jogging
-
కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్
ఓ స్మార్ట్ వాచ్ 42 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడింది. మార్నింగ్ జాగింగ్‌కు వెళ్లిన కంపెనీ సీఈవోకు ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో.. స్మార్ట్‌వాచ్ అతన్ని రక్షించింది. స్మార్ట్‌ఫోన్ సాయంతో భార్యకు సమాచారం ఇవ్వగా.. నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. గుండెపోటు నుంచి బయటపడటానికి స్మార్ట్ వాచ్ ఎలా సాయపడిందనే విషయాన్ని ఆయనే స్వయంగా వివరించారు. ఈఘటన బ్రిటన్‌లో జరిగింది. హాకీ వేల్స్ కంపెనీ సీఈవో పాల్ వాపమ్ స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలో నివిసిస్తుంటారు. ఆయనకు రోజూ జాగింగ్‌కు వెళ్లడం అలవాటు. ఓ రోజు ఉదయం 7 గంటలకు ఇంటి సమీపంలోనే జాగింగ్‌కు వెళ్లారు. పరుగెత్తుతుండగా అయిదు నిమిషాలకు అకస్మాత్తుగా అతనికి ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. గుండె బిగుతుగా అనిపించడంతో ఒక్కసారిగా రోడ్డుమీద కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికున్న స్మార్ట్ వాచ్ ద్వారా భార్య లారాకు ఫోన్ చేశాడు. ఆమె అక్కడికి చేరుకొని తన కారులో అతన్ని నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. చదవండి: బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు డాక్టర్లు సైతం సరైన సమయంలో వైద్యం అదించడంతో సీఈవో ప్రాణాలు నిలిచాయి. అయితే గుండె ధమనుల్లో ఒకటి పూర్తిగా బ్లాక్ అవ్వడం కారణంగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అదే ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసుకొని ఆరు రోజులు తరువాత ఇంటికి చేరుకున్నారు. కాగా ఈ ఘటన తనతోపాటు తన కుటుంబాన్ని షాక్‌కు గురి చేసిందని చెప్పారు. అంతేగాక తనకు ఉబకాయ సమస్యలు ఏం లేవని రోజు ధృడంగా ఉండటానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సరైన సమయంలో సాయం చేసిన స్మార్ట్ వాచ్, భార్య, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కాలంలో ఆపిల్ వాచ్ సిరీస్ 8 వంటి ఎల్టీఈ కనెక్టివిటీ, ఈ-సిమ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్‌లలో ఫోన్లు దగ్గరలో లేకునప్పటికీ కాల్ చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల గతంలో గుండెపోటు లక్షణాలను స్మార్ట్‌వాచ్‌లు ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయడంతో పలువురి ప్రాణాలు దక్కిన విషయం తెలిసిందే. స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండే హార్ట్‌రేట్, ఈసీజీ వంటి సెన్సర్లు గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి. -
Video: చీరకట్టు, స్మార్ట్ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 12 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్, స్పెయిన్‌కు వెళ్లారు. ప్రస్తుతం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా అక్కడ ఆమె జాగింగ్ చేస్తూ కనిపించారు. చీర కట్టులో.. స్మార్ట్ వాచ్ ధరించి, రబ్బరు చెప్పులు వేసుకుని మరీ.. మాడ్రిడ్ పార్క్‌లో మమతా బెనర్జీ జాగింగ్ చేశారు. దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘మార్నింగ్ రిఫ్రెష్. ఉదయమే జాగింగ్ చేస్తే రోజుకు కావాల్సిన శక్తి వస్తుంది. అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి’ అంటూ ఆమె ఆ పోస్టుకు కామెంట్ కూడా చేశారు. కాగా సాధారణంగా ప్రతి రోజూ ట్రెడ్‌మిల్‌పై జాగ్ చేస్తుంటారు. గతంలోనూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ.. వివిధ సందర్భాల్లో చెప్పుకొస్తూ ఉంటారు. ఓసారి ఆమె డార్జిలింగ్ కొండల్లో 10 కిలోమీటర్లు జాగింగ్ చేసి ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 12 రోజుల పాటు దుబాయ్, స్పెయిన్ పర్యటనకు వెళ్లిన దీదీ ప్రముఖ స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ అయిన లా లిగా అధ్యక్షుడితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. లా లిగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్‌లో ఒకటి. చదవండి: జోరు వానలో ల్యాండింగ్.. ముంబైలో విమాన ప్రమాదం View this post on Instagram A post shared by Mamata Banerjee (@mamataofficial) View this post on Instagram A post shared by Mamata Banerjee (@mamataofficial) -
OU: ఓయూ తీరుపై విమర్శలు.. ‘నడకకు రేటు కడితే ఎలా..?’
సాక్షి, హైదరాబాద్: దట్టమైన అడవిని తలపించే పచ్చిక బయళ్ల మధ్య ఉస్మానియా అందాలను ఆస్వాదిస్తూ నిత్యం వేలాది మంది చేసే వాకింగ్‌కు ఓయూ అధికారులు వెలకట్టారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో భాగంగా సెక్యూరిటీ పేరుతో యూజర్ చార్జీల వసూలుకు పూనుకున్నారు. సినిమా షూటింగ్, వాకింగ్, జిమ్, గేమ్స్ ఇలా ప్రతిదానికి ఓ రేటు నిర్ణయించారు. దీనిపై యూనివర్సిటీలో నిత్యం వాకింగ్ చేసే ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి డిసెంబర్ ఒకటి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నప్పటికి మొదటి వారం తరువాత ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఓయూలో వాకింగ్.. మైమరిపించే అనుభూతి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల వారికి ఉస్మానియా ప్రకృతి ప్రసాదించిన వరం. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది తెల్లవారు జామున 5గంటల నుంచి ఉదయం 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇక్కడ వాకింగ్ చేసి సేద తీరుతుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, బీపీ, షుగర్ వ్యాధులున్న వారితో పాటు అధిక బరువుతో బాధపడేవారు డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేందుకు ఇక్కడకు వస్తుంటారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, మినీ టెక్, ఐపీఈల వెనుక దట్టమైన అడవిని తలపించే మార్గంలో వాకింగ్ చేయడం ఈ ప్రాంత వాసులకు మరిచిపోలేని అనుభూతి. పొద్దున్నే పురివిప్పి నాట్యం చేసే నెమళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే మైమరచిపోయే అనుభూతి కలుగుతుంది. సామాన్యులతో పాటు హర్యాణా గరవ్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య ఇలా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు యూనివర్సిటీలో వాకింగ్ అనుభూతిని పొందినవారే. దీంతోపాటు ఓయూలోని ప్లేగ్రౌండ్స్‌లో వందలాది యువత క్రికెట్, వాలీబాల్, రన్నింగ్‌తో పాటు ఇతర ఆటలు ఆడుతూ క్రీడా స్ఫూర్తిని పొందుతున్నారు. భద్రత పేరుతో బాదుడు ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భద్రత కరువైందని, నిర్మానుష్య ప్రాంతంలో పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని.. దీనిని నియంత్రించాలనే ఉద్దేశంతోనే యూజర్ చార్జీల నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం పసలేదని వాకర్స్ కొట్టిపడేస్తున్నారు. యూనిర్సిటీలో గత కొన్నేళ్లుగా సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న పాతవారిని ఇటీవల తొలగించి రిటైర్డ్ ఆర్మీకి చెందిన వారికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. వారి జీతభత్యాలను సమకూర్చుకోవడం కోసమే యూజర్ చార్జీల ఆలోచనను తీసుకువచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మందికి ప్రతిరోజూ ఆరోగ్య ప్రధాయినిగా ఉన్న యూనివర్సిటీలో ఎంతో మంది ప్రాణవాయువు ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే వారినుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. ఒకరిద్దరు అసాంఘిక శక్తులు ఉంటే వారిని కట్టడి చేయాలని, గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. కుటుంబంపై భారం నేను, నా భార్య ఎన్నో ఏళ్లుగా ఉస్మానియాలో వాకింగ్ చేస్తున్నాం. ఎప్పుడూ ఎటువంటి అభద్రతా భావం మాలో కలగలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా వాకర్స్‌కి మెరుగైన వసతులు కల్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేయడం అన్యాయం. కొంత మంది కుటుంబ సమేతంగా వాకింగ్ చేస్తారు. వారంతా నెలకు 1000 రూపాయలు వాకింగ్ కోసం చెల్లించాలంటే చాలా భారం అవుతుంది. అధికారులు ఈ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలి. –కౌండిన్యా ప్రసాద్, వాకర్ స్వేచ్ఛగా గాలి పీల్చేందుకు ఆంక్షలా..? యూనివర్సిటీ దగ్గరగా ఉందనే ఈ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని ఉంటున్నాం. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తుంటా. ఇప్పుడు అకస్మాత్తుగా యూజర్ చార్జీలు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టాలంటే భద్రత పెంచి గస్తీని ముమ్మరం చేయాలి. అవసరం అనుకుంటే ఉచితంగా ఐడీ కార్డులను పంపిణీ చేయాలి. –ఎం.నర్సయ్య, వాకర్ -
ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!
ఆరోగ్యంగా, చురుగ్గా... యవ్వనంగా కనిపించాలంటే బరువు సమానంగా ఉండాలి. అధిక బరువు వల్ల వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు. అలా కాకుండా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం అవసరం. బరువు తగ్గాలంటే ఆహారంపై అదుపుతోబాటు కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్ అంటారు. వీటిలో సైక్లింగ్, జాగింగ్ సులువైనవి. ఇప్పుడు జాగింగ్ గురించి చెప్పుకుందాం. ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం చాలా మందికి అలవాటు. శరీరం ఒత్తిడికి గురి కాకుండా, ఈ వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేమిటో చూద్దాం... జాగింగ్ చేయడానికి జిమ్‌లో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా జాగింగ్ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు. శారీరకంగా ఫిట్‌గా, క్యాలరీలను కరిగించుకుని బాడీ ఫ్రెష్‌గా కనబడేందుకు దోహదం చేసే వాటిలో జాగింగ్ మెరుగైనది. ఇది గుండె కండరాలను బలోపేతం చేసి గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్‌గ్లూకోజ్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. జాగింగ్ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ గ్రూప్ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఈ ఒక్క కారణం వల్ల శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది. ముఖ్యంగా ముఖం తేటగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు.. ►జాగింగ్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటం వల్ల కండరాలు కరిగి, బాడీ షేప్ మారి చూడటానికి అందంగా మారుతారు. ►బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ►ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్ మంచి మార్గం. ►జాగింగ్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వ్యాధులతో, ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి అధికంగా ఉండి శారీరక శక్తిని పెంచుతుంది. ►తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో స్ట్రెస్, డిప్రెషన్, అలసట తగ్గుతాయి. ►కండరాల శక్తిని మెరుగు పరుస్తుంది. వెన్నెముక, తొడల భాగాన్ని దృఢంగా మార్చుతుంది. ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికి చాలా మేలు చేస్తుంది. జాగింగ్ వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పాజిటివ్ శక్తి వస్తుంది. ►చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనబడుతారు. అయితే కేవలం జాగింగ్ ఒక్కటే చేస్తే సరిపోదు. ఆహారంపై అదుపు కూడా ఉండాలి. అప్పుడే పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలూ శరీరానికి సమకూరతాయి. చదవండి: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. -
జాగింగ్కని వెళ్లి ప్రియురాలతో ఎంజాయ్.. భార్యను చూసి రన్నింగ్
‘‘ఏమోయ్ నేను ఈ మధ్య బాగా లావయ్యాను కదా.. బరువు తగ్గడం కోసం జాగింగ్‌కు వెళ్దామనుకుంటున్నాను.. ఏం అంటావ్’’ అని అమాయకంగా భార్యను అడిగాడు ఓ వ్యక్తి. భర్త ఆరోగ్యంగా ఉండటమే తనకు ముఖ్యమని భావించిన ఇల్లాలు సరే అంది. భర్త జాగింగ్ ప్రారంభించి నెల రోజుల పైనే అవుతుంది. అయినా ఒక్క గ్రాము బరువు కూడా తగ్గలేదు. దాంతో ఆ ఇల్లాలికి అనుమానం వచ్చింది. ఓ రోజు భర్తకు తెలియకుండా అతడి వెనకే ఫాలో అయ్యింది. ఇక పార్కులో కనిపించని దృశ్యం చూసి ఆమె షాకయ్యింది. ఎందుకంటే భర్త అక్కడ తన ప్రియురాలితో ముచ్చట్లాడుతూ కనిపించాడు. భార్యను అక్కడ చూసిన భర్త.. వెంటనే పరుగందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: 2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి) ఈ సంఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలు లేవు. జాగింగ్ పేరు చెప్పి.. ఓ వ్యక్తి ప్రతి రోజు పార్క్‌కు వెళ్లి ప్రియురాలిని కలుస్తుండేవాడు. జాగింగ్ చేసినప్పటికి భర్త బరువు తగ్గకపోవడంతో అనుమానం వచ్చి.. ఓ రోజు అతడి వెనకే పార్క్‌కు వెళ్లింది భార్య. అక్కడ ప్రియురాలితో సరదాగా గడుపుతున్న భర్తను చూసి షాకయ్యింది. వారి వెనక నిల్చుని ‘‘ఓహో తమరు చేసే జాగింగ్ ఇదా’’ అని ప్రశ్నించింది. సడెన్‌గా పార్క్‌లో భార్య గొంతు వినిపించేసరికి.. అతగాడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ప్రియురాలితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇక భార్య దగ్గరకు రావడం చూసి నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత పరుగందుకున్నాడు. ఇక సదరు ఇల్లాలు.. ‘‘ఆగు.. నా మాట విను.. ఇలాగే పరిగెత్తావనుకో.. ఇంటికి వచ్చాక నీ పని చెప్తాను’’ అని హెచ్చరించింది. (చదవండి: Viral Video: కేంద్ర మంత్రి డ్యాన్స్.. ప్రధాని మోదీ స్పందన) ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోని షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ‘‘బాగా అయ్యింది.. ఇంటికెళ్లాక నీకు ఉంది పో’’.. ‘‘బలే బుక్కయ్యావ్ కదా ఇక నీకు చుక్కలు చూపిస్తుంది నీ భార్య’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పోలీసుల సలహా : 3 రోజులు భార్యతో.. 3 రోజులు ప్రేయసితో.. -
జాగింగ్ చేయబోతున్నారా?..జాగ్రత్తలివి!
జాగింగ్ చేసేవారు తప్పనిసరిగా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే జాగింగ్ చేయడంలో బాగా క్యాలరీలు ఖర్చవుతాయన్న విషయం తెలిసిందే. నిజానికి అవి కొవ్వులను కాల్చేస్తే మేలు. కానీ ఒకవేళ దానికి బదులుగా మన దేహంలోని ప్రోటీన్లను కాల్చేస్తే?... దాంతో మనకు తీరని నష్టం జరుగుతుంది. అందుకే జాగింగ్ చేయడానికి ఓ అరగంట ముందు చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఉండటం మంచిది. ఇందులోసం ఒక చిలగడదుంప (మోరంగడ్డ), బంగాళదుంప, కార్న్ఫ్యాక్స్లలో ఏదో ఒకటి తీసుకుని, దాంతో పాటు ఒక గ్లాసు పాలు (లో ఫ్యాట్ మిల్క్) తాగడం మంచిది. ఒక కప్పు పండ్ల ముక్కలూ తీసుకోవచ్చుగానీ... అందులో అరటి, పుచ్చకాయ, సపోటా, డ్రైఫ్రూట్స్ లేదా ఖర్జూరం తీసుకోవడం అంత మంచిది కాదు. జాగింగ్ చేయడానికి ముందే నీళ్లు (ప్లెయిన్ వాటర్) నింపిపెట్టుకున్న ఓ బాటిల్ లేదా ఓఆర్ఎస్ సొల్యూషన్ వెంట ఉంచుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది... జాగింగ్ చేసిన వెంటనే నీళ్లు/ఓఆర్ఎస్ ద్రావణం తాగకూడదు. జాగింగ్ ముగిశాక... కాస్తంత వ్యవధి తర్వాతే తాగాలి. -
2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి
న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం నుంచైనా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోరారు. డయ్యూలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఘోగ్లా బీచ్‌లో జాగింగ్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ఒక కష్టతరమైన ఏడాదిని పూర్తిచేసుకొని 2021లోకి అడుగుపెడుతన్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అని ట్వీట్ చేశారు. (సీఎం రావత్‌కు అస్వస్థత, ఎయిమ్స్‌కు తరలింపు ) Jogged on the pristine Ghoghla beach in Diu this morning. As we enter 2021, after a difficult year that has tested us all, let us rise together and make an endeavour to remain fit and healthy. May the coming year bring good health and prosperity in our lives. pic.twitter.com/dcQjZxB4Xk — President of India (@rashtrapatibhvn) December 28, 2020 ఆదివారం ఘోగ్లా బీచ్‌ను సందర్శించిన ఆయన డయ్యూలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా డయ్యూలో కల్చరల్ హెరిటేజ్‌ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, స్వచ్ఛత కోసం స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఇటీవలే నిష్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాంతానికి "బ్లూ ఫ్లాగ్" ధృవీకరణ పత్రాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా రామ్‌నాథ్ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్తాపన చేశారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం నేడు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. (ఆ పదవిపై ఆసక్తి లేదు: శరద్ పవార్) -
మాస్క్‌తో వ్యాయామం మంచిదేనా?
కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్‌లు తొడగడం నిత్యకృత్యమైపోయింది. అయితే కొందరు మాస్క్‌లు తొడిగే వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేస్తున్నారు. అయితే మాస్క్ పెట్టుకుని వ్యాయామం చేయడం మంచిదేనా? ఎక్సర్సైజ్ చేసే సమయంలో మాస్క్ తొడగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వ్యాయామం చేయడం సరైన పద్ధతి అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే మాస్క్ తొడిగి వ్యాయామం చేయాల్సి వస్తే... కొన్ని అంశాలను గమనించడమూ ఎంతో అవసరం. మాస్క్‌తో వ్యాయామం ఎంతవరకు మంచిదో చూద్దాం. మామూలుగానైతే మాస్క్‌లు మంచివే. వైరస్‌లనూ, వ్యాధి కారక క్రిములనూ చాలావరకు నిరోధిస్తాయి. తద్వారా వ్యాధులను నివారిస్తాయి. అయితే మీరు వాకింగ్‌గానీ, జాగింగ్ గానీ లేదా ఇతర వ్యాయామాలు చేసే సమయంలో మాస్క్ తొడిగితే ... ఆ తేడాను మీరే పసిగట్టగలరు. మామూలుగా వ్యాయామం చేసే సమయంలో అధిక శ్రమ కారణంగా మనకు కాస్తంత ఆయాసం రావడం మామూలే. అయితే ముక్కుకు అడ్డుగా ఏదీ లేనప్పుడు మామూలు కంటే మరింత ఎక్కువగా, ధారాళంగా గాలి పీలుస్తూ ఉంటాం. కానీ మాస్క్ అడ్డుగా ఉన్న సమయంలో మనం కాస్తంత తల బాగా తేలికైన ఫీలింగ్ (లైట్‌హెడెడ్‌నెస్) గానీ, కళ్లు తిరగడం గానీ, మగత గా అనిపించడం లేదా తగినంత చురుగ్గా లేకపోవడం, ఊపిరి అందకుండా ఉన్న ఫీలింగ్గానీ ఉంటే మాస్క్ వల్ల మీకు అందాల్సినంత ఆక్సిజన్ అందకుండా ఉందని అర్థం. అలాంటి సమయాల్లో మాస్క్ తొలగించి... జనసామాన్యానికి దూరంగా ఉంటూ వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం ముగించాక మళ్లీ మాస్క్ తొడుక్కోవచ్చు. తేలికపాటి నడక సాగించే వారు విడిగా ఇంట్లోనే మాస్క్ లేకుండా నడిచి... నడక ప్రక్రియ పూర్తి కాగానే మళ్లీ మాస్క్ ధరించడం మేలు. వ్యాయామం అప్పుడు అస్సలు మాస్క్ తొడగకుండానే ఉండాల్సిన వారు... మీరు గుండెజబ్బులతో బాధపడుతున్నవారా? లేదంటే... మీకు ఏవైనా శ్వాససంబంధమైన వ్యాధులున్నాయా? అలాగైతే వ్యాయామం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాధుల కారణంగా మీకు శ్వాసలో తగినంత ఆక్సిజన్ అందకపోతే ఇబ్బందులు ఖాయం. అందుకే వాకింగ్, బ్రిస్క్‌వాకింగ్ వంటివి చేస్తున్నప్పుడు మాస్క్ తొడగకుండా చేయడం అవసరం. అయితే బయట ఇప్పుడున్న వాతావరణంలో మాస్క్ తొడగకపోవడం అంత మంచిది కాదు కాబట్టి... మీరు ఇంటి ఆవరణలోనో, మేడపై ఖాళీస్థలంలోనో మాస్క్ లేకుండానే నడక కొనసాగించడం మంచిది. ఒకవేళ ఫేస్‌మాస్క్ ధరించక తప్పదని మీ డాక్టర్ చెబితే... మీరు వ్యాయామం మొదలుపెట్టే ముందర ఒకసారి మీ డాక్టర్ సలహా తప్పక తీసుకునే ఎక్సర్సైజ్ ప్రారంభించాలి. డాక్టర్‌ను నేరుగా కలవడం కుదరకపోతే ఫోన్లో సంప్రదించాలి. పేషెంట్ స్వయానా కనిపిస్తుండే టెలిమెడిసిన్ పద్ధతైతే ఇంకా మంచిది. చాలా కాలంగా వ్యాయామం చేయకుండా ఇప్పుడే మొదలుపెడుతున్నారా? చాలాకాలం నుంచి వ్యాయామం చేయకుండా ఉన్నవారు... వ్యాధినిరోధకతను పెంచుకునేందుకు ఇప్పుడు మొదలుపెట్టాలనుకుంటున్నవారూ చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మాస్క్ తొడిగే నేరుగా వ్యాయామం మొదలుపెట్టడం అస్సలు మంచిది కాదు. తొలుత తేలికపాటి వ్యాయామాలు/వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు చేస్తూ... క్రమంగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవడం అవసరం. చాలాకాలం వ్యాయామం చేయకుండా ఇప్పుడు వ్యాయామం మొదలుపెట్టగానే... మగతగా, కళ్లుతిరుగుతున్నట్లుగా, స్పృహతప్పుతున్నట్లుగానూ అనిపిస్తే వ్యాయామాలు ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. మాస్క్‌తో వ్యాయామం చేస్తే ఏమవుతుంది? మామూలుగా మనం శ్వాసించేటప్పుడు గాలి చాలా ఫ్రీగా ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అయితే ఫేస్‌కు మాస్క్ ఉన్నప్పుడు అది గాలిని నిరోధిస్తూ, దాని కదలికలకు అడ్డుపడుతుంది. దాంతో అందాల్సిన మోతాదులో ఆక్సిజన్ అందదు. మాస్క్ ఉన్నప్పుడు మన ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్‌లో ఎంతో కొంత కొరత ఉంటుంది. అలాగే మనం వదిలే గాలిలో ఉండే కార్బన్ డై యాక్సైడ్ మునపటిలా మొత్తం బయటి గాలిలోకే వెళ్లకుండా... ముక్కుకు ఆని ఉన్న మాస్క్ ప్రాంతంలోనే ఎక్కువ మోతాదు ఉండిపోతుంది. దాంతో మళ్లీ మరోసారి గాలి పీల్చినప్పుడు మొదటికంటే ఆక్సిజన్ తక్కువ అందడంతో పాటు, ముక్కుకు దగ్గరగానే ఉన్న కార్బన్ డైయాక్సైడ్ మళ్లీ లోపలికి ప్రవేశించడంతో అందాల్సిన ఆక్సిజన్ పాళ్లు మరింత తగ్గుతాయి. ఇలా ఆక్సిజన్ అందాల్సినంత మోతాదులో అందకపోవడంతో ఇటు గుండెకూ, అటు మెదడుకూ తగినంత ఆక్సిజన్ అందకనే ఇలా తల దిమ్ముగా ఉండటం, తల తేలికైపోయినట్లుగా ఉండటం, ఊపిరి అందకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. మాస్క్ విషయంలో జాగ్రత్తలివి... ► ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులే ఉంటారు కాబట్టి... కుటుంబసభ్యుల్లో ఎవ్వరికీ ఫ్లూ, జలుబు వంటి లక్షణాలేవీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ తొడగకండి. అయితే కుటుంబసభ్యులైనా అందరూ తగినంత భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. ► ఇంటి ఆవరణలో లేదా మేడపైన విడిగా వ్యాయామం చేయాలి. ఇంట్లోని కుటుంబసభ్యులు వ్యాయామం చేస్తూన్నా కలివిడిగా కాకుండా విడివిడిగానే చేయాలి. ► బయటకు వెళ్లినప్పుడు తప్పక మాస్క్ ధరించే వెళ్లాలి. గుంపులు గుంపులుగా జనాలు ఉన్నచోటికి మీకు మాస్క్ ఉన్నా వెళ్లకండి. అక్కడ రద్దీ తగ్గాకే వెళ్లండి. తీవ్రమైన (హెవీ) వ్యాయామాలు చేసేవారు... ఇప్పుడు జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ ఎలాగూ పనిచేయడం లేదు. అయితే పర్సనల్ జిమ్‌లలో లేదా తమకు అందుబాటులో ఉండే వస్తువులతో చాలా తీవ్రంగా వ్యాయామాలు (ఇంటెన్స్ ఎక్సర్సైజ్) చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ వెయిట్లిఫ్టింగ్స్, స్ప్రింట్స్, ప్లయోమెట్రిక్స్, క్రాస్‌ఫిట్ సై్టల్ వర్కవుట్స్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్స్ (హిట్స్–హెచ్ఐఐటీ) వంటి వ్యాయామాలు చేసేవారు మాస్క్ తొడుక్కోకుండా చేయడం అవసరం. కార్డియో వ్యాయామాలు చేసేవారు కూడా ఇవే పద్ధతులు అవలంబించాలి. మీకు తగినంత ఆక్సిజన్ అందుతుందో లేదో గుర్తించడం ఎలా? ఆక్సిజన్ తగినంతగా అందుతుందా లేదా అన్నది తెలుసుకోడానికి ఉత్తమమైన మార్గం పల్స్ ఆక్సీమీటర్‌ను ఉపయోగించడం. దానిద్వారా మన రక్తంలోని ఆక్సిజన్ మోతాదు ఎంత ఉందో తక్షణం తెలిసిపోతుంది. అయితే ఇలాంటి ఉపకరణాలు ఆసుపత్రుల్లో మాత్రమే ఉంటాయి కాబట్టి... మన దేహస్పందనలను జాగ్రత్తగా గమనించడం ద్వారా మనకు మనంగా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. వ్యాయామం చేస్తున్న సమయంలో భరించలేనంత శ్రమ...ఊపిరందకపోవడం, (వ్యాయామంలో ఎంతో కొంత ఆయాసం ఉంటుందిగానీ... అది పూర్తిగా గాలి ఆడనంత తీవ్రంగా ఉంటే)... తల బాగా తేలికయిపోయినట్లు ఉండటం, అవయవాలు మొద్దుబారినట్లు అనిపించడం, తిమ్మిర్లుగా అనిపించడం, నిస్సత్తువగానూ, నీరసంగానూ, నిద్రవస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం వ్యాయామం ఆపేయాలి. పైన పేర్కొన్నవన్నీ మన ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ లభ్యం కావడం లేదనడానికి సూచనలు. అలాంటప్పుడు అన్ని రకాల వ్యాయామాలు ఆపేసి, డాక్టర్ సంప్రదించి, మళ్లీ మీ డాక్టర్ వ్యాయామాలు చేయడానికి అనుమతించాకే మొదలుపెట్టాలి. -
మాస్క్‌లతో రన్నింగ్ చేయవచ్చా?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా లాక్డౌన్ విధించిన పలు ప్రపంచ దేశాలు క్రమంగా సడలింపులు ఇస్తున్నాయి. అయితే కరోనా ముప్పు పూర్తిగా పోనంతకాలం లేదా కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనేంతవరకు ముఖానికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని అన్ని దేశాలు చెబుతున్నాయి. వాకింగ్, జాగింగ్‌ల కోసం, వాహ్యాలీకి పార్కులకు వెళ్లేందుకు యూరప్ దేశాలు ఇప్పటికే అనుమతి ఇచ్చాయి. మున్ముందు భారత్‌లో కూడా వాకింగ్, జాగింగ్‌లకు అనుమతిచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మరి మాస్క్‌లు ధరించి జాగింగ్లు, వాకింగ్లు చేయవచ్చా? ముఖ్యంగా జాగింగ్లు చేసేటప్పుడు ఆయాసం రాదా? అదే క్రీడాకారులు రన్నింగ్ చేస్తే మరింత ఇబ్బంది ఉండదా? మాస్క్‌లు ధరించిన సాధారణ ప్రజలే దమ్మాడడం లేదని, ఆయాసం వస్తోందని చెబుతున్నారుగదా! మాస్క్‌లు ధరించడం వల్ల సరిగ్గా ఆక్సిజన్ అందగా ఆయాసం వస్తోందని, అనారోగ్యం కూడా ఏర్పడవచ్చని కొందరు వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు. చైనాలో ఇటీవల ఓ 26 ఏళ్ల జాగర్ ముఖానికి మాస్క్ ధరించి నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి కుప్పకూలిపోయారు. ఆయన్ని వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో చేర్చగా, అతని ఎడమ ఊపిరితిత్తి 90 శాతం కుంచించుకు పోయిందని, గుండె కూడా కుడి వైపునకు జరిగిందని వైద్యులు తేల్చారు. అదే చైనాకు చెందిన ఇద్దరు 14 ఏళ్ల పిల్లలు మాస్క్‌లు ధరించి జాగింగ్ చేస్తూ కుప్ప కూలిపోయి చనిపోయారు. మాస్క్‌లు ధరించడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయా? చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలకు అటాప్సీ చేయలేదు కనుక మాస్క్‌ల కారణంగానే వారు మరణించారని చెప్పలేం. కరోనా నుంచి తప్పించుకోవాలంటే బయటకు వెళ్లినప్పుడు మూడు లేయర్లుగల మాస్క్‌లు, లేదా ఎన్95 మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవి ధరించినా గాలిని పీల్చుకోగలం. ముక్కు, నోరుకు ఎలాంటి ఫిల్టర్ ఉన్నా గాలి పీల్చుకోవడం ఇబ్బందే అవుతుంది. పరుగెత్తుతున్నప్పుడు ముక్కుతోపాటు, నోటితో కూడా గాలిని ఎక్కువగా పీలుస్తారని, ఆ సమయంలో నోటికి ఆక్సిజన్ అవసరం పెరుగుతుందని ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’లో పని చేస్తోన్న డాక్టర్ అమోల్ పాటిల్ తెలిపారు. ముఖానికి మాస్క్ ధరించి పరుగెత్తడం కన్నా మాస్క్‌లు లేకుండా పరుగెత్తడమే బాగుంటుందని దర్శన్ వాగ్ లాంటి పలువురు కోచ్‌లు తెలిపారు. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని క్రమంగా అలవాటు చేసుకోవడం మంచిదని వారు సూచించారు. మొదట్లో మాస్క్‌లతోని మెల్లగా ప్రాక్టీస్ చేయాలని, తర్వాత క్రమేణ వేగం పుంజుకోవాలని చెప్పారు. పరుగెత్తడం ఆపి, ఆయాసం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇతరులకు దూరంగా వెళ్లి మాస్క్‌లను తొలగించి గాలి పీల్చుకోవచ్చని చెప్పారు. మాస్క్‌లను ధరించి పరుగెత్తడం వల్ల ఊపిరితిత్తులు మరింత బలపడే అవకాశం ఉందని దర్శన్ వాగ్ తెలిపారు. -
జాగింగ్ చేస్తూ సరిహద్దులు దాటేసింది!
వాషింగ్టన్: బీచ్‌లో జాగింగ్ చేస్తూ ఓ యువతి అనుకోకుండా దేశ సరిహద్దులనే దాటేసింది.ఫ్రాన్సుకు చెందిన సిండెల్లా రోమన్(19) ఈ ఏడాది మేలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం వైట్‌రాక్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లిని కలుసుకునేందుకు వచ్చింది. సముద్ర తీరంలో జాగింగ్ చేస్తూ.. కెనడా సరిహద్దు దాటి అమెరికాలో ప్రవేశించింది. ఆమె వద్ద గుర్తింపు పత్రాలు లేకపోవడంతో గస్తీ దళాలు అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో అక్రమ వలసదారుల కోసం ఏర్పాటుచేసిన డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. చివరకు ఆమె తన తల్లి క్రిస్టిన్ ఫెర్న్‌కు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆమె వెంటనే పాస్‌పోర్టు, ఇతర పత్రాలను తీసుకొచ్చి అధికారులకు చూపించినా.. వాటిపై కెనడా అధికారుల ధ్రువీకరణ లేదని మెలికపెట్టారు. రెండు వారాల పాటు సిండెల్లాను అక్కడే ఉంచారు. అవసరమైన పత్రాలను అందజేశాక జూన్ 6వ తేదీన ఆమెను వదిలిపెట్టారని కెనడా మీడియా తెలిపింది. -
గర్భిణులూ జాగింగ్ చేయవచ్చు!
గర్భిణులు వ్యాయామంలో భాగంగా జాగింగ్ చేయడంపై చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. పరుగు వల్ల వారికి గర్భస్రావమయ్యే ముప్పు ఉంటుందని, నెలలు నిండక ముందే కాన్పు వచ్చే అవకాశాలు ఉంటాయని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే, ఇవన్నీ అపోహలేనని, తేలికపాటి పరుగు వల్ల గర్భిణులకు ఎలాంటి ముప్పు ఉండదని ఒక తాజా అధ్యయనంలో తేలింది. గర్భిణులుగా ఉన్నప్పుడు జాగింగ్ చేసే మహిళలకు పుట్టే పిల్లల బరువులో కూడా ఎలాంటి లోపాలు తలెత్తవని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రొఫెసర్ ఆండ్రూ షెనాన్ ఆధ్వర్యంలో లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో పరుగు వల్ల గర్భిణులకు ఎలాంటి హానీ జరగదని తేటతెల్లమైంది. గర్భిణులు రోజూ కనీసం ముప్పయి నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిదని, వ్యాయామంలో భాగంగా ఒక మోస్తరు వేగంతో పరుగు తీయవచ్చని ఈ అధ్యయనం నిర్వహించిన కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాయా మం వల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారని, వారికి పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారని వారు వివరిస్తున్నారు. అయితే ఈ పరుగు కేవలం కడుపుపై బరువు పడని విధంగా ఒక మోస్తరు వేగంతో (స్లో జాగింగ్) సాగితేనే మేలు. -
మనసు మాట
జాగింగ్ చేసి అలా పార్క్‌లో బెంచ్‌పై కూర్చున్నాను. ‘‘ఏమండీ రామంగారూ జాగింగ్ అయిపోయిందా?’’ పలకరించాడు పక్కింటి జగన్నాథం. అవునన్నట్లు నవ్వాను. నా ధ్యాసంతా బెంచ్ కింద చుట్టిపడేసిన ఓ పింక్ పేపర్ మీదే ఉంది. మెల్లగా దాన్ని అందుకొని చూస్తే ముత్యాల్లాంటి అక్షరాలు. నిస్సహాయతను తెలుపుతున్నట్లున్న ఓ కవిత. ఆ కవిత రాసిన అమ్మాయి పేరు కూడా కవితే. కింద సంతకం చూస్తే అర్థమైంది.నేను వెన్నెలనై నిన్ను సేదతీర్చాలనుకుంటాను కానీ, ఆ సమయంలో నువ్వు నులువెచ్చని కిరణాలనే కోరుకుంటావ్..సరేనని సర్దిచెప్పుకుని.. నువ్వు కోరుకునే వెచ్చని కిరణమై నిన్ను తాకేలోపే.. సంధ్యకాలపు చల్లదనాన్ని ఆస్వాదిస్తుంటావ్..నాదొక ఊహ.. నీదొక స్వప్నం. నాదొక శ్వాస.. నీదొక ఊపిరి. నాదొక పరుగు.. నీదొక తీరం. నన్ను నీలో వెతికి వెతికి అలసిపోతున్నా. ప్రతీసారి ఓడిపోతున్నా. గెలవాలనిపిస్తోంది. నిదానంగా నీ హృదయపు సవ్వడి వినాలనిపిస్తోంది. వినిపించగలవా!? ‘ఎంత పెయిన్ ఉందీ కవితలో? తన గుండెతడి నా మనసును తాకింది. పాపం బ్రేకప్ అనుకుంటా. రాస్కెల్ మోసం చేసి పోయాడేమో. చిట్టితల్లి ఎంత బాధపడుతోందో!?’ అనుకుంటూ ఎదురుగా ఉన్న పెద్ద పార్క్ వైపు చూశా. వేగంగా కదులుతున్న నా చూపు.. చేతిలో పుస్తకంతో నిలబడున్న ఓ అమ్మాయి మీద పడింది. చెట్టుకు ఆనుకున్న ఓ అబ్బాయితో ఏదో గొడవ పడుతోంది. నిజానికి నా చూపు ఆగింది ఆమె చేతిలోని పుస్తకంపైనే! అందులోని పేపర్స్ అచ్చు నా చేతిలోని నలిగిన పేపర్లానే ఉన్నాయి. ‘తనే కాబోలు కవిత’ అనుకుంటూ కళ్లజోడు సర్దుకుని కాస్త వంగి చూశాను. అమాయకమైన ఆమె కళ్లు అతగాడిని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. వాణ్ని చూడ్డానికి ప్రయత్నించా కానీ, ఏపుగా పెరిగిన గుబురైన పొదల్లోంచి సరిగా కనిపించడం లేదు. ఆ అమ్మాయెందుకో బాగా ఏడుస్తోంది. అబ్బాయి విసుగ్గా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తను మాత్రం తన్నుకొచ్చే కన్నీళ్లను ఆపే ప్రయత్నం చేస్తో్తంది. సరిగ్గా ఐదు నిమిషాలకు ఆ అబ్బాయి తిరిగొచ్చాడు. ఈసారి కూడా సరిగా కనిపించలేదు రాస్కెల్. తనను ఓదార్చి సారీ చెప్పాడనుకుంటా. కోటి కాంతులను నింపుకుని కళ్లతోనే నవ్వుతోంది. ‘ఒక బంధం నిలబడాలంటే రెండు మనసులు నిస్వార్థంగా కలవాలిగానీ, ఆ క్షణం సంతోషం కోసం కాదని’ ఈ తరానికి ఎప్పుడు అర్థమవుతుందో అనుకుంటూ పైకి లేచా, చేతిలోని పింక్ లెటర్‌ను డస్ట్‌బిన్ వైపు విసిరేస్తూ. చేతికర్రనందుకుంటూ అప్రయత్నంగానే మళ్లీ కవితవైపు చూశా. కవితకు ఎదురుగా నిలబడిన ఆ కుర్రాడిని చూసి.. తిరిగి ఆ పింక్ లెటర్ అందుకుని, మడతపెట్టి జేబులో పెట్టుకుని, ముందుకు నడిచా. ఆ రాస్కెల్ కూడా నన్ను చూశాడు. ‘‘తాతయ్యా.. తాతయ్యా..’’ వెనకే పరుగున వచ్చాడు సమీర్. నేను కోపంగా నడుస్తున్నానని వాడికి అర్థమైంది. జేబులోని పింక్ లెటర్ తీసి వాడి చేతిలో పెట్టాను.అది చూడగానే.. ‘‘ఐ నో తాతయ్యా! నువ్వు నన్నూ కవితని చూడ్డం నేను చూశా’’ అన్నాడు. వాడు చెప్పేదంతా వింటూ నడుస్తున్నాను. ‘‘సారీ తాతయ్యా! నీ దగ్గర ఏ విషయం దాచనుగానీ, ఇదంత ఇంపార్టెంట్ అనిపించలేదు. తనో నసలే తాతయ్యా, తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం’’ అన్నాడు చాలా సింపుల్‌గా. వీడేనా ఇలా మాట్లాడుతోంది? కోపం తన్నుకొచ్చింది. తప్పు ఈ తరానిదేనేమో! ‘ఒక బంధాన్ని ఇంత తేలిగ్గా, ఇంత అవహేళనగా చూస్తుంటే మనుషుల మధ్య బంధం ఎలా నిలబడుతుంది?’ ఆలోచనలతో పోటీపడుతూ నడిచే వయసు ఏనాడో దాటిపోయిందన్న విషయం కూడా మరిచిపోయి, నడకలో వేగం పెంచాను. మనసుపడే ఆందోళనకు గుండె వేగం తోడైంది. నేను మరిచిపోయినా నా శరీరం గుర్తు చేస్తుందిగా, అందుకే ఆయాసం ఊపేసింది. నిలబడే ఓపిక లేక కాస్త వరిగానంతే. సమీర్ తీసుకెళ్తున్న విషయం తెలుస్తూనే ఉంది.సమీర్ నా కొడుకు కొడుకు. కొడుకూకోడలు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు కానీ, సమీర్ పుట్టిన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. కోర్టు నిబంధనలు పక్కన పెడితే.. వాడు ఇద్దరికీ భారమయ్యాడు.బంధాన్ని భారమనుకునేంత స్వార్థం వాళ్ల నాన్నదైతే, భారాన్ని బంధంగా పులుముకోరాదనేంత స్వార్థం వాళ్ల అమ్మది. అదిగో ఆరోజే సమీర్ శాశ్వతంగా మా దగ్గరకు వచ్చేశాడు. లేదు మేమే తెచ్చేసుకున్నాం. ఎంతైనా రక్తం కదా. ‘‘ఇప్పుడెలా ఉంది తాతయ్యా!’’ సమీర్ నా పక్కకొచ్చి కూర్చున్నాడు. బాగానే ఉందన్నట్లు తలూపాను, తలదిండు గోడకు ఆన్చి కూర్చుంటూ. నా రూమ్‌లో అలికిడిని గమనించిన జానకి పరుగున వచ్చి నా తలపై చెయ్యివేసి ‘‘మీరు బాగానే ఉన్నారుగా?’’ అంది పెద్ద డాక్టర్ అయినట్లు. నాకు నవ్వొచ్చింది. తనకేమైనా తక్కువా? షుగర్, బీపీ, మోకాళ్లనొప్పులు.. చాలానే ఉన్నాయి. కానీ నాకు చిన్న జ్వరమొచ్చినా సేవ చెయ్యడానికి ఎక్కడలేని ఓపిక తెచ్చేసుకుంటుంది.‘‘నానమ్మా! నువ్వెళ్లి రెస్ట్ తీస్కో.. తాతయ్య దగ్గర నేనుంటాలే’’‘‘కాసేపు ఉండి వెళ్తాలేరా! మీ తాతయ్యకి ఏమైనా కావలిస్తే..’’‘‘అరే నానమ్మా! నేను చూసుకుంటాలే. నీకసలే బాగోలేదుగా, అత్తొస్తే నన్ను తిడుతుంది. వెళ్లి పడుకో’’ అని నచ్చజెప్పి జానకిని పక్కరూమ్‌కి పంపి మళ్లీ వచ్చి కూర్చున్నాడు. చాలాసేపు మౌనం రాజ్యమేలింది. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. తన చేతిపై నా చెయ్యేశా, కాస్త ధైర్యమిద్దామని.‘‘తాతయ్యా! నాకోడౌట్.. ఏ రక్త సంబంధం లేకుండా ఒక మనిషి తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, తన కోరికలనీ మరిచిపోయేంతలా మరో మనిషిని ప్రేమించడం ఎలా సాధ్యం?’’ అడిగాడు చాలా ఆశ్చర్యంగా. వాడి ప్రశ్న అర్థంకాలేదు కాసేపు. మళ్లీ మాట్లాడం మొదలుపెట్టాడు.. ‘‘నాకసలు ఏం అర్థం కావడం లేదు తాతయ్యా! ఇప్పటిదాకా కవితలానే నా జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, అభిప్రాయాలు కలవక చాలా కొద్ది నెలల్లోనే బ్రేకప్ అనుకునేవాళ్లం. కానీ, కవిత నాకు పరిచయం అయ్యి మూడేళ్లు కావస్తోంది. తను డెఫ్ అండ్ డంబ్ ట్రైనింగ్ క్లాసుల్లో పరిచయమైంది. కొద్దిరోజులకే మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ప్రపోజ్ చేస్తే ఓకే అంది. తనెప్పుడూ నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నించలేదు. నా ప్రతి అవసరం తనకు బాగా తెలుసు. నా ప్రతి ఆశను తను ప్రేమిస్తుంది. తను కూడా నానుంచి అదే కోరుకుంటుంది కానీ, నేను ఏరోజూ తన ఊహలని నిజం చేసే ప్రయత్నం చెయ్యలేదు. అదే కారణంతో మా ఇద్దరి మధ్య చాలా గొడవలు అయ్యాయి. ‘నీతో నావల్ల కాదు’ అని చాలాసార్లు తెగేసి చెప్పా. ఆ వెంటనే బాధ పడుతుందేమో, ఏడుస్తుందేమో అని దగ్గరైపోతా. మళ్లీ సేమ్ సీన్. నన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే.. కోపగించి వెళ్లిపోయినా తనకోసం కచ్చితంగా తిరిగి వస్తానని తన నమ్మకం. అదే జరుగుతుంది కూడా! ‘నువ్వు వస్తావని నాకు తెలుసు’ అంటోంది చాలా సింపుల్‌గా. నా ఆలోచన లేకుండా కవిత ఒక పూట కూడా ఉండటం కష్టం తాతయ్యా! ఒక మనిషిని అంతలా ఎలా ప్రేమించాలి తాతయ్యా? నాకు బంధాల విలువ తెలీకకాదు. మన కుటుంబంలో ఎవరికైనా చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేను. బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి అది సహజమే కానీ...’’‘‘ఏంట్రా! తాతయ్యని రెస్ట్ తీసుకోనివ్వకుండా బుర్ర తింటున్నావ్’’ అంది వాళ్లత్త. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సమీర్.. ‘ఏంలేదత్తా’ అంటూ పైకి లేచాడు అసహనంగా. వాడి నిరుత్సాహం నాకు అర్థమైంది. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కానీ నాకు తెలుసు వాడికి ఏం కావాలో..!? సొరుగులోని ఒక తెల్లని కాగితం తీసుకుని రాయడం మొదలుపెట్టా. ‘‘రేయ్ చిన్నూ! నువ్వు కవితని ప్రేమిస్తున్నావ్. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటావ్. తనని మరిచిపోవడం అసాధ్యం. ఇంత కచ్చితంగా ఎందుకు చెబుతున్నానంటే.. ఒక మనిషి ఎలా ఉందో, ఎలా ఉంటుందో, అని ఆలోచించడం తల్లిప్రేమ లాంటిది. ఊపిరి ఆగేంతవరకూ ఆ ప్రేమ స్వచ్ఛంగానే ఉంటుంది.జీవితంలో మనం కొన్ని బంధాలను మార్చలేం. మార్చుకోవడానికి ఇష్టపడం. అవి అలానే ఉండాలని, అలా ఉంటేనే బాగుంటాయని నమ్మి అలానే ప్రేమిస్తాం. వాటి స్థానాలను మార్చడానికి కూడా ప్రయత్నించం. ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్లని శాశ్వతంగా కోల్పోయినా.. ఓ అందమైన జ్ఞాపకంగా మార్చుకుని గుండెల్లో నింపుకుంటాం. అలాంటి బంధానికి అసలైన ఉదాహరణ పేగుబంధం. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికీ వెగటు కారు. నీ జీవితంలో ఆ స్థానంలో నేను, నానమ్మా ఉన్నాం కదా. అలానే వారివారి జీవితాల్లో ఎవరో ఒకరు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. లైఫ్ పార్ట్నర్నీ అలానే ప్రేమిస్తుంటారు కొందరు. మనసుకి, మనిషికి విలువిచ్చే ప్రతి మనిషికీ కలిగే భావాలివి. మీ నానమ్మ మీ నాన్నని గారాం చేసి కష్టం తెలీకుండా పెంచింది. కానీ వాడికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మేము గుర్తొచ్చేవాళ్లం. మీ నాన్న పెంపకంలో జరిగిన తప్పులు నీ పెంపకంలో జరగకూడదనే.. కుండ చూసి అన్నం తినడం నేర్పించా. వెనక ఉన్న వాళ్లకి ఉందో లేదో చూసి తినడంలోనే బంధం ముడిపడుతుందని నేను నమ్ముతా. అదే నమ్మకాన్ని నీకు పంచా. అందుకే మా పట్ల అంత అనురాగాన్ని చూపించగలుగుతున్నావు. ఏ బంధమైనా అనుకరణతోనే బలపడుతుంది. కవితని నువ్వు ఎందుకు వదులుకోలేకపోతున్నావో తెలుసా? తను నీకు పంచింది అమ్మ ప్రేమని. ఒక తల్లి తన బిడ్డ విషయంలో ఎలా ఆలోచిస్తుందో తను నీ విషయంలో అలా ఆలోచించింది. పాతికేళ్ల క్రితం మీ అత్త.. ‘నేనో అనాథని ప్రేమించా. తననే పెళ్లి చేసుకుంటా’ అని మాతో వాదించినప్పుడు మీ అమ్మానాన్నల్లాంటి ప్రేమేలే అనుకున్నాం. నచ్చకపోయినా వాళ్లకి పెళ్లిచేశాం. ఏడేళ్లకి మాకో నిజం తెలిసింది. మీ అత్తకి ఎప్పటికీ పిల్లలు పుట్టరని. ఇది తెలిస్తే మీ మావయ్య మీ అత్తని వదిలేస్తాడేమోనని మేం చాలా భయపడ్డాం. మా ఇబ్బందిని గుర్తించిన మీ మావయ్య మా దగ్గరికొచ్చి.. ‘మీ అమ్మాయికి పిల్లలు పుట్టరన్న విషయం మా పెళ్లికి ముందే తెలుసు’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు మీ అత్తకు కడుపునొప్పి వచ్చి కళ్లు తిరిగిపడిపోయిందట. అప్పుడే తనకీ విషయం తెలిసిందని చెప్పాడు. అది తెలిస్తే మీ అత్త తట్టుకోలేదని చెప్పలేదట. పెళ్లయ్యాక లోపం తనలో ఉందని మీ అత్తను నమ్మించాడట. దాంతో మీ అత్త మమ్మల్ని మభ్యపెట్టేందుకు గుళ్లూ గోపురాలని తిరిగేది. దురదృష్టవశాత్తు మీ అత్త స్నేహితురాలు అమెరికా నుంచి రావడం, ఆమే తనకు పరీక్షలు చెయ్యడంతో విషయం తెలిసిపోయింది. ‘మా అనుకి పిల్లలు పుట్టరని తెలిసీ..?’ అని మీ నాన్నమ్మ అడగబోతే.. ‘కారణాలతో బంధాలు విడిపోతే విలువేముంది? ఈ విషయం ముందే తెలిసినా, తరువాత తెలిసినా ఒక్కటే. నేను అనూని ప్రాణంగా ప్రేమించాను. రోజులు.. సంవత్సరాలు.. కాదు. జీవితం చివరిఅంకం వరకూ ఊహిస్తూ ప్రేమించా’ అన్నాడు. చిన్నవాడైనా చేతులెత్తి మొక్కాలనిపించింది. ‘అయినా పిల్లలు లేరని బాధపడ్డం దేనికి? మన సమీర్ ఉన్నాడుగా!’ అన్నాడు ఎంతో నిస్వార్థంగా. బంధాన్ని కలుపుకోవడమంటే అదే. ముందు కవిత నీకోసం పుట్టిందని నమ్ము. సాధారణంగా భార్యాభర్తలు ‘ఈ కష్టం నీ వల్లే వచ్చిందనో, ఈ నష్టం నీ వల్లే జరిగిందనో’ నిందించుకుంటూ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు కాకుండా నీ స్థానంలో వేరే వాళ్లైతే నా జీవితం ఇంకా గొప్పగా ఉండేదని అంచనా వేస్తూ, ప్రస్తుతాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అంతకు మించిన పొరబాటు మరోటుండదు. నీకు అన్ని భాషలు, భావాలు తెలుసు. ఇదంతా నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకుని నా తీరులో చెప్పొచ్చు. కానీ, రాతలోని భావం మనసుకు చేరుతుంది. ఒక్కసారి చెప్పిన మాటకంటే ఒక్కసారి రాసిన రాత శాశ్వతంగా నిలుస్తుంది. అందుకే ఇది రాస్తున్నా. నీ కవిత నీకోసం రాసిన కవితలతో పాటు ఈ లేఖనూ జీవితాంతం నీ వెంటే ఉంచుకో. ఎప్పుడైనా మనసు చెదిరినప్పుడు ఒక్కసారి తీసి చదువుకో. గాడ్ బ్లెస్ యు రా చిన్నూ!’’. ∙∙ నెల దాటింది. హాల్లో ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి పక్కున నవ్వులు. రూమ్‌లోంచి తొంగి చూశా. ఎవరినో చుట్టు ముట్టారంతా. దగ్గరకెళ్లి చూస్తే కవిత. ‘తాతయ్య!’ అని కవితకు పరిచయం చేశాడు సమీర్. కవిత పలకరించింది. నేను నవ్వా. మళ్లీ మాటల సంగ్రామం. కవిత కళ్లనే గమనించా. స్వచ్ఛంగా నవ్వుతున్నాయి. అదే మెరుపు సమీర్లోనూ చూశా. మనసుకి సంతృప్తిగా అనిపించింది. ఇంట్లో వాళ్లంతా ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే నవ్వుతూ చూస్తున్నా.కవిత నా దగ్గరకు వచ్చి ‘‘ఏం తాతయ్యా! మీరేం మాట్లాడరూ?’’ అని అడిగింది.‘‘తను మాట్లాడలేడు. హీ ఈజ్ డంబ్!’’ అన్నాడు సమీర్. నేను మరోసారి చిన్నగా నవ్వాను. - సంహిత నిమ్మన -
గుండెకు జాగింగ్
బహుశా యోగాలో జాగింగ్ అనేది కొత్త పదంగా అనిపిస్తుంది. దీని వివరాల్లోకి వెళితే... అన్ని అంగచాలనాలు శిరస్సు నుండి పాదాల వరకు పూర్తి చేసిన తరువాత, వెన్నెముకకు సంబంధించిన అయిదు రకాల మేరు చాలనాలను సాధన చేయాలి. వీటన్నింటి తర్వాత... చివరలో చేసేదే యోగిక్ / కార్డియాక్ జాగింగ్. ఈ యోగిక్ జాగింగ్‌ను 5 నిమిషాల పాటు చేసి శవాసనంలో విశ్రాంతి తీసుకున్నట్లయితే శరీరం, మనస్సు రెండు సాంత్వన పొందుతాయి. ఇవి ఎలా చేయాలో తెలుసుకునే ముందే దీనివలన కలిగే లాభాలు ఏమిటో చూద్దాం. ఎ) శరీరంలో అన్ని భాగాలకు రక్తప్రసరణ జరిగి ప్రతికణానికి సరైన పోషణ జరగటం వలన ఆరోగ్యవంతమైన కణజాలానికి, కణాల జీవకాలం పెరగడానికి అవకాశం ఉంటుంది. బి) శరీరంలో కండర వ్యవస్థ (మస్క్యులర్ స్కెలెటల్ సిస్టమ్), ఎముకల వ్యవస్థ దృఢంగా తయారవుతుంది. తద్వారా మెటబాలిక్ రేటు (జీవక్రియ) పెరుగుతుంది. పేరుకుపోయిన కొవ్వు పదార్థాలు కరిగి శక్తి కింద మారుతుంది. సి) వెయిట్ మేనేజ్మెంట్, ఫాట్ మెటబాలిజమ్ మెరుగవడానికి ఉపయోగపడుతుంది. అన్ని కీళ్ళకు వ్యాయామం జరగడం వలన ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారించవచ్చు, పరిష్కరించవచ్చు. డి) వీటన్నిటికన్నా కూడా హృదయ కండర వ్యవస్థకు కార్డియో–రెస్పిరేటరీ వ్యవస్థకు చాలా మంచిది. ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. అంటే గుండె సామర్థ్యం పెరగడం వలన ఎక్కువసేపు శారీరక శ్రమ చేసినప్పటికీ గుండె అలసిపోదు. రికవరీ రేటు బాగుంటుంది. అంటే గుండె బాగా అలసిపోయిన తరువాత తిరిగి విశ్రాంత స్థితికి చేరుకోవడానికి పట్టే సమయం తగ్గుతుంది. అందువల్లనే దీనిని కార్డియాక్ జాగింగ్ అని కూడా పిలుస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నెమ్మదిగా మొదలుపెట్టాలి. కొంచెం కొంచెం స్పీడు పికప్ చేయాలి. మళ్ళీ నెమ్మదిగా ముగించాలి. మొత్తం వ్యవధి మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాలకు మించి ఉండకూడదు. ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్య ఉన్నవాళ్ళు హృదయ సమస్యలు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవాళ్ళు స్పీడుగా చేయకూడదు. కావాలంటే చేసే వ్యవధిని బాగా తగ్గించండి. మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ చేయండి. 1) మడమలు పిరుదులను తాకేటట్లు: జాగింగ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్‌లో (ఆల్టర్నేట్ లెగ్) కాలు మార్చి కాలు వెనుక హిప్‌కు తగిలేటట్లుగా చేయాలి. (వ్యవధి 1 నిమిషం) 2) మోకాలు ముందు పై వైపుకి అంటే మోకాలు ఛాతీకి దగ్గరగా వచ్చేటట్లు: రెండోమోకాలు పైకి కిందకు వచ్చేటట్లు జాగింగ్ చేయాలి. (వ్యవధి 1 నిమిషం) 3) సాధారణ జాగింగ్ – మోకాళ్ళను సమంగా పైకి లేపుతూ: చేతులను కూడా పైకి తీసుకువెడుతూ మళ్ళీ కిందకు తీసుకువస్తూ చేతివేళ్ళను బాగా షేక్ చేస్తూ చేయాలి. (వ్యవధి 1 నిమిషం) శవాసన /యోగనిద్ర: శవాసనంలో రిలాక్స్ అయి అన్ని జాయింట్స్‌ని, కండరాలని వదులుగా ఉంచి పాదాలు పక్కకు, అరచేతులు నడుము పక్కన సుఖపూర్వక స్థితిలో ఉంచాలి. కండరాలు పట్టుకున్నట్లయితే వాటిని కదిలించి వదులుగా చేయాలి. శ్వాస వేగంగా ఉన్నప్పుడు శ్వాస తీసుకుని వదిలే ప్రయత్నం చేయకుండా శ్వాస సాధారణ స్థితికి వచ్చిన తరువాత రెండు మూడు దీర్ఘ శ్వాసలు తీసుకుని వదుల్తూ బాడీకి ఆక్సిజన్ అందిస్తూ, శిరస్సు పైభాగం నుండి కాలి చివరి వరకూ అన్ని అంగాలను కనీసం రెండు నిమిషాలు మనోనేత్రంతో వీక్షిస్తూ విశ్రాంత స్థితిలో ఉండాలి. ఈ యోగనిద్ర సాధన 5 నిమిషాలు చాలు. శరీరం మనస్సు తిరిగి పూర్తి శక్తిని పొందుతాయి. - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ – సమన్వయం ఎస్. సత్యబాబు - మోడల్: రీనా -
డీ-హైడ్రేషన్‌ను గుర్తించేదెలా?
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 35. రోజూ జాగింగ్‌ను చేస్తాను. నాకు చెమటలు ఎక్కువ. నాలాంటి వారికి డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందని విన్నాను. నాకు తగిన సూచనలు ఇవ్వండి. - రఘురామ్, నకిరేకల్ జాగింగ్ మొదలుపెట్టడానికి ముందుగా కనీసం నాలుగు వారాల పాటు వేగంగా నడక (బ్రిస్క్‌వాకింగ్) కొనసాగించడం మేలు. జాగింగ్‌కు అనువైన షూస్ ఎంచుకోవడం చాలా అవసరం. సుమారు ప్రతి 1000 కి.మీ. పరుగు తర్వాత ఆ షూస్ మార్చేయాలి. లేకపోతే చూడటానికి షూ బాగానే అనిపించినా సోల్ అరుగుదల వల్ల అడుగులు పడే తీరులో మార్పు వచ్చి దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు కనిపిస్తాయి. ఇక జాగింగ్ వ్యవధి విషయానికి వస్తే రోజూ కనీసం అరగంట నుంచి 45 నిమిషాల పాటు స్లోజాగింగ్ చేయడం మేలు. జాగింగ్ చేయడానికి ముందుగా ఎవరైనా సరే... జాగింగ్‌కు ముందూ, జాగింగ్ తర్వాత స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. డీ-హైడ్రేషన్‌ను దీన్ని గుర్తించడం చాలా తేలిక. మీరు పరుగెత్తుతున్నప్పుడు చెమటల వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు, లవణాలను కోల్పోయి, వాటి (ఎలక్ట్రోలైట్స్) సమతౌల్యత చెబుతుంది. ఈ కండిషన్‌ను డీ-హైడ్రేషన్‌గా పేర్కొనవచ్చు. మీరు డీ-హైడ్రేషన్‌కు గురైతే మీకు స్వల్పంగా తలనొప్పి రావడం, దాహం వేస్తూ ఉండటం, చురుకుతనం తగ్గినట్లుగా అనిపించడం, వికారం, కండరాలు బిగుసుకుపోయి, పట్టివేసినట్లుగా అయిపోవడం (మజిల్ క్రాంప్స్), నీరసం, ఉమ్ము కూడా రాకపోవడం, ఒకవేళ ఊసినా అది చాలా చిక్కగా ఉండటం, తీవ్రమైన నిస్సత్తువకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే జాగింగ్ లేదా రన్నింగ్ చేసేవారు తగినంతగా నీళ్లు తాగాలి. లేకపోతే అది హైపోనేట్రీమియా (శరీరంలో సోడియమ్ లవణాల పాళ్లు తగ్గడం) అనే కండిషన్‌కు దారితీయవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితే. దీన్ని నివారించాలంటే మీరు స్థూలకాయులైతే జాగింగ్ మొదలుపెట్టడానికి ముందే శరీర బరువును తగ్గించుకోవడం అవసరం. ఇక జాగింగ్ చేసే సమయాల్లో తమ శరీరం ఉజ్జాయింపుగా ఎన్ని నీళ్లను కోల్పోతుందో గుర్తించి ఆ మేరకు (లవణాలతో కూడిన నీళ్లు లేదా కొబ్బరినీళ్లు) తీసుకోవాలి. ఉదాహరణకు జాగింగ్ చేయడానికి ముందు మీ శరీరం బరువు 63 కిలోలు ఉందనుకుందాం. అరగంట జాగింగ్ తర్వాత మీ బరువు 62.6 కిలోలు ఉందనుకుందా. అంటే అరగంటలో మీరు 0.4 కిలోల బరువు కోల్పోయారు. అందుకే ఉజ్జాయింపుగా మీరు 400 మిల్లీలీటర్లు లేదా గంట జాగింగ్ చేసేవారైతే 800 మిల్లీలీటర్లు (దాదాపు ఒక లీటరు నీరు) తాగి, మీరు కోల్పోయిన ఫ్లూయిడ్స్ భర్తీ చేసుకోవడం మేలు. అయితే నీటిని గింగ్/రన్నింగ్ ముగిసిన కొద్ది వ్యవధి / విశ్రాంతి తర్వాత తీసుకోవడం అన్నివిధాలా మేలు. డాక్టర్ ప్రవీణ్‌రావు, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పరుగుకు ముందు ప్రత్యేక జాగ్రత్తలివి...
రిజర్వ్ ఫుడ్ బిఫోర్ రన్నింగ్ జాగింగ్ చేసేవారు ముందుగా కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే జాగింగ్ చేయడంలో క్యాలరీలు ఖర్చవుతాయి. అవి శరీరంలో అసలే లేకుండా ఉంటే అది మనలోని కొవ్వులను కాల్చే బదులుగా ప్రోటీన్లకు నష్టం జరుగుతుంది. అందుకే జాగింగ్‌కు అరగంట ముందు చాలా తేలికపాటి ఆహారంగా కొద్దిగా పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తీసుకోవడం మేలు. ఇందులోసం ఒక చిలగడదుంప, ఆలూ, కార్న్ఫ్యాక్స్ తీసుకొని కొవ్వు తక్కువగా ఉండే ఒక గ్లాసు పాలు తాగడం మంచిది. ఒక కప్పు పండ్ల ముక్కలూ తీసుకోవచ్చుగానీ... అందులో అరటి, పుచ్చకాయ, సపోటా, డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇక జాగింగ్ సమయంలో ముందుగానే నీళ్లు నింపిపెట్టు కున్న బాటిల్ గానీ లేదా ఓఆర్ఎస్ సొల్యూషన్ గానీ వెంట ఉంచుకోవాలి. అయితే జాగింగ్ చేసిన వెంటనే నీళ్లు/ఓఆర్ఎస్ ద్రావణం తాగకూడదు. కాస్తంత వ్యవధి తర్వాత తెరిపిన పడ్డాకే తాగాలంటున్నారు నిపుణులు. -
జాగింగ్ వార్నింగ్
పరుగుతో జర జాగ్రత్త! జాగింగ్ వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుందనేది మనకు తెలిసిన ఆరోగ్య సూత్రం. అయితే జాగింగ్ మరీ అలసట కలిగించేదిగా ఉండకూడదు. అలా తీవ్రమైన శ్రమతో శరీరాన్ని అలసటకు లోను చేసే జాగింగ్ వల్ల ఆరోగ్యం సమకూరదని డేనిష్ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. వీరు ప్రతిరోజూ జాగింగ్ చేసే 1,098 మందితో పాటు పన్నెండేళ్ల పాటు అసలు జాగింగ్ చేయని మరో 413 మందిపై నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... అతి తీవ్రంగా శారీరక శ్రమ కలిగేలా చేసే జాగింగ్‌తో ఒనగూరే ప్రయోజనం, అస్సలు జాగింగ్ చేయని వారికి కలిగే ప్రయోజనం ఒకటేనని తేల్చారు. మంచి ఆరోగ్య ప్రయోజనం పొందాలంటే తేలికపాటి వేగంతో లేదా ఒక మోస్తరు వేగంతో పరుగుతీయాలని పేర్కొంటున్నారు. జాగింగ్ వారానికి 2.4 గంటలకు మించకపోతేనే ఆరోగ్యకరం. తీవ్రంగా చేసే జాగింగ్ వల్ల గుండెకు ప్రయోజనం కలగకపోగా అది గుండె, రక్తప్రసరణ వ్యవస్థలపై తీవ్రమైన భారం పడేలా చేసి, ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని తెలిపారు. ఈ విషయాలన్నీ ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
కమాన్ కదలండి
మనలో ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక దశలో నిస్పృహకు లోనవుతుంది. ఒంటరిగా ఫీలవుతాం. సమాజంతో వేరుగా ఉండిపోతాం. సంతోషమూ, విచారమూ లేని బండరాయిగా మారిపోతాం. జీవితం అసలు కదలినట్లే ఉండదు. అప్పుడేం చెయ్యాలి? ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి ఉదయాన్నే లేస్తారు. పనికి వెళ్తారు. తిరిగి ఇంటికి వస్తారు. భోం చేస్తారు. నిద్రకు ఉపక్రమిస్తారు. ఇన్ని పనులను క్రమబద్ధంగా చేస్తూ ఉన్నప్పటికి కూడా జీవితం కదలకుండా అలా నిశ్చలం అయిపోయినట్లు అనిపిస్తుంది. ఈ చట్రం నుంచి బయట పడితేకానీ జీవితం మళ్లీ కదలినట్లు ఉండదు. అందుకోసం రోజూ చేస్తున్న పనులను కొద్ది కొద్దిగా బ్రేక్ చేసుకుని, ఆ బ్రేక్‌లో కొత్త పని చేపట్టండి. ఏదో ఒక పని. పిల్లలకి క్లాస్ చెబుతారా? సమాజ సేవే చేస్తారా? లేదా కొత్తవాళ్లను కలుసుకుంటారా? ఏదైనా కొత్తగా. ఈ కొత్త ప్రయాణంలో మీతో మీరు ప్రేమలో పడిపోతారు. జీవితంలోకి వెలుగురేఖ ప్రసరిస్తుంది. జీవితంలోని నిస్పృహ వదిలిపోతుంది. ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకోండి మీ గురించి మీరు అత్యంత శక్తిమంతులని, అన్నీ చెయ్యగలనని అనుకోవచ్చు. కానీ ఎవరూ కూడా సొంతంగా అన్ని పనులూ చేసుకోలేరు. అందుకే సలహాలు తీసుకోండి. సహాయం అందుకోండి. మీ పనిని షేర్ చేసుకోనివ్వండి. అన్ని పనులూ మీరే చేసుకోవడం మీకు గొప్పగా అనిపించవచ్చు. కానీ తొందరలోనే మీరు ఆ స్థితి నుంచి నిస్పృహలోకి జారిపోతారు. మీ పనిలో మీకు వైఫల్యాలు ఎదురైనప్పుడు మీ మీద మీకు నమ్మకం తగ్గడం ఎంత వాస్తవమో, చిన్న చిన్న సహకారాలు పొందడం ద్వారా ఆ అపనమ్మకం నుంచి బయట పడి పునరుత్తేజితులు కావడం అంతే వాస్తవం. ఎక్సర్సైజ్ చెయ్యండి ఈ మాట ఇప్పటికే మీరు అనేకసార్లు విని ఉంటారు. ఎన్నిసార్లు విన్నా, ఎక్సర్సైజ్ తప్పనిసరి అనడానికి అన్ని కారణాలు ఉంటాయి. కానీ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలన్నది మీ ప్రశ్న కావచ్చు. ఆ ప్రశ్నకు జవాబుగా ఆ రోజు నుండే అనే నిర్ణయానికి రండి. ఎక్సర్సైజ్ ఏదైనా కావచ్చు. వాకింగ్, జాగింగ్, సిటప్స్. పులప్స్.. ఇలా ఏదైనా. వీటి వల్ల శరీరం అలసిపోయిన కొద్దీ మెదడు పదునెక్కుతుంది. స్వల్పమైన వ్యాయామాలే మీలో పెద్ద స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి తగ్గిస్తాయి. చక్కగా నిద్రపట్టిస్తాయి. పనులను చకచక చేయడానికి అవసరమైన కొత్త శక్తి మీలో చొరబడుతుంది. ముందైతే రోజుకి కనీసం 25 నిమిషాలైనా నడవడం ప్రారంభించండి. మార్పులు చేసుకోండి... చిన్నవైనా, పెద్దవైనా... జీవితం జడపదార్థంగా మారినట్లు అనిపించడానికి కారణాలు అనేకం ఉంటాయి. మీకు నచ్చని వ్యక్తి, మీరు నచ్చని ఉద్యోగం మీ జీవితంలోని సంతోషాన్ని తోడిపారేస్తాయి. నీరసం, నిస్సత్తువగా ఆవహించేలా చేస్తాయి. అందుకే ముందుగా మీరు... మీ ఉత్సాహాన్ని హరించి వేస్తున్న అంశాల గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయించుకోండి. ఒక్కొక్క సమస్యనూ విశ్లేషించుకోండి. మీకు మీ ఉద్యోగం నచ్చలేదనుకున్నాం. అంతమాత్రాన ఉద్యోగం మానేయాల్సిన పనిలేదు. ఆఫీసు సమయానికీ, వ్యక్తిగత సమయానికీ కొత్త సరిహద్దులను ఏర్పచుకోండి. ఈ మార్పు మీలోని అసంతృప్తిని దూరం చేస్తుంది. ఉద్యోగం పట్ల కలుగుతున్న విముఖత వల్ల మీరు నష్టపోకుండా జాగ్రత్తపరుస్తుంది. అలాగే మీకు ఒక మనిషి నచ్చలేదనుకుందాం. ఆ నచ్చని మనిషిలోని మంచి విషయాలను మాత్రమే మీరు స్వీకరించండి. దాంతో మొదట ఆ వ్యక్తిపై ద్వేషభావం తగ్గుతుంది. ద్వేషం లేనప్పుడు మీరా మనిషి గురించి ఆలోచించడం తగ్గుతుంది. అది మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యత్యాసం గమనించండి అవును గమనించండి. తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. జీవితాన్ని కదిలించుకునే ప్రయత్నం మిమ్మల్ని క్రియాశీలం చేసిందని గమనించగానే మీ ఐదో అడుగు బలంగా, స్థిరంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, వేగంగా పడుతుంది. అది మీ చుట్టూ ఉన్న వారి నిస్తేజాన్ని కూడా పోగొట్టి వారిలోనూ కదలిక రప్పిస్తుంది. -
జుంబారే అ జుంబరే..
జాగింగ్ అనగానే రెండ్రోజులు కోడి కూయక ముందే లేస్తాం.. మూడో రోజు ముసుగు తన్ని పడుకుంటాం. సిక్స్ ప్యాక్స్ కోసం జిమ్‌లో జాయిన్ అవుతాం, ఓ నెల రోజులు సిన్సియర్‌గా జిమ్‌కు వెళ్తే గొప్ప. ఒళ్లొంచకుండా స్లిమ్‌గా, ఫిట్‌గా తయారవ్వాలనుకుంటాం. ఇలాంటి వారి కోసం పుట్టిందే జుంబా. ఆడుతూ పాడుతూ చేసే డాన్సింగ్ ఎక్సర్సైజ్. జోష్‌ఫుల్ పాటలకు లయబద్ధంగా స్టెప్పులేస్తే చాలు.. మీ కొవ్వు కరిగించుకోవచ్చు. శ్రమిస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా చెమటలతో తడిసిపోవచ్చు. ఇంతటి ప్రత్యేకత ఉంది కాబట్టే సిటీ వాసులు ‘జుంబారే అ జుంబ రే’ అంటూ జుంబా డాన్స్ క్లాస్‌లకు పరిగెడుతున్నారు. జుంబా అంటే లాటిన్లో ఓ రకమైన ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్. మామూలు డ్యాన్స్‌లా కాకుండా వైవిధ్యమైన నృత్య రీతులతో వేసే ఫిట్నెస్ మంత్రం. కొలంబియాలో బెటో అల్బర్టో పరేస్ అనే ఫిట్నెస్ ట్రైనర్ 12 ఏళ్ల క్రితం ఈ ఫిట్నెస్ ప్రక్రియను కనిపెట్టారు. 2011లో ఇండియాకు పరిచయమైంది. ఇక మన హైదరాబాద్‌లో 2012 నుంచి జుంబాకు ఆదరణ పెరిగింది. వ్యాయామం చేస్తున్నామనే ఫీలింగ్ రాకుండా.. శరీరాన్ని ఫిట్ చేయడం జుంబా ప్రత్యేకత. సరదాగా సాగే శిక్షణలో శ్రమ ఏమాత్రం తెలియదు. నో సైడ్ ఎఫెక్ట్స్.. జుంబా డ్యాన్స్ వల్ల ఫిట్నెస్తో పాటు వెయిట్‌లాస్, పాజిటివ్ మైండ్ వంటి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్ని గంటలు చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగని జుంబా డాన్స్‌లో అప్డేటెడ్ మ్యూజిక్ బోర్ కొట్టనివ్వదు. నో ఏజ్ లిమిట్.. వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగ ప్రతి ఒక్కరూ జుంబా ఫిట్నెస్ క్లాస్‌లకు అటెండ్ అవ్వచ్చు. 4 నుంచి 6 ఏళ్ల మధ్య వయసు వారికి జుంబా కిడ్స్ జూనియర్, 7 నుంచి 11 వయసు వారికి జుంబా కిడ్స్, 12 నుంచి 50 వరకూ జుంబా, 50 ఏళ్ల పైబడిన వారికి జుంబా గోల్డ్ అని ప్రత్యేక కేటగిరీల్లో ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. నగరంలో 60కి పైగా సర్టిఫైడ్, లెసైన్స్డ్ జుంబా ట్రైనింగ్ సెంటర్లు వెలిశాయి. స్పష్టమైన తేడా ‘ఆహ్లాదకరమైన విధానంలో ఫిట్నెస్ పొందే ప్రక్రియ జుంబా. మూడు నెలల్లోనే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దాదాపు 10 వేల మందికి పైగా శిక్షణనిచ్చా. ఒక్కరు కూడా అసంతృప్తి చెందలేదు. జుంబా వల్ల వందలాది మంది ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నా’ -విజయ తూపురాని, జుంబా ట్రైనర్ ఎంజాయ్మెంట్ ఫ్యాక్టర్.. ‘జుంబా క్లాస్‌ల వల్ల స్లిమ్‌గా, ఫిట్‌గా తయారయ్యా. ఇప్పుడు నాకు జుంబా అంటే ఎంజాయ్మెంట్ ఫ్యాక్టర్. ఒక్క రోజు కూడా మిస్సవ్వను. ఎప్పటికప్పుడు హుషారెత్తించే స్టెప్పులు జుంబాను వదిలిపెట్టనివ్వవు.’ - దీప్తి - ఎల్.సుమన్‌రెడ్డి ఫొటోలు: సృజన్ పున్నా -
నగ్న ఎథ్లెట్ ను గుద్దేసి పోయిన నల్లకారు
'పుట్టినప్పుడు బట్ట కట్టలేదు... పోయేటప్పుడు అది వెంటరాదు...' అంటూ నందామయా గురుడ నందామయా తత్వం ఆ మనిషికి బాగా ఒంటపట్టింది. అందుకే నడిరోడ్డుపై బట్టలన్నీ విప్పేసి నగ్నంగా జాగింగ్ చేస్తూ, మధ్యమధ్యలో పుష్ అప్స్ చేస్తూ ఆనందించేస్తున్నాడు ఆ పెద్దమనిషి. దీన్ని చూసిన ప్రజలు పోలీసులకు ఫోను చేసి 'బాబూ .... ఇక్కడ ఉచితంగా సినిమా చూపించేస్తున్నాడు ఓ పెద్దమనిషి. దయచేసి అరెస్టు చేయండి' అని చెప్పారు. పోలీసులు హడావిడిగా బయలుదేరేలోపు మూడో ఫోన్ కాల్ వచ్చింది. 'నగ్న ఎథ్లెట్ ని ఒక నల్ల కారు గుద్దేసి వెళ్లిపోయింది' అని సమాచారం ఇచ్చింది. పోలీసులు సదరు నగ్న ఎథ్లెట్ శవాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని గుద్దేసిన కారు డ్రైవర్ పోలీసులు వచ్చే దాకా అక్కడే ఉండి, వారికి పూర్తిగా సహకరించడం విశేషం.ఈ సంఘటన అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రంలోని పోర్ట్ లాండ్ లో జరిగింది.