బ్రెయిన్‌ స్ట్రోక్‌ మాట్లాడుతోంది!వినండి | World Stroke Day on 29th | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ స్ట్రోక్‌ మాట్లాడుతోంది!వినండి

Published Wed, Oct 25 2017 11:44 PM | Last Updated on Wed, Oct 25 2017 11:44 PM

World Stroke Day on 29th

పక్షవాతం వచ్చే ముందు మెదడు మనతో మాట్లాడుతుంది. కొన్ని లక్షణాల ద్వారా తన సందేశాన్ని పంపుతుంది. అదే ఇంగ్లిష్‌ అక్షరాలా ఫాస్ట్‌. ఇందులో ఎఫ్‌... ఫేస్‌ ఈజ్‌ డ్రూపీ అంటే ముఖం వాలిపోయినట్టుగా ఉండటం. ఏ... ఆర్మ్‌ వీక్‌నెస్‌ ఆన్‌ ఒన్‌ సైడ్‌ అంటే ఒకవైపు చేయి బలహీనంగా మారడం. ఎస్‌... స్పీచ్‌ ఈజ్‌ స్లర్ర్‌డ్‌... అంటే మాట ముద్ద ముద్దగా రావడం. టీ... అంటే టైమింగ్‌ ఈజ్‌ క్రిటికల్‌ ఫర్‌ సక్సెస్‌ఫుల్‌ ట్రీట్‌మెంట్‌... అంటే సమయం చాలా అమూల్యమైంది. ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తే... పక్షవాతం వల్ల వచ్చే వైకల్యం అంతగా తగ్గి మనిషి మామూలు అవుతాడని.
అందుకే మెదడు మాట్లాడే మాటలను ‘ఫాస్ట్‌’గా వినండి. ‘ఫాస్ట్‌’ లక్షణాలను గురించండి... ఫాస్ట్‌గా స్పందించండి. రోగిని ‘ఫాస్ట్‌’గా హాస్పిటల్‌కు తరలించండి.

ఈ నెల 29న వరల్డ్‌ స్ట్రోక్‌ డే. పక్షవాతం గురించి అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన రోజు ఇది. గతంలో పక్షవాతం అంటే పెద్దవయసువారిలో తప్ప అందరిలో ఊహించలేని జబ్బు. ఒకప్పుడు చిన్నవయసు వారిలో వస్తుందని ఊహకు సైతం అందని ఈ వ్యాధి ఇప్పుడు యుక్తవయసులో ఉన్నవారికీ వస్తోంది. ఏ పనీ చేయలేని విధంగా వైకల్యాలను తెచ్చిపెట్టేలా పెద్ద మాస్టర్‌ ‘స్ట్రోక్‌’ ఇస్తోంది.  బతుకును దుర్భరం చేస్తోంది. కొంతమందిలో ప్రాణాలను సైతం తీస్తుంది. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఈ అనర్థాన్ని తెచ్చిపెడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కేసులు ప్రతి లక్షమందిలో 84 నుంచి 262 మందిలో ఉంటే, పట్టణాల్లో మాత్రం ఇవి ప్రతి లక్ష మందిలో 334 నుంచి 424 మందిలో కనిపిస్తున్నాయి. ఇవీ పక్షవాతం తీవ్రతను సూచించే అంకెలు. వీటిని చూసి తీవ్రత తక్కువే అనుకోవడం సరికాదు. ఏ పనీ చేయలేక... తమ పనులు సైతం తాము చేసుకోలేక బతుకీడ్చే రోగిని చూస్తే గుండె పిండేసినట్లవుతుంది. కాబట్టి  మెదడును పిండేసే వ్యాధి గురించి అవగాహన పెంచుకోవడం అవసరం.
మెదడుకు అనేక రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి. వాటిని పెద్దవి, మధ్యరకం, చిన్నవి అని మూడుగా వర్గీకరించవచ్చు. పెద్ద రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి అవి పూడుకుపోతే తీవ్రమైన పక్షవాతం వస్తుంది. అదే మధ్యరకం రక్తనాళాలు బ్లాక్‌ అయితే ఓ మోస్తరు స్ట్రోక్, చిన్నవి బ్లాక్‌ అయితే మైనర్‌ స్ట్రోక్‌ వస్తాయి. మెదడులో రెండు అర్ధభాగాలు ఉంటాయి.   శరీరంలోని ఎడమవైపు ఉన్న అవయవాలను  కుడి అర్ధగోళం, కుడి వైపు అవయవాలను ఎడమ అర్ధగోళం నియంత్రిస్తాయి. మెదడు కుడివైపు భాగాలకు రక్తప్రసరణ జరగకపోతే ఎడమవైపు, ఎడమ మెదడుకు రక్తప్రసరణ జరగకపోతే కుడివైపు శరీర భాగాలు చచ్చుబడతాయి.

స్ట్రోక్‌లో రకాలు...
1) ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడు భాగానికి రక్తం అందక ఆ భాగం దెబ్బతినడాన్ని ‘ఇస్కిమిక్‌ స్ట్రోక్‌’ అంటారు.
2) హేమరేజిక్‌ స్ట్రోక్‌ : మెదడు లోపలి రక్తనాళాలు చిట్లడంతో మెదడులో రక్తస్రావం కావడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ‘హేమరేజిక్‌ స్ట్రోక్‌’ అంటారు.
ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌ (టీఐఏ) అంటే : పక్షవాతం లక్షణాలు కనిపించాక అవి 24 గంటలలోపు తగ్గిపోయి రోగి రికవర్‌ అయితే దాన్ని ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌ అని అభివర్ణిస్తారు. అంటే...ఒక పెద్ద స్ట్రోక్‌ రావడానికి ముందు సూచనలుగా వాటిని భావించాలి. ఒకవేళ పై లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా రోగి వాటి నుంచి కోలుకోకపోతే దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు.
ఇవాల్వింగ్‌ స్ట్రోక్‌ : మన కళ్లెదుటే రోగికి కాళ్లూ చేతులూ క్రమంగా చచ్చుబడిపోతూ 10–20 నిమిషాల్లో పూర్తి స్థాయి స్ట్రోక్‌ రావడాన్ని ఇవాల్వింగ్‌ స్ట్రోక్‌ అంటారు.
ఈ టీఐఏ, ఇవాల్వింగ్‌ స్ట్రోక్‌లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయిస్తే పూర్తిస్థాయి స్ట్రోక్‌ రాకుండా నివారించవచ్చు. అందుకే పైన పేర్కొన్న ఏదైనా లక్షణం లేదా కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకుని భవిష్యత్తులో పక్షవాతం రాకుండా నివారించుకోవాలి.

స్ట్రోక్‌కు కారణాలు
వాస్తవానికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎవరికైనా రావచ్చు. అయితే 98% మందిలో ఈ కింది కారణాలు స్ట్రోక్‌కు దోహదపడతాయి. అవి... రక్తపోటు, డయాబెటిస్, పొగతాగడం, మద్యం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, ఒత్తిడికి గురికావడం, రక్తంలో కొవ్వు (కొలెస్ట్రాల్‌) ఎక్కువగా ఉండటం. ఇవిగాక గుండెజబ్బులు ఉన్నవారికి, రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉండటం కూడా స్ట్రోక్‌కు కారణాలు.
బీపీ పరిమాణం ఇలా... బీపీని గుండె పై, కింది గదుల స్పందనలతో కొలుస్తారు. దీన్ని సిస్టోలిక్‌/డయాస్టోలిక్‌ బీపీగా చెబుతారు. బీపీ పరిమాణం ఈ కింది విధంగా ఉంటే...
∙ 120 / 80 ఉంటే దాన్ని నార్మల్‌ బీపీగా పరిగణిస్తారు.
∙ 140 / 90 ఉంటే దాన్ని చాలా కొద్దిపాటి బీపీ (మైల్డ్‌ హైపర్‌టెన్షన్‌)గా చెబుతారు.
∙ 160 / 100 ఉంటే దాన్ని ఓ మోస్తరు బీపీ (మాడరేట్‌ హైపర్‌టెన్షన్‌)గా చెబుతారు.
∙ 200 / 110 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీ లేదా మాలిగ్నెంట్‌ హైపర్‌టెన్షన్‌ అంటారు.
మైల్డ్, మాడరేట్‌ హైపర్‌టెన్షన్‌ ఉన్నవాళ్లలో ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే హైబీపీ లేదా మాలిగ్నెంట్‌ హైపర్‌టెన్షన్‌ ఉన్నవాళ్లలో హేమరేజిక్‌ స్ట్రోక్‌ వచ్చేందుకు అవకాశం ఉంది.
స్ట్రోక్‌కు పైన పేర్కొన్న కారణాల్లో బీపీ, షుగర్, పొగతాగడం... వీటిని ప్రైమరీ వ్యాస్కులార్‌ రిస్క్‌ ఫ్యాక్టర్స్‌గా పేర్కొంటారు.

శరీరంలోని అన్ని రక్తనాళాల్లోనూ లోపలివైపు గోడల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి అవి గట్టిగా మారతాయి. అలా రక్తనాళాల్లో కొవ్వు అడ్డుకోవడాన్ని అథెరో స్లీ్కరోటిక్‌ బ్లాక్‌ అంటారు. దాంతో లోపలివైపు రక్తనాళాల సర్ఫేస్‌ రఫ్‌గా మారుతుంది. ఫలితంగా రక్తప్రసరణ స్మూత్‌గా కాకుండా అడ్డుకుంటూ ఉండటం వల్ల రక్తం గడ్డకట్టడానికి అవకాశం ఎక్కువ. రక్తనాళం క్రమేపీ పూడిపోయి, రక్తప్రసరణ తగ్గిపోయి... మెదడులోని ఏ భాగంలో రక్తసరఫరా లేదో ఆ భాగం దెబ్బతింటుంది. దాంతో మెదడులోని ఆ కేంద్రం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. షుగర్‌ పరిమాణం ఇలా... రక్తంలో చక్కెర పరిమా ణాలను రెండు దశల్లో కొలుస్తారు. మొదటిది పరగడుపున దీన్నే ఫాస్టింగ్‌ షుగర్‌ అంటారు. ఇక ఏదైనా తిన్న తర్వాత కొలిచే పరిమాణానికి పోస్ట్‌ ప్రాండియల్‌ షుగర్‌ అని పేరు. ఆ కొలతలు నార్మల్‌గా ఉండాల్సిన తీరు ఇది...

∙ ఫాస్టింగ్‌ ... 100
∙ పోస్ట్‌ప్రాండియల్‌... 160  
(ఈ కొలతలకు 10 అటూ, ఇటూగా ఉన్నా  ఫరవాలేదు)
∙ అయితే షుగర్‌ ఉండాల్సిన పరిమాణం కంటే తేడాలున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించి ఎక్కువగాన్న షుగర్‌ను నియంత్రించుకోవాలి.
కొలెస్ట్రాల్‌ : స్ట్రోక్‌కు మరో కారణం రక్తంలో కొవ్వు పాళ్లు ఎక్కువ ఉండటం. అందుకే వీటి నార్మల్‌ పరిమాణం ఎంతో తెలుసుకుని వాటిని అదుపులో ఉంచుకోవడం కూడా మంచిది.
∙ రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్‌... 200 కంటే తక్కువ ఉండాలి.
∙ చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ... 100 కంటే తక్కువ ఉండాలి.
∙ మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) ... 40 కంటే ఎక్కువగా ఉండాలి.
∙ ట్రైగ్లిజరైడ్స్‌ అనే రకం కొవ్వు ... 200 కంటే తక్కువగా ఉండాలి.

చికిత్స ఇలా...
స్ట్రోక్‌లోని రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. దాదాపు 80% లో మైల్డ్‌ స్ట్రోక్‌ మాత్రమే వస్తుంది. మిగతావారిలో 15% లో మాడరేట్‌ స్ట్రోక్‌ రావచ్చు. ఇక తీవ్రమైన స్ట్రోక్‌ కేవలం 5% లో మాత్రమే వస్తుంది. ఒకసారి స్ట్రోక్‌ వస్తే ఇక మంచాన పడిపోతామనే అపోహ చాలామందిలో ఉంది. అది సరికాదు. స్ట్రోక్‌లతో 95% కేవలం మైల్డ్, మాడరేట్‌ స్ట్రోక్‌లే కాబట్టి వాళ్లను చాలామట్టుకు ఔట్‌పేషంట్స్‌గానే చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చు. అది ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ అని నిర్ధారణ అయితే రక్తాన్ని పలుచబార్చే మందులు ఇస్తారు. దీనికి తోడు వాళ్లకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌ ఉంటే దానికి తగినట్లు ఆయా రుగ్మతలకు తగిన మందులు వాడతారు.

మైల్డ్, మాడరేట్‌ స్ట్రోక్‌లకుచికిత్స
మైల్డ్‌ స్ట్రోక్‌లో దాదాపు అందరినీ ఔట్‌పేషంట్‌ రోగిగానే పరిగణించి చికిత్స చేయవచ్చు. ఇక మాడరేట్‌ స్ట్రోక్‌కు గురైనవారిలో 80% కి ఔట్‌పేషంట్‌గానే చికిత్స చేయవచ్చు. కేవలం 20% లోనే హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేయాల్సిన అవసరం రావచ్చు. మైల్డ్, మాడరేట్‌ స్ట్రోక్స్‌ 100% తగ్గిపోయి, పూర్తిగా రికవర్‌ అవుతారు. ఇలా మైల్డ్, మాడరేట్‌ స్ట్రోక్స్‌ వచ్చినవారు ప్రతినెలా క్రమం తప్పకుండా ఫాలోఅప్స్‌ చేయించుకుంటే భవిష్యత్తులో స్ట్రోక్‌కు అవకాశం ఉండదు.

సివియర్‌ స్ట్రోక్‌కు చికిత్స...: స్ట్రోక్‌ రోగులందరిలో కేవలం 5% లోనే ఈ సివియర్‌ స్ట్రోక్‌ వస్తుంది. ఇది వచ్చినప్పుడు కాలు, చేయి పూర్తిగా పడిపోవడం, కొందరి పూర్తిగా స్పృహతప్పిపోవడం జరుగుతుంది. వీళ్లను తప్పనిసరిగా న్యూరో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లో చేర్చి చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీళ్లలోనూ దాదాపు 50%–70%  పూర్తిగా కోలుకుంటారు.  

రక్షించుకోండిలా... స్ట్రోక్‌ వచ్చినప్పుడు రోగిని...
∙మొదటి నాలుగున్నర గంటల్లోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే వాళ్లకు టిష్యూ ప్లాస్మెనోజిన్‌ యాక్టివేటర్‌ (టీపీఏ) అనే మందును నరంలోకి (ఇంట్రావీనస్‌గా) ఇస్తారు. దీన్ని ఇవ్వాలంటే ముందుగా సీటీ స్కాన్, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పరీక్ష చేసి ఈ టీపీఏ ఇవ్వవచ్చా అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు.

స్టెమ్‌ సెల్స్‌ చికిత్స : ఇటీవల కొన్ని దేశాల్లో స్టెమ్‌సెల్‌ థెరపీగా పేర్కొనే ఈ మూలకణ చికిత్సను చేస్తున్నారు.  స్ట్రోక్‌ వల్ల దెబ్బతిన్న మెదడు భాగాల్లో మూలకణాలను (స్టెమ్‌సెల్స్‌) ప్రవేశపెట్టడం వల్ల ఆయా భాగాలు మళ్లీ మెదడు కణాలుగా అభివృద్ధి చెంది ఆ భాగం తిరిగి పనిచేసేందుకు అవకాశం ఉంది.

న్యూరో ప్రొటెక్టార్స్‌ : సిటోకోలీన్, పిరాసిటామ్, అడర్వాన్, న్యూరోవైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి వాడటం వల్ల దెబ్బతిన్న మెదడు భాగాలు మళ్లీ కోలుకునేలా చేసేందుకు అవకాశం ఉంది. ఇది కూడా స్ట్రోక్‌ చికిత్సలో ఒక ప్రధాన ప్రక్రియ.

ఎండో వాస్క్యులార్‌ థ్రాంబెక్టమీ : చాలా ఉన్నతస్థాయి సంస్థలో జరిగిన ఈ ట్రయల్స్‌ తాలూకు అధ్యయనాల వల్ల చాలా ఉపయోగం ఉంది. గతంలో స్ట్రోక్‌ వచ్చిన వ్యక్తిని నాలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి తీసుకొస్తేనేనే అవయవాలు చచ్చుబడకుండా చూసేవారు. ఈ ‘ఎండో వాస్క్యులార్‌ థ్రాంబెక్టమీ’ వల్ల దాదాపు 24 గంటల వరకు చేరింది. ఈ పద్ధతిలో స్ట్రోక్‌ వల్ల వచ్చే చాలా అనర్థాలను  గణనీయంగా తగ్గించి, దాదాపు అందరినీ మామూలు వ్యక్తుల్లా చేసేందుకు అవకాశం ఉంది.

పక్షవాతం నివారణకు జలగ చేసే సాయం
జలగ శరీరానికి గాయం చేసి దాదాపు చాలాసేపు రక్తం పీలుస్తుంది. రక్తానికి ఉన్న గుణం ఏమిటంటే... ఒకసారి గాయం అయ్యాక అక్కడ రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఆ ప్రదేశంలో రక్తం గడ్డకడుతుంది. అయితే జలగ ఇలా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు తన లాలాజలంలోని హెపారిన్‌ అనే పదార్థాన్ని రక్తంలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తం గడ్డ కట్టే స్వభావాన్ని కోల్పోతుంది. ఈ హెపారిన్‌ రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుందని దాదాపు 40 ఏళ్ల క్రితమే కనుగొన్నారు. దాంతో స్ట్రోక్‌ వచ్చిన రోగుల్లో రక్తపు గడ్డను నివారించడానికి ఈ హెపారిన్‌ ఉపయోగం చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌ (టీఐఏ)లోనూ, ఇవాల్వింగ్‌ స్ట్రోక్‌ వచ్చిన సందర్భాల్లోనూ, గుండెకు సంబందించిన ధమనుల్లో (ఆర్టీరియల్‌ ఫిబ్య్రులేషన్‌) వచ్చే స్ట్రోక్స్‌లోనూ, మెదడుకు వచ్చే స్ట్రోక్స్‌ సీఎస్‌వీటీ (సెరిబ్రల్‌ సైనస్‌ వీనస్‌ థ్రాంబోసిస్‌)లలోనూ ఈ హెపారిన్‌ను ఉపయోగిస్తారు.

పక్షవాతం లక్షణాలు
పక్షవాతం అనగానే అందరికీ తెలిసిన ప్రధాన లక్షణం ఒక వైపు చేయీ, కాలూ చచ్చుపడిపోవడం. దీన్నే వైద్యపరిభాషలో ‘హెమీప్లీజియా’ అంటారు. కొందరిలో మూతి వంకరపోతుంది ∙కొందరు కళ్లు తిరిగి పడిపోతారు ∙కొందరు శరీరంపై అదుపు తప్పినట్లు నడుస్తారు. దీన్ని అటాక్సియా అంటారు ∙మరికొందరిలో ఒకవైపు చూపు పడిపోవడం లేదా దృష్టి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ కండిషన్‌ను ‘హెమీ అనోపియా’ అంటారు ∙కొందరు పూర్తిగా స్పృహతప్పిపోతారు ∙కొందరిలో మింగడం కష్టంగా ఉండవచ్చు. ఈ కండిషన్‌ను డిస్ఫేజియా అంటారు ∙కొందరికి ఎదుటనున్న వస్తువులు, మనుషులు ఒకటి రెండుగా/ఒకరు ఇద్దరుగా కనిపించవచ్చు. దీన్ని డిప్లోపియా అంటారు.

వైద్య పరీక్షలు
బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చిందని అనుమానం వచ్చినప్పుడు సీటీ స్కాన్‌ బ్రెయిన్‌ పరీక్ష చేయించాలి. దాంతో అది ఇస్కిమిక్‌ స్ట్రోకా లేదా హేమరేజిక్‌ స్ట్రోకా అన్నది నిర్ధారణ చేయవచ్చు. సీటీ స్కాన్‌ (బ్రెయిన్‌)లో అది నిర్ధారణ కాకపోతే ఎమ్మారై (బ్రెయిన్‌), ఎమ్మార్‌ యాంజియో ఇంట్రా క్రేనియల్‌ వెసెల్స్‌ పరీక్ష చేయించాలి. దాంతోపాటు టూడీ ఎకో, కెరోటిడ్‌ డాప్లర్, లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించడం, క్రమం తప్పకుండా షుగర్‌ పాళ్లు తెలుసుకోవడం, ఛెస్ట్‌ ఎక్స్‌రే చేయించడం... ఇవన్నీ రొటీన్‌గా చేయించే పరీక్షలు.

నివారణే ప్రధానం...
అస్సలు స్ట్రోక్‌ రాకముందే తీసుకునే జాగ్రత్తలను ‘ప్రైమరీ ప్రివెన్షన్‌’ అంటారు. అయితే మైల్డ్, మాడరేట్‌ స్ట్రోక్స్‌ వచ్చినవాళ్లు, అది తగ్గిన తర్వాత తీసుకునే జాగ్రత్తలను ‘సెకండరీ ప్రివెన్షన్‌’ అంటారు. ఒకసారి స్ట్రోక్‌ వచ్చి తగ్గినవారు తీసుకునే రక్తాన్ని పలుచబార్చే మందులు (బ్లడ్‌ థిన్నర్స్‌) మినహా అది ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్లలో మిగతా జాగ్రత్తలన్నీ ఒకేలా ఉంటాయి. పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆ నివారణ చర్యలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
1) లైఫ్‌స్టైల్‌లో మార్పులు 2) ఆహారంలో మార్పులు

లైఫ్‌ స్టైల్‌ మార్పులివి...
∙ ప్రతిరోజూ అరగంట నుంచి గంట సేపు వ్యాయామం చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదు రోజులు చేయాలి.
∙ ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
∙ వేళకు భోజనం చేయాలి, వేళకు నిద్రపోవాలి.
ఆహారంలో మార్పులివి...
∙ పాలు, మీగడ, వెన్న, నెయ్యి, మిఠాయిలు, నూనె పదార్థాలు తగ్గించాలి.
∙ కొవ్వు పదార్థాలను చాలా పరిమితంగానే తీసుకోవాలి.
∙ ఉప్పు కూడా కొంచెం తగ్గించాలి.
∙ తాజా కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
డాక్టర్‌ ఆశిష్‌ కుమార్, కన్సల్టెంట్‌ సెరెబ్రోవాస్కులార్‌ – ఎండో వాస్కులార్‌ న్యూరోసర్జన్‌ – స్ట్రోక్‌ స్పెషలిస్ట్, మ్యాక్స్‌క్యూర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement