
‘శుభం’ దగ్గరికి వచ్చేసింది 2017. అనడానికి శుభమే కానీ, సౌత్ సినీ ఇండస్ట్రీకి మొత్తమంతా శుభంగా ఏమీ జరగలేదు! పిక్చర్ హిట్‌లు, ఫట్‌ల మాట అటుంచండి. మాట జారడం, ముక్కుసూటిగా మాట్లాడ్డం.. ఈ ఏడాది పెద్ద కాంట్రవర్సీలు అయ్యాయి. కొందరు జైలుకు వెళ్లారు. కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు ‘సారీ’ చెప్పారు. కొందరు సవాళ్లు విసిరారు. ఇవన్నీ ఇక్కడితో ఆగిపోతే బాగుంటుంది. కొత్త సంవత్సరం హ్యాపీగా మొదలౌతుంది. ఇంతకీ ఏమిటా కాంట్రవర్సీలు?
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆడియెన్స్ టెన్షన్. బాహుబలి 2ని కన్నడిగులు రిలీజ్ చెయ్యనిస్తారా? సత్యరాజ్ టెన్షన్. రాజమౌళి కూల్‌గానే ఉన్నాడు. కూల్ కావలసింది కన్నడ ప్రేక్షకులు. తొమ్మిదేళ్ల క్రితం కావేరీ నీళ్ల గొడవలో సత్యరాజ్ కత్తి బయటికి తీశాడు. కత్తి అంటే కత్తి కాదు. యాంటీ–కన్నడ స్టేట్‌మెంట్.
కావేరీ నీళ్లివ్వకపోతే నీళ్లకు బదులు ఇంకేవో పారతాయన్న అర్థంలో ఏదో అన్నాడు సత్యరాజ్. ఆ వీడియో సడన్‌గా నెట్‌లో పైకి తేలింది. కన్నడిగులు భగ్గుమన్నారు. టైమ్ చూసి సినిమా గేట్‌లు బంద్ చేశారు. బాహుబలి 2ని కర్ణాటకలో ఆడనివ్వం అన్నారు. నీళ్లు చల్లితే మంటలు చల్లారతాయి. నీళ్ల వల్లే మంటలు రేగితే? సత్యరాజ్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. రాజమౌళి నీళ్లు చల్లి కట్టప్పని కూర్చోబెట్టాడు. ‘పర్లేదు ఏం కాదు’ అన్నాడు. ఇద్దరూ విడివిడిగా వీడియోలు రిలీజ్ చేశారు. ‘అర్థం చేసుకోండి ప్లీజ్’ అని రాజమౌళి రిక్వెస్ట్ చేశాడు. ‘హర్ట్ చేసి ఉంటే సారీ’ అని సత్యరాజ్ ప్లీజ్ చేశాడు. కన్నడిగులు చల్లబడ్డారు.
సెన్సార్ కత్తెర తీసింది
గవర్నమెంట్‌ని ఏదైనా అనాలంటే గట్స్ ఉండాలి. ఉంటే మాత్రం ఎందుకంటాం చెప్పంyì ? అసలే గవర్నమెంట్! ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది. ‘మెర్సల్’ని కూడా అలాగే కట్ చేయబోయింది. సెన్సార్ బోర్డు కూడా కత్తెరతో రెడీ అయి కూర్చుంది. జీఎస్టీకి యాంటీగా అందులో హీరో డైలాగులు కొడతాడు. వాటిని కట్ చెయ్యాలని పై నుంచి ఆర్డర్స్! లేకపోతే బ్యాన్. ‘కట్ చెయ్యనివ్వం. బ్యాన్ కానివ్వం’ అని తమిళ్ ఆడియన్స్ థియేటర్‌ల దగ్గరికి గస్తీగా వచ్చి కూర్చున్నారు. పిక్చర్ బతికింది. ‘మెర్సల్’ రిలీజ్‌కు ముందు కూడా.. లోపల జీఎస్టీని చూసి.. సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ ‘నో’ అంది. రోడ్లు బ్లాక్ చేసి, ధర్నాలు చేసి మరీ బాక్సులు విడిపించుకున్నారు. ఈ ఏడాది సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద అతి పెద్ద కాంట్రావర్శి.. మెర్సల్.
దిలీప్ జైలుకెళ్లొచ్చాడు
ఫిబ్రవరిలో దిలీప్ సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చాడు. కోలీవుడ్‌కి మాత్రమే ఆ షాక్ లిమిట్ కాలేదు. సౌత్ మొత్తానికీ కొట్టింది. ఆయనేం బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు. ‘బ్యాడ్‌మ్యాన్’గా బయటికొచ్చాడు! మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న ఓ బ్యూటిఫుల్ స్టార్‌లెట్‌ని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించడానికి కుట్ర పన్నాడని పోలీసులు దిలీప్‌ని అరెస్ట్ చేశారు. రెండు నెలలు జైల్లో ఉండి, బెయిల్‌పై బయటికి వచ్చాడు.
హీరోకి విలన్ బుద్ధేమిటి అని అభిమానులు తలవంపుగా ఫీల్ అయ్యారు. మనకీ ఖర్మ ఏమిటి అని ‘రామ్‌లీల’ నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అందులో దిలీప్‌ది లీడ్ రోల్. పొలిటికల్ కాన్‌స్పిరసీ థ్రిల్లర్. సరిగ్గా రిలీజ్‌కి రెడీగా ఉన్నప్పుడు దిలీప్ అరెస్ట్ అయ్యాడు. దిలీప్ మీద కోపం సినిమా పైకి మళ్లింది. మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నాయి. దిలీప్‌ని వేరుగా, సినిమాను వేరుగా చూడండి అని ఇండస్ట్రీ ప్రాధేయపడింది. సినిమా రిలీజ్ అయింది! అవడమే కాదు, బ్లాక్‌బస్టర్ అయింది! దిలీప్ పాత్రను పాత్రగానే చూసింది కోలీవుడ్. అపహరణ కేసులో దిలీప్ పాత్రేమిటో ఇంకా తేల్లేదు. కేసు నడుస్తోంది.
ఫొటోలు లీక్ అయ్యాయి
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది మోస్ట్ కంగాళీ వ్యవహారం ‘సుచీలీక్స్’. శుచీ శుభ్రత ఏమాత్రం లేని లీక్స్! తమిళ్ సింగర్, రేడియో జాకీ సుచిత్రా కార్తీక్ తన ట్విట్టర్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఎవరెవరో ఎవరెవరితోనో ఉన్న మూవీస్టార్‌ల ఫొటోలు అవి. వాటిల్లో ధనుష్ కూడా ఉన్నాడు.
కొన్ని గంటల తర్వాత సుచిత్ర వాటిని డిలీట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ కొత్త ఫొటోలు పెట్టింది. సుచిత్ర భర్త నెత్తీనోరూ బాదుకుంటూ, ‘నా భార్య మెంటల్ కండిషన్ బాగోలేదు’ అంటూ ఓ వీడియో అప్‌లోడ్ చేశాడు. ‘ఇదేం గొడవ తల్లీ..’ అని పోలీసులు వెళ్లి అడిగితే, ‘నా ట్విట్టర్ అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు’ అంది సుచిత్ర. ‘ఇంకా ఏవైనా లీక్స్ ఉన్నాయా చెప్పు’ అని అడిగారు. ఆ సంగతి హ్యాక్ చేసినవాళ్లకు కదా తెలుస్తుందీ’ అని అమాయకంగా కనురెప్పలు టపటపలాడించింది. మీడియా ఈ వ్యవహారానికి ‘సుచీలీక్స్’ అని పేరు పెట్టింది.
వల్గర్‌గా మాట్లాడారు!
ధన్యా రాజేంద్రన్ చెన్నై జర్నలిస్ట్. విజయ్ సినిమా ‘సుర’ మీద ట్విట్టర్‌లో క్యాజువల్‌గా ఆమె పెట్టిన కామెంట్‌కి విజయ్ అభిమానులంతా ఇంతెత్తున లేచారు. నానా మాటలు అన్నారు. రేప్ చేసి చంపుతాం అన్నారు. ఇంతాచేసి ‘సుర’ సినిమాను ఆమె డైరెక్టుగా ఏమీ అనలేదు. ఆ ‘సుర’ కూడా ఇప్పుడు రిలీజ్ అయింది కాదు. ఏడేళ్ల నాటిది!
‘‘షారుక్ ఖాన్ మూవీ ‘వెన్ హ్యారీ మెట్ సెజల్’ని చూశాను తల వాచి పోయింది. ఇంతకన్నా ‘సుర’ మూవీనే నయం. కనీసం ఇంటర్వెల్ వరకైనా చూడగలిగాను’’ అని ధన్య ట్వీట్ చేశాక ఆమెకు నరకం మొదలైంది. ‘‘ఆమె జర్నలిస్టు. విమర్శించే హక్కు ఉంటుంది. కానీ ఆ వెటకారమే మాకు నచ్చడం లేదు’’ అని మాత్రం ఒక మర్యాదపూర్వకమైన ట్వీట్ వచ్చింది ధన్యకు. చివరికి విజయ్ సీన్‌లోకి వచ్చి.. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’’అని స్టేట్‌మెంట్ ఇచ్చాక గానీ ట్వీట్ల వర్షం ఆగలేదు.
మమ్ముట్టీ ఫ్యాన్స్‌కి మండింది
మలయాళం మూవీ ‘అంగమలి డైరీస్’తో అన్నా రేష్మా రాజన్ ఈ యేడాదే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చింది. చాలామందికి నచ్చింది. మీడియావాళ్లక్కూడ. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రేష్మా రాంగ్ స్టెప్ వేసింది. నిజానికి అది రాంగ్ స్టెప్ కాదు. మమ్ముట్టీ, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్‌ల అభిమానులకు రాంగ్ అయింది.
‘‘మమ్ముట్టీ, దుల్కర్ ఇద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేస్తుంటే.. మీరు ఎవరి పక్కన నటించడానికి ఇష్టపడతారు?’’ అన్నది క్వశ్చన్. వెంటనే రేష్మ.. దుల్కర్ పేరు చెప్పింది. ‘ఎందుకు?’ అనంటే, ‘మమ్ముట్టీ తండ్రి పాత్రకు బాగుంటారు’ అంది. అంతే.. ఆమె మీద ట్రాల్స్ మొదలయ్యాయి. ‘మోహన్‌లాల్ కావాలి కానీ, మమ్ముట్టీ వద్దా నీకు..’ అని వల్గర్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. (‘అంగమలి డైరీస్’ తర్వాత ‘వెలిపడింటే పుస్తకం’ అనే సినిమాలో మోహన్‌లాల్ పక్కన యాక్ట్ చేసింది రేష్మ). రేష్మ ఏడ్చేసింది. ఇంట్లో ఒక్కతే కూర్చొని కాదు. ఏడుస్తూ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్తున్న వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టింది.
కసాబా కామెంట్‌పై గొడవైంది
పార్వతి ఇంకో కేరళ కుట్టి. ముక్కుసూటి నటి. ఏడ్చే టైపు కాదు. ఈ ఏడాది కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్యానెల్ మెంబర్‌గా ఆమె మమ్ముట్టి ‘కసాబా’ మూవీని విమర్శించింది. అందులో మమ్ముట్టీ పోలీస్ ఆఫీసర్. రఫ్ క్యారెక్టర్. ఓ సీన్‌లో అతడు ఉమన్ పోలీస్ ఆఫీసర్ నడుముకు ఉన్న బెల్టును పట్టి లాగుతూ, స్త్రీల ప్రతిభను తక్కువ చేసే డైలాగులు చెప్తాడు. పార్వతికి అది నచ్చలేదు. బ్యాడ్ క్యారెక్టర్ అంది. మమ్ముట్టిని అనలేదు. మమ్ముట్టి వేసిన క్యారెక్టర్‌ని అంది. అది అర్థం చేసుకోకండా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో పార్వతిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు.
