లక్షల మంది మహిళల పదఘట్టనలకు ఒకవేళ ట్రంప్ అదురుపాటుగా కిందపడినా, ఆయనతో పాటు పదవి దిగిపోయే సమస్యలు పోయేవి పోగా, మిగిలిన వాటిపై మహిళల మార్చ్ కొనసాగుతూనే ఉంటుందని వాళ్లు వచ్చిన దారి, వెళుతున్న తీరు చెబుతున్నాయి.
మాధవ్ శింగరాజు
స్త్రీని అదోలా చూసే పురుషుడి ఇమేజ్‌కి భూమ్మీద ఆట్టే నూకలు ఉండవు. అస్సలు సహించరు ఆడవాళ్లు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ రెండేళ్లుగా చక్కగా టై కట్టుకుని ఓవల్ ఆఫీస్‌కి వచ్చి వెళుతూనే ఉన్నారు! మధ్యలో ఎవరైనా ఎదురు పడితే ‘హాయ్.. బేబ్’ అంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి రేపటికి రెండేళ్లు. 2017 జనవరి 20న ఆయన.. ‘ఐ డు సాలెమ్నీ స్వేర్ దట్ ఐ ఫెయిత్‌ఫుల్లీ..’ అని అంటుండగానే, అధ్యక్ష భవనం బయట అమెరికన్ మహిళామణులు ఆయన్ని గద్దె దింపడానికి ప్రతిజ్ఞ చేసి, మర్నాడే పెద్ద ర్యాలీ తీశారు. ఏడాది తర్వాత మళ్లీ 2018 జనవరిలో, ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు.. ఇవాళ న్యూయార్క్‌లో, వాషింగ్టన్‌లో, ఇంకా చాలా చోట్ల, చాలా దేశాల్లో ‘ఉమెన్ మార్చ్ 2019’ నిర్వహిస్తున్నారు.
వచ్చే ఏడాదీ చేస్తారు. ఆ పైయ్యొచ్చే ఏడాదీ చెయ్యొచ్చు.. ట్రంప్ ఇంకా సీట్లోనే ఉంటేనో, మరో టెర్మ్ ఉండబోతుంటేనో.ట్రంప్‌కు వ్యతిరేకంగా మొదలైన ఈ మహిళా మార్చ్‌లో క్రమంగా వేరే లక్ష్యాలు కూడా వచ్చి చేరాయి. మీటూ, సాధికారత, సమానత్వం, ఎల్జీబీటీ హక్కులు.. ఇలాంటివి. ఆత్మాభిమాన సమస్యలు కొన్ని.. బయట తిరిగే మగాళ్లకు అర్థం కావు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు అర్థం కాకుండా ఉండవు. చెప్పినా అర్థం చేసుకునే మగవాళ్లు, చెప్పనిచ్చే మగవాళ్లు తక్కువ కనుకే, ‘ట్రంప్’ అనే ఆడవాళ్ల ఆత్మాభిమాన సమస్య వైట్‌హౌస్‌లో కూర్చోగలిగింది. మహిళలపై ఆయన వెలిబుచ్చే అభిప్రాయాలు, వాళ్లపై తరచూ ఆయన వేస్తుండే జోకులు, అది చేస్తాను, ఇది చేస్తాను అని ఆయన పలికిన ‘పొలిటికల్లీ మిసాజనిస్ట్’ డాంబికాలు మగాళ్లకు నచ్చి ఆయనకు ఓటేశారేమో కానీ, ఆడవాళ్లకు నచ్చే ఫేస్ కాదు ట్రంప్‌ది.
యు.ఎస్.లోకి ఎవర్నీ రానివ్వకపోవడం, గోడ కడతాననడం, వలస వచ్చిన తల్లుల నుంచి బిడ్డల్ని వేరు చెయ్యడం అసలే నచ్చేవి కావు. నచ్చకనే.. ఫ్రమ్ డే వన్ ఆయనకు వ్యతిరేకంగా ‘మార్చ్’ చేస్తున్నారు మహిళలు. అయితే రిడిక్యులస్ అంటున్నారు మగవాళ్లు ఈ మార్చ్‌ని! నవ్వి కొట్టిపారేసే విషయం అని ‘రిడిక్యులస్’ అంటే. అవును. ఇంట్లో బియ్యం లేకపోవడం మగవాళ్లకు రిడిక్యులస్. ఇరవై నాలుగు గంటలూ ఇంట్లోనే ఉండలేకపోతున్నానని ఆడవాళ్లు ఏడుపుముఖం పెట్టడం రిడిక్యులస్. ‘నేనూ ఓటేస్తా’ అనడం రిడిక్యులస్. ‘యుద్ధాల్లేకుండా దేశాలు ప్రశాంతంగా ఉండలేవా?’ అని అడగడం రిడిక్యులస్. అయితే చరిత్రలో ఇలా మగవాళ్లు రిడిక్యులస్ అనిన ప్రతి సందర్భంలోనూ మహిళలే ముందుకొచ్చి వందలు, వేలు, లక్షల్లో ‘మార్చ్’ చేశారు. మార్పు తెచ్చారు. 1789 ఫ్రెంచి విప్లవం మహిళల మార్చ్ నుంచే మొదలైంది! ప్యారిస్‌లో రొట్టె ముక్కల ధరలు ఆకాశంలో చుక్కలై కూర్చున్నాయి.
ధనిక, పేద లేకుండా ప్రతి ఇల్లూ పస్తులతో ఎంగిలి పడుతోంది. పిల్లలు ‘అమ్మా.. ఆకలీ’ అని ఏడుస్తున్నారు. ‘కింగ్ పదహారవ లూయీ ఏమైనా చేయకపోతాడా’ అని మగవాళ్లంతా ఎదురుచూస్తున్నారు. ఎదురు చూస్తున్నారంతే. మగాళ్లూ ఏం చేయడం లేదు. రాజుగారూ ఏం చేయడం లేదు. చూసి, చూసి మహిళలే గడప బయటికి వచ్చారు. ఏడు వేల మంది కలిసి, ప్యారిస్‌కి పన్నెండు మైళ్ల దూరంలో రాజుగారి ప్యాలెస్‌కు ‘మార్చ్’ చేశారు. ‘కష్టం. ఖజానాలో డబ్బుల్లేవు’ అన్నారు రాజుగారు. ‘తమరసలు రాజుగారేనా?’ అన్నారు మహిళలు. హింస చెలరేగింది. మహిళల ఒంటిపై దెబ్బ పడింది. రాజ్యానికే చేటు. చెంపలు వేసుకుని ప్యాలెస్ నుంచి ప్యారిస్ వచ్చి కూర్చున్నారు రాజుగారు. మహిళా విజయం!యు.ఎస్.లో మహిళలకు ఓటు హక్కు కూడా మహిళల ‘మార్చ్’ వల్ల వచ్చిందే. 1913లో ఉడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షుడి సీటులో సర్దుకుని కూర్చోబోతుండగా ఐదు వేల మంది మహిళలు శ్వేతసౌధానికి వెళ్లే మార్గంలో ధనాధన్‌మని మార్చింగ్ చేశారు.
‘మహాశయా బయటికి రండి’ అని నినదించారు. ఆయన రాలేదు. వీళ్లూ కదల్లేదు. చివరికి విల్సన్‌గారి వర్తమానం బయటికి వచ్చింది. ‘రాష్ట్రాలన్నిటితో మాట్లాడి అలాగే చేద్దాం’ అని. మహిళా విజయం! 1970లో న్యూయార్క్ సిటీలో యాభై వేల మంది మహిళలు సమానత్వం కోసం పెద్ద ‘మార్చ్’ జరిపారు. విద్యావకాశాల్లో సమానత్వం, ఉద్యోగావకాశాల్లో సమానత్వం, రాజకీయ అవకాశాల్లో సమానత్వం. ఓటు హక్కు పోరాటం తర్వాత మళ్లీ అంత పెద్ద మార్చ్ ఇదేనని ‘టైమ్’ మేగజీన్ వర్ణించింది. ఈ సమానత్వ పోరును మిగతా దేశాల్లోని మహిళలూ అందుకున్నారు. సమానత్వ చట్టాలు తెచ్చుకున్నారు.
మహిళా విజయం! దేశాల మధ్య యుద్ధాలకు వ్యతిరేకంగా 1976లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ‘పీస్ మార్చ్’లు మహిళలు ప్రారంభించినవే. ఉత్తర ఐర్లండ్‌లో ఇరవయ్యో శతాబ్దాంతపు అతి భయానక గెరిల్లా యుద్ధాన్ని ఆపింది మహిళలే! 2003లో లైబీరియా అంతర్యుద్ధాన్ని చర్చల బల్లల మీదికి తెచ్చి శాంతి శంఖం పూరించిందీ మహిళలే. పిల్లల్ని, పాలు తాగే పసికందుల్నీ వెంటేసుకుని మరీ మార్చ్ చేశారు!నేడు జరగబోతున్న ‘ఉమెన్స్ మార్చ్’లో ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలుపుకుని అరవై లక్షల మంది మహిళలకు పైగా పాల్గొంటున్నారు.
హిస్టారిక్ ఇది. స్త్రీజాతిని చులకనగా చూడ్డం ఒక్కటే డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న కంప్లయింట్ కాదు. డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఇవాళ్టి హిస్టారిక్ మార్చ్‌కి కేంద్ర బిందువూ కాదు. ట్రంప్‌ను దింపేందుకు రెండేళ్ల క్రితం ప్రారంభమైన మహిళా మహోద్యమం.. ఒకవేళ ట్రంప్ దిగిపోయినా కూడా.. ప్రపంచంలోని అన్ని రకాల వివక్షల్ని, అసమానతల్ని చదును చేసేవరకు ఆగబోయేది లేదని ఇప్పటి వరకు జరిగిన చరిత్రాత్మక మహిళా ఉద్యమాల దారితెన్నులను బట్టి స్పష్టం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment