సాక్షి, హైదరాబాద్: దట్టమైన అడవిని తలపించే పచ్చిక బయళ్ల మధ్య ఉస్మానియా అందాలను ఆస్వాదిస్తూ నిత్యం వేలాది మంది చేసే వాకింగ్‌కు ఓయూ అధికారులు వెలకట్టారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో భాగంగా సెక్యూరిటీ పేరుతో యూజర్ చార్జీల వసూలుకు పూనుకున్నారు. సినిమా షూటింగ్, వాకింగ్, జిమ్, గేమ్స్ ఇలా ప్రతిదానికి ఓ రేటు నిర్ణయించారు. దీనిపై యూనివర్సిటీలో నిత్యం వాకింగ్ చేసే ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి డిసెంబర్ ఒకటి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నప్పటికి మొదటి వారం తరువాత ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఓయూలో వాకింగ్.. మైమరిపించే అనుభూతి
యూనివర్సిటీ పరిసర ప్రాంతాల వారికి ఉస్మానియా ప్రకృతి ప్రసాదించిన వరం. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది తెల్లవారు జామున 5గంటల నుంచి ఉదయం 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇక్కడ వాకింగ్ చేసి సేద తీరుతుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, బీపీ, షుగర్ వ్యాధులున్న వారితో పాటు అధిక బరువుతో బాధపడేవారు డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేందుకు ఇక్కడకు వస్తుంటారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, మినీ టెక్, ఐపీఈల వెనుక దట్టమైన అడవిని తలపించే మార్గంలో వాకింగ్ చేయడం ఈ ప్రాంత వాసులకు మరిచిపోలేని అనుభూతి.
పొద్దున్నే పురివిప్పి నాట్యం చేసే నెమళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే మైమరచిపోయే అనుభూతి కలుగుతుంది. సామాన్యులతో పాటు హర్యాణా గరవ్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య ఇలా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు యూనివర్సిటీలో వాకింగ్ అనుభూతిని పొందినవారే. దీంతోపాటు ఓయూలోని ప్లేగ్రౌండ్స్‌లో వందలాది యువత క్రికెట్, వాలీబాల్, రన్నింగ్‌తో పాటు ఇతర ఆటలు ఆడుతూ క్రీడా స్ఫూర్తిని పొందుతున్నారు.
భద్రత పేరుతో బాదుడు
ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భద్రత కరువైందని, నిర్మానుష్య ప్రాంతంలో పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని.. దీనిని నియంత్రించాలనే ఉద్దేశంతోనే యూజర్ చార్జీల నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం పసలేదని వాకర్స్ కొట్టిపడేస్తున్నారు. యూనిర్సిటీలో గత కొన్నేళ్లుగా సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న పాతవారిని ఇటీవల తొలగించి రిటైర్డ్ ఆర్మీకి చెందిన వారికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. వారి జీతభత్యాలను సమకూర్చుకోవడం కోసమే యూజర్ చార్జీల ఆలోచనను తీసుకువచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వేలాది మందికి ప్రతిరోజూ ఆరోగ్య ప్రధాయినిగా ఉన్న యూనివర్సిటీలో ఎంతో మంది ప్రాణవాయువు ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే వారినుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. ఒకరిద్దరు అసాంఘిక శక్తులు ఉంటే వారిని కట్టడి చేయాలని, గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
కుటుంబంపై భారం
నేను, నా భార్య ఎన్నో ఏళ్లుగా ఉస్మానియాలో వాకింగ్ చేస్తున్నాం. ఎప్పుడూ ఎటువంటి అభద్రతా భావం మాలో కలగలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా వాకర్స్‌కి మెరుగైన వసతులు కల్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేయడం అన్యాయం. కొంత మంది కుటుంబ సమేతంగా వాకింగ్ చేస్తారు. వారంతా నెలకు 1000 రూపాయలు వాకింగ్ కోసం చెల్లించాలంటే చాలా భారం అవుతుంది. అధికారులు ఈ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలి. –కౌండిన్యా ప్రసాద్, వాకర్
స్వేచ్ఛగా గాలి పీల్చేందుకు ఆంక్షలా..?
యూనివర్సిటీ దగ్గరగా ఉందనే ఈ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని ఉంటున్నాం. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తుంటా. ఇప్పుడు అకస్మాత్తుగా యూజర్ చార్జీలు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టాలంటే భద్రత పెంచి గస్తీని ముమ్మరం చేయాలి. అవసరం అనుకుంటే ఉచితంగా ఐడీ కార్డులను పంపిణీ చేయాలి. –ఎం.నర్సయ్య, వాకర్
Comments
Please login to add a commentAdd a comment