జుంబారే అ జుంబరే..
జాగింగ్ అనగానే రెండ్రోజులు కోడి కూయక ముందే లేస్తాం.. మూడో రోజు ముసుగు తన్ని పడుకుంటాం. సిక్స్ ప్యాక్స్ కోసం జిమ్‌లో జాయిన్ అవుతాం, ఓ నెల రోజులు సిన్సియర్‌గా జిమ్‌కు వెళ్తే గొప్ప. ఒళ్లొంచకుండా స్లిమ్‌గా, ఫిట్‌గా తయారవ్వాలనుకుంటాం. ఇలాంటి వారి కోసం పుట్టిందే జుంబా. ఆడుతూ పాడుతూ చేసే డాన్సింగ్ ఎక్సర్‌సైజ్. జోష్‌ఫుల్ పాటలకు లయబద్ధంగా స్టెప్పులేస్తే చాలు.. మీ కొవ్వు కరిగించుకోవచ్చు. శ్రమిస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా చెమటలతో తడిసిపోవచ్చు. ఇంతటి ప్రత్యేకత ఉంది కాబట్టే సిటీ వాసులు ‘జుంబారే అ జుంబ రే’ అంటూ జుంబా డాన్స్ క్లాస్‌లకు పరిగెడుతున్నారు.
జుంబా అంటే లాటిన్‌లో ఓ రకమైన ఫిట్‌నెస్ ఇన్‌స్టిట్యూట్. మామూలు డ్యాన్స్‌లా కాకుండా వైవిధ్యమైన నృత్య రీతులతో వేసే ఫిట్‌నెస్ మంత్రం. కొలంబియాలో బెటో అల్బర్టో పరేస్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ 12 ఏళ్ల క్రితం ఈ ఫిట్‌నెస్ ప్రక్రియను కనిపెట్టారు. 2011లో ఇండియాకు పరిచయమైంది. ఇక మన హైదరాబాద్‌లో 2012 నుంచి జుంబాకు ఆదరణ పెరిగింది. వ్యాయామం చేస్తున్నామనే ఫీలింగ్ రాకుండా.. శరీరాన్ని ఫిట్ చేయడం జుంబా ప్రత్యేకత. సరదాగా సాగే శిక్షణలో శ్రమ ఏమాత్రం తెలియదు.
నో సైడ్ ఎఫెక్ట్స్..
జుంబా డ్యాన్స్ వల్ల ఫిట్‌నెస్‌తో పాటు వెయిట్‌లాస్, పాజిటివ్ మైండ్ వంటి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్ని గంటలు చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగని జుంబా డాన్స్‌లో అప్‌డేటెడ్ మ్యూజిక్ బోర్ కొట్టనివ్వదు.
నో ఏజ్ లిమిట్..
వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగ ప్రతి ఒక్కరూ జుంబా ఫిట్‌నెస్ క్లాస్‌లకు అటెండ్ అవ్వచ్చు. 4 నుంచి 6 ఏళ్ల మధ్య వయసు వారికి జుంబా కిడ్స్ జూనియర్, 7 నుంచి 11 వయసు వారికి జుంబా కిడ్స్, 12 నుంచి 50 వరకూ జుంబా, 50 ఏళ్ల పైబడిన వారికి జుంబా గోల్డ్ అని ప్రత్యేక కేటగిరీల్లో ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. నగరంలో 60కి పైగా సర్టిఫైడ్, లెసైన్స్‌డ్ జుంబా ట్రైనింగ్ సెంటర్లు వెలిశాయి.
స్పష్టమైన తేడా
‘ఆహ్లాదకరమైన విధానంలో ఫిట్‌నెస్ పొందే ప్రక్రియ జుంబా. మూడు నెలల్లోనే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దాదాపు 10 వేల మందికి పైగా శిక్షణనిచ్చా. ఒక్కరు కూడా అసంతృప్తి చెందలేదు. జుంబా వల్ల వందలాది మంది ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నా’
-విజయ తూపురాని, జుంబా ట్రైనర్
ఎంజాయ్‌మెంట్ ఫ్యాక్టర్..
‘జుంబా క్లాస్‌ల వల్ల స్లిమ్‌గా, ఫిట్‌గా తయారయ్యా. ఇప్పుడు నాకు జుంబా అంటే ఎంజాయ్‌మెంట్ ఫ్యాక్టర్. ఒక్క రోజు కూడా మిస్సవ్వను. ఎప్పటికప్పుడు హుషారెత్తించే స్టెప్పులు జుంబాను వదిలిపెట్టనివ్వవు.’
- దీప్తి
- ఎల్.సుమన్‌రెడ్డి
ఫొటోలు: సృజన్ పున్నా