బనశంకరి: బెంగళూరు నగరంలో కేఆర్.సర్కిల్ అండర్‌పాస్‌లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కారు మునిగిపోవడంతో మృతిచెందిన ఐటీ ఇంజనీరు భానురేఖ మృతదేహానికి విక్టోరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపి సోమవారం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు అంబులెన్స్ ద్వారా విజయవాడకు తీసుకెళ్లారు. ఆమె బెంగళూరులో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తుండేది. ఉన్నతస్థాయికి చేరాల్సిన తమ బిడ్డ పాతికేళ్లు నిండకుండానే పాడి ఎక్కిందని బంధువులు విలపించారు.
పాలికె అధికారులపై కేసు
అండర్‌పాస్ ఘటనపై హలసూరుగేట్ పోలీసులు బీబీఎంపీ అధికారులపై కేసు నమోదు చేశారు. యువతి సోదరుడు సందీప్ హలసూరుగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోయిందని, నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్థానిక బీబీఎంపీ అధికారులపై ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాల సమయంలో స్థానిక పాలికె అధికారులపై కేసులు నమోదు చేశారు. అవి ఏమయ్యాయో ఇప్పటికీ తెలియదు.
కారు డ్రైవరు అరెస్ట్
భానురేఖ మృతికేసులో క్యాబ్ డ్రైవరు హరీశ్ ను హలసూరుగేట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి మృతికి కారణమయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా భానురేఖ ఎలక్ట్రానిక్‌సిటీలో నివాసం ఉంటుండగా బెంగళూరునగరం చూపించాలని కుటుంబసభ్యులతో కలిసి క్యాబ్‌బుక్ చేసుకుని కారులో బయలుదేరి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆమె మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ నగర పాలికె పనితీరుపై విమర్శలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment