పల్స్ సర్వే వేగవంతం
పల్స్ సర్వే వేగవంతం
Published Wed, Aug 3 2016 11:10 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
కొత్తపేట, చెముడులంక గ్రామాల్లో సర్వే పరిశీలన
కొత్తపేట : సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రజాసాధికారిక సర్వే (పల్స్ సర్వే)ను వేగవంతం చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. కొత్తపేట, ఆలమూరు మండలం చెముడులంక గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాసాధికారిక సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. కొత్తపేటలోని ఒక ఇంటి వద్ద వివరాల నమోదును స్వయంగా తిలకించారు. సర్వే జరుగుతున్న తీరు, ఇంతవరకూ నమోదైన కుటుంబాల వివరాల గురించి ఈ సందర్భంగా సర్వే సిబ్బందిని ఆయన ఆరా తీశారు. పలు చోట్ల ఒక కుటుంబంలో తొలిపేరు నమోదు వేగంగా జరిగినా, తరువాత పేర్లు నమోదుకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని సర్వే సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ మొదట తలెత్తిన సాంకేతిక సమస్యలతో పోలిస్తే ప్రస్తుతం చాలా వరకూ పరిస్థితి మెరుగుపడిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,037 మంది సిబ్బంది ఈ సర్వే నిర్వహిస్తున్నారని, ఇంతవరకూ 44.52 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. ఆయన వెంట అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్, కొత్తపేట తహసీల్దార్ ఎన్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
వేగవంతం చేయండి
ఆలమూరు : ప్రజాసాధికారిక సర్వేను వేగవంతం చేయాలని జేసీ ఎస్.సత్యనారాయణ, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. మండలంలోని చెముడులంక గ్రామంలో జరుగుతున్న పల్స్ సర్వేను బుధవారం వారు పరిశీలించారు. మండలంలో ఇప్పటి వరకూ నమోదైన పల్స్ సర్వే వివరాలు, సర్వేలో ముందున్న గ్రామాలు, వెనుకబడిన గ్రామాలు, అందుకు గల కారణాలను తహసీల్దారు టీఆర్ రాజేశ్వరరావు ఉన్నతాధికారులకు వివరించారు.
Advertisement