దారి మళ్లింపు | Women counter Arvind Kejriwal decision to make Metro bus rides free | Sakshi
Sakshi News home page

దారి మళ్లింపు

Published Thu, Jun 6 2019 2:28 AM | Last Updated on Thu, Jun 6 2019 2:28 AM

Women counter Arvind Kejriwal decision to make Metro bus rides free - Sakshi

మహిళలు నిర్భయంగా బయటికి వెళ్లిరాలేకపోతున్నారంటే భద్రతా యంత్రాంగంలో లోపం ఉందనే కానీ.. చీకటి వెలుగులలో, రాకపోకల రహదారులలో భద్రతలేని విపరీతాలు ఉన్నాయని కాదు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మహిళల భద్రత కోసం ఉచిత ప్రయాణం అనే ‘దారి మళ్లింపు’ను ఒక పరిష్కారంగా ఎంచుకున్నారు!

మాధవ్‌ శింగరాజు
విపత్తులు, విలయాలు వచ్చి.. పట్టాలు దెబ్బతిన్నప్పుడు రైళ్ల రాకపోకల్ని దారి మళ్లిస్తుంటారు. విపత్తులను, విలయాలను ప్రభుత్వాలు దారి మళ్లించలేవు కాబట్టి, ప్రజల ప్రయాణాలనే సురక్షిత మార్గాలలోకి మళ్లిస్తుంటాయి. అది ప్రభుత్వాల బాధ్యత కూడా. అమ్మాయి స్కూలుకు వెళుతోంది. లేదా ఉద్యోగానికి వెళ్లొస్తోంది. వచ్చే పోయే దారిలో లైంగిక వేధింపులు ఎదురౌతున్నాయి. ఆ వేధించేవాళ్ల నుంచి తప్పించడానికి చక్కగా చదువులకు, ఉద్యోగాలకు వెళ్లొచ్చే పిల్లల్ని దారి మళ్లించడం మాత్రం ప్రభుత్వాలు చేయదగిన పని కాదు. వేధించేవాళ్లేమీ మానవులు నిరోధించలేని విపత్తులు, విలయాలు కాదు.. బిక్కుబిక్కుమంటూ వేరే రూటులో స్కూలు బ్యాగు మోసుకుంటూ వెళ్లిరావడానికి, క్యాబ్‌లలో దొంగమొహాలు ఉంటున్నాయని మెట్రోల్లో ఆఫీసుకు ప్రయాణించడానికి! అమ్మాయిల్ని వేధించేవారికి చట్టబద్ధంగా నాలుగు తగిలించి ‘సెట్రైట్‌’ చేసే యంత్రాంగం ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ ఉంది.

అయినా గానీ బాలికలు స్కూళ్లకు, మహిళలు ఉద్యోగాలకు నిర్భయంగా వెళ్లిరాలేకపోతున్నారంటే భద్రతా యంత్రాంగంలో లోపం ఉందనే కానీ.. చీకటి వెలుగులలో, రాకపోకల రహదారులలో భద్రతలేని విపరీతాలు ఉన్నాయని కాదు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మహిళల భద్రత కోసం ‘దారి మళ్లింపు’నే ఒక పరిష్కారంగా ఎంచుకున్నారు! చీకటి పడ్డాక క్యాబ్‌లలో రావడం సురక్షితం కాదు కాబట్టి, పట్టపగలైనా ఒకరిద్దరి మధ్య ప్రయాణించడం సేఫ్‌ కాదు కాబట్టి.. ఎప్పుడూ రద్దీగా ఉండి, జనం బాగా మసులుతుండే మెట్రో రైళ్లను, కార్పొరేషన్‌ బస్సులను తమ డే–టు–డే జర్నీకి ఎంచుకునేలా మహిళలందరికీ ఆయన ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నారు! ఆదేశాలు అమల్లోకి వచ్చిన వెంటనే ఢిల్లీ మహిళలు మెట్రో రైళ్లలో, కార్పొరేషన్‌ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్‌ లేకుండా ప్రయాణించవచ్చు.

ఉచిత ప్రయాణం వల్ల మహిళలపై వేధింపులు తగ్గుతాయా అనే ప్రశ్న కనుక మీరు వేయదలిస్తే కాస్త ఆగండి. అది పూర్తిగా సంబంధం లేని ప్రశ్న. ఉచిత ప్రయాణానికి, సురక్షిత ప్రయాణానికి సంబంధం లేదు కాబట్టి! ఉచిత ప్రయాణమేమీ మహిళల ఒంటి మీది కరెంట్‌ జాకెట్‌ కాదు.. ఎవరైనా చెయ్యేస్తే చెయ్యి వేసిన వ్యక్తి షాక్‌ కొట్టి గిలగిల కొట్టుకుంటూ కింద పడిపోడానికి! మరి ఏడాదికి 700 కోట్ల రూపాయల వ్యయం అయ్యే ఈ ‘స్కీమ్‌’ వల్ల ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు. మహిళల్ని వేధింపుల నుంచి ‘దారి మళ్లించడం’.. అంతే. లేదా ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం. రోజుకు లక్ష మంది మహిళలకు ఈ ఏడొందల కోట్ల రూపాయల వల్ల రక్షణ లభిస్తుందని కేజ్రీవాల్‌ అంచనా. అంటే.. రోజూ క్యాబ్‌లలో, ప్రైవేటు వాహనాల్లో వెళ్లొస్తుండే మహిళల్లో లక్షమంది ‘ఉచితం’లోకి మళ్లుతారని.

