కథలు ఆకాశం నుంచి నేలకు దిగి రావు. ఈ నేలలో అనేక కథలు దాగున్నాయి. వాటి జాడలు వెదుక్కుంటూ వెళ్లడమే సృజనకారుల పని. బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లిన రైటర్, డైరెక్టర్ తనూజ చంద్ర తనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపై డాక్యుమెంటరీలు తీయాలని నిర్ణయించుకుంది...
తనూజ చంద్ర తల్లి కామ్నా చంద్ర రైటర్, సోదరుడు విక్రమ్ చంద్ర రైటర్, సోదరి అనుపమ చోప్రా ఫిల్మ్ క్రిటిక్. రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంటి నిండా సృజనాత్మక వాతావరణం కొలువై ఉండేది.
టీవీ సిరీస్ జమీన్ ఆస్మాన్(1996)తో డైరెక్టర్‌గా వినోదరంగంలోకి అడుగుపెట్టింది తనూజ. మహేష్‌భట్ ‘జఖ్మ్’ సినిమాకు స్క్రీన్‌ప్లే రాసి మంచి పేరు తెచ్చుకుంది. సంజయ్ దత్, కాజోల్ జంటగా నటించిన ‘దుష్మన్’ సినిమాతో బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా తొలి అడుగు వేసింది. ‘నేను కమర్షియల్ డైరెక్టర్‌ని మాత్రమే’ అనే ధోరణిలో కాకుండా మహిళల జీవితానికి సంబంధించిన సమస్త కోణాలను సినిమా, ఓటీటీ మాధ్యమాలపై ఆవిష్కరిస్తోంది తనూజ.
‘ఊహాల్లో నుంచి మహిళలకు సంబంధించిన కథలను అల్లడం కంటే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడితే నిజమైన కథలు వస్తాయి’ అంటున్న తనూజ స్క్రిప్ట్ మేకింగ్ కోసం రైటింగ్ రూమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంతోమంది మహిళలతో మాట్లాడింది. ఆ క్రమంలో తనకు ఏదైనా ఆలోచన వస్తే అది స్క్రిప్ట్‌గా రూపొందుతుంది.
వెండితెరపై రాణిస్తున్న వారు షార్ట్ ఫిల్మ్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. తనూజకు మాత్రం ఎలాంటి పట్టింపులు లేవు. పెద్ద డైరెక్టర్‌గా పేరు వచ్చిన తరువాత కూడా రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ ‘సిల్వత్’ తీసింది. ‘ఏ మాన్‌సూన్ డేట్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు కూడా విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయిదు సంవత్సరాల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లహ్ర అనే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది తనూజ. అక్కడ తనకు ఇద్దరు మేనత్తలు ఉన్నారు.
ఇద్దరూ భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంటీ రాధ సరదా మనిషి. శాంతస్వభావి. ఎంత పెద్ద కష్టానికైనా అడ్జస్టైపోతుంది. సుధా ఆంటీ మాత్రం రాధ ఆంటీకి పూర్తి భిన్నం. ఒకరకంగా చెప్పాలంటే ఫైర్‌బ్రాండ్. చాలా స్క్రిక్ట్. పర్‌ఫెక్షన్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా గొడవకు దిగుతుంది. ఒకరి వయసు 93. మరొకరి వయసు 83. వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరికీ తమ మనస్తత్వాల మూలంగా ఎప్పుడూ గొడవలు రాలేదు.
వీరి జీవితాన్ని గురించి లోతుగా తెలుసుకున్న తరువాత ‘ఆంటీ సుధా ఆంటీ రాధ’కు శ్రీకారం చుట్టింది తనూజ. నలభై ఎనిమిది నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హాయిగా నవ్వుకునే సన్నివేశాలే కాదు కంట తడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘సాధారణ ప్రజలు అనే మాట వింటుంటాం. అయితే వారి జీవితాలలోకి తొంగి చూస్తే అసాధారణ సన్నివేశాలు, సాహసాలు కనిపిస్తాయి’ అంటున్న తనూజకు ఇది తొలి డాక్యుమెంటరీ ఫిల్మ్.
కట్ చేస్తే...
‘వెడ్డింగ్.కాన్’ అనే సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తనూజ. పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది మహిళలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కాజేశాడు ప్రజిత్. రకరకాల మారుపేర్లతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు పాల్పడేవాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్...మొదలైన రాష్ట్రాల్లో ఎంతోమంది మహిళలను మోసం చేశాడు.
థానేలోని ధోకాలీ ప్రాంతానికి చెందిన ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజిత్ మోసం వెలుగులోకి వచ్చింది. థానే పోలీసులు ప్రజిత్‌ను అరెస్ట్ చేశారు. ‘వెడ్డింగ్.కాన్’ డాక్యుమెంటరీ ప్రజిత్‌లాంటి ఎంతోమంది మోసగాళ్ల మోసాలకు అద్దం పడుతుంది.
‘మ్యాట్రిమోనియల్ మోసాల ద్వారా నష్టపోయిన మహిళలు ఎందరో ఉన్నారు. అయితే చాలామంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణం తాము తప్పు చేశాం అనే భావన. నలుగురు నవ్వుతారేమో అనుకోవడం. ఇది నన్ను చాలా బాధ పెట్టింది’ అంటుంది తనూజ చంద్ర. అయితే ‘వెడ్డింగ్.కాన్’ బాధిత మహిళలకు ధైర్యాన్ని ఇస్తుంది, న్యాయం కోసం పోరాటం చేసే స్ఫూర్తిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు.
గమనాన్ని మార్చింది
బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లినప్పుడు సాధారణ జీవితాల్లోని అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఎంతో మంది మహిళలతో మాట్లాడిన తరువాత...మహిళల గురించి ఓటీటీ మాధ్యమం ద్వారా సీరియస్‌గా చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి అనిపించింది. ఆంటీ సుధా ఆంటి రాధ నా గమనాన్ని మార్చింది అని చెప్పవచ్చు.
– తనూజ చంద్ర, రైటర్, డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment