
♦ ఇండియా, అమెరికాల మధ్య ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు వేస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌ను ముంబై తీసుకొచ్చి వీధులన్నీ తిప్పి చూపించి, చుట్టాలిళ్లలో విందు భోజనాలు చేయించాక, ఇక్కడి నుంచీ మళ్లీ ఆ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యు.ఎస్. వెళ్లిపోయి అక్కడ జూలై 4న అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని అక్కడ మళ్లీ నిక్ జోనాస్ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకున్నారు. అయితే ఇప్పటిక్కూడా ప్రియాంక గానీ, నిక్ గానీ తమ ప్రేమ గురించి గానీ, పెళ్లి గురించి గానీ ఎక్కడా మనసు విప్పి మాట్లాడకపోవడం చూస్తుంటే.. వాళ్లిద్దరైనా ఒకరిముందొకరు మనసు విప్పుకున్నారా అనే సందేహాలు వస్తున్నాయి
♦ ప్రకృతి అందాలు, పర్వతాల నడుమ మనాలీలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాక కంగనా రనౌత్ ఇంత వరకు మళ్లీ ఆ ఇంట్లోకి వెళ్లలేదు! ‘మెంటల్ హై క్యా’ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్న కంగనా, ఆ షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చాకైనా తన డ్రీమ్ హౌస్‌లో సేద తీరే తీరిక లేకుండా.. ఆమె కోసం కబ్బాడీ థీమ్‌తో అశ్వనీ అయ్యర్ తివారీ నిర్మిస్తున్న సినిమా సిద్ధంగా ఉంది!
♦ ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే మరణానికి చేరువైన భారత సంతతి హంగేరీ చిత్రకారిణి అమృతా షేర్‌గిల్ జీవిత కథను సినిమాగా తీయాలనుకుంటున్నట్లు బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రకటించారు. ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత ప్రతిభాశీలురలో ఒకరైన అమృత తన పందొమ్మిదవ యేట తెచ్చిన చిత్రలేఖనాల సంకలనం ‘యంగ్ గర్ల్స్’ (1932).. చరిత్రలో ఆమెను చిరస్మరణీయురాలిని చేసిందనీ, అందుకే ఆమె బయోపిక్‌ను నిర్మించబోతున్నానని నిర్మాత కూడా అయిన దియా వెల్లడించారు
♦ పవన్ కల్యాణ్ అభిమానుల నుండి తన ట్విట్టర్‌కు వస్తున్న అసభ్యకరమైన కామెంట్‌లను తట్టుకోలేక రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్‌ను క్లోజ్ చేసేశారు. రేణు దేశాయ్ రెండో పెళ్లి ఖరారు అయిన విషయం తెలుసుకున్న క్షణం నుంచీ ఆమె మొదటి భర్త పవన్ కల్యాణ్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పెడుతున్న వేధింపుల పోస్టులకు తాళలేక ట్విట్టర్ నుంచి బయటికి వచ్చేసిన రేణు.. ఎప్పుడైనా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వీలుగా ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రం ఉంచుకున్నారు
♦ ఇరవై ఐదేళ్ల అమెరికన్ గాయని అరియానా గ్రాండే తను వివాహమాడబోతున్న ఇరవై నాలుగేళ్ల అమెరికన్ నటుడు, కామెడియన్ పీట్ డేవిడ్‌సన్ తనపై విసిరిన క్రూరమైన జోక్‌కు అభ్యంతరం తెలియజేయడంతో పెళ్లికి ముందే వీరి ప్రేమ పెటాకులు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. గత ఏడాది మే 22న యు.కె.లోని మాంచెస్టర్‌లో జరిగిన ఆత్మాహుతి ఉగ్రదాడి కారణంగా ఇరవై మూడు మంది చనిపోవడంతో, ఆ రోజు అక్కడ కచేరీ ఇస్తున్న అరియానా పేరు అందరికీ తెలిసిందని పీట్ జోక్ చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు
♦ ఆగస్టు 18 నుంచి ఇండోనేషియాలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్‌లో భారతదేశం నుండి పాల్గొంటున్న 18 మంది సభ్యులు గల మహిళా హాకీ టీమ్‌కు రాణీ రాంపాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. గత ఏడాది తొమ్మిదవ ఉమెన్స్ ఏషియా కప్‌ను గెలిచిన రాణీకి, గోల్ కీపర్‌గా అనుభవం ఉన్న సవిత వైస్ కెప్టెన్‌గా నిర్ణయించారు
♦ ఇటీవల విడుదలైన అపర్ణా జైన్ పుస్తకం ‘లైక్ ఎ గర్ల్ : రియల్ స్టోరీస్ ఫర్ టఫ్ కిడ్స్’.. విశేష ఆదరణ పొందుతోంది. స్ఫూర్తిప్రదాతలైన యాభై మంది భారతీయ మహిళల జీవిత చరిత్రలు ఉన్న ఈ పుస్తకం.. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటి లైబ్రరీలోనూ తప్పక ఉండాలని ప్రచురణకర్తలు అంటున్నారు
♦ తెలుగులో రంగస్థలం, మహానటి, తమిళంలో ఇరుంబు తెరై (ఇనుపతెర) చిత్రాలతో ఈ ఏడాది హిట్స్ సాధించిన సమంతా.. ఇప్పటికే ఒప్పుకుని ఉన్న చిత్రాలన్నిటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి త్వరత్వరగా ముగించుకుని నటనకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారని వినికిడి! 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత.. ‘తల్లయ్యాక సినిమాలు మానేస్తాను’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారని, 2019లో రిలాక్స్ కావాలని అనుకుంటున్నారు కనుక ఇక ఆమె తల్లి అయ్యే ప్రయత్నాలు చెయ్యవచ్చుననీ మీడియా ఊహిస్తోంది