‘పొలోమంటూ.. ఉన్నవాళ్లు, లేనివాళ్లు ఉచిత ప్రయాణానికి ఎగబడితే మెట్రో రైళ్లు కిక్కిరిసి పోతాయి కదా’ అనే మాటకు ఆయన వేసిన లక్ష లెక్క అది!  క్యాబ్‌ల నుంచి కార్పొరేషన్‌ బస్సులకు షిఫ్ట్‌ అయ్యే మహిళల సంఖ్య ఎంతో కూడా ఆయన టీమ్‌ లెక్కేసే పనిలో ఉంది. వారం రోజుల్లో ఆ డేటా అంతా ఇవ్వాలని కేజ్రీవాల్‌ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు! వచ్చే రెండు మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు కల్పించబోతున్న ఈ ఉచిత ప్రయాణ సదుపాయం వల్ల ఢిల్లీలో జెండర్‌ క్రైమ్‌ రేట్‌ బాగా తగ్గిపోతుందని ఢిల్లీ మొత్తం మీద కేజ్రీవాల్‌ ఒక్కరే బలంగా నమ్ముతున్నారు. ఢిల్లీ ప్రస్తుత జనాభా 2 కోట్ల 60 లక్షలు. ఇందులో సగం మంది మహిళలే అన్నది సాధారణమైన విషయం అయితే, ఈ సగంమందిలో లక్షకు 300 మంది ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారన్నది అసాధారణమైన సంగతి.

యూ.కె.లో ఈ లెక్క 80గా, ప్రపంచం మొత్తం మీద సగటున 40గా ఉంది. ఢిల్లీ రైళ్లలో, బస్సులలో రోజుకు 60 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వాళ్లలో మహిళలు ముప్పై లక్షల మంది ఉంటారనుకున్నా.. కేజ్రీవాల్‌ ఉచిత ప్రయాణం కల్పించబోతున్న రక్షణ ఈ ముప్పై లక్షలమందికి కాదు. క్యాబ్‌లు, రిక్షాల నుంచి రైళ్లకు మళ్లే రెండు మూడు లక్షలమందికి (బస్సులను కూడా కలుపుకుని). ఈ రెండు మూడు లక్షల మందిని కాపాడే బాధ్యతలను ఆయన సీసీ కెమెరాలకు అప్పగిస్తే ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసే పని ఉండదు. మిగతా డబ్బును సమృద్ధిగా మహిళల సంక్షేమానికి, సంరక్షణకు ఉపయోగించవచ్చు.

అప్పుడు లక్షకు 300గా ఉన్న క్రైమ్‌ రేటు కూడా తగ్గుతుంది. అయితే ఈ తెలివి కేజ్రీవాల్‌కు లేక కాదు. ‘నిర్భయ’ ఘటన జరగడానికి ఇరవై రోజుల ముందు ఆవిర్భవించి, నిర్భయ వంటి ఘటనలు మళ్లీ జరగక్కుండా ఢిల్లీ మహిళలకు భద్రత కల్పించడమే తమ ధ్యేయమన్న హామీతో నాలుగేళ్ల క్రితం అఖండ విజయం సాధించిన కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీకి మళ్లీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి. నిజానికి ఈ మాటను మనం ఇంకోలా చెప్పుకోవాలి.. ‘రోజులు దగ్గర పడ్డాయి’ అని! ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని ఈ  తరుణంలో కేజ్రీవాల్‌ తిరిగి మునుపటి హామీతోనే మోదీని ఎదుర్కోవడం తప్ప వేరే దారి లేని పరిస్థితిని ఈ నాలుగేళ్లలో ఢిల్లీలో మహిళలపై ఏమాత్రం తగ్గుముఖం పట్టని నేరాలు తెచ్చిపెట్టాయి.

ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు పడే పాట్లు ఎలాంటివైనా.. నగరాల్లో, పట్టణాల్లో ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి చేరే వరకు పడే పాట్లన్నిటికీ ప్రధాన కారణం భద్రత లేకపోవడం అనుకుంటాం కానీ,  లేకపోవడం కాదు. ‘కల్పించలేకపోవడం’. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో బీజేపీనే విజయం సాధించింది! ఆ ఏడుగురు ఎంపీల గెలుపులో కీలక పాత్ర పోషించినది కూడా.. దైనందిన జీవితంలో భద్రతను కోరుకున్న మహిళా ఓటర్లే. మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా మసలేంత భద్రతను కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ బాగా ప్రభావం చూపింది.

మహిళలకు అంతకుమించిన హామీని ఏదైనా ఇస్తే తప్ప కేజ్రీవాల్‌ మళ్లీ అధికారంలోకి రావడం కష్టం. అందుకే ఆయన ఈ ఉచిత ప్రయాణం వైపు మళ్లినట్లున్నారు. అనుదిన జీవన పోరాటంలో భద్రత తర్వాతే మహిళకు ఏదైనా. ‘ఏమమ్మా.. నీ భద్రత కోసం పెద్ద ప్రాజెక్టును తలకెత్తుకున్నాం. నీ వంతుగా పదో, ఇరవయ్యో ఇవ్వు’ అని ప్రభుత్వమే వచ్చి అడిగినా.. సంతోషంగా పర్సులోంచి ఇంకో పది ఎక్కువే తీసి ఇచ్చే మహిళలకు.. భద్రత పేరుతో డబ్బులు మిగిల్చినా అది వాళ్లకు ఏం సంతోషం.. ఉచిత ప్రయాణానికీ, వేధింపులు తగ్గడానికి ఏం సంబంధం లేదని క్లియర్‌గా తెలిసిపోతుంటే?! ఒంటిపై చెయ్యేసినవాడు తప్పించుకుని పోవడానికి వీల్లేకుండా చెయ్యాలి కానీ, ఒంటిపై చెయ్యేస్తున్నవాడి నుంచి తప్పించడానికికైతే ప్రభుత్వాలు ఎందుకు?!    ∙

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement