
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ప్రపంచ మహిళల ట్వంటీ–20 పోటీలలో సెంచరీ చేసిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. దక్షిణ అమెరికాలోని ఉత్తర అట్లాంటిక్ తీరంలో ఉన్న గుయానాలో నవంబర్ 9న న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కౌర్ ఈ అత్యద్భుతమైన విజయం సాధించారు. నవంబర్ 9న మొదలైన ఈ ప్రపంచ మహిళల ట్వంటీ 20 మ్యాచ్‌లు నవంబర్ 24న యాంటీగువాలో ముగుస్తాయి. 22న సెమీ ఫైనల్స్.
సెమీ ఫైనల్స్ చేరడానికి ముందు వరకు భారత మహిళల జట్టు నవంబర్ 11న పాకిస్తాన్‌తో, నవంబర్ 15న ఐర్లాండ్‌తో, నవంబర్ 17న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ కూడా గుయానాలోనే జరుగుతాయి. ట్వంటీ–20 ఆడుతున్న జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు.. స్మృతి మంథన, మిథాలీరాజ్, జమీమా రోడ్రిగ్స్, వేదాకృష్ణమూర్తి, దీప్తీ శర్మ, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనూజా పాటిల్, ఏక్తా భిస్త్, దయాళన్ హేమలత, మోన్సీ జోషీ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి ఉన్నారు.
ఈ మంగళ, శుక్రవారాలు శబరిమలకు సంబంధించి అత్యంత కీలకమైన రోజులు కానున్నాయి. నవంబర్ 16న శబరిమల ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇక అప్పట్నుంచీ 41 రోజుల పాటు నిరవధికంగా ఆలయ పూజలు జరుగుతాయి. నవంబర్ 13న (రేపు).. స్త్రీలకు ఆలయ ప్రవేశ హక్కును కల్పిస్తూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పన్నెండుకు పైగా వాదనలపై సుప్రీంకోర్టు సమీక్ష జరుపుతుంది.
వాదోపవాదాలు ఎలా ఉన్నా.. ఈ ‘మండల’ కాలంలో శబరిమలను సందర్శించుకోవడానికి ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 560 మందికిపైగా మహిళలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరోవైపు, కొచ్చి, తిరువనంతపురం నుంచి శబరిమల వస్తున్న మహిళా భక్తులను భద్రత కారణాల రీత్యా హెలికాప్టర్‌లో తరలించడంలోని సాధ్యాసాధ్యాలపై కేరళ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.
భారతదేశంలో వివాహమైన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు.. భర్త పెట్టే హింసకు గురవుతున్నారని వడోదరలోని ‘సహజ్’ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడయింది. యు.కె.లోని ‘ఈక్వల్ మెజర్స్ 2030’ అనే సంస్థతో కలిసి ‘సహజ్’ నిర్వహించిన ఈ సర్వేలో.. ‘ఒకవైపు ఆర్థికంగా పురోగమిస్తున్న ఇండియా.. లైంగిక వివక్ష విషయంలో మాత్రం తిరోగమిస్తోందనీ.. స్త్రీల సంక్షేమం, ఆరోగ్యం, స్త్రీల భద్రత, రక్షణ అనేవి ఏమాత్రం ప్రాముఖ్యంలేని అంశాలు అయిపోయాయని’ సర్వే నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment