హోమియో కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- అమీర్‌బాషా, గుంటూరు
మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకంతో మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్‌లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అంటే... మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం.
విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్‌సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది.
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి?
- మనోహర్, వరంగల్
డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిష్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్లు రక్తం పెరగడానికి మందులు వాడాలి.
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. ఇలా మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? వివరంగా చెప్పండి.
- అక్బర్‌ఖాన్, కోదాడ
నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12-14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి.
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా కూతురు కెరియర్ ఓరియెంటెడ్. ఈ కారణం వల్లనే పెళ్లి కూడా చాలా ఆలస్యంగా... అంటే 35వ ఏట జరిగింది. మరో నాలుగైదేళ్ల పాటు పిల్లలు వద్దనుకుంటోంది. తన వయసు రీత్యా మరో నాలుగైదేళ్లు ఆగడం సరైనదేనంటారా? తగిన సలహా ఇవ్వండి.
- సుగుణ, హైదరాబాద్
వయసు పెరుగుతున్న కొద్దీ సంతానం కలిగే అవకాశాలు తగ్గుతుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో అండం విడుదలయ్యే అవకాశాలు తగ్గుతుంటాయి. అండం నాణ్యత కూడా తగ్గుతుంది. దాదాపు ముప్పయయిదేళ్ల వయసు తర్వాత నుంచి సంతానం పొందే అవకాశాలు క్రమంగా తగ్గుతూ పోతుంటాయి. మీ కుటుంబంలో త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటే, మీరు మీ అమ్మాయికి ఒవేరియన్ రిజర్వ్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఫెర్టిలిటీ చికిత్సలు చేయిస్తున్నా... సంతానవతి అయ్యేందుకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఇక ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు, ట్యూబ్స్‌లో వచ్చే వ్యాధులు వయసుతో పాటు పెరుగుతాయి. ఫలితంగా సంతానవకాశాలు సన్నగిల్లుతాయి.
వయసు పెరుగుతున్న కొద్దీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు వచ్చి, గర్భధారణలో వచ్చే కాంప్లికేషన్స్ పెరుగుతాయి. దాంతోపాటు గర్భస్రావాలు (అబార్షన్స్) అయ్యే పర్సంటేజీ (శాతం) పెరుగుతుంది. అంటే... చిన్నవయసులో గర్భస్రావాలు అయ్యే అవకాశాలు 35 కంటే చిన్నవయసు ఉన్నవారిలో 13 శాతం ఉంటే... 45 ఏళ్ల వయసు పైబడిన వాళ్లలో అది 54 శాతానికి పెరగవచ్చు.
వయసు పెరిగిన మహిళల్లో క్రోమోజోములలో మార్పులు వచ్చి, బిడ్డలో పుట్టుకతోనే వచ్చే సమస్యలు వచ్చే రిస్క్ కూడా ప్రమాదమూ పెరుగుతుంది. అందుకే కెరియర్‌కూ, సంతానాన్ని పొందడం అంశంలో సమతౌల్యం పాటించేలా మీ అమ్మాయి నిపుణుల నుంచి కౌన్సెలింగ్ పొందేలా చూడండి. అయితే ఈ అంశంలో అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రపరంగా సంతాన సాఫల్యాల కోసం ఉన్న సాంకేతికత వల్ల కాస్త పెద్దవయసు మహిళలకూ గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
డయాలసిస్ చేయిస్తుంటే... ఒంటిపై దురద ఎందుకు?
Published Wed, Oct 14 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM
Advertisement
Advertisement