
శూన్యంలో ఏం నింపాలి??
13-19 కేరెంటింగ్
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
ఇటీవల కాలంలో టీనేజ్ పిల్లల్లో దాదాపు అందరిదీ ఒకటే సమస్య... ఏకాగ్రత కుదరడం లేదని. తల్లిదండ్రులందరి ఫిర్యాదు ఒక్కటే.. మా పిల్లలు చదువు మీద ధ్యాస పెట్టడం లేదని.
ఈ వయసులో ఎందుకీ సమస్య ఎక్కువవుతోంది..?
సుష్మ పట్టణంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం ఊరు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి పరిచయమై, ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఊరు నుంచి వచ్చాక అతని నుంచి రోజూ మెసేజ్‌లు.. మొదట్లో స్పందించని సుష్మ మెల్ల మెల్లగా అతని మెసేజ్‌లకు తిరుగు సందేశం ఇవ్వడం మొదలుపెట్టింది. గంటలు గంటలు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తోంది. కొన్ని రోజులకు ఎలాగైందంటే పావు గంటలో అతని నుంచి తిరుగు మెసేజ్ రాకపోతే పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తించేది. తల్లిదండ్రులు ఆ అబ్బాయి గురించి ఎంక్వయిరీ చేశారు. ఊరు వెళ్లి కలిశారు. అతను చదువు మానేసి, ఏ పనీ లేకుండా ఊరికే రోజులు వెళ్లదీస్తున్నాడు. గట్టిగా మందలిస్తే ‘ఇక నుంచి మెసేజ్ చేయను, మాట్లాడను’ అని చెప్పాడు. సుష్మను హాస్టల్‌లో ఉంచారు. ఏడాది గడిచింది. మళ్లీ ఈ మధ్య ఆ అబ్బాయి నుంచి రోజూ మెసేజ్‌లు. ఫోన్‌లోనే కబుర్లు. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సుష్మకు చదువు మీద పూర్తిగా శ్రద్ధ తగ్గిపోయింది. టీచర్లు చెప్పే పాఠాలపై ఏకాగ్రత నిలపలేకపోతోంది. మెసేజ్‌లకు అట్రాక్ట్ అయిపోయి, చదువు నుంచి దూరం అయ్యింది.
అవినాష్, వినీల దూరపు బంధువులు. ఇద్దరూ ఇంటర్మీడియట్ విద్యార్థులే! బంధువుల ఫంక్షన్‌లో కలిశారు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇళ్లకు వచ్చాక ‘హాయ్ హాయ్’ మెసేజ్‌లు ఇచ్చుకోవడం మొదలైంది. పేరెంట్స్‌కి తెలియకుండా సాగే నిశ్శబ్ద సందేశాలు ఇరువైపులా పిల్లలిద్దరినీ చదువుకు దూరం చేశాయి. పెద్దలకు తెలిసి గొడవలయ్యాయి. పిల్లల దగ్గర నుంచి ఫోన్లు లాక్కున్నారు. సమస్య అప్పటికి సద్దుమణిగింది. మరుసటి ఏడాది ఓ పెళ్లిలో కలిశారు. మారిన నెంబర్లు మళ్లీ ఇచ్చుకున్నారు. మళ్లీ మామూలే! ఫోన్‌లలో మెసేజ్‌లు, కబుర్లు! పుస్తకాలు ముందు ఉన్నా ఏకాగ్రత కుదరడం లేదు. పరధ్యానంగా ఉంటున్నారు. మార్కులు తగ్గిపోయాయి. పాస్ అవుతారో లేదో.. అని భయం.
భౌతిక శాస్త్రంలో ... ‘శూన్యం పూడ్చబడుతుంది’ అనే సిద్ధాంతం ఒకటుంది. పిల్లల మైండ్‌ఎప్పుడైతే లక్ష్యం వైపుగా ఉండదో అది శూన్యంలోనే ఉంటుంది. ఆ శూన్యం ఇటీవల రకరకాల ఆకర్షణలతో పూరింపబడుతోంది. వాటిలో ప్రధానమైనది టెక్నాలజీ! పాఠశాల స్థాయి నుంచే పిల్లల దగ్గర ఫోన్‌లు, ఇంటర్‌నెట్ సదుపాయం ఎక్కువైంది. పిల్లలు తమ చుట్టూ ఉన్నవారితో కన్నా మెసేజ్‌లు, చాట్‌లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ వయసులో కలిగే రకరకాల అట్రాక్షన్‌లతో టెక్నాలజీ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారో, చదువు నుంచి ఎలా దూరం అవుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. సరైన దారిలో పెట్టగలగాలి.
ఇవి గమనించండి...
మారుతున్న కాలానికి, వచ్చి పడుతున్న టెక్నాలజీకి మనం అడ్డుపడలేం. అయితే, ఏ కారణం లేకుండా ఎవరూ పరధ్యానంగా ఉండరు అనే విషయాన్ని గుర్తించాలి. పిల్లలు ఒక వైపునకు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టే, మరో వైపునకు (చదువు)దూరం అవుతున్నారు అనేది గమనించాలి.
{పతి మనిషి మైండ్‌లో ‘ఇద్, ఇగో, సూపర్ ఇగో’అని 3 దశలు ఉంటాయి. ‘ఇద్’ అనేది చిన్నపిల్లల మనస్తత్వం. తాత్కాలిక ఆనందాల కోసం పదే పదే మారాం చేస్తుంటుంది. తప్పు అని తెలిసినా ఆనందం కోసం వెంపర్లాడుతుంటుంది. ‘ఇగో’ అనేది దానిని పోలీస్‌లా హెచ్చరిస్తుంది. మంచీ చెడు రెండూ చెబుతుంది. ‘సూపర్ ఇగో’ జడ్జ్ చేస్తుంది. చేసే పని ‘ఎందుకు మంచిది కాదు’ అనేది తమ లోపలి స్వరం ఒకటి హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్వరం వినిపిస్తుందో పిల్లలు అప్పుడు తమను తామే నేరస్థులుగా భావించుకుంటారు. చదువు నుంచి దూరం అవుతారు.
ఇవి సూచించండి...
మనసుకు ‘వద్దు’ అని చెప్పద్దు: ఆకర్షణకు సంబంధించి ఎలాంటి ‘కోరికలు’ కలిగినా వెంటనే ‘వద్దు’ అని మనసుకు చెప్పకండి. ‘ఇప్పుడు కాదు’ అని వాయిదా వేస్తూ ఉండమనండి. వాయిదా సమయాన్ని బట్టి తీవ్రత తగ్గిపోతుంటుంది. ‘వద్దు’ అంటే పెరుగుతుంది. ఈ విషయాన్ని పిల్లలు గ్రహించేలా వివరించాలి.
టైమ్ మిషన్‌లో ఎక్కండి: ఆకర్షణకు లోనవకుండా ఉండాలి, చదువు మీద ఏకాగ్రత కుదరాలి అంటే.. ‘టైమ్ మిషన్’లో ఎక్కమని చెప్పాలి. అంటే కళ్లు మూసుకొని 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో తమని తాము చూసుకోమని చెప్పాలి. మంచి ఇల్లు, కారు, హోదా.. ఇవన్నీ ఉండేలా తమ లోపలి స్వరం వారికే వినిపిస్తుంది. తమని తాము అలా చూసుకున్న తర్వాత దానికి 100 శాతం ఎఫర్ట్ పెడుతున్నానా! అని వారే బేరీజు వేసుకుంటారు. టైమ్ మిషన్ ఎక్కినప్పుడు ఆటోమేటిగ్గా తాము పెద్దలకు తెలియకుండా చేస్తున్న పనుల పట్ల వారికి భయం వేస్తుంది.
పెద్దల స్థానంలో ఉండమనండి: ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పక్కన నిల్చుని లిఫ్ట్‌లో పైకి వెళుతున్నాడు. అతనికి మరో వ్యక్తి తన పక్కన ఉన్నట్టే కనిపిస్తుంది. అదే కింద ఉన్నవారికి లిఫ్ట్‌లో ఉన్న ఆ వ్యక్తి పైకి వెళుతున్నట్టే కనిపిస్తుంది. పక్కన ఉన్న వ్యక్తి, కింద ఉన్న వ్యక్తి ఇద్దరూ చెప్పే సమాధానం సరైనదే! అయితే, ఎక్కడా రెండూ కరెక్ట్‌గా ఉండటం సాధ్యపడదు. పిల్లలు ఆకర్షణలో ఉన్నప్పుడు వారు చేస్తున్నది వారికి కరెక్టే అనిపిస్తుంది. అలాంటప్పుడు పెద్దలు తాము అమలుపరిచే శిక్షలు కరెక్టే అనుకుంటారు. కానీ, పిల్లల మదిలో ఉన్న అపోహలను పెద్దలను తొలగించే ప్రయత్నం చేయాలి.
పిల్లలను తల్లిదండ్రుల(పెద్దల) స్థానంలో ఉండమనాలి. ‘నీ కూతురు/కొడుకు ఇలాగే చేస్తే నువ్వేం చేస్తావు?’ అని అడగాలి. సినిమాలలో వంద రకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెడితే అతనే హీరోగా చూపిస్తారు. అబ్బాయిలు అదే నిజం అనుకుంటున్నారు. అయితే, సినిమాలు నిజాలు కావు. కేవలం 3 గంటల వినోదానికి సంబంధించింది మాత్రమే అనేది వారు తెలుసుకోగలగాలి. అదే సినిమాలో హీరో ఒక బ్రిడ్జి మీద నుంచి ఇంకో బ్రిడ్జ్ మీదకు దూకడం వంటి అసాధ్యపు సీన్లు చేస్తుంటాడు. ప్రేమ అనే వ్యవహారానికి త్వరగా ఆకర్షితులయ్యే పిల్లలు అలాంటి సాహసాలు ఎందుకు చేయడం లేదు? ఇవెందుకు చేస్తున్నారు? అంటూ ఇలా వాస్తవాలను తెలియజేయాలి.
టీనేజ్ పిల్లల్లో ఆకర్షణ అనేది సాధారణమైనదే అని ముందుగా పెద్దలు తెలుసుకోవాలి. అయితే, ఆ ఆకర్షణ పరిధులు దాటడం వల్లే సమస్యలు కాబట్టి, ఇదే విషయాన్నీ పిల్లలకు వివరించాలి.
- డా. గీతా చల్లా, సైకాలజిస్ట్
www.sudishacounselingcentre.org