వెల్‌డన్ రాడ్రిక్స్
కట్‌లో ఒక షార్ప్‌నెస్ ఉంటుంది.. ఫ్లో లో ఒక స్మూత్‌నెస్ ఉంటుంది కలర్స్ లో గోవా చురుక్కు ఉంటుంది... అందుకే చాలా మంది డిజైనర్లు ఈ టాప్ డిజైనర్ వెండెల్ రాడ్రిక్స్‌ను వెల్‌డన్ రాడ్రిక్స్ అంటుంటారు.ఉల్లిపొరలా చూపులను కట్టిపడేసే షిపాన్ ఫ్యాబ్రిక్‌తో రమ్యమైన సొబగులు అద్దడంలో వెండెల్ ఎన్నో వండర్స్ సృష్టిస్తారు. రాణీ పింక్ కలర్ ట్యూనిక్ అల్ట్రామోడ్రన్‌కి ప్రతిరూపంలా ఉంది. రంగులతో మ్యాజిక్ చేయడం, ఫ్యాబ్రిక్స్‌తో ఫ్యాబులస్ డిజైన్స్ రూపొందించడం వెండెల్ ప్రత్యేకత. నీలం, కాఫీ, బంగారు రంగులు ఎంత స్టైలిష్‌గా కళ్లకు కడుతున్నాయో! నీలాకాశం జిలుగులు, ప్రకృతి పరవశాలకు ఫ్యాబ్రిక్ కాన్వాస్‌గా మారిపోయిందా అనిపించకమానదు ఇలాంటి డ్రెస్సులను చూస్తే! లాంగ్‌లోనే మనసును కొల్లగొట్టే ఇలాంటి లవింగ్ మ్యాక్సీ డ్రెస్సులు రాడ్రిక్స్ ఖాతాలో లెక్కకు మించి.
తెలుపు, ఎరుపు, పింక్ డై కలర్స్ వాడిన ట్యునిక్స్ అతివల అందాన్ని స్టైలిష్‌గా రూపుకడతాయి. ఒకే కలర్.. చిన్న చిన్న తేడా.. గొప్ప అందం.. వెండెల్ డ్రెస్సుల సొంతం. లాంగ్ పలాజో స్కర్ట్, లాంగ్ స్లీవ్స్ ట్యూనిక్ ఇండో వెస్ట్రన్ స్టైల్‌కి చిరునామాగా నిలుస్తాయి. సుతిమెత్తని ఫ్యాబ్రిక్.. పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు వెండెల్ ఆధునిక కలలకు సరికొత్త భాష్యం. లాంగ్ మ్యాక్సీ గౌన్‌లో బాలీవుడ్ నటి దీపికా పదుకునే! ప్లెయిన్ క్లాత్‌తో అబ్బురపరిచే డిజైన్లను ఎలా రూపొందించవచ్చో వెండెల్ ట్యునిక్స్‌ని చూసి తెలుసుకోవచ్చు. పసుపు రంగు వి-నెక్ ట్యునిక్ యూత్ స్టైల్‌కి సిసలైన అద్దం పడుతుంది.సృజనతో పాటు సహనం అవసరం
- వెండెల్ రాడ్రిక్స్, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్
ఇండియన్ టాప్ టెన్ ఫ్యాషన్ డిజైనర్లలో మేటిగా పేరున్న వ్యక్తి వెండెల్ రాడ్రిక్స్. అంతర్జాతీయ వస్త్రనిపుణుడిగా ప్రముఖుల చేత ప్రశంసలు పొందిన వెండెల్ గోవాకు చెందిన వ్యక్తి. గోవా వాతావరణానికి తగ్గట్టు ఈ డిజైనర్ వస్త్ర నైపుణ్యంలోనూ అక్కడి స్పార్క్ కనపడుతుంది. వెండెల్ కృషిని అభినందిస్తూ 2014లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పర్యావరణ కార్యకర్తగానూ పనిచేస్తున్న వెండెల్ ఒక సామాజిక వాది కూడా! ‘ఫ్యాషన్ పరిశ్రమ చాలా సృజనాత్మకమైనది. ఇందులో ఎంతో మంది యువత తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే, ఇందులో డిజైనర్ వర్క్‌కి ఒక గుర్తింపు రావడం అనేది చాలా కష్టం. ఈ రంగంలో నిలదొక్కుకోవాలనుకునేవారికి సృజనతో పాటు సహనం ఉండాలి. పాజిటివ్ దృక్పథం ఉండాలి’ అంటారు డిజైనర్ వెండెల్ రాడ్రిక్స్.