Women issues
-
Tanuja Chandra: చీకటి వెలుగుల దారుల్లో...
కథలు ఆకాశం నుంచి నేలకు దిగి రావు. ఈ నేలలో అనేక కథలు దాగున్నాయి. వాటి జాడలు వెదుక్కుంటూ వెళ్లడమే సృజనకారుల పని. బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లిన రైటర్, డైరెక్టర్ తనూజ చంద్ర తనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపై డాక్యుమెంటరీలు తీయాలని నిర్ణయించుకుంది... తనూజ చంద్ర తల్లి కామ్నా చంద్ర రైటర్, సోదరుడు విక్రమ్ చంద్ర రైటర్, సోదరి అనుపమ చోప్రా ఫిల్మ్ క్రిటిక్. రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంటి నిండా సృజనాత్మక వాతావరణం కొలువై ఉండేది. టీవీ సిరీస్ జమీన్ ఆస్మాన్(1996)తో డైరెక్టర్‌గా వినోదరంగంలోకి అడుగుపెట్టింది తనూజ. మహేష్‌భట్ ‘జఖ్మ్’ సినిమాకు స్క్రీన్‌ప్లే రాసి మంచి పేరు తెచ్చుకుంది. సంజయ్ దత్, కాజోల్ జంటగా నటించిన ‘దుష్మన్’ సినిమాతో బాలీవుడ్లో డైరెక్టర్‌గా తొలి అడుగు వేసింది. ‘నేను కమర్షియల్ డైరెక్టర్ని మాత్రమే’ అనే ధోరణిలో కాకుండా మహిళల జీవితానికి సంబంధించిన సమస్త కోణాలను సినిమా, ఓటీటీ మాధ్యమాలపై ఆవిష్కరిస్తోంది తనూజ. ‘ఊహాల్లో నుంచి మహిళలకు సంబంధించిన కథలను అల్లడం కంటే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడితే నిజమైన కథలు వస్తాయి’ అంటున్న తనూజ స్క్రిప్ట్ మేకింగ్ కోసం రైటింగ్ రూమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంతోమంది మహిళలతో మాట్లాడింది. ఆ క్రమంలో తనకు ఏదైనా ఆలోచన వస్తే అది స్క్రిప్ట్‌గా రూపొందుతుంది. వెండితెరపై రాణిస్తున్న వారు షార్ట్ ఫిల్మ్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. తనూజకు మాత్రం ఎలాంటి పట్టింపులు లేవు. పెద్ద డైరెక్టర్‌గా పేరు వచ్చిన తరువాత కూడా రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ ‘సిల్వత్’ తీసింది. ‘ఏ మాన్సూన్ డేట్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు కూడా విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయిదు సంవత్సరాల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లహ్ర అనే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది తనూజ. అక్కడ తనకు ఇద్దరు మేనత్తలు ఉన్నారు. ఇద్దరూ భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంటీ రాధ సరదా మనిషి. శాంతస్వభావి. ఎంత పెద్ద కష్టానికైనా అడ్జస్టైపోతుంది. సుధా ఆంటీ మాత్రం రాధ ఆంటీకి పూర్తి భిన్నం. ఒకరకంగా చెప్పాలంటే ఫైర్‌బ్రాండ్. చాలా స్క్రిక్ట్. పర్ఫెక్షన్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా గొడవకు దిగుతుంది. ఒకరి వయసు 93. మరొకరి వయసు 83. వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరికీ తమ మనస్తత్వాల మూలంగా ఎప్పుడూ గొడవలు రాలేదు. వీరి జీవితాన్ని గురించి లోతుగా తెలుసుకున్న తరువాత ‘ఆంటీ సుధా ఆంటీ రాధ’కు శ్రీకారం చుట్టింది తనూజ. నలభై ఎనిమిది నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హాయిగా నవ్వుకునే సన్నివేశాలే కాదు కంట తడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘సాధారణ ప్రజలు అనే మాట వింటుంటాం. అయితే వారి జీవితాలలోకి తొంగి చూస్తే అసాధారణ సన్నివేశాలు, సాహసాలు కనిపిస్తాయి’ అంటున్న తనూజకు ఇది తొలి డాక్యుమెంటరీ ఫిల్మ్. కట్ చేస్తే... ‘వెడ్డింగ్.కాన్’ అనే సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తనూజ. పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది మహిళలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కాజేశాడు ప్రజిత్. రకరకాల మారుపేర్లతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడేవాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్...మొదలైన రాష్ట్రాల్లో ఎంతోమంది మహిళలను మోసం చేశాడు. థానేలోని ధోకాలీ ప్రాంతానికి చెందిన ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజిత్ మోసం వెలుగులోకి వచ్చింది. థానే పోలీసులు ప్రజిత్‌ను అరెస్ట్ చేశారు. ‘వెడ్డింగ్.కాన్’ డాక్యుమెంటరీ ప్రజిత్లాంటి ఎంతోమంది మోసగాళ్ల మోసాలకు అద్దం పడుతుంది. ‘మ్యాట్రిమోనియల్ మోసాల ద్వారా నష్టపోయిన మహిళలు ఎందరో ఉన్నారు. అయితే చాలామంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణం తాము తప్పు చేశాం అనే భావన. నలుగురు నవ్వుతారేమో అనుకోవడం. ఇది నన్ను చాలా బాధ పెట్టింది’ అంటుంది తనూజ చంద్ర. అయితే ‘వెడ్డింగ్.కాన్’ బాధిత మహిళలకు ధైర్యాన్ని ఇస్తుంది, న్యాయం కోసం పోరాటం చేసే స్ఫూర్తిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. గమనాన్ని మార్చింది బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లినప్పుడు సాధారణ జీవితాల్లోని అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఎంతో మంది మహిళలతో మాట్లాడిన తరువాత...మహిళల గురించి ఓటీటీ మాధ్యమం ద్వారా సీరియస్‌గా చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి అనిపించింది. ఆంటీ సుధా ఆంటి రాధ నా గమనాన్ని మార్చింది అని చెప్పవచ్చు. – తనూజ చంద్ర, రైటర్, డైరెక్టర్ -
మహిళా సమస్యల నేపథ్యంలో అరియన్
తమిళ సినిమా: ఎంజీపీ మాస్ మీడియా పతాకంపై నవీన్ నిర్మించిన చిత్రం అరియవన్. యారడి నీ మోహిని, తిరుచిట్రంఫలం వంటి విజయవంతమైన చిత్రాలు దర్శకుడు మిత్రన్ ఆర్.జవహర్ తెరకెక్కించిన తాజా చిత్రం ఇది. నవ జంట ఇషాన్, ప్రణాలి జంటగా నటించిన ఇందులో నటుడు డానియల్ బాలాజీ, సత్యన్, కల్కి రాజా, రమ రమేష్ చక్రవర్తి, కావ్య, సూపర్ గుడ్ సుబ్రహ్మణి, రామన్ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. వీవీ టీమ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ఒక పాటను సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ రూపొందించడం విశేషం. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని సత్యం సినిమాస్ థియేటర్లో నిర్వహించారు. నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర ఆడియో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కథానాయకుడిగా పరిచయమైన ఇషాన్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నాను. దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్ చిత్రాల్లో మంచి సందేశంతో కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పాజిటివ్ ఎనర్జీతో బయటికి వస్తారన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు కె. భాగ్యరాజ్ మాట్లాడుతూ అరియవన్ చిత్ర ట్రైలర్ బాగుందని.. అందుకు చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు మిత్రన్ ఆర్. జవహార్ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన ఉత్తమ పుత్తిరన్ చిత్రంలో తాను నటించానని, ఆయన చాలా శాంత స్వభావుడు అని పేర్కొన్నారు. నూతన జంటతో చిత్రం చేస్తున్నారంటే అది కచ్చితంగా మంచి కథాచిత్రమే అయ్యి ఉంటుందన్నారు. కొత్తవారితో చిత్రాన్ని చేసిన నిర్మాత నవీన్‌కు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర హీరో కళ్లల్లో జీవం ఉందని, ఈయన మంచి కథను ఎంచుకొని నటించి విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నట్లు పేర్కొన్నారు. -
డీజీపీని కలిసిన వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గురువారం డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. మహిళా కమిషన్ దృష్టికి వచ్చిన కేసుల వివరాలను డీజీపీకి తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న కేసులపై డీజీపీతో చర్చించినట్టు చెప్పారు. గుంటూరులో నగ్న వీడియోల కేసు మరవకముందే మరో కేసు నమోదు అయిందన్నారు. కేసులకు సంబంధించి పోలీసుల పాత్రపై విచారించి చర్యలు తీసుకోమని డీజీపీని కోరినట్టు వెల్లడించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. (‘నాడు – నేడు’పై మన కల నిజం కావాలి: సీఎం జగన్) ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. దిశా యాప్‌ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సైబర్ నేరాలకు పాల్పడేవారిపై మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు.(‘కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధం’) -
దారితెన్నులు
లక్షల మంది మహిళల పదఘట్టనలకు ఒకవేళ ట్రంప్ అదురుపాటుగా కిందపడినా, ఆయనతో పాటు పదవి దిగిపోయే సమస్యలు పోయేవి పోగా, మిగిలిన వాటిపై మహిళల మార్చ్ కొనసాగుతూనే ఉంటుందని వాళ్లు వచ్చిన దారి, వెళుతున్న తీరు చెబుతున్నాయి. మాధవ్ శింగరాజు స్త్రీని అదోలా చూసే పురుషుడి ఇమేజ్‌కి భూమ్మీద ఆట్టే నూకలు ఉండవు. అస్సలు సహించరు ఆడవాళ్లు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ రెండేళ్లుగా చక్కగా టై కట్టుకుని ఓవల్ ఆఫీస్‌కి వచ్చి వెళుతూనే ఉన్నారు! మధ్యలో ఎవరైనా ఎదురు పడితే ‘హాయ్.. బేబ్’ అంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి రేపటికి రెండేళ్లు. 2017 జనవరి 20న ఆయన.. ‘ఐ డు సాలెమ్నీ స్వేర్ దట్ ఐ ఫెయిత్‌ఫుల్లీ..’ అని అంటుండగానే, అధ్యక్ష భవనం బయట అమెరికన్ మహిళామణులు ఆయన్ని గద్దె దింపడానికి ప్రతిజ్ఞ చేసి, మర్నాడే పెద్ద ర్యాలీ తీశారు. ఏడాది తర్వాత మళ్లీ 2018 జనవరిలో, ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు.. ఇవాళ న్యూయార్క్‌లో, వాషింగ్టన్లో, ఇంకా చాలా చోట్ల, చాలా దేశాల్లో ‘ఉమెన్ మార్చ్ 2019’ నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాదీ చేస్తారు. ఆ పైయ్యొచ్చే ఏడాదీ చెయ్యొచ్చు.. ట్రంప్ ఇంకా సీట్లోనే ఉంటేనో, మరో టెర్మ్ ఉండబోతుంటేనో.ట్రంప్‌కు వ్యతిరేకంగా మొదలైన ఈ మహిళా మార్చ్‌లో క్రమంగా వేరే లక్ష్యాలు కూడా వచ్చి చేరాయి. మీటూ, సాధికారత, సమానత్వం, ఎల్జీబీటీ హక్కులు.. ఇలాంటివి. ఆత్మాభిమాన సమస్యలు కొన్ని.. బయట తిరిగే మగాళ్లకు అర్థం కావు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు అర్థం కాకుండా ఉండవు. చెప్పినా అర్థం చేసుకునే మగవాళ్లు, చెప్పనిచ్చే మగవాళ్లు తక్కువ కనుకే, ‘ట్రంప్’ అనే ఆడవాళ్ల ఆత్మాభిమాన సమస్య వైట్‌హౌస్‌లో కూర్చోగలిగింది. మహిళలపై ఆయన వెలిబుచ్చే అభిప్రాయాలు, వాళ్లపై తరచూ ఆయన వేస్తుండే జోకులు, అది చేస్తాను, ఇది చేస్తాను అని ఆయన పలికిన ‘పొలిటికల్లీ మిసాజనిస్ట్’ డాంబికాలు మగాళ్లకు నచ్చి ఆయనకు ఓటేశారేమో కానీ, ఆడవాళ్లకు నచ్చే ఫేస్ కాదు ట్రంప్‌ది. యు.ఎస్.లోకి ఎవర్నీ రానివ్వకపోవడం, గోడ కడతాననడం, వలస వచ్చిన తల్లుల నుంచి బిడ్డల్ని వేరు చెయ్యడం అసలే నచ్చేవి కావు. నచ్చకనే.. ఫ్రమ్ డే వన్ ఆయనకు వ్యతిరేకంగా ‘మార్చ్’ చేస్తున్నారు మహిళలు. అయితే రిడిక్యులస్ అంటున్నారు మగవాళ్లు ఈ మార్చ్‌ని! నవ్వి కొట్టిపారేసే విషయం అని ‘రిడిక్యులస్’ అంటే. అవును. ఇంట్లో బియ్యం లేకపోవడం మగవాళ్లకు రిడిక్యులస్. ఇరవై నాలుగు గంటలూ ఇంట్లోనే ఉండలేకపోతున్నానని ఆడవాళ్లు ఏడుపుముఖం పెట్టడం రిడిక్యులస్. ‘నేనూ ఓటేస్తా’ అనడం రిడిక్యులస్. ‘యుద్ధాల్లేకుండా దేశాలు ప్రశాంతంగా ఉండలేవా?’ అని అడగడం రిడిక్యులస్. అయితే చరిత్రలో ఇలా మగవాళ్లు రిడిక్యులస్ అనిన ప్రతి సందర్భంలోనూ మహిళలే ముందుకొచ్చి వందలు, వేలు, లక్షల్లో ‘మార్చ్’ చేశారు. మార్పు తెచ్చారు. 1789 ఫ్రెంచి విప్లవం మహిళల మార్చ్ నుంచే మొదలైంది! ప్యారిస్‌లో రొట్టె ముక్కల ధరలు ఆకాశంలో చుక్కలై కూర్చున్నాయి. ధనిక, పేద లేకుండా ప్రతి ఇల్లూ పస్తులతో ఎంగిలి పడుతోంది. పిల్లలు ‘అమ్మా.. ఆకలీ’ అని ఏడుస్తున్నారు. ‘కింగ్ పదహారవ లూయీ ఏమైనా చేయకపోతాడా’ అని మగవాళ్లంతా ఎదురుచూస్తున్నారు. ఎదురు చూస్తున్నారంతే. మగాళ్లూ ఏం చేయడం లేదు. రాజుగారూ ఏం చేయడం లేదు. చూసి, చూసి మహిళలే గడప బయటికి వచ్చారు. ఏడు వేల మంది కలిసి, ప్యారిస్‌కి పన్నెండు మైళ్ల దూరంలో రాజుగారి ప్యాలెస్‌కు ‘మార్చ్’ చేశారు. ‘కష్టం. ఖజానాలో డబ్బుల్లేవు’ అన్నారు రాజుగారు. ‘తమరసలు రాజుగారేనా?’ అన్నారు మహిళలు. హింస చెలరేగింది. మహిళల ఒంటిపై దెబ్బ పడింది. రాజ్యానికే చేటు. చెంపలు వేసుకుని ప్యాలెస్ నుంచి ప్యారిస్ వచ్చి కూర్చున్నారు రాజుగారు. మహిళా విజయం!యు.ఎస్.లో మహిళలకు ఓటు హక్కు కూడా మహిళల ‘మార్చ్’ వల్ల వచ్చిందే. 1913లో ఉడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షుడి సీటులో సర్దుకుని కూర్చోబోతుండగా ఐదు వేల మంది మహిళలు శ్వేతసౌధానికి వెళ్లే మార్గంలో ధనాధన్మని మార్చింగ్ చేశారు. ‘మహాశయా బయటికి రండి’ అని నినదించారు. ఆయన రాలేదు. వీళ్లూ కదల్లేదు. చివరికి విల్సన్గారి వర్తమానం బయటికి వచ్చింది. ‘రాష్ట్రాలన్నిటితో మాట్లాడి అలాగే చేద్దాం’ అని. మహిళా విజయం! 1970లో న్యూయార్క్ సిటీలో యాభై వేల మంది మహిళలు సమానత్వం కోసం పెద్ద ‘మార్చ్’ జరిపారు. విద్యావకాశాల్లో సమానత్వం, ఉద్యోగావకాశాల్లో సమానత్వం, రాజకీయ అవకాశాల్లో సమానత్వం. ఓటు హక్కు పోరాటం తర్వాత మళ్లీ అంత పెద్ద మార్చ్ ఇదేనని ‘టైమ్’ మేగజీన్ వర్ణించింది. ఈ సమానత్వ పోరును మిగతా దేశాల్లోని మహిళలూ అందుకున్నారు. సమానత్వ చట్టాలు తెచ్చుకున్నారు. మహిళా విజయం! దేశాల మధ్య యుద్ధాలకు వ్యతిరేకంగా 1976లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ‘పీస్ మార్చ్’లు మహిళలు ప్రారంభించినవే. ఉత్తర ఐర్లండ్‌లో ఇరవయ్యో శతాబ్దాంతపు అతి భయానక గెరిల్లా యుద్ధాన్ని ఆపింది మహిళలే! 2003లో లైబీరియా అంతర్యుద్ధాన్ని చర్చల బల్లల మీదికి తెచ్చి శాంతి శంఖం పూరించిందీ మహిళలే. పిల్లల్ని, పాలు తాగే పసికందుల్నీ వెంటేసుకుని మరీ మార్చ్ చేశారు!నేడు జరగబోతున్న ‘ఉమెన్స్ మార్చ్’లో ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలుపుకుని అరవై లక్షల మంది మహిళలకు పైగా పాల్గొంటున్నారు. హిస్టారిక్ ఇది. స్త్రీజాతిని చులకనగా చూడ్డం ఒక్కటే డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న కంప్లయింట్ కాదు. డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఇవాళ్టి హిస్టారిక్ మార్చ్‌కి కేంద్ర బిందువూ కాదు. ట్రంప్‌ను దింపేందుకు రెండేళ్ల క్రితం ప్రారంభమైన మహిళా మహోద్యమం.. ఒకవేళ ట్రంప్ దిగిపోయినా కూడా.. ప్రపంచంలోని అన్ని రకాల వివక్షల్ని, అసమానతల్ని చదును చేసేవరకు ఆగబోయేది లేదని ఇప్పటి వరకు జరిగిన చరిత్రాత్మక మహిళా ఉద్యమాల దారితెన్నులను బట్టి స్పష్టం అవుతోంది. -
మహిళా సమస్యలపై పోరాడాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై పోరాటం చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మహిళా కాం గ్రెస్ నేతలకు సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో భట్టి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళల సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. మహిళలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటేనే పార్టీపై విశ్వా సం, ఆదరణ పెరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రత్యేక మహిళా కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని భట్టి సూచిం చారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద, మాజీ ఎమ్మెల్యే అరుణతార తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ సెల్ సమావేశం కాంగ్రెస్ మైనారిటీ సెల్ సమావేశం కూడా గాంధీభవన్‌లో జరిగింది. మైనారిటీ సెల్ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై భట్టి దిశానిర్దేశం చేశారు. మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫకృద్దీన్ పాల్గొన్నారు.