ఊపిరాడటం లేదు..!! | World COPD Day Special Story | Sakshi
Sakshi News home page

ఊపిరాడటం లేదు..!!

Published Wed, Nov 20 2019 9:13 AM | Last Updated on Wed, Nov 20 2019 9:13 AM

World COPD Day Special Story - Sakshi

ఓ వైపు ధూమపానం.. మరో వైపు దుమ్ము, ధూళి, పొగతో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసనాళాలు మూసుకుపోయి ప్రాణాలు పోతున్నాయి. ఆయాసంతో మొదలై క్రమంగా క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(సీఓపీడీ) మారి ప్రాణం తీస్తుంది. ఊపిరి తీసుకోవడానికి వారు పడే యాతన అంతా ఇంతా కాదు. మనిషి ఒక్క నిమిషం ముక్కుమూసుకుంటే తీవ్రంగా ఇబ్బంది పడతాడు. అలాంటిది సీఓపీడీతో బాధపడే వ్యక్తి శ్వాసనాళాలు మూసుకుపోయి నరకం చూస్తాడు. దీనికి అవగాహన ఒక్కటే మార్గం. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే రాకుండా చూసుకోవడమే మేలని పేర్కొంటున్నారు. ఏటా నవంబర్‌ మూడవ బుధవారం వరల్డ్‌ సీఓపీడీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.  – సాక్షి, కర్నూలు 

జిల్లాలో సీఓపీడీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సరదాగా మొదలయ్యే సిగరెట్‌ కాల్చడం అలవాటుగా మారి మనిషి ప్రాణాలు తీస్తోంది. పదేళ్ల క్రితం ఈ వ్యాధి బాధితుల సంఖ్య జనాభాలో మూడు శాతంగా ఉండేది. ఇప్పుడది 6 శాతానికి పైగా పెరిగినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 3 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 65 శాతం పొగతాగే వారిలో మిగిలిన వారు దుమ్ము, ధూళిలో పనిచేయడం, పొగ, కాలుష్యం, రసాయనాల మధ్య విధులు నిర్వహించడంతో వస్తోందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని పట్టణ ప్రాంతాలు, డోన్, బేతంచర్ల వంటి పారిశ్రామిక ప్రాంతాలలో సీఓపీడీ బాధితులు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి కారక లక్షణాలు, కలిగే ఇబ్బందులతో ప్రతి సంవత్సరం 2,500 మంది మరణిస్తున్నట్లు అంచనా. ప్రతి ముగ్గురు పొగతాగే వారిలో ఒకరికి భవిష్యత్‌లో  తప్పకుండా ఈ వ్యాధి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

ఈ వ్యాధి మూడు రకాలు 
1. క్రానిక్‌ బ్రాంఖైటిస్,
 2. ఎంఫీసీమా,
 3. క్రానిక్‌ ఆస్తమా 

సీఓపీడీ వ్యాధి అంటే... 
వైద్యపరిభాషలో క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీస్‌(సీఓపీడీ)గా ఈ వ్యాధిని పిలుస్తారు. ఇది ఊపిరితిత్తులకు వచ్చే దీర్ఘకాలిక జబ్బు. బీడి/సిగరెట్‌ తాగడం వల్ల 65 శాతం మేరకు వస్తుంది. ఈ జబ్బులో శ్వాసనాళాలు, లంగ్‌ టిష్యూ యాల్వియోలై బాగా దెబ్బతింటాయి.  ఈ కారణంగా కావాల్సినంత ఆక్సీజన్‌ ఊపిరితిత్తులకు అందదు.  దీంతో రోగి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడతాడు.  

వ్యాధిలక్షణాలు 
ఆయాస పడటం, దగ్గు, రొప్పుట, ఛాతి బిగుసుకుపోవడం, దీర్ఘకాలంగా గళ్లపడటం, శ్వాసలో పిల్లికూతలు, శ్వాసలో గురగుర శబ్దాలు, తమ పనులను తామే చేసుకోలేక పోవడం.  
సీఓపీడీ బాధితులు ఎవరంటే 
40 ఏళ్లు వయస్సు పైబడిన వారు 
ధూమపానం (బీడీ, సిగరెట్, చుట్టకాల్చేవారు) చేసే వారికి వస్తుంది. ప్రతి ముగ్గురు స్మోకర్లలో ఒకరికి ఈ వ్యాధి వస్తుంది. ప్యాసివ్‌ స్మోకింగ్‌ (పొగతాగే వారి పక్కనుండే వారికి) వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.  
ఈ వ్యాధి వచ్చిన తర్వాత కేవలం 5 ఏళ్లు మాత్రమే జీవిస్తారు.  
ఈ జబ్బు దీర్ఘకాలంగా బీడి/సిగరెట్‌ తాగే వారిలో 90 శాతం వస్తుంది. వాతావరణ కాలుష్యం వల్ల, పరిశ్రమలు, గనుల్లో పనిచేసేవారికి, దుమ్ముధూళికి గురయ్యే వారికి వస్తుంది.  
చిన్న వయస్సులోనే జన్యు సంబంధ వ్యాధుల వల్ల కూడా వస్తుంది. అల్ఫా 1 యాంటిట్రిప్సిన్‌ తక్కువ ఉండటం వల్ల రావచ్చు.  
ఈ జబ్బు మన దేశంలో స్త్రీల కంటే పురుషుల్లోనే అధికం 
8సీఓపీడీతో కలిగే నష్టాలు 
అన్ని రంగాల్లో మనిషి పనితనం తగ్గిపోతుంది 
గుండె పెద్దదిగా మారి హార్ట్‌ ఫెయిల్యూర్‌ కావచ్చు 
పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ న్యూమోథోరాక్స్‌ రావచ్చు 
ఆస్టియోపోరోసిస్‌(ఎముకలు మెత్తపడటం) రావచ్చు 
కండరాలు కరిగిపోయి సన్నబడతారు = మానసికంగా కృంగిపోవడం 

సీఓపీడీకి చికిత్స–నివారణ చర్యలు 
పొగతాగడం మానేయాలి. 
బ్రాంకోడైలేటార్స్, ఇన్‌హేలర్స్, స్టెరాయిడ్స్, ఛాతి వైద్యుని పర్యవేక్షణలో వాడాలి.  
ఆక్సిజన్‌ థెరపీని దీర్ఘకాలంగా రోజుకు కనీసం 15 గంటలు తీసుకోవాలి.  
ఊపిరితిత్తుల వ్యాయామం, ప్రాణాయామం చేయాలి.  
ఊపిరితిత్తుల మారి్పడి శస్త్రచికిత్స, లంగ్‌ వాల్యూమ్‌ రిడక్షన్‌ సర్జరీలు చేయాల్సి ఉంటుంది.  
వ్యాక్సిన్స్‌ (ఇన్‌ఫ్లూయోంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌) ఇప్పించాలి. 

ఇన్‌హేలర్ల వాడకంతోనే ఉపశమనం
సీఓపీడీ వ్యాధిని నివారించలేము. ఇన్‌హేలర్ల వాడకంతో ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు వ్యా«ధి ముదరకుండా చూసుకోవచ్చు. ఊపిరితిత్తుల సామర్ధ్యం తెలిపే పరీక్షలు ‘స్పైరోమెట్రీ’ పరీక్షలు నిర్వహించి, వ్యాధినిర్ధారణ అయితే మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ జబ్బు వచ్చిన తర్వాత ఎంత ఖర్చు చేసినా పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. కావున ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన ఉంచుకుంటే మేలు. తద్వారా వ్యాధికి గురిగాకుండా ఉండవచ్చు. ముఖ్యంగా స్మోకర్లు ఈ వ్యాధిపట్ల జాగ్రత్తగా ఉండాలి.  
 – డాక్టర్‌ నెమలి రవికుమార్‌రెడ్డి, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, కర్నూలు 

పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది 
 మన దేశంలో ఈ వ్యాధితో ఏటా 2,300 మంది చనిపోతున్నారు. ప్రపంచంలో మన దేశం సీఓపీడీలో రెండవ స్థానంలో ఉంది.  ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుంటే దీర్ఘకాలిక వ్యాధిగా వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. ఆయాసం మొదలైనప్పుడే జాగ్రత్త పడాలి. స్పైరోమెట్రీ పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి. లేకపోతే సీఓపీడీ వ్యాధి ముదిరి రోగి పనిచేసే సామర్ధ్యం తగ్గిపోతుంది.  
– డాక్టర్‌ కె.శివకృష్ణ, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement