పుట్టాక చంపేవాళ్లు నేరస్తులైతే పుట్టక ముందే చంపేవాళ్లు ఏమవుతారు?ప్రాణం పోయాల్సిన చోటులోనే ప్రాణం తీసేవాళ్లు తయారైతే?చేసిన నేరం ఊరికే పోదు. కటకటాల వెనక్కు తోస్తుంది.పుట్టిన బిడ్డ ఏడిస్తే తల్లికి ఆనందం.బిడ్డను పుట్టనివ్వకపోతే అదే తల్లికి ఆక్రోశం.ఆ ఆక్రోశానికి కారకులెవ్వరు?
వనపర్తి.జనవరి 11, 2009.‘చూడమ్మా! మమ్మల్ని చూసి పోలీసులని భయపడనక్కర్లేదు. ఓ అన్నలా అనుకొని చెప్పు. అసలేం జరిగింది?’ చేతులు ఒళ్లో పెట్టుకొని, తల దించుకొని కుర్చీలో కూర్చున్న ఆమెనే చూస్తూ అనునయంగా అడిగాడు ఎఎస్‌పి.ఆమె మౌనంగా ఉంది. చుట్టూ చూశాడు ఎఎస్‌పి. తలుపు దగ్గర ఆమె తల్లీదండ్రి ఉన్నారు. వారి వల్లనే ఏమీ చెప్పలేకపోతుందని గమనించి బయటకు వెళ్లమన్నట్టు సైగ చేశాడు. కొన్ని క్షణాలు అక్కడే తచ్చాడిన వాళ్లు ఇక తప్పదన్నట్టు బయటకు వెళ్లారు. ‘మీ అమ్మనాన్న బయటకు వెళ్లారు. నీకేం భయం లేదు. ఏం జరిగిందో చెప్పు. నీకేం సాయం కావాలన్నా చేస్తాం’ మరోసారి అడిగాడు ఎస్సై. ఆమె తల ఎత్తి ‘మా ఆయన్ని జైల్లో పెట్టారు. విడిపించండన్నా’ అంది చేతులు జోడిస్తూ! ఆ కళ్ల నిండుగా నీళ్లు. ఆమె పరిస్థితికి జాలి కలిగింది ఎఎస్‌పికి.
బదిలీ మీద వచ్చిన ఎఎస్‌పి (అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) కొత్తగా ఛార్జ్ తీసుకున్నాక పెండింగ్ ఫైల్స్‌ని వెరిఫై చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క ఫైల్ తీసుకొని పరిశీలనగా చూస్తున్నాడు. వాటిలో ఒక ఫైల్ ఆసక్తికరంగా అనిపించింది.డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. పేరు: రాధ (పేరు మార్చడమైనది)వయసు: 16. అదే ఊరుకు చెందిన 22 ఏళ్ల మాణిక్యం, రాధ ప్రేమించుకున్నారు.ఇంటి నుంచి వెళ్లిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు మాణిక్యం మీద కేసు పెట్టారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నందుకు అతని మీద కేసు నమోదైంది. పోలీసులు రాధ, మాణిక్యం ఉన్న చోటు కనుక్కొని వాళ్లని పట్టుకునేసరికి ఆరేడు నెలలు గడిచాయి. మాణిక్యాన్ని అరెస్ట్ చేశారు. అతను తిరుపతి జైలులో ఉన్నాడు. అయితే రాధ అప్పటికే 5 నెలల గర్భవతి. ఫైల్ మూశాడు ఎఎస్‌పి.ఆలోచనలో పడ్డాడు.. ‘ఈ కేసు ఫైల్ అయ్యి మరో మూడు నెలలు గడిచాయి. అంటే ప్రస్తుతం ఆ అమ్మాయి ఎనిమిది నెలల గర్భవతి అయి ఉండాలి. భర్త జైలులో ఉన్నాడు. చిన్న వయసు. ఇప్పుడా అమ్మాయి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి’ అనిపించింది. రాధ వాళ్లంటికి బయల్దేరారు.
‘నా భర్తను విడిపించన్నా..’ అందా అమ్మాయి.‘ఇది కిడ్నాప్ కేసు కాదన్నా. నేను ఇష్టప్రకారమే వెళ్లా. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇందులో నా భర్త తప్పు ఏముంది’ అంది.ఎఎస్‌పి తల పంకించాడు. అమ్మాయి వయసు తక్కువ ఉండటం ఒక్కటే ఈ కేసులో ప్రతికూలం అనిపించింది. ‘సరే... ఏం చేయగలనో చూస్తాను’ అని బయటకు రాబోతూ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి ‘ఇప్పుడు నువ్వు గర్భవతివి కదా! సమయానికి మందులు వేసుకుంటున్నావా’ అడిగాడు. అంతే. ఆ అమ్మాయి గుండె బద్దలైనట్టుగా ఏడ్వడం మొదలుపెట్టింది. చేతుల్తో ముఖం కప్పేసుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది.‘ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్.. ఏమయ్యింది?’ ‘ఏ మందులూ లేవన్నా. పోయిన నెలలోనే బలవంతంగా ఆబార్షన్ చేయించారు మా అమ్మ నాన్న’ ‘అబార్షనా?!’తల్లిదండ్రులని పిలిచాడు. ‘చిన్నపిల్ల. దానికి ఇంకో పిల్ల ఎందుకని కడుపు తీయించాం సార్’ చెప్పారు రాధ తల్లీదండ్రి.వాళ్లకు పెళ్లి ఇష్టం లేదని అర్థమవుతూనే ఉంది. చిన్నపిల్ల కనుక ఇప్పుడీ జంజాటం ఎందుకులే అని తీయించి ఉంటారు అనిపించింది.కాని ఒక్క క్షణంలోనే అతడికి అనుమానం వచ్చింది. ‘ఏడవ నెలలో అబార్షన్ చేస్తే ఎంత ప్రమాదం.. అబార్షన్ ఎవరు చేసుంటారు?’ అనుకున్నాడు.
ఒక్క క్షణం పట్టలేదు. అసలు కారణం అర్థమైంది.‘లింగ నిర్థారణ చేయించారు కదూ. అమ్మాయి కనుకనే అబార్షన్ చేయించారు కదూ. అబ్బాయి అయితే ఉంచుకునేవారు కదూ’ అన్నాడు రెట్టిస్తూ.అమ్మాయి తల్లిదండ్రులు తల దించుకున్నారు. ‘మైగాడ్. ఈ టౌన్‌లో లింగ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఏడవ నెలలోనూ భ్రూణహత్యలు జరుగుతున్నాయంటే ఎలాంటి డాక్టర్లు ఉన్నారిక్కడ’ అనుకుని ‘ఏ హాస్పిటల్?’ అడిగాడు. రాధ చెప్పిన హాస్పిటల్ పేరు నోట్ చేసుకుంటూ..‘ముందా డాక్టర్‌ని అరెస్ట్ చేయాలి’ అన్నాడు ఎస్సైతో..‘డాక్టర్ పేరు చెప్పమ్మా’ అడిగాడు. ‘అక్కడ పెద్ద సారు అబార్షన్ చేశాడు. కానీ ఆ పెద్ద సారు ఎవరో తెలియదన్నా’ అంది రాధ. అదే మాట రాధ తల్లిదండ్రులు అన్నారు.‘డాక్టర్ రాసిచ్చిన చీటీ ఉంటుందిగా’‘అలాంటివేవీ లేవన్నా. కావల్సిన మందులన్నీ ఆ పెద్ద సారే ఇచ్చాడు’
‘ఏదో కేసు కోసం వస్తే ఇంకేదో కేసుకు క్లూ దొరికింది. ఇది ఎంత పెద్ద క్రైమ్! ఎలాంటి ఆధారాలు దొరక్కండా జాగ్రత్తపడుతూ ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నార’ని అర్ధమైంది ఎఎస్‌పికి.‘పేరు తెలియకుండా, కాగితం ముక్క ఆధారం కూడా లేకుండా జాగ్రత్తపడిన ఆ డాక్టర్‌ని అరెస్ట్ చేయడం ఎలా? ఒక వేళ అరెస్ట్ చేసినా సరైన ఆధారాలు లేకపోతే.. నిజంగానే అతను అలాంటివాడు కాకపోతే అతనికి చెడ్డ పేరు రావచ్చు. లేదంటే పట్టణంలో ఇతర డాక్టర్లంతా కలిసి ధర్నా చేసే అవకాశాలూ లేకపోలేదు. అదే గనక జరిగితే పెద్ద సమస్యే అవుతుంది. ఆ డాక్టర్ కూడా తనను తప్పు పట్టొ్టచ్చు. కొత్తగా వచ్చిన పోలీసాఫీసర్ ఇలా చేశాడంటే నాకూ చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది ఎలా’ ఆలోచిస్తూ ఓ నిర్ణయానికి వచ్చాడు ఎఎస్‌పి. అతనిని ఫాలో అయ్యారు మిగతా సిబ్బంది.
ఆసుపత్రి రిసెప్షన్ దగ్గర..‘అమ్మా, పెద్ద సారు ఎప్పుడొస్తాడు. ఎంత టైమ్ పడుతుంది’ అడిగాడు అతను. ఎగాదిగా చూసింది రిసెప్షనిస్ట్.పాత ప్యాంట్, పాత చొక్కా వేసుకుని ఉన్నాడు. చంకలో పాత సంచి.. తలకు నూనె పెట్టి నున్నగా దువ్విన జుట్టు. ‘బాగా పల్లెటూరు వాడున్నట్టున్నాడు.. ఇక్కడకు వచ్చేవారంతా ఇలాంటివారేగా’ అనుకుంటూ ఆ పక్కనే ఉన్న ఆమెనూ ఓసారి చూసి.. ‘సారు లోపలే ఉన్నాడు. వాళ్లందరూ అయిపోయాక మిమ్మల్ని పిలుస్తాం. పేషెంట్ పేరేంటి?’ అంది రిసెప్షనిస్ట్. ‘మా చెల్లెలు, రాధ..’ చెప్పాడతను.వెళ్లి లైన్‌గా ఉన్న కుర్చీల్లో ఇద్దరూ ఒదిగి కూర్చున్నారు.అరగంట.. గంట గడిచింది.
లోపలకు పిలిచారు. డాక్టర్ ముందు ఇద్దరూ కూచున్నారు. ‘సమస్య ఏంటి..’ అన్నట్టు చూశాడు ఆ డాక్టర్! ‘సారూ, ఈమె మా చెల్లెలు. పోయిన నెలలో అబార్షన్ చేశారుగా. ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. రాత్రిళ్లు కడుపు నొప్పి అని విలవిల్లాడిపోతోంది. ఏడవ నెలలో అబార్షన్ చేయడం వల్లనే ఇలా అయ్యిందేమో! చనిపోతుందేమో అని భయంగా ఉంది సార్! మా చుట్టుపక్కలవాళ్లు కూడా అదేఅంటున్నారు. అందుకే తీసుకొచ్చాను. మీకోసారి చూపిద్దామని..’ అన్నాడు అతను. రాధ వైపుగా చూసిన ఆ డాక్టర్... ‘ఏమీ కాదయ్యా! నేను 8వ నెలలో కూడా అబార్షన్లు చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి బయట చెప్పద్దు. మందులు రాసిస్తా అవి వాడండి. నయమౌతుంది’ అన్నాడు డాక్టర్. ‘ఓహో.. 8వ నెలలోనూ భ్రూణహత్యలు చేస్తున్నారన్నమాట.. ’ అన్నాడతను.డాక్టర్ కంగారు పడ్డాడు.‘ఎవరు నువ్వు?’ అన్నాడు.‘యు ఆర్ అండర్ అరెస్ట్’ అన్నాడు ఎఎస్‌పి.నిర్ఘాంతపోయాడు డాక్టర్. అలా మఫ్టీలో వచ్చింది కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఎఎస్‌పి అని తెలిసి వణికిపోయాడు అతను.
ఆ వెంటనే వచ్చిన పోలీసులు డాక్టర్ చేతికి బేడీలు వేశారు. రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్‌తో సహా డాక్టర్‌పై కేసు ఫైల్ అయ్యింది. ఎవరికీ తెలియకుండా భ్రూణహత్యలు చేస్తూ డబ్బులు మూటకట్టుకునే డాక్టర్‌ని రాధ కేసు ద్వారా కటకటకాల వెనక్కి పంపించారు పోలీసులు.
‘పేరు తెలియకుండా, కాగితం ముక్క ఆధారం కూడా లేకుండా జాగ్రత్తపడిన ఆ డాక్టర్‌ని అరెస్ట్ చేయడం ఎలా? ఒకవేళ అరెస్ట్ చేసినా సరైన ఆధారాలు లేకపోతే.. నిజంగానే అతను అలాంటివాడు కాకపోతే అతనికి చెడ్డ పేరు రావచ్చు. లేదంటే పట్టణంలో ఇతర డాక్టర్లంతా కలిసి ధర్నా చేసే అవకాశాలూ లేకపోలేదు. అదే గనక జరిగితే పెద్ద సమస్యే అవుతుంది. ఆ డాక్టర్ కూడా తనను తప్పు పట్టొ్టచ్చు. కొత్తగా వచ్చిన పోలీసాఫీసర్ ఇలా చేశాడంటూ తనకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఎలా’ ఆలోచిస్తూ ఓ నిర్ణయానికి వచ్చాడు ఎఎస్‌పి.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment