నా వయసు 39 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – డి. జ్ఞానేశ్వర్‌రావు, కంచికచర్ల
గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు.
కారణాలు
∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు.
లక్షణాలు
∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా
ఆకస్మికంగా కనిపిస్తాయి.
∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది.
∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది.
∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
నివారణ / జాగ్రత్తలు
మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి.
చికిత్స
హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్‌స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్
ఇంటర్నేషనల్, హైదరాబాద్
కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి
నా వయసు 48 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? – ఎల్. లక్ష్మీబాయి, నిజామాబాద్
మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. ఇటీవలికాలంలో రోజురోజుకూ వేరికోస్ వెయిన్స్ వ్యాధి బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం
వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం
వ్యాధి నిర్ధారణ అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్.
చికిత్స వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామాధిలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
సైనసైటిస్ తగ్గుతుందా?
నా వయసు 36 ఏళ్లు. చాలాకాలంగా ముక్కుతో గాలి పీల్చుకోవడం కష్టం కావడంతో పాటు తలనొప్పి సమస్యలతో బాధపడుతుంటాను. డాక్టర్‌ను సంప్రదిస్తే సైనసైటిస్ అని చెప్పారు. చాలా రకాల మందులు వాడాను. వాడినప్పుడు కొద్దిపాటి ఉపశమనమేగానీ సమస్య తగ్గడం లేదు. హోమియోలో శాశ్వత చికిత్స ఉందా? – ఎస్. సురేందర్, వరంగల్
సైనస్ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్‌ల లోపలివైపున మ్యూకస్ మెంబ్రేన్ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి వేడిమిని మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది.
సైనసైటిస్ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టం కావడం ∙ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం ∙కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య తలనొప్పి రావడం ∙తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్‌ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. ఎక్స్–రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు. సైనస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచన విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి...
హెపార్ సల్ఫూరికమ్ అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. ∙మెర్క్‌సాల్ : రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టాక్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును
నిర్ణయిస్తారు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి,
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment