
హైదరాబాద్ మెట్రో రైళ్లలో స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చునే మగాళ్ల బెడదను వదలించుకోడానికి మహిళా ప్రయాణికులు సోషల్ మీడియాలో సమాలోచనలు జరుపుతున్నారు. స్త్రీలు కళ్లెదుట నిలబడి ఉన్నప్పటికీ స్త్రీల సీట్లలో భీష్మించుకుని కూర్చొనే పురుషులపై చర్య తీసుకోవడం జరుగుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో స్త్రీలే ఇక తమ ‘హక్కు’ను పొందడం కోసం ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో.. మార్గాలను అన్వేషిస్తున్నారు.
మొద్దుమొహాలైన మగాళ్లు వెంటనే గ్రహించేలా ఉండడం కోసం ‘లేడీస్ కోచ్’కు, లేడీస్ సీట్‌లకు గులాబీ రంగును వేయించడం ఒక మార్గం అని ఒకరు సూచించగా.. ఆ పనేదో ఎన్నికలు అయ్యాక చేస్తే బాగుంటుందనీ, లేకుంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి లబ్ది పొందుతుందని ఒకరు అభిప్రాయపడ్డారు. మరొకరు.. ఉన్న మూడు కోచ్‌లలో ఒకటి స్త్రీలకు, ఒకటి పురుషులకు, మిగతా కోచ్‌ను ఉమ్మడిగా స్త్రీ, పురుషులకు కేటాయించడం ఫలితాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్త్రీల సీట్‌లలో కూర్చునే మగాళ్లకు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 500 రూ. జరిమానా విధిస్తోంది. అయినప్పటికీ మగాళ్లలో మార్పు రాకపోవడంతో చివరికి మహిళా ప్రయాణికులే మార్గాన్వేషణలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment