స్వాతి కల నెరవేరింది!
విచిత్రం
ఇక్కడున్న సైనికురాలిపేరు కెప్టెన్ స్వాతీ సిన్హా. భారతదేశానికి, చైనాకి మధ్యనున్న సరిహద్దు నాథూలా ప్రాంతంలో సైనికవిమానంలో కెప్టెన్‌గా పనిచేస్తోంది. సరిహద్దుల్లో పనిచేస్తున్న మొదటి మహిళా సైనిక విమాన కెప్టెన్‌గా స్వాతీ సిన్హా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ఆమె తోటి మహిళలకు తన వృత్తి ప్రత్యేకత గురించి చెబుతూ...అందరికీ ఆహ్వానం పలుకుతోంది. చుట్టూ చూద్దామంటే ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఉండని కార్యాలయంలో ఎంతో స్వేచ్ఛగా పనిచేస్తున్న స్వాతీ సిన్హాని పలకరిస్తే... ‘‘నాకు చిన్నప్పటి నుంచి సైనికులంటే చాలా ఇష్టం. ఎనలేని గౌరవం కూడా. ఒక్కసారైనా వారున్న ప్రాంతాలకు వెళ్లి చూడాలనే కోరిక బలంగా ఉండేది. ఆ విషయం గురించి అమ్మానాన్నలకు చాలాసార్లు చెప్పాను. వినీ విననట్టు ఊరుకున్నారు.
వాళ్లు నా ముందుంచిన అవకాశాలు రెండే. ఒకటి ఇంజనీర్, రెండోది డాక్టర్. చేసేది లేక ఇంజనీరింగ్ చదివాను. వెంటనే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. ఓ ఏడాది ఉద్యోగం చేశాక.. భారత సైనికదళానికి సంబంధించిన పరీక్షలేవో రాసే అవకాశం కలిగింది. అంతే పరీక్ష రాశాను. రెండేళ్లలో లక్నోలోని సైనిక విభాగ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఇంట్లోవాళ్లు, బంధువులు అందరూ... నేను ఆ ఉద్యోగంలో చేరడాన్ని ఇష్టపడలేదు. ‘పోనీ మామూలు విమాన పెలైట్ కూడా కాదు...సైనిక విమానంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో...ఎందుకొచ్చిన గొడవే..’అంటూ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడారు. నేను ఎవరి మాటలు లెక్కచేయలేదు. సైనికురాలిగా పనిచేయడం కంటే గొప్ప ఉద్యోగం మరొకటి ఉండదని నా అభిప్రాయం’’ అంటూ చెప్పుకొచ్చింది స్వాతి.
తోటివారికి ఆహ్వానం...
బెంగుళూరులో ఒక ఇంజినీర్ కుటుంబంలో జన్మించిన స్వాతీ సిన్హా తన వృత్తి గురించి ఇంకా చెబుతూ...’’అందరూ ఊహించుకుంటున్నట్టు ఇక్కడ ప్రతిరోజు శత్రువులపై దాడి ఉండదు. అలాగే శత్రువులు కూడా అదేపనిగా మమ్మల్ని చంపే ప్రయత్నాలు చేయరు. దేశ సరిహద్దుల్లోని మన ప్రాంతాన్ని ఎవరూ ఆక్రమించకుండా కాపలా కాయడమే మా ఉద్యోగం. అందులో భాగంగా గగనతలంలో విమానాలపై చక్కర్లు కొడుతుంటాం. ప్రస్తుతం నేను ఇక్కడి కార్యాలయంలో సిగ్నల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాను. సైనిక వృత్తిని ఇష్టపడే ప్రతి ఒక్క మహిళకూ ఇక్కడ స్థానం ఉంటుంది. ఇక తోటి ఉద్యోగులంటారా... దేశ భద్రతకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టినవారు మహిళకు భద్రత ఇప్పించలేరా...ఒక్కమాటలో చెప్పాలంటే నాతో పనిచేసేవారంతా ప్రాణమిచ్చే తోబుట్టువులు’ అని ఎంతో గర్వంగా చెప్పింది స్వాతి సిన్హా. మహిళలు చాలా రంగాలను దూరం నుంచి చూసే భయపడిపోతుంటారు. స్వాతి సిన్హా అనుభవం తోటి మహిళలకు కొత్త ధైర్యాన్ని ఇస్తుందని భావిద్దాం.