పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబు వయసు పదకొండేళ్లు. తరచూ తలనొప్పి తో చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు తలనొప్పి చాలా అరుదుగా వచ్చేది. కానీ ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. – ఎల్. రామస్వామి, కాకినాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు.
నివారణ / చికిత్స: ∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ∙నుదుటిపై చల్లటి నీటితో అద్దడం ∙నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు యాస్పిరిన్ లేదా ఎన్‌ఎస్‌ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం ∙నీళ్లు ఎక్కువగా తాగించడం ∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలామట్టుకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి.
వర్షం,వాతావరణంఉంటే చాలు... ముక్కులుబిగదీసుకు పోతున్నాయి!
మా పాప వయసు ఏడేళ్లు. కాస్తంత మబ్బు పట్టి వాన వచ్చేలాంటి వాతావరణం ఉంటే చాలు పాపకు జలుబు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వాతావరణంలో రాత్రుళ్లు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతూ ఏడుస్తోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. – జి. రమణి, చిత్తూరు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర (నేసల్ మ్యూకోజా) ఇన్‌ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కు లోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా రైనైటిస్‌లో కనిపిస్తాయి. కొంతమందిలో ఎప్పుడూ (పెరిన్నియల్‌గా) కనిపించే ఈ సమస్య మరికొందరిలో అప్పుడప్పుడు (సీజనల్)గా కనిపిస్తుంటుంది. ఇది అలర్జీ వల్లనే కాకుండా ఇన్ఫెక్షన్స్‌కు సంబంధం లేని ఇతర సమస్యలు (నాన్‌ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా) రావచ్చు. అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్‌సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా ఇది వస్తుంది. మీ పాప విషయంలో మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యలో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ– కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, పెయింట్ వంటి ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువుల ఒంటి మీద వెంట్రుకలు, దుమ్మూ ధూళి, కాలుష్యాల వంటి వాటికి పాపను దూరంగా ఉంచాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.
పాపకు నోట్లో పొక్కులు... తగ్గేదెలా?
మా పాప వయసు ఆరున్నర ఏళ్లు. కొద్ది రోజుల కిందట పాప గొంతు నొప్పి అంటే డాక్టర్‌కు చూపిం చాం. అప్పుడు తగ్గాయి కానీ మళ్లీ పాప నోటిలో, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. చాలా నొప్పిగా ఉంటోందని చెబుతోంది. గొంతు అంతా ఎర్రబారింది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి. – ఈశ్వరీబాయి, కరీంనగర్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ∙ఉద్వేగపరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్‌లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్‌లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, అబ్రేసివ్ ఫుడ్స్ వంటి కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి.దీనికి ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్‌ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్‌తో ఇది వస్తున్నట్లు భావించవచ్చు.ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాలి. అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో చికిత్స తీసుకోండి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment