కలెక్టరేట్ కోసం వచ్చిన కంప్యూటర్లు
- - సిద్ధమవుతున్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు
- - ఖమ్మం నుంచి తరలివచ్చిన కంప్యూటర్లు
- - దసరా నాటికి అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు
- - కలెక్టరేట్ పనుల్లో నిమగ్నమైన రెవెన్యూ సిబ్బంది
- కంప్యూటర్లు సిద్ధం
- చురుగ్గా ఎస్పీ కార్యాలయం పనులు
కొత్తగూడెం: కొత్త జిల్లాల పాలనకు విజయదశమే ముహూర్తం కావడంతో నూతన కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగూడెం సింగరేణి శాప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్‌లోని వివిధ శాఖల కార్యాలయాల కోసం గదులను ముస్తాబు చేస్తున్నారు. సింగరేణి కార్పొరేట్ డిస్పెన్సరీ నుంచి ఎస్పీ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పనులన్నీ చకచకా సాగుతున్నాయి.
విజయ దశమి రోజున కొత్తజిల్లాల కార్యకలాపాలు ప్రారంభించాలని, జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించిన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి. సింగరేణి అప్పగించిన భవనాలను కలెక్టర్ పాలన కార్యాలయం, ఎస్పీ పాలన కార్యాలయాలుగా తీర్చిదిద్దే పనుల్లో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా కార్యాలయాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు కేటాయించింది. జిల్లా కలెక్టరేట్ కోసం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సింగరేణి శాఫ్ కార్యాలయాన్ని కేటాయించారు. గతంలో సింగరేణి కంప్యూటర్లు, ఆన్‌లైన్ కార్యకలాపాలన్నీ ఈ కార్యాలయం నుంచే జరిగేవి. కలెక్టరేట్‌లోని వివిధ శాఖలకు అనుగుణంగా ఉండేందుకు భవనంలోని గదులను తీర్చిదిద్దుతున్నారు. కలెక్టర్ గదితోపాటు సిబ్బంది ఉండేందుకు వీలుగా రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనంలో మొత్తం 21 గదులు, ఒక హాల్ ఉంది. జిల్లా ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్ భవనంలో జిల్లా ట్రెజరీ, వెనుకబడిన తరగతుల గృహనిర్మాణ సెల్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కలెక్టరేట్ ఏర్పాటు చేసే భవనంలోని గదులను అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అధికారులు ఇప్పుడు వాటికి రంగులు వేయించే పనుల్లో నిమగ్నమయ్యారు.
దసరా నాటికి జిల్లా కార్యకలాపాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పనులను ప్రారంభించేందుకు ఖమ్మం కలెక్టరేట్ నుంచి 24 కంప్యూటర్లు, ఐదు ప్రింటర్లను పంపించారు. వీటిని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సిద్ధం చేశారు. జిల్లా ప్రారంభం నుంచే పాలన కొనసాగాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త మండలాల పనులను ప్రారంభించారు. మండలాలకు సంబంధించిన ఫైళ్లను వేరు చేసే పనుల్లో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమయ్యారు. కొత్త కలెక్టరేట్ వచ్చిన తర్వాత కొత్త మండలాలకు పూర్తి పనులు కానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లా పేరుతో ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని ఆదేశాలు రావడంతో మండలాల వారీగా మీ సేవలో వేరు చేస్తున్నారు. దసరా తర్వాత ధ్రువీకరణ పత్రాలు కొత్త జిల్లాల పేరుతో రానున్నాయి.
ఎస్పీ కార్యాలయం కోసం సింగరేణి సంస్థ కార్పొరేట్ డిస్పెన్సరీని కేటాయించింది. గత ఐదేళ్ల నుంచి ఈ భవనంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో చుట్టూ పొదలు, చెట్లతో నిండిపోయింది. ప్రస్తుతం పోలీస్ శాఖ అధికారులు చుట్టూ చెట్లను తొలగింపజేశారు. ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు సరిపోయే విధంగా గదులను తయారు చేస్తున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్‌లు చేస్తున్నారు. భవనం చుట్టూ గుంతలు ఉండటంతో మట్టిని తొలగించి వాటిని చదును చేయిస్తున్నారు. దసరా వచ్చేస్తుండటంతో పనులను త్వరితగతిన చేపట్టేందుకు కొత్తగూడెం డీఎస్పీ సురేందర్‌రావు ఆధ్వర్యంలో పనులు చకచకా సాగుతున్నాయి.