ఐశ్వర్యా పిళ్లై
ఐశ్వర్య చూపుకు బ్రేక్ పడింది కానీ, ఆమె కలలకు బ్రేక్ పడలేదు. కళ్లున్నప్పుడు లోకాన్ని చూశాను కాబట్టి కళ్లు లేకున్నా ఆ లోకాన్ని చిత్రీకరించగలను అనుకున్నారు ఐశ్వర్య.
కళ్లు అందరికీ ఒకేలా ఉంటాయి. చూడ్డంలోనే భిన్నత్వం ఉంటుంది. పైపైన చూసేవాళ్లుంటారు. లోతుగా చూసేవాళ్లుంటారు. ఫిల్మ్ మేకింగ్‌కైతే లోతుగా చూసి, తేలిగ్గా చెప్పగలిగే కనెక్టివిటీ ఉండాలి.. అంతర్నేత్రానికీ, బహిర్నేత్రానికీ! తేలిగ్గా చెప్పడం అంటే గుండెకు హత్తుకునేలా చెప్పడం. గాఢత ఉంటుంది కానీ, గర్భితంగా ఉండదు! అలాగన్నమాట. సబ్జెక్ట్ ఎంత టఫ్ అయినా ఈజీగా నరాల్లోకి ఇంకిపోయేలా షూట్ చెయ్యాలంటే.. చూసే చూపులో ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఐశ్వర్యా పిళ్లైకి ఉంది. కానీ.. కళ్లే.. లేవు! అవును. ఈ ఫిల్మ్ మేకర్‌కు రెండు కళ్లూ లేవు. కానీ.. గొప్ప చూపు ఉంది! అందుకే ఈ ఏడాది ‘హోల్మన్’ అవార్డుకు ఆమెకు ఎంట్రీ లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ అవార్డుకు ఇండియా నుంచి వెళ్లిన ఒకే ఒక్క ఎంట్రీ ఐశ్వర్యదే. విజేతకు 25 వేల డాలర్ల నగదు బహుమతి లభిస్తుంది. పదహారు లక్షలకు పైగా అమౌంట్! అదొక్కటే కాదు, విజేత కెరీర్‌కు అవసరమైన సహకారం కూడా లభిస్తుంది. అంతకన్నా ముందు ఐశ్వర్యకు మన సహకారం ఉండాలి. మార్చి 7 వరకు జరిగే ఆన్‌లైన్‌లో ఐశ్వర్యకు మనం ఓటెయ్యాలి. The Blind Filmmaker holman అని యూట్యూబ్‌లో కొడితే ఒకటిన్నర నిమిషాల వీడియో వస్తుంది. అది చూస్తే ఐశ్వర్య ‘లుక్’ ఎంత విలక్షణమైనదో తెలుస్తుంది.
చూపుంటేనే కదా ఫిల్మ్ డైరెక్షన్. కానీ ఐశ్వర్య చేస్తున్నారు కదా.. రెండు కళ్లూ లేకుండా! ఎలా? అనంతమైన అంతర్‌దృష్టి! హైదరాబాద్‌లోని ‘ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్’లో పునరావాస సలహాదారుగా (రిహ్యాబిలిటేషన్ కౌన్సెలర్)గా పని చేస్తున్నారు ఐశ్వర్య. ఫిల్మ్ మేకింగ్ ఆమె కల. అందుకే మాస్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. విషాదం ఏంటంటే.. థర్డ్ ఇయర్‌లో ఆమె చూపు పోయింది! అయితే ఆమె చూపుకు బ్రేక్ పడింది కానీ, కలలకు బ్రేక్ పడలేదు. కళ్లున్నప్పుడు లోకాన్ని చూశాను కాబట్టి కళ్లు లేకున్నా ఆ లోకాన్ని చిత్రీకరించగలను అనుకున్నారు ఐశ్వర్య. స్క్రిప్టింగ్.. పోస్ట్ ప్రొడక్షన్.. డైరెక్షన్.. అన్నిటి దగ్గరా తనే కూర్చున్నారు. ఆ పనంతా ఆమె తన టీమ్‌తో కలిసి చేశారు. ఆ ‘ఏవీ’ని ఐశ్వర్య సన్నిహితులు ‘హోల్మన్’ అవార్డుకు పంపారు. అక్కడ విన్ అయితే ఫిల్మ్ మేకింగ్‌లో ‘శిక్షణ’ను ప్రారంభించాలని ఆమె ఆకాంక్ష. ఇక ఆమె అంతిమలక్ష్యం.. చూపులేనివారి నైపుణ్యాలతో సమాజానికి దారి చూపించే ఓ మంచి చిత్రాన్ని తియ్యడం.
Comments
Please login to add a commentAdd a comment