స్త్రీలోక సంచారం | women empowerment :Mother and Child Care | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Fri, Jul 13 2018 12:07 AM | Last Updated on Fri, Jul 13 2018 12:07 AM

women empowerment :Mother and Child Care - Sakshi

తెలంగాణలోని సిద్దిపేటలో ‘మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌’ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు అరుణా నాయుడు, తన జూనియర్‌ డాక్టర్‌ సెలవులో ఉండటంతో తనొక్కరే ముగ్గురు నర్సుల సహాయం తీసుకుని  24 గంటల వ్యవధిలో 33 మందికి సురక్షితంగా కాన్పులు జరిపి 17 మంది ఆడ శిశువులను, 16 మంది మగ శిశువులను తల్లుల ఒడికి చేర్చి వైద్యవృత్తికి వన్నె తెచ్చారు. జూలై 9 అర్ధరాత్రి మొదలై జూలై 10 అర్ధరాత్రి వరకు ఏకబిగిన సాగిన కాన్పులలో మొత్తం 66 మందీ (తల్లీబిడ్డలు కలిపి) ఆరోగ్యంగా ఉండటంతో ప్రసూతి విభాగం కళకళలాడింది  వెయిట్‌ లాస్‌ సర్జరీ చేయించుకుంటే తేలిగ్గా నడిచేందుకు వీలవుతుందనీ, థైరాయిడ్‌ వంటి సమస్యలను నివారించవచ్చునని సూచించినప్పటికీ.. డైటింగ్‌ ద్వారా మాత్రమే బరువు తగ్గడానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత మొగ్గుచూపారని.. జయ మృతికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిటీ ఎదుట ప్రముఖ డయాబెటాలజిస్ట్‌  జయశ్రీ గోపాల్‌ సాక్ష్యం ఇచ్చారు. 2016 సెప్టెంబర్‌ 22న జయలలిత ఆసుపత్రిలో అడ్మిట్‌ కావడానికి దారితీసిన పరిస్థితులపైన, డిసెంబర్‌ 5న ఆమె మరణించినట్లుగా ప్రకటన వెలువడే వరకు ఆసుపత్రిలో ఆమెకు అందిన వైద్య చికిత్సలపైన ఈ ఏకసభ్య కమిటీ విచారణ జరుపుతోంది 

ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్‌’లో గత ఏడాది జూన్‌ 4న జరిగిన మైనర్‌ బాలిక రేప్‌ కేసులో మూడు నెలల విచారణ అనంతరం బి.జె.పి. బంగార్‌మావ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగర్‌ మీద, అతడికి సహకరించిన శశీ సింగ్‌ అనే మహిళ మీద ‘పోక్సో’ చట్టం కింద సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. పని ఇప్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే ఇంటి లోపలికి ఆ బాలికను పంపించి, తను బయట వేచి ఉండటం ద్వారా అత్యాచారానికి సహకరించినందుకు శశిపైన, అత్యాచారానికి పాల్పడినందుకు ఎమ్మెల్యే పైన పోక్సో (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌’) చట్టంలోని 3, 4 సెక్షన్‌ల కింద సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.

హిందువుల ఇంట్లో పెరిగిన షబ్నమ్‌ షేక్‌ అనే 20 ఏళ్ల యువతి తన వివాహ వేడుకను గణేశ్‌ పూజతో ప్రారంభించి, ముస్లిం సంప్రదాయంలో నిఖా జరిపించుకుని, తనను పెంచిన తండ్రితో కన్యాదానం ఇప్పించుకోవడం మత సామరస్యానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది. గుజరాత్‌లోని వెరవెల్‌ ప్రాంతంలో ఉంటున్న షబ్నమ్‌కు ఐదేళ్ల వయసులో తల్లి చనిపోగా, ట్రక్కు డ్రైవర్‌ అయిన ఆమె తండ్రి ఆమెను తన హైందవ స్నేహితుడి ఇంట్లో వదిలి వెళ్లిపోయిన అనంతరం పదిహేనేళ్ల తర్వాత ఆ స్నేహితుడే ముస్లిం పెద్దల సహకారంతో  షబ్నమ్‌కు అబ్బాస్‌ అనే వరుడిని వెదికి తెచ్చి, ఆమె ఇష్ట ప్రకారం రెండు వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిపించాడు.

 రాజస్తాన్‌లోని బుండీ జిల్లా, హరిపురా గ్రామంలో ఒకటో తరగతి చదువుతున్న ఐదేళ్ల బాలిక తన పాఠశాల ప్రాంగణంలో వరుణపక్షి (రెడ్‌ వాటిల్డ్‌ లాప్‌వింగ్‌) పెట్టిన గుడ్లను.. చూసుకోకుండా కాలితో తొక్కినందుకు పరిహారంగా గ్రామ పెద్దలు ఆ బాలిక 11 రోజుల పాటు ఇంటిలోపలికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు! వాన రాకడ సందేశాన్ని తెచ్చే వరుణపక్షి గుడ్లను చిదిమేసినందుకు పాప పరిహారంగా, ప్రాయశ్చిత్తంగా వారు ఈ శిక్ష విధించడంతో ఆ బాలిక ఈ నెల 3 వ తేదీ నుంచి స్కూలుకు వెళ్లి వస్తున్నప్పటికీ, ఇంటి బయటే ఒక నులక మంచంపై ఉంటోంది ::: రష్యాలో ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీలు మొదలయ్యాక ఇప్పటి వరకు 300 వరకు మహిళల్ని వేధించిన కేసులు నమోదు అయ్యాయని ‘ఫుట్‌బాల్‌ అగైనెస్ట్‌ రేసిజం ఇన్‌ యూరప్‌’ (ఫేర్‌) హెడ్డు పియారా పోవార్‌ వెల్లడించారు. ఇవన్నీ కూడా లైంగిక వివక్షతో ఫుట్‌బాల్‌ అభిమానులు వీధులలో చెలరేగి పాల్పడినవేనని చెబుతూ, స్థానిక రష్యన్‌ మహిళలు కూడా విదేశీ పురుషుల లైంగిక వేధింపులకు గురైన  ఘటనలూ చోటు చేసుకున్నాయని పోవార్‌ తెలిపారు.

వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదన్న బ్రిటిష్‌ రాజప్రాసాద సంప్రదాయాలకు భిన్నంగా ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ ఐర్లండ్‌లోని ప్రముఖులతో అనేక విషయాలను చర్చించడం, ఆ వివరాలను ఆ ప్రముఖులు ట్విట్టర్‌లో పెట్టడం.. బ్రిటన్‌లో రాజకీయ కల్లోలానికి కారణం అయ్యాయి. పెళ్లయ్యాక తొలి విదేశీ పర్యటనగా ఈ భార్యాభర్తలు ఐర్లండ్‌ వెళ్లినప్పుడు వీరికి సాదర ఆహ్వానం లభించడంతో పాటు, కొన్ని రాజకీయ అంశాలపైన తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి  ‘మీటూ’ స్ఫూర్తితో కేరళలో మలయాళీ మహిళా నటులు లింగ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సహ నటిని కిడ్నాప్‌ చేయించి, ఆమెపై అత్యాచారం చేయబోయాడన్న ఆరోపణలపై జైలు శిక్షను అనుభవించి ప్రస్తుతం బెయిల్‌ మీద తిరుగుతున్న దిలీప్‌ అనే నటుడుని తిరిగి నటీ నటుల సంస్థ ‘అమ్మ’లో చేర్చుకోవడంతో మొదట వ్యతిరేకించిన రీమా, పార్వతి, శ్రీలేఖ, సజిత్‌లతో మొదలైన ఈ ఉద్యమం క్రమక్రమంగా తీవ్రమై, దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలకూ వ్యాపించి ఒక స్ఫూర్తి పోరాటంగా రూపు దాల్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement