అట్లాస్‌ కటింగ్స్‌ | whole world cuts the cake for new year celebrations | Sakshi
Sakshi News home page

అట్లాస్‌ కటింగ్స్‌

Published Sat, Dec 29 2018 12:09 AM | Last Updated on Sat, Dec 29 2018 12:09 AM

whole world cuts the cake for new year celebrations - Sakshi

ఇది అందరి పండుగ. ఇంతకు మించిన,  ఇంతకంటే అందమైన,  అందరికీ నచ్చిన హ్యాపీబర్త్‌డే  ఇంకొకటి ఉండదు. అందుకే ఈ బర్త్‌డేకి ప్రపంచమంతా కేక్‌ కట్‌ చేస్తుంది. మీరూ టేస్ట్‌ చేయండి. హ్యాపీ బర్త్‌డే 2019

ఇటాలియన్‌ క్రీమీ కేక్‌
కావలసినవి: బటర్‌మిల్క్‌ – ఒక కప్పు; బేకింగ్‌ సోడా – ఒక టీ స్పూను; బటర్‌ – అర కప్పు; షార్టెనింగ్‌ – అర కప్పు; పంచదార – 2 కప్పులు; కోడిగుడ్లు – 5; కొబ్బరి ఫ్లేక్స్‌ – ఒక కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – ఒక టీ స్పూను; మైదా పిండి – 2 కప్పులు; క్రీమ్‌ చీజ్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; బటర్‌ – అర కప్పు; వెనిలా ఎసెన్స్‌ – ఒక టీ స్పూను; పంచదార పొడి – 4 కప్పులు; లైట్‌ క్రీమ్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; వాల్నట్స్‌ తరుగు – అర కప్పు; స్వీటెన్‌డ్‌ ఫ్లేక్‌డ్‌ కోకోనట్‌ – ఒక కప్పు. 

తయారీ: ∙అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్‌ చేయాలి ∙తొమ్మిది అంగుళాల ఎత్తులో  గుండ్రంగా ఉన్న మూడు పాన్‌లకు కొద్దిగా బటర్‌ పూసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో బటర్‌ మిల్క్, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా గిలకొట్టి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో క్రీమ్, అర కప్పు బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు గిలకొట్టాలి ∙కోడి గుడ్లు జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙బటర్‌ మిల్క్‌ మిశ్రమం, ఒక టీ స్పూను వెనిలా ఎసెన్స్, ఒక కప్పు కొబ్బరి ఫ్లేక్స్, బేకింగ్‌ పౌడర్, మైదా పిండి జత చేసి అన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు సుమారు పావు గంట సేపు గిలకొట్టాలి ∙ ముందుగా సిద్ధం చేసుకున్న మూడు పాన్‌లలో సమానంగా పోసి, అవెన్‌లో సుమారు అరగంటసేపు ఉంచాలి ∙ఒక పాత్రలో క్రీమ్, చీజ్, అర కప్పు బటర్, ఒక టీ స్పూన్‌ వెనిలా ఎసెన్స్, పంచదార పొడి వేసి అన్నీ కలిసి, బాగా క్రీమీగా వచ్చేవరకు గిలకొట్టాలి ∙కొద్దిగా క్రీమ్‌ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙వాల్నట్స్‌ తరుగు, కొబ్బరి ఫ్లేక్స్‌ జత చేసి బాగా కలియబెట్టాలి ∙తయారుచేసి ఉంచుకున్న కేక్‌లను అవెన్‌లో నుంచి బయటకు తీయాలి ∙క్రీమ్‌ మిశ్రమాన్ని ఒక పొరలా సమానంగా పరవాలి, ఆ పైన మరొక కేక్‌ అమర్చాక, క్రీమ్‌ మిశ్రమం మళ్లీ ఒక పొరలా వేసి ఆ పైన మరో కేక్‌ ఉంచాలి ∙చివరగా మొత్తం కేక్‌ను క్రీమ్‌తో కవర్‌ చేయాలి ∙కావలసిన ఆకారంలో కట్‌ చేసి చల్లగా అందించాలి.

గ్రీక్‌ యోగర్ట్‌ కేక్‌  విత్‌ ఆరెంజ్‌ సిరప్‌ 
(పోర్టోకలోపిటా)
కావలసినవి: యోగర్ట్‌ (గడ్డ పెరుగు) – పావు కేజీ; కార్న్‌ ఆయిల్‌ – ఒకటిన్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; ఆరెంజ్‌ జ్యూస్‌ – ఒకటిన్నర కప్పులు; బేకింగ్‌ పౌడర్‌ – 4 టీ స్పూన్లు ; కమలా పండు తొక్కల తురుము (ఆరెంజ్‌ జెస్ట్‌) – ఒక కప్పు; వెనిలా ఎసెన్స్‌ – ఒక టీ స్పూను; ఫైలో డఫ్‌ – అర కేజీ
సిరప్‌ కోసం: నీళ్లు – అర లీటరు; పంచదార – అరకేజీ; కమలాపండు తొక్కల తురుము – తగినంత; దాల్చినచెక్క పొడి – చిటికెడు

తయారీ: ∙ఫైలో డఫ్‌ని ప్యాకెట్‌లో నుంచి బయటకు తీసి, పెద్ద పళ్లెంలో ఉంచి, 20 నిమిషాల పాటు వదిలేస్తే, బాగా ఎండుతుంది ∙బేకింగ్‌ ట్రే మీద కొన్ని పోసి, అవెన్‌లో 100 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర తడి ఆరి పొడిగా అయ్యేవరకు ఉంచాలి ∙అన్నిటినీ అదేవిధంగా ఆరబెట్టాలి ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార, కమలాపండు తొక్కల తురుము, దాల్చిన చెక్క పొడి వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙మంట తగ్గించి, సుమారు పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙ఒక పెద్ద పాత్రలో కార్న్‌ ఆయిల్, పంచదార వేసి బాగా గిలకొట్టాలి ∙ పెరుగు, కమలా రసం, కమలా పండు తురుము, వెనిలా ఎసెన్స్‌ వేసి అన్నీ కలిసేవరకు గిలకొట్టాలి ∙బేకింగ్‌ పౌడర్‌ జతచేసి తేలికగా గిలకొట్టాలి ∙ఫైలో డఫ్‌ షీట్లను చిన్న చిన్న ముక్కలు చేసి, పెరుగు మిశ్రమానికి జత చేయాలి ∙ఎనిమిది అంగుళాల మందం ఉన్న బేకింగ్‌ ట్రేకి ఆయిల్‌ బ్రష్‌ చేసి, ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి ∙180 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర ప్రీహీట్‌ చేసిన అవెన్‌లో ఈ ట్రేలను ఉంచి, సుమారు 45 నిమిషాలు బేక్‌ చేయాలి ∙బయటకు తీశాక, వేడి కేక్‌ మీద చల్లటి ఆరెంజ్‌ సిరప్‌ను నెమ్మదిగా పోయాలి ∙బాగా పీల్చుకునేలా చూసుకోవాలి ∙కేక్‌ చల్లారాక ఫ్రిజ్‌లోఉంచాలి ∙ఈ కేక్‌ను చల్లగా సర్వ్‌ చేయాలి.

వేగన్‌  జ్యూయిష్‌  హనీ కేక్‌ 
(ఇజ్రాయిల్‌)

కావలసినవి: గోధుమ పిండి – రెండున్నర కప్పులు; బేకింగ్‌ పౌడర్‌ – ఒక టేబుల్‌ స్పూను; బేకింగ్‌ సోడా – 2 టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; లవంగాల పొడి – పావు టీ స్పూను; మేపుల్‌ సిరప్‌ – ఒక కప్పు (సూపర్‌ మార్కెట్‌లో రెడీగా దొరుకుతుంది); ఆపిల్‌ సాస్‌ – ఒక కప్పు; సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ – అర కప్పు; వెనిలా ఎసెన్స్‌ – ఒక టీ స్పూను; కిస్‌మిస్‌ – అర కప్పు; బాదం పప్పుల తరుగు – పావు కప్పు

తయారీ: ∙అవెన్‌ను 325 డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేయాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్‌పౌడర్, బేకింగ్‌ సోడా, దాల్చిన చెక్క పొడి, శొంఠి పొడి, లవంగాల పొడి వేసి బాగా కలపాలి ∙వేరొక పాత్రలో మేపుల్‌ సిరప్, ఆపిల్‌ సాస్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, వెనిలా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి ∙ ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి ∙కిస్‌మిస్‌ జత చేసి మరోమారు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి ∙8 అంగుళాల మందం ఉన్న రెండు బేకింగ్‌ ట్రేలకి కొద్దిగా బటర్‌ పూయాలి ∙రెండు భాగాలను రెండు ట్రేలలో సమానంగా ఉంచాలి ∙పైభాగంలో బాదం పప్పుల తరుగు వేసి, ట్రేలను అవెన్‌లో ఉంచి సుమారు 50 నిమిషాల పాటు బేక్‌ చేయాలి ∙మధ్యమధ్యలో పుల్లతో గాని చాకుతో గాని గుచ్చి, కేక్‌ సిద్ధమైందో లేదో సరిచూసుకోవాలి.

క్లాసిక్‌ విక్టోరియా స్పాంజ్‌ కేక్‌ (ఇంగ్లండ్‌)
కావలసినవి: మైదా పిండి – పావు కేజీ; బేకింగ్‌ పౌడర్‌ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్లు – 3 (పెద్దవి); పంచదార పొడి – పావు కేజీ; సాఫ్టెన్డ్‌ బటర్‌ – పావు కేజీలో సగం; మార్గరిన్‌ – 100 గ్రా.; స్ట్రాబెర్రీ జామ్‌ – ఒక జార్‌; హెవీ క్రీమ్‌ – పావు కేజీ

తయారీ: ∙అవెన్‌ను 350 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దగ్గర ప్రీ హీట్‌ చేయాలి ∙ఎనిమిది అంగుళాల లోతు ఉన్న రెండు బేకింగ్‌ పాన్‌లు తీసుకుని, కింది భాగంలో బటర్‌ సమానంగా పూయాలి ∙ఒక పెద్ద పాత్రలోకి మైదా పిండి జల్లించుకోవాలి ∙ఒక గిన్నెలో కోడి గుడ్లు, పంచదార, మైదా పిండి, బేకింగ్‌ పౌడర్, సాఫ్టెనింగ్‌ బటర్, మార్జరిన్‌ వేసి ఎలక్ట్రిక్‌ హ్యాండ్‌ మిక్సర్‌తో అన్నీ కలిసేలా బాగా గిలకొట్టాలి ∙మిశ్రమం చేతిలోకి తీసుకుంటే జారిపోయేలా బాగా మెత్తగా ఉండాలి ∙ఎలక్ట్రిక్‌ హ్యాండ్‌ మిక్సర్‌ లేకపోతే, చెక్క గరిటెతో బాగా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని రెండు బేకింగ్‌ ట్రేలలో సమానంగా పరవాలి ∙పై భాగాన్ని చెక్కగరిటెతో మృదువుగా సమానంగా చేయాలి ∙అవెన్‌లో గ్రిల్‌ మీద ఉంచి సుమారు అర గంట సేపు బేక్‌ చేయాలి ∙మధ్యలో ఒకసారి చూసుకుని, కేక్‌ బాగా గోధుమరంగులోకి మారుతున్నట్లు అనిపిస్తే, కొన్ని డిగ్రీలు తగ్గించాలి ∙బాగా పొంగి, లేత గోధుమ రంగులోకి వస్తే కేక్‌ ఉడికినట్లే ∙అవెన్‌లో నుంచి కేక్‌ను బయటకు తీసి, ఐదు నిమిషాలు చల్లారాక, కేక్‌లను వెనుక వైపుకి తిప్పాలి ∙పూర్తిగా చల్లారాక కేక్‌ను ప్లేట్‌లో ఉంచాలి ∙స్ట్రాబెర్రీ జామ్‌ను మందంగా పరచాలి ∙రెండో కేక్‌ను కూడా ప్లేట్‌లోకి తీసుకుని, పైభాగంలో చిక్కటి క్రీమ్‌ను సమానంగా పరచాలి ∙ క్రీమ్, జామ్‌ ఒక దాని మీద ఒకటి కలిసేలా ఉంచాలి ∙ఐసింగ్‌ సుగర్, స్ట్రాబెర్రీలతో అలంకరించాలి.

ఈ పేరు ఎలా వచ్చింది... క్వీన్‌ విక్టోరియా పేరు మీద ఈ కేక్‌ను విక్టోరియా స్పాంజ్‌ కేక్‌ అని పిలుస్తారు. ఇది ఆవిడకు చాలా ఇష్టమైన కేక్‌. బెడ్‌ఫోర్ట్‌ డచెస్‌ అయిన అన్నా అనే ఆవిడ, మధ్యాహ్నం టీ తాగాక కేక్‌ తినే సంప్రదాయాన్ని విక్టోరియాకు పరిచయం చేశారట. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.  2012లో క్వీన్‌ డైమండ్‌ జూబిలీ సెలబ్రేషన్స్‌ జరిగినప్పుడు క్వీన్‌ ఎలిజబెత్‌ – 2, అలవాటు గా టీ తాగాక, కొద్దిగా కేక్‌ తిన్నారట.

ఫ్రెంచ్‌ చాకొలేట్‌ కేక్‌
కావలసినవి: పంచదార – అర కప్పు; సెమీ స్వీట్‌ చాకొలేట్‌ – 10 ముక్కలు (సుమారు 30 గ్రా.); అన్‌సాల్టెడ్‌ బటర్‌ – ముప్పావు కప్పు; వెనిలా ఎసెన్స్‌ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్లు – 5; జల్లించిన మైదా పిండి – పావు కప్పు; క్రీమ్‌ ఆఫ్‌ టార్టార్‌ – ఒక టిన్‌; ఉప్పు – కొద్దిగా; మెత్తటి పంచదార పొడి – డస్టింగ్‌ కోసం

తయారీ: ∙అవెన్‌ను 325 డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేసుకోవాలి ∙స్ప్రింగ్‌లా ఉండే 9 అంగుళాల మందం ఉన్న కేక్‌ టిన్‌కి బటర్‌ పూయాలి ∙కొద్దిగా పంచదార పొడి చల్లాలి ∙ఎక్కువగా ఉన్న పంచదారపొడిని తీసేయాలి ∙మూడు టేబుల్‌ స్పూన్ల పంచదారను పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో చాకొలేట్, బటర్, మిగిలిన పంచదార వేసి కలిపి, స్టౌ మీద ఉంచి, సన్నటి మంట మీద కొద్దిగా ఉడికించాలి ∙చాకొలేట్, బటర్‌ కరిగి, పంచదార కలిసిపోయేవరకు కలుపుతూ ఉడికించి దింపేయాలి ∙వెనిలా ఎసెన్స్‌ జత చేసి బాగా కలిపి పక్కన ఉంచి, చల్లారనివ్వాలి ∙కోడి గుడ్డు పచ్చ సొన జత చేసి గిలకొట్టాలి ∙మైదా పిండి జత చేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో కోడి గుడ్డు తెల్ల సొన వేసి బాగా నురగలా వచ్చేవరకు గిలకొట్టాలి ∙క్రీమ్‌ ఆఫ్‌ టార్టార్, ఉప్పు జత చే సి, బాగా దగ్గరపడే వరకు కలపాలి. పక్కన ఉంచుకున్న పంచదార జత చేసి బాగా కలిసేవరకు గిలకొట్టాలి ∙ఈ మిశ్రమంలో నుంచి మూడో వంతు మిశ్రమాన్ని చాకొలేట్‌ మిశ్రమానికి జత చేశాక, మొత్తం మిశ్రమాన్ని తెల్ల సొన మిశ్రమంలో వేసి కలపాలి ∙బటర్‌ పూసుకున్న ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, మిశ్రమాన్ని జాగ్రత్తగా బబుల్స్‌ లేకుండా సమానంగా పరిచి అవెన్‌లో ఉంచాలి ∙సుమారు గంట సేపు బేక్‌ చేయాలి ∙అర గంట తరవాత ఒకసారి చెక్‌ చేసుకోవాలి ∙ఒకవేళ కేక్‌ సమానంగా పొంగినట్లు లేకపోతే, అరగంట తరవాత కేక్‌ను తిరగేయాలి ∙కేక్‌ పగిలిపోయినట్లుగా కాని, బాగా గోధుమరంగులోకి మారుతున్నట్లు గాని అనిపిస్తే కేక్‌ మీద ఒక సిల్వర్‌ ఫాయిల్‌ ఉంచాలి ∙కేక్‌ తయారైన తరవాత వైర్‌ కూలింగ్‌ ర్యాక్‌ మీదకు మార్చి, పూర్తిగా చల్లార్చాక, బేస్‌ తీసేయాలి (చల్లారక ముందే తీయకూడదు). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement