కోమా నుంచీ బయటపడవచ్చు! | Coma: Types Causes Treatments Prognosis | Sakshi
Sakshi News home page

కోమా నుంచీ బయటపడవచ్చు!

Published Thu, Mar 25 2021 12:50 AM | Last Updated on Thu, Mar 25 2021 5:25 AM

Coma: Types Causes Treatments Prognosis - Sakshi

సినిమాల్లో కోమా కేసులను చూసి చూసి మనలో చాలామందికి ఓ దురభిప్రాయం ఉంది. కోమాలోకి వెళ్తే... అది దాదాపు గా మరణానికి ముందు దశ అనీ... అలా కోమాలోకి వెళ్లినవాళ్లు ఒక పట్టాన వెనక్కు రారని! కానీ... కోమాలోకి వెళ్లిన దాదాపు గా 80 శాతం కేసుల్లో మనుషులు వెనక్కు సురక్షితంగా వస్తుంటారు. ఇక కోమా గురించి మరో అపోహ కూడా ఉంది. అదేదో యాక్సిడెంట్‌ అయి... తలకూ, మెదడుకు తీవ్రమైన గాయం అయినవారిలోనే చాలామంది కోమాలోకి వెళ్తుంటారని!! కానీ... ఆహారంలో తగినంత ఉప్పు లేకపోవడం మొదలుకొని, ఓ సాయంత్రంవేళ ఆల్కహాల్‌ ఎక్కువగా తాగేసినా కోమాలోకి వెళ్తుంటారని. ఇలా కోమాపై ఎన్నెన్నో అపోహలు. అలాంటి అపోహలు తొలగిస్తూ... స్పృహతప్పిన స్థితి మరింత గాఢంగా ఉండటమే కోమా అనీ... ఏ 20 శాతం కేసులు మినహా మిగతా వాళ్లంతా  బయటపడేందుకు అవకాశముందని చెబుతూ ‘కోమా’పై అవగాహన పెంచే కథనం ఇది. 

స్పృహ కోల్పోవడం మనందరికీ తెలిసిందే. కోమా అంటే కూడా స్పృహ లేని స్థితే. కాకపోతే మరింత గాఢమైన స్థితి. అంటే ‘ప్రొఫౌండ్‌ అన్‌కాన్షియస్‌’ స్టేజ్‌ అని చెప్పవచ్చు. వెలుతురుకూ, నొప్పికీ, దెబ్బకూ లేదా మరే ఇతర అంశాలకూ స్పందన లేకుండా నిద్రా, మెలకువలు... ఈ రెండింటికీ అతీతమైన స్థితే... ‘కోమా’. కోమాకు నూరు కారణాలంటూ వైద్యుల మాటల్లో ఓ వాడుక ఉంది. అయితే సాధారణంగా కోమాకు మూడంటే మూడు ప్రధాన కారణాలుంటాయని చెప్పుకోవచ్చు.

1. మెదడుకు సంబంధించిన జబ్బులవల్ల కోమాలోకి జారిపోవడం. 2. శరీరంలోని ఇతర అవయవాల వల్ల కోమాలోకి వెళ్లడం. 3. ఇతర కారణాలు అంటే... ఆల్కహాల్, డ్రగ్స్, విషపదార్థాలు ఓరల్‌గా తీసుకోవడం వల్లగానీ,  కార్బన్‌డయాక్సైడ్, సయనైడ్‌ వంటి విషవాయువులు పీల్చడం వల్లగానీ లేదా ఒక్కోసారి వడదెబ్బ సింపుల్‌ వంటి కారణాలతోనూ కోమాలోకి వెళ్లడం. 

కోమా – కారణాలు: మెదడుకు సంబంధించని కారణాలతో కోమాలోకి వెళ్లడమన్నది సాధారణ వడదెబ్బ నుంచి మొదలుకొని దేహంలోని కీలకమైన అవయవాలకు (వైటల్‌ ఆర్గాన్స్‌) వచ్చే రకరకాల సమస్యల వరకు దేని కారణంగానైనా జరగవచ్చు.

కార్డియాక్‌ అరెస్ట్‌ – సాధారణంగా కార్డియాక్‌ అరెస్ట్‌తో గుండె ఆగినప్పుడు కార్డియోపల్మునరీ రిససియేషన్‌ (సీపీఆర్‌) అనే ప్రక్రియ ద్వారా గుండెపై మసాజ్‌ చేసినట్లుగా కొంత ఒత్తిడి కలిగిస్తూ దాన్ని తిరిగి పనిచేయించడానికి ప్రయత్నిస్తారు. ఈ సీపీఆర్‌ చాలాసేపు కొనసాగినప్పుడు వెళ్లే కోమా నుంచి బయటపడేసేందుకు రోగికి ‘హైపోథెర్మియా’ అనే ప్రక్రియతో చికిత్స చేస్తారు. డయాబెటిస్‌తో – సాధారణంగా డయాబెటిస్‌ ఉన్నవారు తమ దేహంలో చక్కెర పెరగడం వల్ల కలిగే అనర్థాలు రాకుండా ఉండేందుకంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సరిగ్గా ఆహారం తీసుకోకుండానూ మందులు మాత్రం వేళకు వేసుకుంటూ ఉంటారు. దాంతో అదనపు చక్కెరమీద పనిచేయాల్సిన మందులు... అన్నం తినని కారణంగా ఉన్న కొద్దిపాటి చక్కెరపైనా పనిచేసి, వాటినీ తగ్గించడంతో శరీరంలో చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతాయి.  

అంటే సాధారణంగా  100–140 వరకు ఉండాల్సిన షుగర్‌ లెవెల్స్‌ 30–20 కంటే తక్కువకు పడిపోతాయి. అలాంటప్పుడు రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని ‘హైపోగ్లైసీమిక్‌ కోమా’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో చక్కెర రోగులకు డాక్టర్లే చెప్పిమరీ చాక్లెట్‌ వంటి తీపిపదార్థాలు తినిపిస్తారు. ఇక ‘డయాబెటిక్‌ కోమా’ అని మరోటి ఉంది. చక్కెర రోగులు వారు తీసుకోవాల్సిన మందుల్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అలాగే సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల చక్కెరపాళ్లు విపరీతంగా పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు.  

ఇందులోనూ మళ్లీ రెండు రకాలు... 
1. చక్కెర పాళ్లు 500 ఎంజీ/డీఎల్‌ కంటే ఎక్కువగా పెరగడంతో కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని హైపర్‌ ఆస్మోలార్‌ కోమా అంటారు. 
2. దేహంలోని వ్యర్థాలు (కీటోన్స్, యాసిడ్స్‌) పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని ‘కీటో అసిడోటిక్‌ కోమా’ అంటారు. 

ఈ రెండు సందర్భాల్లోనూ ఇన్సులిన్, సెలైన్‌ ఇచ్చి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గించడం వల్ల కోమా స్థితి నుంచి వెనక్కు తీసుకురావచ్చు. హైపో న్యాట్రీమిక్‌ కోమా: మన శరీరంలో చక్కగా పనిచేయడానికి ఎన్నో లవణాలు అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు మనం తీసుకునే ఉప్పు ద్వారా మనకు ఒంట్లోకి సోడియం చేరుతుంది. ఇది 140–150 మిల్లీ ఈక్వివాలెంట్స్‌ పరిమాణంలో ఉండటం అన్నది సాధారణమైన కొలత.

ఆ పరిమాణం 110 కంటే తగ్గితే మనిషి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. బీపీకి చికిత్స తీసుకుంటున్నవారిలో మందుల వల్ల ఈ పరిస్థితి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కారణం... బీపీని నియంత్రించడానికి డాక్టర్లు ఉప్పు తగ్గించమంటారు. దాంతో కొందరు ఉప్పు పూర్తిగా మానేస్తారు. ఫలితంగా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ. ఐవీ ఫ్లుయిడ్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక ఎవరైనా రోగి పొటాషియం లవణాల లోపం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తే ముందే కాసిన్ని కొబ్బరినీళ్లు తాగించడం వల్ల కోమాను  నివారించవచ్చు. 

హైపర్‌ న్యాట్రీమిక్‌ కోమా: ఇది దేహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్య.  ఉదాహరణకు సోడియం పాళ్లు 165 మిల్లీ ఈక్వివలెంట్స్‌ కంటే ఎక్కువ కావడం వల్ల కూడా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 

లివర్‌ కోమా: కాలేయం చాలా జబ్బుల వల్ల దెబ్బతింటుంది. ఎక్కువగా కొవ్వుండే ఆహారపదార్థాలు తినేవారి నుంచి మొదలుకొని... హెచ్‌బీసీ, హెచ్‌బీబీ వంటి వైరస్‌ల వల్ల లివర్‌ దెబ్బతిన్నప్పుడు కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. 

కిడ్నీ కోమా: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి. అయితే ఇందులో 99% డయాబెటిస్‌ కారణంగా కిడ్నీలు దెబ్బతిని, కోమాలోకి వెళ్లే కేసులే ఎక్కువ. ఇలాంటివారికి డయాలసిస్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. 

గ్లాస్‌గో కోమా స్కేల్‌
కోమా తీవ్రతను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్‌ను ‘గ్లాస్‌గో కోమా స్కేల్‌’గా చెబుతారు. ఇందులో స్కేల్‌ అంటూ ఏదీ ఉండదుగానీ.. రోగికి ఇస్తున్న సూచనల ఆధారంగా  వారు స్పందించే ఒక్కోరకమైన స్పందనకూ ఒక్కో స్కోర్‌ ఇస్తారు. ఉదాహరణకు కనురెప్పలు కదిలించమంటూ సూచన ఇస్తే వారు కనబరిచే కంటి కదలికలకూ, నోటిమాటకు స్పందించే తీరుకు, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్‌ ఉంటుంది. ఇందులో డాక్టర్‌ ఇచ్చిన ఏ ఆదేశానికీ స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్‌ మూడుగా నమోదవుతుంది. అలాగే డాక్టర్‌ ఆదేశాలకు రోగినుంచి  స్పందనలు పెరుగుతున్న కొద్దీ స్కోర్‌ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్‌ ఉంటే అది రోగి నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అన్నమాట.

అదే స్కోర్‌ పెరిగి అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్‌గా 15 ఉంటుంది. అంటే గ్లోస్‌గో స్కేల్‌ ఆదేశాలకు రోగి స్పందిస్తున్న కొద్దీ కోమా నుంచి దూరం అవుతున్నాడన్నాడని అర్థం. కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే రోగిని బాగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా ఒకవైపునకు తిరిగి ఉండేలా పడుకోబెట్టాలి. నోట్లో గుడ్డలు కుక్కడం వంటివి చేయవద్దు. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం వంటివి సరికాదు. స్పృహలోకి తెప్పించేందుకు చేసే ఈ పనులు రోగులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు.

ఓ వ్యక్తికి ప్రమాదంలో మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఇలా కోమా చాలా పెద్దకారణాల వల్లనే కాకుండా, చిన్న చిన్న కారణాల వల్ల కూడా కలగవచ్చు. వాటిని చక్కదిద్దితే దాదాపు 80 శాతం రోగుల్లో కోమాను నివారించవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ...కోమాలో రోగికి చేయాల్సిన ప్రథమ చికిత్సను ఏబీసీగా చెప్పవచ్చు. 

►ఏ – ఎయిర్‌ వే... అంటే ఊపిరి తీసుకోడానికి నోట్లో గల్ల వంటిది ఉంటే గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. 
►బి – బ్రీతింగ్‌ ... అంటే గాలి బాగా ఆడేలా, ఊపిరి తీసుకోగలిగేలా చూడాలి. 
►సి – సర్క్యులేషన్‌... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపడం వల్ల. ఈ మూడు ప్రాథమిక విషయాలను కాస్తంత విపులీకరించి చూస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ఈ ప్రథమ చికిత్సల తర్వాత తప్పనిసరిగా రోగిని వీలైనంత త్వరగా డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement