటే డిజెనరేటివ్ పరిస్థితిగా పరిగణించాలి. ఇక్కడ మోకాలి చిప్పలు (పటెల్లా అనే మృదులాస్థి) అరిగిపోవడం జరుగుతుంది. ఈ అరుగుదల తీవ్రతను బట్టి, మనకు కనిపించే లక్షణాలు ఉంటాయి.

చికిత్సాసూత్రాలు: ఏ వ్యాధికైనా ముందుగా కారణాలను దూరంగా ఉంచాలి. మీరు ప్రధానంగా బరువు తగ్గాలి. షుగరు, బీపీ వంటి వ్యాధులేవైనా ఉంటే  నియంత్రించుకోవాలి. విటమినులు, క్యాల్షియం లవణాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తినండి. ఆకుకూరలు, పాలు, పెరుగు, తాజాపండ్లు, శుష్కఫలాలు మితంగా తినండి. మాంసరసం, చేపలు తగినంతగా తీసుకోండి. లభిస్తే తామరతూండ్లతో కూర చేసుకొని తినండి. మితిమీరి వ్యాయామం చేయవద్దు. శరీరం సహకరించినంతవరకు, తగురీతిలో వ్యాయామం చేయ్యండి. ముఖ్యంగా సోఫోలో కూర్చొని మోకాళ్లను మెల్లగా ముడుచుకోవడం, చాచడం 10 నిమిషాలు రెండుపూటలా చేయండి. క్రమక్రమంగా ఆ సామర్థ్యం పెరగడానికి వెసులుబాటు అవుతుంది.

ఔషధాలు:  క్షీరబలా (క్యాప్సూల్స్): ఉదయం 1, రాత్రి 1 ఖాళీ కడుపున  మహాయోగరాజ గుగ్గులు (మాత్ర) : పూటకొక్కటి చొప్పున మూడుపూటలా (తిన్న తర్వాత)  బృహత్‌వాతచింతామణి (మాత్రలు) : రోజుకొక్కటి  అశ్వగంధారిష్ట (ద్రావకం) : నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండు పూటలా తాగాలి.  పిండతైలం, మహానారాయణ తైలాలను సమానంగా కలిపి మోకాళ్లపై మృదువుగా, పావుగంట పాటు, రెండుపూటలా మర్దనా చేసి, వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. ఈ చికిత్సాక్రమం మూడు నెలలు పాటించి, తర్వాత పరిస్థితిని సమీక్షించుకోండి.

డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్.


జనరల్ కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 17 ఏళ్లు. ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల మా అమ్మాయికి తీవ్ర జ్వరంతో ఒళ్లునొప్పులు కూడా ఉన్నాయి. రక్తపరీక్ష చేయిస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య 1.10 లక్షలుగా ఉన్నట్లు తేలింది. అంటే మా అమ్మాయికి డెంగ్యూ ఉన్నట్లేనా? తనకు ప్లేట్‌లెట్లు ఎక్కించాలా? అసలు ప్లేట్‌లెట్లు ఎందుకు తగ్గుతాయి? జ్వరం, ఒళ్లునొప్పులతో మా అమ్మాయి కాలేజీకి వెళ్లలేకపోతోంది. ఇప్పుడు ఇంటర్మీడియట్‌లో ఉన్నందున చదువులో ఎక్కడ వెనకబడుతుందో అని ఆందోళనగా ఉంది. దయచేసి మా అమ్మాయి సమస్యకు పరిష్కారం చెప్పండి.
- చంద్రకళ, నిజామాబాద్
మీరు తెలిపిన వివరాలను బట్టి మీ అమ్మాయి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే డెంగ్యూ ఉన్నట్లు కాదు. చాలా కారణాల వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. సరైన వ్యాధి నిర్ధారణ ద్వారా ఏ కారణంతో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిందో తెలుసుకొని చికిత్స అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య 1.10 లక్షలకు తగ్గినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే వైరల్ ఫీవర్లలో కూడా జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వాటితో పాటు నీరసం ఉంటే పండ్లసరాలు, కొబ్బరినీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తాగించండి. ఈ తరహా సమస్య ఉన్నవారికి బయటకు పంపించడం అంత మంచిది కాదు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ప్రదేశాలకు అసలు పంపించకూడదు. ముందుగా వైద్య పరీక్షలు చేయించి, వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వ్యాధిని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. దాంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి. మీ అమ్మాయికి సాధారణ జ్వరమే అయితే రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది.

 జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గిన వెంటనే కాలేజీకి పంపించవచ్చు. అనారోగ్యంతో కాలేజీకి వెళ్లిన మీరు ఆశించిన ప్రయోజనం ఉండదు. ఆరోగ్యంగా ఉండి కాలేజీకి వెళ్తేనే చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా వైద్యులను సంప్రదించి, మీ అమ్మాయి సమస్య ఏమిటో తెలుసుకొని, అందుకు అనుగుణంగా చికిత్స చేయించుకోండి.

డాక్టర్ కె. శశికిరణ్
సీనియర్ జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ,
హైదరాబాద్ .


ఎండోక్రైనాలజీ కౌన్సెలింగ్
నా భార్య గర్భవతి. ఇప్పుడు ఆరోనెల. ఇటీవలే థైరాయిడ్ పరీక్ష చేయిస్తే టీఎస్‌హెచ్ 5.3 అని తెలిసింది. ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఆ విలువ 3 కంటే తక్కువగా ఉండాలని చెప్పి, థైరాక్సిన్ అనే మందు మొదలుపెట్టారు. దాని మోతాదు 50 ఎంసీజీ. నావి రెండు ప్రశ్నలు. మొదటిది... టెస్ట్ రిపోర్ట్‌లో టీఎస్‌హెచ్ నార్మల్ వ్యాల్యూ 0.3 - 5.5 అని ఉంది. మరి నా భార్యకు థైరాక్సిన్ మందు ఇవ్వడం ఎందుకు మొదలుపెట్టారు? రెండో ప్రశ్న కాన్పు తర్వాత ఈ హైపోథైరాయిడిజమ్ తగ్గుతుందా?
- జీవీఆర్., కర్నూలు
మీరు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే.. 0.3 - 5.5 అనే నార్మల్  రేంజ్.. గర్భవతులకు వర్తించదు. గర్భిణిగా ఉన్నప్పుడు కలిగే ఒత్తిడులను తట్టుకోడానికి శరీరం థైరాయిడ్ హార్మోన్‌లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ ఉత్పత్తి తగ్గితే అది వారికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మీరు చెప్పిన వివరాల ప్రకారం ఆమెకు తగినంత టీఎస్‌హెచ్ స్రవించడం లేదు. అందుకే ఆమెకు ఉన్న కండిషన్‌ను హైపోథైరాయిడిజమ్‌గా చెప్పవచ్చు. మీరు థైరాక్సిన్ ట్యాబ్లెట్లను నిరభ్యంతరంగా వాడవచ్చు.

ఇక ప్రసవం అయిన మర్నాటి నుంచి మీ భార్యకు వచ్చే థైరాక్సిన్ మోతాదు తగ్గించాలి. అందుకే కాన్పు అయిన 4 - 8 వారాల తర్వాత మళ్లీ మరోసారి టీఎస్‌హెచ్ మోతాదులను పరీక్షించి, ఆమెకు ఇవ్వాల్సిన మోతాదులను నిర్ణయించాలి. దీనికోసం అప్పుడు మీ ఎండోక్రైనాలజిస్ట్‌ను మరోసారి సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ప్రసవం తర్వాత 2 - 3 నెలల్లో టీఎస్‌హెచ్ తగ్గి, మళ్లీ పెరుగుతుంది. దీన్ని పోస్ట్‌పార్టమ్ థైరాయిడైటిస్  అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని నెలలు థైరాక్సిన్ మోతాదు తగ్గించి, అవసరాన్ని బట్టి మళ్లీ పెంచాల్సి ఉంటుంది.

ఇక మీ భార్యకు ప్రెగ్నెన్సీలో వచ్చిన హైపోథైరాయిడిజమ్, ప్రసవం తర్వాత తగ్గుతుందా లేదా అన్నది ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేం. అయితే యాంటీ టీపీవో యాంటీబాడీస్ పరీక్ష ద్వారా కొంతమేరకు అంచనా వేయవచ్చు. వివరాల కోసం మీ ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించండి. గర్భధారణ తర్వాత వచ్చే హైపోథైరాయిడిజమ్‌లో ఎక్కువ శాతం కాన్పు తర్వాత కూడా కొనసాగుతుంది. మీరు నిర్భయంగా ఉండాల్సిన అంశం ఏమిటంటే... తల్లికి వచ్చిన హైపోథైరాయిడిజమ్ బిడ్డకు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. కానీ... కొంతమంది శిశువుల్లో జన్మతః థైరాయిడ్ గ్రంథే లేకపోవచ్చు లేదా సరిగా పనిచేయకపోవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడం కోసం చిన్నారి పుట్టిన 48 గంటల తర్వాత టీ4 అండ్ టీఎస్‌హెచ్ పరీక్ష తప్పనిసరి.

డాక్టర్ వి. శ్రీ నాగేష్
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్ .

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement