ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | This week YouTube hits | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Mon, Apr 30 2018 12:59 AM | Last Updated on Mon, Apr 30 2018 12:59 AM

This week YouTube hits  - Sakshi

ఇన్‌ కాన్వర్జేషన్‌ విత్‌ మై పీరియడ్‌ – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి 9 ని. 44 సె.హిట్స్‌ 6,16,874
ఆడవాళ్ల వైపు నుంచి లోక రీతులను ఉదహరించే యూ ట్యూబ్‌ చానల్‌ ‘గర్ల్‌ ఫార్ములా’ చేసిన కొత్త వీడియో ఇది. ఇంగ్లిష్‌లో టైటిల్‌ పెట్టారుగానీ అచ్చ తెలుగు వీడియో. ఇటీవలి కాలంలో స్త్రీ సమాజంలో ‘బహిష్టు’ గురించి చర్చ జరుగుతోంది. ‘హ్యాపీ టు బ్లీడ్‌’ పేరుతో నెలసరి ఒక సహజమైన విషయంగా దాని గురించి సమాజం ఆ సమయంలో స్త్రీలను వివక్షతో చూడరాదని, స్త్రీలు కూడా అందుకు న్యూనత పడరాదని చర్చ జరుగుతున్నది. స్త్రీలకు సహజమైన, జీవన చక్రానికి ఎంతో అవసరమైన ‘బహిష్టు’ గురించి పాతకాలపు ఆలోచనలు అవసరమా? ఆ సమయంలో స్త్రీలపై ఆంక్షలు అవసరమా? ఈ విషయాలను లౌడ్‌గా కాకుండా ఒక సున్నితమైన సంభాషణలాగా ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చిత్రీకరించారు. పుట్టిన రోజు నాడు ఒక అమ్మాయికి పీరియడ్స్‌ మొదలవుతాయి. పీరియడ్స్‌ ఒక యువతి రూపంలో ఆ అమ్మాయికి ఎదురుపడతాయి. ఆ అమ్మాయికి పీరియడ్స్‌ ఎలా సాంత్వనం కలిగించాయో ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చూడొచ్చు. ‘పీరియడ్స్‌ మొదలైన మొదటి రోజు ఆడవాళ్లకు ఆఫీషియల్‌ లీవ్‌ ఇచ్చే హక్కు’ను ఈ వీడియో నొక్కి వక్కాణించింది. మనం చాలా మారాం. ఇంకా మారాల్సిన సంగతులు నెలసరి విషయంలో ఈ వీడియోలో ఉన్నాయి. మంచి ప్రయత్నం. రచన, దర్శకత్వం: మసాలా సుదీప్‌.

వీర్‌ ది వెడ్డింగ్‌ – ట్రైలర్‌
నిడివి 2 ని. 49 సె.హిట్స్‌ 1,93,86,809
సమాజం బంధనాలు వేయడం, వ్యక్తి స్వేచ్ఛ కోసం పెనుగులాడటం జరుగుతున్నదే. మగవాళ్ల సంగతి పక్కన పెట్టండి. స్త్రీలు స్వేచ్ఛ కోసం పెనుగులాడితే? స్వేచ్ఛను ఎక్స్‌ప్లోర్‌ చేయాలనుకుంటే? మగ వ్యవస్థను చాలెంజ్‌ చేయాలనుకుంటే? ‘వీర్‌ ది వెడ్డింగ్‌’లో నలుగురు యువతులు ఈ ప్రయత్నమే చేసేలా ఉన్నారు. తమకు ఇష్టమైన జీవన మార్గాలలో ప్రయాణం చేయడానికి వీరు ప్రయత్నిస్తే ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేది కథ. ఇందులో వాడిన భాష, పాత్రల బాహాటమైన ప్రవర్తన మన ప్రేక్షకులకు కొంత షాక్‌ ఇచ్చే అవకాశం ఉంది. బూతులు కూడా ధారాళంగా మాట్లాడితే షాక్‌ కదా. అదీ ఆడపిల్లలు. కాని వాస్తవ సమాజంలో ఈ వాస్తవ యువతులు కూడా ఉన్నారు. ‘క్విక్‌ గన్‌ మురుగన్‌’ వంటి సినిమాలకు పని చేసిన శశాంక్‌ ఘోష్‌ దీనికి దర్శకుడు. సోనమ్‌ కపూర్‌ సొంతగా నటించి నిర్మించింది. కరీనా కపూర్‌ ఇంకో ముఖ్యపాత్ర. చాలా కుతూహలం రేపుతున్న ట్రైలర్‌ ఇది.

నా పేరు సూర్య – ట్రైలర్‌
నిడివి 1 ని. 49 సె.హిట్స్‌ 27,56,165 
సైనికుడు దేశాన్ని ప్రేమించడం విధి. దేశం కోసం పిచ్చిగా, ఆగ్రహంగా చెలరేగితే ఆ సైనికుడికే కాక ఎదుటివారికి కూడా సమస్యలు వస్తాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లో అల్లు అర్జున్‌ చాలా కోపం కలిగిన దేశభక్తితో నిండిన సైనికుడిగా కనిపించనున్నాడు. బార్డర్‌లో చచ్చిపోవాలనేది ఇతడి కోరిక. కాని బార్డర్‌లో ఎదుర్కోవాల్సిన శత్రువు కంటే బార్డర్‌ లోపల ఉన్న శత్రువును ఎదుర్కోవడం ముఖ్యమని భావిస్తాడు. ఆ పనిలో ఏం కోల్పోయాడు... ఏం పొందాడు... తెర మీద చూడాలి. వక్కంతం వంశీ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా అల్లు అర్జున్‌ అభిమానులలో క్రేజ్‌ను తీసుకువస్తోంది. లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్‌ నిర్మాతలు. అర్జున్, శరత్‌ కుమార్‌ వంటి స్టార్లు కూడా ఉన్నారు. ‘నాకు కోపం వస్తే బూతులే వస్తాయి మంత్రాలు కాదు’... ‘కేరెక్టర్‌ కోల్పోవడం అంటే చావు రాక ముందే చచ్చిపోవడం’ వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. బన్నీ లుక్స్‌ బాగున్నాయి. మే 4న సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement