గరుడ పురాణంలో ఏముంటుంది?
గరుడపురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. మరణానంతర జీవితంపై గరుత్మంతుడికి తలెత్తిన పలు సందేహాలకు శ్రీ మహావిష్ణువు వివరంగా సమాధానాలు చెప్పాడు. అదే గరుడ పురాణం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఇందులో స్వర్గం అంటే ఏమిటి, నరకమంటే ఏమిటి, ఏ పాపం చేసిన వారు నరకానికి పోతారు, ఏ పుణ్యకార్యం చేసిన వారికి స్వర్గార్హత లభిస్తుంది, వైతరణి అంటే ఏమిటి, వైతరణకి ఎవరు పోతారు? నరక బాధలు తప్పించు కోవాలంటే ఏం చేయాలి... వంటి అనేక సందేహాలకు విష్ణుమూర్తి గరుడునికి సమాధానాలు చెప్పాడు.. ఎవరైనా మరణించినప్పుడు పురోహితుడు లేదా ఎవరైనా పెద్దవాళ్లు గరుడ పురాణాన్ని పారాయణ చేస్తారు. అయితే ఎందువల్లో ఏమో, గరుడపురాణం అంటే కేవలం ఎవరైనా పోయినప్పుడు మాత్రమే చదువుకునేది అనే ఒక అపప్రధ ఉంది. మనిషి మనిషిగా బతకడానికి చదవవలసిన గ్రంథం కాబట్టి దీనిని ఎప్పుడైనా చదవవచ్చునని కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే, మనసు బలహీనంగా ఉన్నవారు మాత్రం ఇది చదవకపోవడమే మంచిదని మరికొందరు చెబుతారు.