బహుశా యోగాలో జాగింగ్ అనేది కొత్త పదంగా అనిపిస్తుంది. దీని వివరాల్లోకి వెళితే... అన్ని అంగచాలనాలు శిరస్సు నుండి పాదాల వరకు పూర్తి చేసిన తరువాత, వెన్నెముకకు సంబంధించిన అయిదు రకాల మేరు చాలనాలను సాధన చేయాలి. వీటన్నింటి తర్వాత... చివరలో చేసేదే యోగిక్ / కార్డియాక్ జాగింగ్.
ఈ యోగిక్ జాగింగ్‌ను 5 నిమిషాల పాటు చేసి శవాసనంలో విశ్రాంతి తీసుకున్నట్లయితే శరీరం, మనస్సు రెండు సాంత్వన పొందుతాయి. ఇవి ఎలా చేయాలో తెలుసుకునే ముందే దీనివలన కలిగే లాభాలు ఏమిటో చూద్దాం.
ఎ) శరీరంలో అన్ని భాగాలకు రక్తప్రసరణ జరిగి ప్రతికణానికి సరైన పోషణ జరగటం వలన ఆరోగ్యవంతమైన కణజాలానికి, కణాల జీవకాలం పెరగడానికి అవకాశం ఉంటుంది.
బి) శరీరంలో కండర వ్యవస్థ (మస్క్యులర్ స్కెలెటల్ సిస్టమ్), ఎముకల వ్యవస్థ దృఢంగా తయారవుతుంది. తద్వారా మెటబాలిక్ రేటు (జీవక్రియ) పెరుగుతుంది. పేరుకుపోయిన కొవ్వు పదార్థాలు కరిగి శక్తి కింద మారుతుంది.
సి) వెయిట్ మేనేజ్‌మెంట్, ఫాట్ మెటబాలిజమ్ మెరుగవడానికి ఉపయోగపడుతుంది. అన్ని కీళ్ళకు వ్యాయామం జరగడం వలన ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారించవచ్చు, పరిష్కరించవచ్చు.
డి) వీటన్నిటికన్నా కూడా హృదయ కండర వ్యవస్థకు కార్డియో–రెస్పిరేటరీ వ్యవస్థకు చాలా మంచిది. ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. అంటే గుండె సామర్థ్యం పెరగడం వలన ఎక్కువసేపు శారీరక శ్రమ చేసినప్పటికీ గుండె అలసిపోదు. రికవరీ రేటు బాగుంటుంది. అంటే గుండె బాగా అలసిపోయిన తరువాత తిరిగి విశ్రాంత స్థితికి చేరుకోవడానికి పట్టే సమయం తగ్గుతుంది. అందువల్లనే దీనిని కార్డియాక్ జాగింగ్ అని కూడా పిలుస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నెమ్మదిగా మొదలుపెట్టాలి. కొంచెం కొంచెం స్పీడు పికప్ చేయాలి. మళ్ళీ నెమ్మదిగా ముగించాలి. మొత్తం వ్యవధి మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాలకు మించి ఉండకూడదు. ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్య ఉన్నవాళ్ళు హృదయ సమస్యలు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవాళ్ళు స్పీడుగా చేయకూడదు. కావాలంటే చేసే వ్యవధిని బాగా తగ్గించండి. మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ చేయండి.
1) మడమలు పిరుదులను తాకేటట్లు: జాగింగ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్‌లో (ఆల్టర్నేట్ లెగ్) కాలు మార్చి కాలు వెనుక హిప్‌కు తగిలేటట్లుగా చేయాలి. (వ్యవధి 1 నిమిషం)
2) మోకాలు ముందు పై వైపుకి అంటే మోకాలు ఛాతీకి దగ్గరగా వచ్చేటట్లు: రెండోమోకాలు పైకి కిందకు వచ్చేటట్లు జాగింగ్ చేయాలి. (వ్యవధి 1 నిమిషం)
3) సాధారణ జాగింగ్ – మోకాళ్ళను సమంగా పైకి లేపుతూ: చేతులను కూడా పైకి తీసుకువెడుతూ మళ్ళీ కిందకు తీసుకువస్తూ చేతివేళ్ళను బాగా షేక్ చేస్తూ చేయాలి. (వ్యవధి 1 నిమిషం)
శవాసన /యోగనిద్ర: శవాసనంలో రిలాక్స్ అయి అన్ని జాయింట్స్‌ని, కండరాలని వదులుగా ఉంచి పాదాలు పక్కకు, అరచేతులు నడుము పక్కన సుఖపూర్వక స్థితిలో ఉంచాలి. కండరాలు పట్టుకున్నట్లయితే వాటిని కదిలించి వదులుగా చేయాలి. శ్వాస వేగంగా ఉన్నప్పుడు శ్వాస తీసుకుని వదిలే ప్రయత్నం చేయకుండా శ్వాస సాధారణ స్థితికి వచ్చిన తరువాత రెండు మూడు దీర్ఘ శ్వాసలు తీసుకుని వదుల్తూ బాడీకి ఆక్సిజన్ అందిస్తూ, శిరస్సు పైభాగం నుండి కాలి చివరి వరకూ అన్ని అంగాలను కనీసం రెండు నిమిషాలు మనోనేత్రంతో వీక్షిస్తూ విశ్రాంత స్థితిలో ఉండాలి. ఈ యోగనిద్ర సాధన 5 నిమిషాలు చాలు. శరీరం మనస్సు తిరిగి పూర్తి శక్తిని పొందుతాయి.
- ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్
– సమన్వయం ఎస్. సత్యబాబు
- మోడల్: రీనా
Comments
Please login to add a commentAdd a comment