
ఎన్నెన్నో ఆనందాల కోసం ఎన్నెన్నో వారాంతపు సెలవులు...
ఈ ఏడాది క్యాలెండర్‌ను ఒకసారి తిరగేశారా! పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాలు ఎప్పుడొస్తున్నాయో పట్టించుకునే వారికంటే సెలవులెన్ని రాబోతున్నాయి అని చూసేవారే మనలో ఎక్కువ. అలాంటి వారికి ఈ ఏడాది పండగే!
- ఎన్.ఆర్
ఈ ఏడాది(2015)లో సెలవు దినాలు అదీ వరసక్రమంగా వచ్చే జాబితాను ఒకసారి పరికించండి. ఎందుకంటే మీకంటే ముందే ఆ రోజులను గమనించేసి, ట్రావెల్ బుకింగ్స్ చేసుకున్నవారి సంఖ్య, చేస్తున్నవారి సంఖ్య విపరీతంగా ఉంది..
ఆ జాబితా ఏంటంటే..
ఈసారి వారాంతాలలో మూడు - నాలుగు రోజులు వరసగా సెలవు రోజులు వస్తున్నాయి. ఈ నెలలోనే చూడండి... రిపబ్లిక్ డే (జనవరి 26) సోమవారం వచ్చింది. ఆ విధంగా శని, ఆది, సోమ వారాలు వరసగా మూడు రోజులు సెలవు దినాలు. ఇలాగే హోలి, గుడ్‌ఫ్రై డే, బుద్ధ పూర్ణిమ, ఈద్-ఉల్-జుహా, గాంధీ జయంతి, క్రిస్టమస్.. ఈ పండగలన్నీ సోమ లేదా శుక్రవారాలలో ఉన్నాయి. అంటే, వారంలో మూడు రోజులు సెలవు గ్యారెంటీ!
ఒకవేళ శనివారం మీకు పనిదినం అయితే ఆ రోజు వచ్చే సెలవులేంటో తెలుసా! రామనవమి, ఈదుల్ ఫితర్, స్వాతంత్య్రదినోత్సవం, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి/మొహర్రమ్.. ఈ పండగలు శనివారాలే వస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాదిలో ఆ విధంగా ఆరు సెలవులను పొందవచ్చు. ఆ తర్వాత వచ్చే ఆదివారంతో కలుపుకుంటే రెట్టింపు ఆనందమే! వీటన్నింటినీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఏడాదిలో ఈ విధంగా మొత్తం 14 రోజుల సెలవు దినాలు కలిసొస్తాయి.
ముందుగానే ప్రణాళికకు సూచిక...
మూడు-నాల్గు నెలల ముందుగానే ఏయే ప్రాంతాలు చుట్టిరావాలనుకుంటున్నారో టికెట్, రూమ్ బుకింగ్ చేయించుకోవాలి. దీని వల్ల ట్రావెల్ ఏజెన్సీలు ఇచ్చే ట్రావెల్ ఆఫర్లనూ పొందవచ్చు.
‘మేక్ మై ట్రిప్’ మార్కెటింగ్ ఆఫీసర్ మోహిత్ గుప్తా మాట్లాడుతూ -‘చాలా హోటల్స్ ఇప్పటికే మంచి ఆఫర్లతో సిద్ధంగా ఉన్నాయి. స్పా, మీల్స్, బసకు సంబంధించిన వోచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంత త్వరగా బుక్ చేసుకుంటే వారికి అంత విలాసవంతమైన సదుపాయాలు డిస్కౌంట్లలో లభిస్తాయి. మీ ప్రయాణ తేదీ ముందుగానే నిర్ణయించుకొని, ఏ ప్రాంతంలో బస చేయాలనుకుంటున్నారో తేల్చుకోవడానికి ఈ ఏడాది వారంతపు సెలవు దినాలు ఎదురుచూస్తున్నాయి’ అన్నారు. అంటే చివరి వరకు ఎదురుచూస్తే దక్కాల్సిన ఆఫర్లు చేజారిపోవడం ఖాయం అన్నమాట. సో, హర్రీ అప్!
‘క్లియర్ ట్రిప్ ప్రెసిడెంట్,’ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీధరన్ మాట్లాడుతూ - ‘‘ఇప్పటికే 65 శాతం టికెట్లు వారాంతపు ప్రయాణాలకు బుక్ అయ్యాయి’’అని చెబుతూ ‘‘మనదేశ ప్రయాణికులు సెలవు దినాలను ప్రయాణాల కోసం ఉపయోగించడం తక్కువ. ఏవైనా మరీ ఎక్కువ సెలవు రోజులు వస్తే తప్ప అంత త్వరగా కదలరు అనే అభిప్రాయం ఉంది. కానీ, ఈ అభిప్రాయం మార్చుకోక తప్పదు’’ అన్నారు.
ఈ ఏడాది ప్రయాణాలకు వేదికగా మారబోతోందని, మరిన్ని కుటుంబ సంతోషాలను మూటగట్టుకోబోతున్నారని ట్రావెలర్స్ తమ ప్రయాణ బుకింగ్స్‌తో చెప్పకనే చెబుతున్నారన్నమాట. విష్ యూ హ్యాపీ జర్నీ!