స్టేజీ మీదే తిట్టేశారు
సాయి ధన్సిక కన్నీళ్లు పెట్టుకోవడం, అమలాపాల్ బాగా హర్ట్ అవడం కూడా ఏడాది టాక్ ఆఫ్ ది సౌత్ అయింది. నవంబర్‌లో రిలీజ్ అయిన ‘విళిత్తిరు’ మూవీ ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ రాజేంద్రన్ (ఆ సినిమా డైరెక్టర్ కాదు)ను సాయి ధన్సిక స్టేజ్ మీదకు ఆహ్వానించడం మర్చిపోవడం ఆయన అభిమానులకు బాగా కోపం తెప్పించింది. అమలాపాల్‌కు జరిగిన ఇన్‌సల్ట్ వేరే ఇంకో ప్రోగ్రామ్‌లో. అమల లేని ఆ స్టేజ్‌పైన అమలను తిట్టింది ఎడిటర్ లెనిన్.
ఒక ఇంటర్వ్యూలో అమల చెప్పిన మాటల్ని అపార్థం చేసుకుని అమలను కించపరిచేలా ఆయన మాట్లాడాడు. ‘తిరుట్టు పాయలే 2’ చిత్రం పోస్టర్‌లలో అమల నాభి కనిపిస్తుంది. దీనిపై విమర్శలు వచ్చినప్పుడు.. 2017లో కూడా మనం హీరోయిన్ నాభి గురించి మాట్లాడుతున్నాం అని అమల ఆశ్చర్యపోయింది. ఆ మాట లెనిన్‌కి కోపం తెప్పించింది. ‘నాభికేం కర్మ, నాభి లోపలికి కూడా చూపించేస్తారు ఈ హీరోయిన్‌లు.. ఛీ’ అన్నాడు! నేషనల్ అవార్డు విన్నర్ అయిన లెనిన్ ఇలా సంస్కారం లేకుండా మాట్లాడ్డంతో ఇండస్ట్రీ విస్తుపోయింది.
శింబూ తల తెగబోయింది
2017లో ఇంకో పెద్ద కాంట్రవర్శీ... శింబూ షూటింగ్‌లను ఎగ్గొట్టి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం. అతని ఇండిసిప్లీన్ బిహేవియర్ వల్ల స్కెడ్యూళ్లు దెబ్బతిని తమకు నష్టాలు వచ్చాయని మరికొందరు నిర్మాతలు బయటికి వచ్చారు. శింబును అసలే ఏ సినిమాలోకీ తీసుకోకూడదని తీర్మానించారు. శింబూ సారీ చెప్పి తప్పించుకున్నాడు.
తమిళ్, కన్నడం, మలయాళం అయ్యాయి. ఇక తెలుగు ఒక్కటి మిగిలింది. ఇక్కడేం లేవా? పెద్దగా లేవు. ఉన్న ఒకదాన్నీ పెద్దది చేద్దామని మీడియా చూసింది కానీ, తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మీకు గుర్తుండే ఉంటుంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో నటుడు చలపతిరావుని మాట్లాడించి, íసినిమాలోని ఒక డైలాగ్‌కి ఆయన చేత ఆన్సర్ చెప్పించడంతో వివాదం మొదలైంది.
ఇవండీ..
2017లో అభిమానుల యాటిట్యూడ్ వల్ల యాక్టర్‌లకు వచ్చిన తిప్పలు, తలనొప్పులు; యాక్టర్‌ల బోల్డ్ బిహేవియర్ వాళ్ల అభిమానులకు వచ్చిన కోపాలు, తాపాలు.
Comments
Please login to add a commentAdd a comment