మట్టి పనులు వేగవంతం చేయాలి
ఏపీ జెన్‌కో డైరెక్టర్ నాగేశ్వరరావు
దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం పవర్ హౌస్ నిర్మాణానికి అవసరమైన మట్టి పనులను వేగంగా పూర్తిచేయాలని ఏపీ జెన్‌కో డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనికోసం దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామం వద్ద కొండపై జరుగుతున్న పనులను ఏపీ జెన్‌కో సలహాదారు జి.ఆదిశేషు, పలువురు అధికారులతో కలిసి నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి జెన్‌కో ఈఈ కొలగాని వీవీఎస్ మూర్తి వారికి వివరించారు. ఈ సందర్భంగా జెన్‌కో డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకూ 68 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరిగిందన్నారు. మరో 40 లక్షల క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉందని, దానిని మార్చి నాటికి పూర్తిచేస్తే ఏప్రిల్ నెలలో పవర్‌హౌస్ నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు. ఇప్పటికే విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్ కె.రత్నబాబు, ఎస్‌ఈ పి. రంగనాగన్, ఈఈ వీఎస్‌ఎన్ రాజు, డీఈలు కోటేశ్వరరావు, రాజ్‌కుమార్, ట్రాన్స్‌ట్రాయ్ మేనేజర్ మల్లికార్జునరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.